back pains
-
ఆ ఒక్క ఇంజెక్షన్ చాలు,రీసెర్చ్‌లో ఏం తేలిందంటే..
రకరకాల కారణాలతో చాలామందిని వెన్నునొప్పి బాధిస్తుంటుంది. ఎప్పటికప్పుడు మాత్రలు మింగడం.. ఆ రోజు గడిపేయడం అంతే. అయితే అమెరికాలో జరిగిన ఓ పరిశోధన పుణ్యమా అని ఇకపై ఈ ఇబ్బంది తీరిపోనుంది. శరీరంలోని ఏ కణంలానైనా మారిపోగల సామర్థ్యమున్న మూలకణాలు కొన్నింటిని ఇంజెక్షన్ రూపంలో ఎక్కించుకుంటే మూడేళ్ల పాటు వెన్నునొప్పి దరి చేరదని రీసెర్చ్‌లో వెల్లడైంది. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో మెసోబ్లాస్ట్ అనే ఓ ఫార్మా కంపెనీ ఉంది.ఇటీవల వెన్నెముకలోని భాగాలు అరిగిపోయిన దాదాపు 100 మందికి మూలకణాలు అందించింది. వెన్నెముకలోని ఎముకల మధ్య ఉన్న ఖాళీల్లో ద్రవం పూర్తిగా ఇంకిపోయినప్పుడు చిన్నపాటి కదలికలకూ విపరీతమైన నొప్పి కలుగుతుంది. వారికి ఇతరుల ఎముక మజ్జలోంచి సేకరించిన మూలకణాలను ఎక్కించినప్పుడు వారిలో నొప్పి గణనీయంగా తగ్గిపోయినట్లు తెలిసింది. కొంతమందిలో దాదాపు రెండేళ్ల పాటు నొప్పి లేకపోగా.. కొంతమందికి సమస్య మూడేళ్ల తర్వాత గానీ తిరిగిరాలేదు. తాము పరిశోధనలు చేసిన వందమందిని ఎంఆర్ఐ స్కాన్ చేసినప్పుడు వెన్నెముకలోని సమస్యలు చాలా వరకూ తగ్గిపోయినట్లు తెలిసిందని మెసోబ్లాస్ట్ పరిశోధకులు తెలిపారు. -
తొందరపడి PRP ఇంజెక్షన్ లు చేయించుకోకండి
-
ఈ బరువును ఏం చేద్దాం?
స్కూల్లో టీచర్‌గానీ హెడ్మాస్టర్ గానీ ఎవరైనా పిల్లవాడి స్కూల్‌బ్యాగ్ వీపున తగిలించుకుని ఒక పదిహేను నిమిషాలు నిలబడగలరా? అన్నీ టెక్స్›్టలు అన్ని నోట్సులూ రోజూ తేవాలంటే పిల్లల వీపున పెరుగుతున్న బరువు ఎంత? టెక్ట్స్బుక్కుల పేజీలు పెరిగితే చదువు భారం. వీపున ఈ బరువు భారం. తల్లిదండ్రులు, న్యాయస్థానాలు పదే పదే చెప్పినా స్కూలు యాజమాన్యాలు మాత్రం ఈ బరువును పట్టించుకోవడం లేదు. పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బ తీసే ఈ బరువును ఏం చేద్దాం? నైట్ డ్యూటీ చేసి వచ్చే ఆ తండ్రి ఉదయాన్నే లేవక తప్పదు. ఇద్దరు కూతుళ్లను స్కూల్ బస్ ఎక్కించాలి. ఒకరు ఆరు, ఒకరు ఎనిమిది. వాళ్లు వెళ్లి ఎక్కగలరు. కాని వాళ్ల స్కూల్ బ్యాగులను మోస్తూ మాత్రం వెళ్లి ఎక్కలేరు. వాళ్ల ఇంటి నుంచి ఒక ఫర్లాంగు దూరంలో ఉన్న రోడ్డు మీద బస్సు ఆగుతుంది. సెకండ్ ఫ్లోర్లో ఉన్న పోర్షన్ నుంచి వాళ్లు బ్యాగులను మోసుకుంటూ బస్ దగ్గరకు వెళ్లి ఎక్కేసరికి వాళ్ల పని అయిపోతుంది. నాలుగు రోజులు ఇలా చేస్తే ఐదో రోజు ఒళ్లు నొప్పులు అని స్కూల్ ఎగ్గొడతారు. అందుకే తండ్రి లేచి ఆ స్కూల్ బ్యాగులను స్కూటర్ మీద పెట్టుకుని బస్ వరకు వెళ్లి ఎక్కిస్తాడు. మళ్లీ స్కూల్లో బస్ ఆగిన చోటు నుంచి క్లాస్ రూమ్ వరకూ వారు ఆ బ్యాగ్ మోయాల్సిందే. ఏం అంత బరువా? అనంటే ఆరో క్లాసు అమ్మాయి బ్యాగు బరువు 8 కిలోలు ఉంటుంది. ఎనిమిదో క్లాసు అమ్మాయి బ్యాగు బరువు పది కిలోలు ఉంటుంది. నిజం! వెన్ను వంచే బరువు స్కూలుకు పిల్లలు చదువుకోవడానికే వెళతారు. కాని చదువు పేరుతో బరువు లెత్తే కూలీలుగా వారు వెళ్లకూడదు. జాతి తన వెన్నుముక మీద నిలబడాలని కోరుకునే మనం చిన్న వయసు నుంచి పిల్లల వెన్ను వంచేస్తున్నాం. శాస్త్రీయ సూచన ప్రకారం ఒక విద్యార్థి స్కూల్ బ్యాగ్ బరువు అతని శరీర బరువులో పది శాతం ఉండాలి. అంటే 20 కిలోల అమ్మాయి/ అబ్బాయి కేవలం రెండు కిలోల స్కూల్ బ్యాగ్‌ను మోయాలి. 30 కిలోల బరువుంటే మూడు కిలోలే మోయాలి. ఒక అంచనా ప్రకారం ఇవాళ ప్రైమరీ లెవల్లో అంటే 5 వ తరగతి వరకూ పిల్లలు 6 నుంచి 12 కిలోల బరువున్న స్కూల్ బ్యాగులు మోస్తున్నారు. హైస్కూలు పిల్లలు 12 నుంచి 17 కిలోల బరువు స్కూల్ బ్యాగులు మోస్తున్నారు. ఎన్.సి.ఇ.ఆర్.టి. తాజా స్కూల్ బ్యాగ్ పాలసీ ప్రకారం 5 వ తరగతి లోపు పిల్లలకు రెండున్న కేజీలకు మించి బరువు ఉండరాదు. 6 నుంచి 10 చదివే పిల్లలకు నాలుగున్నర కేజీలకు మించి బరువు ఉండరాదు. ఈ పాలసీను స్కూళ్లు గౌరవిస్తున్నాయా? ఆరోగ్య సమస్యలు స్కూల్ బ్యాగును మోయడం కూడా తప్పేనా అని కొందరు వితండంగా మాట్లాడవచ్చు గాని అవసరానికి మించిన బరువు వీపు మీద పిల్లలు రోజూ మోయడం వల్ల వారికి వెన్ను సమస్యలు వస్తాయి. పాదంపై పట్టు మారుతుంది. నడక తీరు మారుతుంది. భుజం నొప్పి వంటివి బాధిస్తాయి. రోజూ ఆ బరువు మోసుకెళ్లే విషయం వారికి ఆందోళన గురి చేస్తుంది. కొంతమంది పిల్లలు ఈ మోత మోయలేక ఏదో ఒక వంక పెట్టి స్కూల్ ఎగ్గొడుతున్నారన్న సంగతి నిపుణులు గమనించారు కూడా. ఇంత బరువు ఎందుకు? ప్రభుత్వం కాని/ ప్రయివేటు కాని/ ఛారిటీ స్కూళ్లుగాని పిల్లలు బాగా చదవాలని ఆరు నుంచి ఎనిమిది పిరియడ్లు చెబుతున్నారు. ప్రతి సబ్జెక్ట్ ప్రతిరోజూ ఉండేలా చూస్తున్నారు. ఆ సబ్జెక్ట్‌కు టెక్స్›్టబుక్, నోట్ బుక్, వర్క్‌బుక్... ఇవిగాక స్పెషల్ నోట్‌బుక్కులు... ఇన్ని ఉంటున్నాయి. నీటి వసతి లేకపోయినా తల్లిదండ్రుల జాగ్రత్త వల్ల వాటర్ బాటిల్ ఒక బరువు. లంచ్ లేని చోట లంచ్ బ్యాగ్. ఒక్కోసారి స్పోర్ట్స్ అని బ్యాట్లు కూడా మోసుకెళతారు. ఇన్ని బరువులు 15 ఏళ్ల లోపు పిల్లలు మోయడం గురించి ఎన్నోసార్లు తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా, కోర్టులు మందలించినా పరిస్థితిలో మార్పులేదు. ఏం చేయాలి? స్కూళ్లల్లో ప్రతి పిల్లవాడూ టెక్స్›్టబుక్ తేవాల్సిన అవసరం లేని విధానం ఉండాలి. కొన్ని టెక్ట్స్›బుక్కులను క్లాసుల్లో ఉంచాలి. అలాగే ప్రతి క్లాస్‌లో తాళాలు ఉన్న బుక్షెల్ఫ్లను ఏర్పాటు చేసి విద్యార్థులు తమకు ఆ రోజుకు అవసరం లేని పుస్తకాలను అందులో పెట్టుకుని వెళ్లేలా చూడాలి. పిరియడ్లను తగ్గించాలి. రోజూ అన్ని సబ్జెక్ట్‌లు చెప్పాల్సిన అవసరం లేని రీతిలో టైంటేబుల్ వేయాలి. టైంటేబుల్లో లేని సబ్జెక్ట్ పుస్తకాలు తేవాల్సిన పని లేదని పిల్లలకు చెప్పాలి. అలాగే ప్రభుత్వాల వైపు నుంచి ఒక క్లాసు విద్యార్థికి అన్ని క్లాసుల టెక్స్›్టబుక్కులు ఎంత బరువు అవుతున్నాయో, ఏ సబ్జెక్ట్‌కు ఎన్ని పేజీల పాఠ్యపుస్తకాలు ఉన్నాయో అంచనా వేయించాలి. ఒక సబ్జెక్ట్‌తో సంబంధం లేకుండా మరొక సబ్జెక్ట్ వారు పాఠ్యపుస్తకాలను తయారు చేసేలా కాకుండా అన్ని సబ్జెక్ట్‌ల వారూ ఆ ఫలానా క్లాసుకు మొత్తం ఎన్ని పేజీల పాఠ్యపుస్తకాలు తయారు చేస్తున్నారో చూసుకోవాలి. అసలు ‘ఎక్కువ సిలబస్సే మంచి చదువు’ భావన పై చర్చ జరగాలి. ఇక తల్లిదండ్రులైతే ఎప్పటికప్పుడు పిల్లల బ్యాగులు చెక్ చేస్తూ వాటిలో అనవసరమైన వస్తువుల బరువు లేకుండా చూసుకోవాలి. టైమ్‌టేబుల్ చెక్ చేసి ఆ పుస్తకాలే ఉంచాలి. బస్ ఎక్కేప్పుడు దిగేప్పుడు ఆ బరువును అందుకునే వీలుంటే తప్పక అందుకోవాలి. పిల్లల భుజాలకు అనువైన సరైన బ్యాగ్‌లు కొనివ్వాలి. -
పిల్లలు... ఎముక...ఎరుక!
పిల్లలు ఆటలాడుతూ ఉంటారు. కొద్దిపాటి స్థలం ఉంటే చాలు ఓ ఫోల్డింగ్ కుర్చీని వికెట్లలా పెట్టి గల్లీ క్రికెట్ ఆడటం మనం చూస్తూనే ఉంటాం. వారు తమ ఆటల్లో ఎంతగా నిమగ్నమవుతారంటే తమకు ఏదైనా హాని జరుగుతుందా లేదా అన్న అంశాన్ని కూడా చూసుకోరు. పైగా జనం, ట్రాఫిక్, కార్లు, వాహనాల రద్దీ ఎక్కువగా ఉండే సందుల్లోనూ ఇలా ఆడుతుంటారు. ఇంకా చెప్పాలంటే ఇక వారు టీనేజ్‌లోకి ప్రవేశించగానే వాళ్లలో స్రవించే కొన్ని హార్మోన్ల కారణంగా సాహసప్రవృత్తితో ఉంటారు. దాంతో టూవీలర్లు నేర్చుకోవడంతోనే తమ వాహనాలను విపరీతమైన వేగంతో నడపటం, ముందు చక్రాలు లేదా వెనక చక్రాలు ఎత్తడం వంటి ఫీట్లకూ, సాహసాలకు పాల్పడుతుంటారు. ఫలితంగా కింద పడిç గాయాల పాలు కావడం, ఎముకలు విరగడం చూస్తుంటాం. పిల్లల్లో అయ్యే చాలా రకాల ప్రమాదాలు ఇలాగే ఎక్కువగా జరుగుతుంటాయి. పిల్లల్లో ప్రమాదాలు ముప్పు చాలా ఎక్కువ... ఎందుకంటే... పెరిగే వయసులో ముఖ్యంగా టీనేజీ పిల్లల ఎముకలు పెద్దవారితో పోలిస్తే మృదువుగానే ఉంటాయి. కానీ... అలా పెరిగే ఎముకకు అనుగుణంగా పక్కనే ఉన్న కండరాలు (మజిల్స్), మృదు కణజాలం (సాఫ్ట్ టిష్యూస్), లిగమెంట్లు, టెండన్లు పెరిగేందుకు వీలుగా అంతే అనువుగానూ ఉండవు. కాబట్టి ఎముక పెరిగే దశలో ఎముకకూ... కండరాలు, మృదుకణజాలం, లిగమెంట్లు, టెండన్ల మధ్య సమన్వయం అదే స్థాయిలో ఉండదు. అందుకే ఎముకలు పెరిగే దశలో ఉన్న పిల్లల్లో గాయాలయ్యే రిస్క్ చాలా ఎక్కువ. పిల్లలకూ, పెద్దలకూ ఎముకల్లోతేడా ఇలా ఉంటుంది... పిల్లల్లోని ఎముకల చివర్లో పెరుగుదలకు వీలుగా ఉండే మృదులాస్థి (కార్టిలేజ్) ఉంటుంది. వీటిని ‘గ్రోత్ ప్లేట్స్’ అంటారు. పెద్దవాళ్ల ఎముకల్లో పెరుగుదలకు వీలు కల్పించే ఈ కార్టిలేజ్ ఉండదు. ఈ గ్రోత్ప్లేట్స్లోని మృదులాస్థి చిగురులా మెత్తగా పెరుగుతూపోయి... పెరుగుదల ప్రక్రియ పూర్తయ్యాక... ఆ భాగం గట్టిగా మారిపోయి పెళుసుగా అయిపోతుంది. దీన్నే వైద్య పరిభాషలో చెప్పాలంటే క్యాల్సిఫికేషన్ అంటారు. పెరిగే పిల్లల్లో ఈ గ్రోత్‌ప్లేట్ వల్లనే ఎముక పొడవుగా పెరుగుతుంటుంది. ఎముకలను కండరంతో అతికి ఉంచే టెండన్స్ ఉన్న ప్రాంతంలోనూ గ్రోత్ కార్టిలేజ్ ఉంటుంది. ఈ ప్రాంతాన్ని ‘అపోఫైసిస్’ అంటారు. ఎముకకూ, టెండన్ అంచుకూ మధ్య భాగంలో ఉన్న కార్టిలేజ్‌ను ‘అపోఫైసీల్ కార్టిలేజ్’ అంటారు. ముందుగా కార్టిలేజ్ నిడివి పెరుగుతుంది. ఆ తర్వాత దాని కింద ఉన్న ఆ పెరిగిన భాగం పెళుసుబారిన ఎముకగా మారుతుంది. ఇలా అయ్యేటప్పుడు ఎముకకూ, టెండన్కూ మధ్య ఉన్న కాస్త బలహీనమైన ప్రాంతంలో గాయాలయ్యేందుకు ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఆటల్లో భాగంగా ఏదైనా కండరం బిగుసుకున్నప్పుడు (మజిల్ కంట్రాక్షన్ సమయంలో) ఆ కండరం చాలా ఎక్కువగా కుంచించుకుపోతుంది. కానీ అదే సమయంలో పక్కన ఎముక పెరుగుతూ ఉంటుంది. ఇలా పెరిగే ఎముక లాగే దిశకూ, ఈ కండరాల బిగుసుకునే దిశకూ ఉండే తేడా వస్తుంది. దాంతో పిల్లల్లో గాయాలయ్యే (ఫ్రాక్చర్స్ అయ్యే) ఆస్కారం ఎక్కువ. ఎముకపై ఒకే చోట ఎప్పుడూ గాయం మాటిమాటికీ అవుతుండటం వల్ల అది ‘అపోఫైసైటిస్’ అనే కండిషన్‌కు దారితీయవచ్చు. ఓస్గూడ్–ష్లాటర్ అనే ఒక రకం మోకాళ్ల రుగ్మతకు ఇదో ఉదాహరణ. ఈ ఓస్గూడ్–ష్లాటర్ కండిషన్లో పైనున్న కార్టిలేజ్ చాలా మృదువుగా ఉండటం, దాని కిందనే ఉన్న ఎముక మాత్రం గట్టిగా ఉండటం, ఆటల్లో కండరం లాగేయడంతో మోకాలి భాగంలో ఇన్ఫ్లమేషన్ వచ్చి మోకాలి వాపు వచ్చి పిల్లలను బాధిస్తూ ఉంటుంది. అయితే దాదాపు చాలా సందర్భాల్లో పిల్లలకు ఇదేమీ శాశ్వతమైన నష్టం కలగజేయదు. ఆర్థోపెడిక్ నిపుణులు తరచూ ఉపయోగించే రైస్ (అంటే రెస్ట్, ఐస్, కంప్రెషన్, ఎలివేషన్) చికిత్సతో ఉపశమనం కలుగుతుంది. అంటే కాలికి తగినంత విశ్రాంతి (రెస్ట్) ఇవ్వడం, ఐస్ కాపడం పెట్టడం, నొక్కి పట్టి ఉంచేందుకు ఎలాస్టిక్ రాప్ లేదా స్లీవ్ తొడగడం (కంప్రెషన్), పడుకున్నప్పుడు కాలిని కాస్త ఎత్తుగా దిండు మీద ఉంచడం (ఎలివేషన్)తో ఈ సమస్య తగ్గుతుంది. నొప్పి మరీ ఎక్కువగా ఉంటే డాక్టర్ల సలహా మేరకు నొప్పి నివారణ మాత్రలు తీసుకుంటే సరిపోతుంది. ఎదిగే వయసు పిల్లల్లో ఎముకల్లో నొప్పి... కొన్ని సందర్భాల్లో పిల్లల్లో ఎముకలు పెరుగుతున్నప్పుడు కూడా వారి ఎముకల్లో నొప్పి వస్తుంటుంది. ఎముక పెరుగుతున్నప్పుడు దానికి అనుగుణంగా కండరం, లిగమెంట్ కూడా పెరగాలి. కానీ పిల్లల్లో ఒకదశలో ఎముక పెరుగుదల చాలా వేగంగా సాగుతుంది. ఆ టైమ్‌లో పిల్లలు వేగంగా ఎత్తు పెరుగుతారు. ఒకటి రెండేళ్ల పాటు చూడని పిల్లలను అకస్మాత్తుగా చూసినప్పుడు చాలామంది పిల్లల్లో మనం దీన్ని గమనించగలుగుతాం. ఇలా ఎత్తు పెరగడాన్ని ‘గ్రోత్ స్పర్ట్’ అంటారు. ఈ పెరుగుదల సమయాన్నే వైద్యులు లాగ్ ఫేజ్ అని కూడా అంటారు. (ఈ లాగ్ ఫేజ్ దశలో ఎముకలు వేగంగా పెరిగి పిల్లాడు అకస్మాత్తుగా పొడవవుతాడు. ఆ తర్వాత ఈ వేగం మందగించి, చాలా నెమ్మదిగా కొద్దికాలం పాటు పెరిగి... ఆ తర్వాత పెరుగుదల ఆగిపోతుంది. అలా నెమ్మదిగా పెరిగే దశను ‘ల్యాగ్’ ఫేజ్ అంటారు). పిల్లలు వేగంగా పెరిగే గ్రోత్స్పర్ట్ సమయంలో ఎముకకూ, కండరానికి మధ్య లోపించిన సమన్వయం వల్ల కీళ్లు బిగుతుగా అనిపించడం, కీళ్లు సులభంగా వంగకపోవడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఇదే సమయంలో పిల్లలు ఏదైనా పనిని అదేపనిగా చేస్తూ ఉన్నప్పుడు వారిలో కొన్ని చోట్ల కండరాలకు, ఎముకలకు అయినచోటే మాటిమాటికీ గాయాలు అవుతుండవచ్చు. ఫలితంగా కండరాలు బిగుసుకుపోయినట్లుగానూ అనిపించవచ్చు. సాధారణంగా ఆటలాడే పిల్లల్లో ఈ తరహా గాయాలు కనిపిస్తుంటాయి. కాబట్టి ఈ దశలో పిల్లలకు ఏవైనా గాయాలైనప్పుడు అదేపనిగా వ్యాయామాన్ని గాని, ఏదైనా శారీరకమైన శ్రమను (యాక్టివిటీని) గాని చేయించడం అంత సరికాదు. అలాగే ఒక్కోసారి మనం చేసే శారీరక శ్రమ (ఫిజికల్ యాక్టివిటీ) తాలూకు తీవ్రతను ఒకేసారి పెంచడం కూడా ఆర్థోపెడిక్ గాయాలకు ఆస్కారం ఇస్తుంది. అలాగే కొన్ని సందర్భాల్లో పిల్లల వ్యాయామ తీవ్రతనూ అలాగే వారు వ్యాయామం చేసే వ్యవధినీ చాలా ఎక్కువగానూ, అనూహ్యంగానూ పెంచడం, పాదాలకు సరిగ్గా సరిపోనివీ, సరిగా అమరని పాదరక్షలు వాడటం, ఎగుడుదిగుడుగా ఉన్న ఉపరితలంపై ఆటలాడటం వల్ల దొడ్డికాళ్లు (బౌలెగ్స్) రావచ్చు, కొందరిలో మోకాళ్లు ఒకదానికి ఒకటి కొట్టుకునే నాక్ నీస్ అనే సమస్య ఉంటుంది. చిన్నతనంలో రికెట్స్ వంటి వ్యాధి వచ్చిన వారిలో ఇలా మోకాళ్లు కొట్టుకునే సమస్య వచ్చే అవకాశాలుంటాయి. ఇలాంటి పిల్లలకు క్యాల్షియమ్ లోపం ఉందేమో పరీక్షించి, ఆ లోపాన్ని భర్తీ చేయాల్సి ఉంటుంది. ఇక మనందరిలోనూ మడమకూ, వేళ్లకూ మధ్య ఉండే భాగం అర్థచంద్రాకారంలో పైకిలేచి నేలకు ఆనకుండా చేసే ఆర్చ్‌లా ఉంటుందన్న విషయం తెలిసిందే. కానీ కొందరిలో వంశపారంపర్యంగా ఈ ఆర్చ్ ఉండదు. అయితే ఇలా ఆర్చ్ లేకపోవడం అన్నది పిల్లల్లోనూ, వారి ఎదుగుదలలోనూ ఎంతమాత్రమూ సమస్య కాబోదు. ఇలా ఫ్లాట్‌ఫీట్ ఉన్న ఒక ఆటగాడు ఒలింపిక్స్‌లో గోల్డ్‌మెడల్ కూడా సాధించాడు. కాకపోతే ఫ్లాట్‌ఫీట్ కారణంగా వారి మోకాళ్లపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి వారు తమ ఆర్చ్ భాగంలో సపోర్ట్ ఉండేలాంటి పాదరక్షలు ధరిస్తే చాలు. పిల్లల్లో వచ్చే మరికొన్ని ఎముకల సమస్యలు... గ్రోత్‌ప్లేట్ ఫ్రాక్చర్స్: పిల్లల ఎముకలు గ్రోత్ప్లేట్స్తో ఉంటాయన్న విషయం తెలిసిందే. ఎముకతో పోలిస్తే ఈ పెరిగే భాగం బలహీనంగా ఉంటుందన్న విషయమూ చెప్పుకున్నాం కదా. దాంతో ఈ తేడాల వల్ల ఒక్కోసారి ఎముకకూ, గ్రోత్ప్లేట్స్కూ మధ్యనుండే భాగం ఫ్రాక్చర్స్ అయి జాయింట్ డిస్ప్లేస్మెంట్కూ, చాలా ముందుగానే వచ్చే అర్లీ ఆర్థరైటిస్ వంటి సమస్యకూ దారితీయవచ్చు. చాలా అరుదుగా ఒక్కోసారి కొంత మంది పిల్లల్లో పెరుగుదల ఆగిపోవచ్చు. వైద్య పరిభాషలో ఇలా పెరుగుదల ఆగిపోవడాన్ని ‘స్టంటెడ్ గ్రోత్’ అని చెబుతారు. ఇలాంటి సందర్భాల్లో తల్లిదండ్రులు లేదా శిక్షకులు పిల్లాడిలోని సమస్యను సరైన సమయంలో గుర్తించాలి. దానికి ఇవ్వాల్సిన చికిత్స కూడా చాలా శ్రద్ధగా చేయించాల్సి ఉంటుంది. ఆస్టియోకాండ్రోసిస్: ఇది ఎముక చివరన పెరిగే కార్టిలేజ్‌లో చాలా సాధారణంగా కనిపించే సమస్య. ఎముక చివరన జరిగే రక్తసరఫరాలో తేడాల వల్ల ఈ సమస్య వస్తుంది. తుంటి ఎముక కీలు వద్ద కనిపించే ‘పార్థెస్ డిసీజ్’ అన్నది ఈ తరహా సమస్యకు ఒక మంచి ఉదాహరణ. దీనివల్ల తుంటి ఎముక కీలు శాశ్వతంగా దెబ్బతినవచ్చు. సాధారణంగా సమస్య తుంటికే వచ్చినా... పిల్లలు మాత్రం మోకాలు నొప్పి అని చెబుతుంటారు. ఇలా ఒకచోట ఉన్న నొప్పి మరో చోట బయటకు కనిపించడాన్ని వైద్యపరిభాషలో ‘రిఫర్డ్ పెయిన్’ అంటారు. కాబట్టి పిల్లలు మోకాళ్లలో నొప్పి అంటే తుంటి ఎముకను జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. పిల్లల వయసును బట్టి కూడా సమస్యలతో పాదాల సమస్యలు (కొహ్లెర్స్ డిసీజ్), పాదాల వేళ్ల సమస్యలు (ఫ్రీబెర్గ్స్ డిసీజ్), మడమ సమస్యలు (సెవెర్స్ డిసీజ్) వంటివి కూడా కనిపించవచ్చు. ఒక పనిని అదేపనిగా పదేపదే చేస్తే వచ్చే సమస్యల్లో ముఖ్యమైనది ఆస్గుడ్ ష్లాటర్స్ డిసీజ్ అని చెప్పుకున్నాం కదా. ఇది కూడా చాలావరకు ఆస్టియోకాండ్రోసిస్లాగే ఉంటుంది. కానీ ఇందులో టెండెనైటిస్, అపోఫైసైటిస్ వంటివి ఎక్కువగా కనిపిస్తాయి. ఇది మోకాలి చిప్ప వద్ద ఉండే టెండన్‌ను ఎక్కువగా దెబ్బతీస్తుంది. మోకాలి చిన్న కింద చిన్న బుడిపె వంటిది కనిపించవచ్చు. దీన్ని టిబియల్ ట్యుబర్కిల్ అంటారు. తొడకు సంబంధించిన అతిపెద్ద కండరం అయిన క్వాడ్రసెప్ కండరపు చివరి భాగం... మోకాలి చిప్ప టెండన్ ద్వారా మోకాలి కిందనున్న ట్యుబర్కిల్కు అంటుకుని ఉంటుంది. మనం తరచూ అదేపనిగా ఏదైనా వ్యాయామమో, శారీరక శ్రమో చేస్తున్నప్పుడు ఆ ట్యుబర్కిల్ వద్ద ఉన్న కండరం ఊడినట్లుగా అవుతుంది. అలాంటప్పుడు ఒక్కోసారి ఆ పరిసరాల్లో ఎముక వద్ద, కండరాల వద్ద కాస్తంత పెద్ద గాయం కావచ్చు. అలాంటప్పుడు పిల్లలు తమ మోకాలిచిప్ప కింది భాగంలో నొప్పిగా ఉందంటూ బాధపడుతుంటారు. అక్కడ కొంత వాపు కూడా కనిపించవచ్చు. చూడటానికి కాస్తంత ప్రమాదకరంగా అనిపించినా... నిజానికి ఇది అంత పెద్ద హానికరం కాని సమస్య. కాస్త విశ్రాంతి తీసుకోవడం, కాలికి శ్రమ ఇవ్వకపోవడం వల్ల ఇది తగ్గిపోతుంది. కొందరిలో శస్త్రచికిత్స చేయాల్సిన పరిస్థితి రావచ్చు. కానీ అది చాలా చాలా అరుదు. పిల్లల్లో పుట్టుకతో వచ్చే కంజెనిటల్ సమస్యలు... కొన్నిసార్లు పిల్లలు పుట్టుకతోనే వెన్నులో కాస్త లోపంతో పుట్టవచ్చు. ఇలాంటి సమస్యను ‘స్పాండిలోలైసిస్’ అంటారు. దీనివల్ల కూడా వెన్నునొప్పి రావచ్చు. ఒక్కోసారి పైన ఉన్న వెన్నుపూన తన కింద ఉన్నదానిపైనుంచి జారిపోయి... ముందుకు వెళ్లిపోవచ్చు. అలాంటప్పుడు కూడా పిల్లల్లో వెన్నునొప్పి వస్తుంది. ఈ పరిస్థితిని స్పాండిలోలైస్థెసిస్ అంటారు. పిల్లలు లేదా యుక్తవయస్కుల్లో వెన్నునొప్పితో పాటు జ్వరం, మల, మూత్రవిసర్జనలకు సంబంధించిన సమస్యలు ఉంటే మరిన్ని వైద్యపరీక్షలు అవసరమవుతాయి. అలాంటి సమయాల్లో వారిని మరింత నిశితంగా పరీక్షించాల్సి ఉంటుంది. ఇక కొందరిలో వెన్ను వంకరగా ఉండే స్కోలియోసిస్ అనే సమస్య కూడా వస్తుంది. దీనికి శస్త్ర చికిత్స అవసరం అవుతుంది. ఈ తరహా నడుమునొప్పి ప్రమాదకరం కాదు... అయితే చాలా మంది పిల్లల్లో నిద్రలో నడుం పట్టేసి మర్నాడు వారికి నడుమునొప్పి రావచ్చు. ఇలా వచ్చే నడుమునొప్పి గురించి ఆందోళన పడాల్సిన అవసరం ఉండదు. నిద్రలో నడుం పట్టేసి వచ్చే నొప్పికి విశ్రాంతి తీసుకుంటే చాలు. ఒకవేళ నొప్పి తీవ్రంగా ఉంటే ఉపశమనం కోసం, డాక్టర్ సలహా మేరకు ఒకటి రెండు రోజులు మాత్రమే పెయిన్ కిల్లర్స్ వేసుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. ఈ తరహా నడుమునొప్పి విషయంలో జాగ్రత్త... కొన్ని సందర్భాల్లో లోపల ఏదైనా ఇన్ఫెక్షన్ ఉండటం లేదా గడ్డ (ట్యూమర్) వల్ల కూడా నడుం నొప్పిరావచ్చు. ఈ తరహా నడుమునొప్పి నిద్రలో పట్టేసినప్పుడు వచ్చే నొప్పిలా ఒకపట్టాన తగ్గదు. ఇలా నొప్పి తగ్గకుండా అదేపనిగా వస్తున్న సందర్భాల్లో తప్పక వైద్య పరీక్షల కోసం ఆర్థోపెడిక్ నిపుణుడిని సంప్రదించాలి. అలాంటప్పుడు వైద్యపరీక్షల్లో తేలే అంశాన్ని బట్టి చికిత్స ఆధారపడి ఉంటుంది. పిల్లల్లో వచ్చే చాలా రకాల ఎముకలకు సంబంధించిన నొప్పులు చాలావరకు తాత్కాలికం. వారి ఎదుగుదలకూ, పెరుగుదలకూ చాలావరకు ప్రతిబంధకం కాదు. చిన్నపాటి విశ్రాంతి, ఐస్ కాపడం వంటి జాగ్రత్తలతోనే అది తగ్గిపోతుంది. అయితే నొప్పి ఎంతకూ తగ్గనప్పుడు మాత్రం అదేపనిగా కాపడం పెట్టడం, నొప్పి ఉన్నచోట మర్దన చేస్తూనే ఉండటం సరికాదు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో వారిలో ఏదైనా తీవ్రమైన సమస్య (లుకేమియా అంటే బ్లడ్‌క్యాన్సర్) ఉన్నదానికి కూడా ఎముకల్లో నొప్పి ఒక లక్షణం కావచ్చు. అందుకే పిల్లల్లో నొప్పి వచ్చినప్పుడు ఒకసారి డాక్టర్‌కు చూపించి, అది ప్రమాదకరం కాని సాధారణమైన నొప్పేనని నిర్ధారణ చేసుకొని, ఆపైన నిశ్చింతగా ఉండవచ్చు. ఆటల్లోగాయాలతోనూ ప్రమాదాలు... తరచూ ఆటల్లో ఎక్కువగా పాల్గొనే పిల్లల్లో పెద్దవాళ్లలాగే గాయాల కావచ్చు. కొన్ని సార్లు బెణుకులు (స్ప్రెయిన్), ఎముకలు విరగడం (ఫ్రాక్చర్లు) వంటి ప్రమాదాలు కూడా జరగవచ్చు. ప్రమాదాలు ఎప్పుడు ఎలా జరుగుతాయో తెలియదు. కాబట్టి వాటిని మనం ఎలాగూ నివారించలేం. కాకపోతే పిల్లలు పదే పదే ఆటలాడుతూ ఉండటం వల్ల వారిలో చోటు చేసుకునే భౌతిక కార్యకలాపాల (ఓవర్ యూజ్ ఆక్టివిటీ)ని తగ్గించడం ద్వారా వాటి వల్ల అయ్యే గాయాలను కొంతవరకు నివారించవచ్చు. అందుకే పిల్లలు ఆటలు లేదా వ్యాయామం లేదా స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ చేసే సమయంలో ముందుగా చేయాల్సిన వార్మ్–అప్ వ్యాయామాలు, అటు తర్వాత చివగా చేయాల్సిన కూలింగ్ డౌన్ వ్యామామాలు తప్పనిసరిగా చేసేలా చూడాలి. వారి శిక్షణ కార్యక్రమాలను ఆ విధంగా రూపొందించాలి. చిన్నారి అథ్లెట్లలో ఎముకలు అకస్మాత్తుగా పెరిగే గ్రోత్ స్పర్ట్ (లాగ్) దశలో కండరాలకు ఫ్లెక్సిబిలిటీ కలిగించేలా తరచూ మసాజ్ చేయడం వంటివి అవసరం. అలాంటి పిల్లలకు ఏవైనా గాయాలైనప్పుడు అవి పూర్తిగా మానేవరకు, ఆ వ్యాయామాన్ని పూర్తిగా ఆపేసి, వారికి తగినంత విశ్రాంతి ఇవ్వడం వంటి జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. పిల్లల్లో వెన్ను నొప్పి... ప్రకృతి నియమం ప్రకారం చిన్నపిల్లల్లో వెన్ను నొప్పి రాదు. రానే కూడదు. ఒకవేళ పిల్లల్లో వెన్ను నొప్పి వస్తున్నా లేదా తరచూ కనిపిస్తూ లేదా దాని తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నా... ఆ పరిస్థితిని తేలిగ్గా తీసుకోకూడదు. పిల్లలు లేదా టీనేజీలో ఉన్న వారు లేదా అప్పుడే టీనేజీ దాటిన యుక్తవయస్కుల్లోని వారికి వెన్ను నొప్పి వచ్చిందంటే అది వెన్నుపై తీవ్రమైన ఒత్తిడి వల్ల కావచ్చని భావించాలి. ఒక్కోసారి వాళ్లు నిల్చునే లేదా కూర్చునే భంగిమలు సరిగా లేకపోవడం వల్ల కూడా ఇది ఇస్తుంది. సాధారణంగా పూర్తి విశ్రాంతితో ఇలాంటి సమస్యలు చక్కబడతాయి. అయితే గాయం తీవ్రత ఎక్కువగా ఉంటే ఒకటి లేదా అంతకు మంచి వెన్నుపూసల్లో ఏదైనా/ఏవైనా ఫ్రాక్చర్ ఉందేమో చూడాలి.-డాక్టర్ కె. సుధీర్‌రెడ్డి,చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్,ల్యాండ్‌మార్క్ హాస్పిటల్స్, హైదరాబాద్ -
వెన్నుపూస కదిలిపోతోంది!
ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు..కాలనీలను ముంచెత్తుతున్న వరదలు నగర రోడ్లను పూర్తిగా ధ్వంసం చేశాయి. గుంతల రోడ్లలో అడుగుతీసి అడుగు వేయలేని దుస్థితి. అరకిలోమీటరు ప్రయాణిస్తే చాలు 60 గుంతలపై గెంతాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఫలితంగా వాహనాలే కాదు ప్రయాణికుల ఒళ్లు హూనమవుతోంది. వెన్నుపూస కదిలిపోతోంది. నొప్పిని భరించలేక ఆస్పత్రులకు చేరుతున్నవారి సంఖ్య ఇటీవల భారీగా పెరిగింది. నిమ్స్ సహా ఏ కార్పొరేట్ ఆస్పత్రిలోకి తొంగి చూసినా బ్యాక్‌పెయిన్, ఒంటి నొప్పి బాధితులే దర్శనమిస్తున్నారు. సాక్షి, సిటీబ్యూరో: మెట్రోరైల్ వర్క్స్...విద్యుత్ కేబుళ్లు..సివరేజ్ పైప్‌లైన్స్ కోసం తవ్విన గుంతలు ఇప్పటికే ప్రయాణికులను ఓ కుదుపు కుదుపుతుండగా, ఇటీవల ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు రహదారులనే కాదు నగరవాసుల ఒళ్లును కూడా గుల్ల చేస్తున్నాయి. వీవీఐపీలు తిరిగే బంజారాహిల్స్, బేగంపేట్, ఎన్టీఆర్మార్గ్, రాజ్‌భవన్‌రోడ్డు, అసెంబ్లీ, పంజగుట్టా, లక్టీకపూల్, ట్యాంక్‌బండ్, మాదాపూర్, గచ్చిబౌలి, కూకట్పల్లి రహదారులపై కూడా భారీ గుంతలు ఏర్పడ్డాయి. ఇక ఎల్బీనగర్ నుంచి మొజంజాహీమార్కెట్, ఉప్పల్, రామంతాపూర్, అంబర్పేట్, నల్లకుంట, నారాయణగూడ, హిమాయత్‌నగర్, లిబర్టీ చౌరస్తా రహదారులు మరీ అధ్వానంగా తయారయ్యాయి. అడుగుకోగుంత కన్పిస్తుంది. తెలుగుతల్లి, పంజాగుట్టా, బేగంపేట్, ప్యారడైజ్, మెహిదీపట్నం ప్లైఓవర్లపై కూడా భారీ గుంతలు ఏర్పాడ్డాయి. మంగళ, బుధవారాల్లో వర్షం కురియకపోయినా గుంతల్లోని నీరు అలాగే నిల్వఉండటంతో తెలియక వేగంగా దూసుకొచ్చి ఒక్కసారిగా కుదుపునకు లోనవుతున్నారు. బైక్‌లు స్క్రిడై ప్రమాదాలు జరుగుతున్నాయి. దెబ్బలు తగిలి ఆస్పత్రుల్లో చేరుతుండగా, మరికొందరు స్పైన్, నెక్, నడుము నొప్పులతో బాధపడుతున్నారు. గతంలో 70 ఉంటే..ప్రస్తుతం 150 కేసులు వాహనం నడిపే వారే కాదు..వెనుక సీట్లో కూర్చున్న వారికి కూడా వెన్ను, భుజం, తొడ, మెడ జాయింట్స్ పెయిన్స్ తప్పడం లేదు. బైక్ నడిపే వారు వెన్ను, మెడ, భుజాలు, ఇతర కండరాల నొప్పులతో బాధ పడుతుంటే, కారు నడిపేవారు నడుము, కాళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. నిమ్స్ సహా అపోలో, యశోద, కేర్, కిమ్స్, సన్ షైన్ తదితర ఆస్పత్రుల్లోని ఆర్థోపెడిక్ విభాగాలకు చేరుతున్న బాధితుల సంఖ్య ఇటీవల భారీగా పెరిగింది. సాధారణ రోజుల్లో ఆస్పత్రి ఆర్థోపెడిక్ విభాగం సగటు ఓపీ 70 ఉండగా, ఇటీవల ఈ ఓపీ రోగుల సంఖ్య 150కి పెరిగింది. బాధితుల్లో 60 శాతం మండి ఒంటినొప్పులతో బాధపడుతుంటే, 15 శాతం మంది వెన్నుపూసలో డిస్కుల అరుగుదల వల్ల వచ్చే బ్యాక్పెయిన్తో బాధపడుతున్నారు. పది శాతం మంది నెక్పెయిన్తో బాధపతుంటే, ఐదు శాతం మంది బోన్ఫ్రాక్చర్తో బాధపడుతున్నట్లు సన్‌షైన్ ఆస్పత్రికి చెందిన ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యనిపుణురాలు డాక్టర్ చిరంజీవి తెలిపారు. జాగ్రత్తలు తీసుకోవాలి : డాక్టర్ రామ్ కమల్, ఆర్థోపెడిషియన్, శ్రీకర ఆస్పత్రి గతంతో పోలిస్తే ఇటీవల ఆర్థోపెడిక్ సంబంధిత కేసులు పెరిగాయి. గుంతలు తేలిన రోడ్లపై గంటల తరబడి ప్రయాణించడం వల్ల వాహనాల కుదుపులకు ఒళ్లుగుల్ల అవుతోంది. ముఖ్యంగా మధ్య వయస్కులే ఈ సమస్యను ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. కొంతమంది వృద్ధులు బోన్ఫ్రాక్చర్తో బాధపడుతున్నారు. వర్షాకాలనికి ముందు మా ఆస్పత్రికి రోజుకు సగటున 70మంది వస్తే..ప్రస్తుతం ఈ సంఖ్య 150కి చేరుకుంది. నిజానికి బైక్ నడిపేటప్పుడు తల, నడుము, షోల్డర్ వంచకుండా నిటారుగా ఉండటం అలవాటు చేసుకోవాలి. కారులో సిట్టింగ్ 110 డిగ్రీలు తప్పని సరిగా ఉండాలి. వీపు భాగాన్ని పూర్తిగా సీటుకు అనించి కూర్చోవాలి. గుంతలు, ఎగుడు దిగుడు రోడ్లు, స్పీడ్ బ్రేకర్లు ఉన్నప్పుడు వేగం తగ్గించాలి. లాంగ్ జర్నీ చేసేప్పుడు ప్రతి గంట, రెండు గంటలకోసారి కొంత విరామం తీసుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. -
స్పాండిలోసిస్‌కు పరిష్కారం చెప్పండి
నా వయసు 39 ఏళ్లు. గత ఆర్నెల్ల నుంచి తీవ్రమైన మెడనొప్పి, నడుమునొప్పితో బాధపడుతున్నాను. డాక్టర్‌ను సంప్రదిస్తే స్పాండిలోసిస్ అంటున్నారు. మందులు వాడుతున్నా, నొప్పి తగ్గినట్టే తగ్గి మళ్లీ వస్తోంది. ఈ సమస్యకు హోమియోలో శాశ్వత పరిష్కారం ఉందా? – కె. రామారావు, నల్లగొండ ఎముకల అరుగుదల వల్ల వచ్చే ఒక రకమైన ఆర్థరైటిస్‌ను స్పాండిలోసిస్ అంటారు. ఇది మెడ భాగంలో వస్తే సర్వైకల్ స్పాండిలోసిస్ అని, నడుము భాగంలో వస్తే లంబార్ స్పాండిలోసిస్ అని పేర్కొంటారు. కారణాలు : ∙కాళ్లు, చేతులతో ఉన్నట్లు వెన్నులో కూడా జాయింట్స్ ఉంటాయి. ఈ జాయింట్స్ అరుగుదల వల్ల నొప్పి రావచ్చు. ∙జాయింట్స్‌లోని ద్రవం తగ్గడం వల్ల ∙స్పైన్ దెబ్బతినడం వల్ల ∙వెన్నుపూసల మధ్య నుంచి నరాలు శరీరంలో వ్యాపించడానికి ఉండే దారి సన్నబడి, నరాలపై ఒత్తిడి పడి నొప్పి వస్తుంది. లక్షణాలు : ∙సర్వైకల్ స్పాండిలోసిస్ : మెడనొప్పి, తలనొప్పి తల అటు–ఇటు తిప్పడం కష్టమవుతుంది. మెడ బిగుసుకుపోయినట్టుగా ఉంటుంది. నొప్పి మెడ నుంచి భుజాలు, చేతుల వరకు ఉంటుంది. ∙లంబార్ స్పాండిలోసిస్ : నడుమునొప్పి, కొన్నిసార్లు నడుము నొప్పితో పాటు మెడ నొప్పి కూడా ఉంటుంది. నొప్పి నడుము నుంచి మొదలై పాదం వరకు వ్యాపిస్తుంది. దీనినే సయాటికా నొప్పి అంటారు. నరాలు ఒత్తిడికి గురైనప్పుడు అవి సప్లై అయ్యే చోటు మొద్దుబారడం, నడవడానిక్కూడా ఇబ్బందిపడటం వంటి సమస్యలు వస్తాయి. నివారణ : వెన్నెముకకు సంబంధించిన వ్యాయామాలు చేయడం, మంచి పోషకాహారం తీసుకోవడం, క్యాల్షియమ్ ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలు తీసుకోవడం, ఒక్కసారిగా కూర్చోవడం లేదా నిల్చోవడం వంటివి చేయకపోవడం, దూరప్రాంతాలకు వాహనం నడపడం వంటివి చేయకపోవడం. చికిత్స : రోగి శారీరక, మానసిక సమస్యలను పరిగణనలోకి తీసుకొని ఇచ్చే కాన్స్టిట్యూషనల్ చికిత్సతో వారిలోని రోగనిరోధక శక్తి క్రమంగా పెరిగి, సమస్య పూర్తిగా తగ్గుతుంది. డాక్టర్ ఎ.ఎం. రెడ్డి, సీఎండీ,పాజిటివ్ హోమియోపతి, హైదరాబాద్ -
తరచుగా పట్టేస్తున్నాయి
ప్రస్తుతం నేను ప్రెగ్నెంట్‌ని. నాకు కండరాలు తరచుగా పట్టేస్తున్నాయి. ‘డి’ విటమిన్ లోపం వల్ల ఇలా జరుగుతుందని విన్నాను. ‘డి’ విటమిన్ కోసం ఎలాంటి ఆహారం తీసుకోవాలి? కండరాలు పట్టకుండా ఉండడానికి వేరే మార్గాలు ఏమైనా ఉన్నాయా?– ఆర్.సంగీత, నెల్లిమర్ల గర్భిణిగా ఉన్నప్పుడు చాలామందిలో కాళ్ల కండరాలు పట్టేసినట్లు ఉండడం, కాళ్ల నొప్పులు, కాళ్ల పిక్కలలో నొప్పులు ఉంటాయి. డీహైడ్రేషన్, క్యాల్షియం, మెగ్నీషియం విటమిన్స్ లోపం, బిడ్డ బరువు, తల్లి బరువు కాళ్లమీద పడడం, రక్తప్రసరణ తగ్గడం, బిడ్డ బరువు వెన్నుపూస మీద పడి, అక్కడి నుంచి కాళ్లకు చేరే సరాలు, రక్తనాళాలు ఒత్తుకుని కాళ్లనొప్పులు, కాళ్లలో నీరు చేరడం వంటి అనేక కారణాల వల్ల కండరాలు తరచుగా పట్టేస్తాయి. కేవలం విటమిన్ డి లోపం ఒక్కటే కారణం కాదు. కొన్నిసార్లు విటమిన్ డి మరీ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా, క్యాల్షియం ఎక్కువగా రక్తంలో కండరాలలో చేరుతుంది. అధికంగా శరీరంలో క్యాల్షియం ఉండటం వల్ల కూడా కండరాలు బిగుతుగా ఉండి, కాళ్లు పట్టేసినట్లు ఉండటం జరగవచ్చు. కాబట్టి విటమిన్ డి... అవసరాన్ని బట్టి, డాక్టర్ సలహా మేరకు, కండరాలు పట్టేయడానికి తీసుకోవచ్చు. విటమిన్ డి, చేపలు, గుడ్డు పచ్చసొనలో, పాలలో ఎక్కువగా దొరుకుతుంది. కండరాలకు మసాజ్ చెయ్యడం, చిన్న వ్యాయామాలు చెయ్యడం, మధ్యాహ్నం పూట కొద్దిగా విశ్రాంతి తీసుకోవటం, మంచినీళ్లు ఎక్కువగా తాగటం, ఆహారంలో సరైన పౌష్టికాహారం తీసుకోవటం, పడుకున్నప్పుడు కాళ్ల కింద దిండు ఎత్తుగా పెట్టుకోవడం, వేడి నీళ్లతో కాపడం పెట్టడం లేదా ఐస్‌తో మసాజ్ చెయ్యడం, మెగ్నీషియం ఎక్కువగా ఉండే ఆహారం అంటే బీన్స్, డ్రై ఫ్రూట్స్ వంటివి తీసుకోవటం వంటి జాగ్రత్తలు పాటించడం వల్ల చాలామందిలోకి కండరాల సమస్య నుంచి చాలావరకు ఉపశమనం దొరుకుతుంది. నాకు అప్పుడప్పుడు కడుపులో విపరీతమైన నొప్పి వస్తుంది. ‘పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్’ వల్ల కూడా ఇలా జరుగుతుందని ఒక ఫ్రెండ్ చెప్పింది. ఇది నిజమేనా? ‘ పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్’ గురించి తెలియజేయగలరు.– బీఆర్, కర్నూల్ ఆడవారిలో పొత్తికడుపు లోపల ఉన్న గర్భాశయం, అండాశయం, ఫెలోపియన్ ట్యూబ్లలో ఉన్న కణజాలంలో, ఏదైనా ఇన్ఫెక్షన్, ఇంకా ఇతర కారణాల వల్ల వాటిలో వాపు రావడాన్ని పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ (పీఐడీ) అంటారు. దీనిలో కొందరిలో పొత్తికడుపులో నొప్పి, ఎక్కువగా యోని నుంచి తెల్లబట్ట, దురద, వాసన, జ్వరం, మూత్రంలో మంట, కలయికలో నొప్పి, పీరియడ్స్ క్రమం తప్పడం వంటి లక్షణాలు ఒక్కొక్కరిలో ఒక్కోలాగా ఏర్పడవచ్చు. కొందరిలో ఎటువంటి లక్షణాలు ఉండకపోవచ్చు. ఇది ఎక్కువ మటుకు ఇన్ఫెక్షన్, కలయిక ద్వారా బ్యాక్టీరియా క్రిములు, యోని భాగం నుంచి గర్భాశయంలోకి పాకడం వల్ల వస్తుంది. చాలావరకు క్లమీడియా, గోనోరియా వంటి క్రిముల వల్ల ఈ ఇన్ఫెక్షన్ వస్తుంది. పీఐడీని నిర్ధారించడానికి సీబీఎఫ్, ఈఎస్ఆర్, సీఆర్పీ, స్కానింగ్, వెజైనల్ స్వాబ్ వంటి, ఇంకా ఇతర పరీక్షలు చెయ్యవలసి ఉంటుంది. నిర్ధారణ అయిన తర్వాత అశ్రద్ధ చెయ్యకుండా, యాంటీబయోటిక్స్ మొత్తం కోర్సు వాడవలసి ఉంటుంది. అవసరమైతే దంపతులు ఇద్దరూ వాడవలసి ఉంటుంది. చికిత్స తీసుకోకుండా అశ్రద్ధ చేస్తే, ఇన్ఫెక్షన్ బాగా ముదిరి, గర్భాశయం దెబ్బతినడం, ట్యూబ్స్ పాడవడం, అలాగే ట్యూబ్స్ మూసుకొని పోయి గర్భం రాకపోవడం, అండాశయాలు, ట్యూబ్స్‌లో చీము చేరడం, వాటిని తొలగించవలసి రావడం వంటి సమస్యలు పెరిగే అవకాశాలు ఉంటాయి. నీకు అప్పుడప్పుడు కడుపులో నొప్పి వస్తుంది అని రాశావు. నీ వయసు ఎంత, వివాహం అయిందా లేదా అనేది రాయలేదు. అది గ్యాస్‌వల్ల కాని, యూరిన్ ఇన్ఫెక్షన్ వల్ల కాని ప్రేగులలో సమస్య వల్ల, గర్భాశయంలో సమస్యలు వంటి ఎన్నో కారణాల వల్ల కడుపులో నొప్పి రావచ్చు. అన్ని నొప్పులకు పీఐడీ కారణం కాదు. కాబట్టి నీ నొప్పిని అశ్రద్ధ చెయ్యకుండా డాక్టర్ని సంప్రదించి, అవసరమైన పరీక్షలు చేయించుకుని, చికిత్స తీసుకోవడం మంచిది. గర్భిణిగా ఉన్న స్త్రీలు బ్యాక్ పెయిన్, పెల్విక్ పెయిన్ సమస్యలను ఎదుర్కోవడానికి కారణం ఏమిటి? విశ్రాంతి లోపించడం వల్లే ఇలా జరుగుతుందనే మాట చాలాసార్లు విన్నాను. నిజానికి ఎక్కువగా విశ్రాంతి తీసుకున్న వారు కూడా ఈ సమస్యలను ఎదుర్కోవడం చూశాను. అసలు కారణం ఏమిటి?– కె.శాంతి, గూడూరు గర్భిణిగా ఉన్నప్పుడు, గర్భాశయంలో 9 నెలల పాటు బిడ్డ పెరగటం వల్ల, గర్భాశయం బాగా సాగుతుంది. కండరాల మీద బరువు పెరుగుతుంది. కడుపులో గర్భాశయం... పెల్విక్ ఎముకలకు, వెన్నుపూసకి, కొన్ని లిగమెంట్స్ ద్వారా అతుక్కుని ఉంటుంది. గర్భాశయం సాగేకొద్దీ లిగమెంట్స్ ద్వారా, పెల్విక్ ఎముకలు, వెన్నుపూస మీద ఒత్తిడి పడి, అవి లాగినట్లు ఉండి, గర్భిణీలలో బ్యాక్ పెయిన్, పెల్విక్ పెయిన్ సమస్యలు రావడం జరుగుతుంది. గర్భిణీలలో ప్రొజెస్టరాన్ హార్మోన్ విడుదల వల్ల, వెన్నుపూస కండరాలు, పెల్విక్ కండరాలు వదులయినట్లు ఉండడం, నడుంనొప్పి రావడం జరుగుతుంది. కాన్పు కోసం బిడ్డ బయటకు రావటానికి సహజంగానే పెల్విక్ కండరాలు, ఎముకలు కొద్దిగా వదులు అవుతాయి. మొత్తం విశ్రాంతి తీసుకోవటం వల్ల పూర్తిగా నొప్పి నుంచి ఉపశమనం ఉండదు. ఈ నొప్పుల కోసం ఇంకా పూర్తిగా విశ్రాంతి తీసుకుంటే, కండరాలు ఇంకా పట్టేసి నొప్పి పెరుగుతుంది.డాక్టర్ సలహా మేరకు విశ్రాంతి ఎంత అవసరముంటే అంత తీసుకోవాలి. కొద్దిగా చిన్నపాటి వ్యాయామాలు, వాకింగ్ వంటివి చెయ్యడం వల్ల కొందరిలో ఈ నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. డా‘‘ వేనాటి శోభ రెయిన్బో హాస్పిటల్స్ కూకట్పల్లి హైదరాబాద్ -
వెన్నునొప్పి... మందులతో తగ్గుతుందా?
నాకు ఈమధ్య విపరీతమైన వెన్నునొప్పి వస్తోంది. ఎన్ని చోట్ల చికిత్స తీసుకున్నా ప్రయోజనం ఉండటం లేదు. దీనికి హోమియోలో చికిత్స ఉందా? – రమేశ్ కుమార్, గుంటూరు ఇటీవల వెన్నునొప్పి చాలా ఎక్కువ మందిలో కనిపిస్తోంది. వెన్నుభాగంలో లిగమెంట్లు, కండరాలు, మన రోజువారీ జీవితంలో శారీరకంగా ఎదురయ్యే ఎన్నో సమస్యలను తట్టుకొని నరాల మీద ఎలాంటి ఒత్తిడి పడకుండా కాపాడుకోవడం వెన్నెముక ప్రధాన విధి. అధికంగా బరువు ఎత్తడం, దించడం, ఊబకాయం, ఇన్ఫెక్షన్లు, క్యాల్షియమ్ లోపం, విటమిన్ బి12, డీ3 లోపాలు, ఎముకల సాంద్రత తగ్గడం వంటివి వెన్నునొప్పికి కొన్ని కారణాలు. మనం ఏ పని చేయాలన్నా ప్రతిక్షణం మెడ, నడుములోని వెన్నుపూసలు పనిచేయాలి. అందుకే ప్రతి పదిమందిలో ఆరు నుంచి ఎనిమిది మంది వెన్ను సంబంధిత సమస్యలతో బాధపడుతుంటారు. ‘వెన్నుపూసలు అరిగి వెన్నునొప్పి వస్తుంది కాబట్టి మందులతో దాన్ని పరిష్కరించలేమనీ, ఆపరేషనే మార్గమని’ ఒక అపోహ ఉంది. పైగా ఇది జీవితాంతం వేధిస్తూ ఉంటుందని నిస్పృహ కూడా. అయితే... వెన్నునొప్పికి కారణమైన డిస్క్ బల్జ్, డిస్క్ కంప్రెషన్, నరాలమీద ఒత్తిడి పెరగడం వల్ల తీవ్రమైన నొప్పి వస్తుంటుంది. ఇలాంటి వెన్ను నొప్పులు వచ్చినప్పుడు... అంటే ఉదాహరణకు డిస్క్ బల్జ్ వల్ల నరాలమీద ఒత్తిడి పెరిగినప్పుడు తగ్గించడానికి హోమియోలో కోబాల్ట్ లాంటి ప్రభావపూర్వకమై మందులు అందుబాటులో ఉన్నాయి. మెడభాగంలో వెన్నుపూసలు అరిగి వచ్చే నొప్పిని సర్వైకల్ స్పాండిలోసిస్ అంటారు. మెడ భాగంలో సి1 నుంచి సి7 వరకు ఉండే వెన్ను పూసలు సర్వైకల్ పూసలు. ఇవి అరిగినప్పుడు వెన్నుపూసల కీళ్ల మధ్య భాగం తగ్గిపోవడం వల్ల డిస్క్‌బల్జ్ ఏర్పడటం, వెన్నుపూసల మధ్య రాపిడి పెరగడంతో మెడ భాగం నుంచి నొప్పి మొదలై చేతి వేళ్ల వరకు నొప్పి పాకుతూ ఉంటుంది. దాంతో పాటు తిమిర్లు, చేయి మొద్దుబారడం, మెడ ఫ్రీగా తిరగలేకపోవడం, మెడ పట్టివేసినట్లుగా ఉండటం వంటివి చూస్తుంటాం. ఇలాంటి వారికి యాసిడ్‌ఫాస్ అనే మందు బాగా పనిచేస్తుంది. ఇక మెడ, నడుము, వెన్నెముక నొప్పులకు రస్టాక్స్, బ్రయోనియా ఆల్బ్, కాల్కేరియా ఫ్లోర్, హైపరికం, మహిళల్లో వచ్చే ఇలాంటి సమస్యలకు సిమిసిఫ్యూగా వంటివి చాలా బాగా పనిచేస్తాయి. డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి, ఎండీ (హోమియో) స్టార్ హోమియోపతి, హైదరాబాద్ -
నొప్పికి అడ్డుకట్ట..!
కూర్చుంటే నొప్పి.. లేస్తే నొప్పి.. నడిస్తే నొప్పి! నడుము, వెన్ను నొప్పులతో పాటు రోజూ వేధించే నొప్పులెన్నో.. అలాంటి దీర్ఘకాలిక బాధలకు ఇక చెల్లు! పెయిన్ కిల్లర్లు అక్కర్లేదు.. ఎలక్ట్రోడ్లు అవసరం లేదు.. ఒక చిన్న చిప్‌ను వెన్నుపాము వద్ద అమర్చుకుంటే చాలు.. నొప్పి సంకేతాలు మెదడుకు చేరకుండా అడ్డుకుంటుంది. వెన్నుపాము వద్ద అమర్చిన అయాన్ పంపు ఊహాచిత్రమిది. అంతర్ చిత్రంలో.. ప్లస్ గుర్తులో ఉన్నవి నొప్పి సిగ్నళ్లు కాగా, పసుపురంగులోనివి నొప్పిని అడ్డుకుంటున్న సిగ్నళ్లు శరీరంలో ఎలాంటి నొప్పి అయినా మనకు తెలియాలంటే.. ముందుగా ఆ నొప్పి సిగ్నళ్లు మెదడును చేరాలి. అప్పుడే మనకు నొప్పి అనుభూతి కలుగుతుంది. ఆ తర్వాతే బాధ నుంచి ఉపశమనం కలిగించే నాడీ రసాయనాలు విడుదలయ్యేలా మెదడు ఆదేశాలిస్తుంది. ఇదంతా దేహంలో జరిగే సహజమైన ప్రక్రియ. కానీ నొప్పి సిగ్నళ్లు నిరంతరం మెదడును చేరుతూ ఉంటే.. ఇక రోజూ నరకమే! అందుకే.. నొప్పి సంకేతాలు మెదడును చేరకుండా అడ్డుకునేందుకు శాస్త్రవేత్తలు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. స్వల్పస్థాయి కరెంటు షాక్‌లు ఇచ్చే ఎలక్ట్రోడ్లను వెన్నుపాము వద్ద అమర్చడం, పెయిన్ కిల్లర్ మందులను ఇవ్వడం వంటివి చేస్తున్నారు. కానీ వీటి వల్ల దుష్ర్పభావాలు కలుగుతున్నాయి. మరి.. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నొప్పికి అడ్డుకట్ట వేయడం కుదురుతుందా? అంటే అవుననే అంటున్నారు స్పెయిన్‌లోని లైనికోపిన్ యూనివర్సిటీ, కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు. శరీరంలో నొప్పిని నివారించే నాడీ రసాయనాలను సహజంగానే విడుదలయ్యేలా చేసే ‘ఆర్గానిక్ అయాన్ పంప్’ని వారు తయారు చేశారు. ఉదాహరణకు.. ఒక వ్యక్తికి నడుము దగ్గర నాడులు దెబ్బతిని నడుమునొప్పి వేధిస్తుందనుకుందాం. దెబ్బతిన్న నాడుల దగ్గర నుంచి నొప్పి సంకేతాలు(నాడీ రసాయనాలు) వెన్నుపాముకు, అక్కడి నుంచి మెదడుకు చేరతాయి. అయితే, ఈ సంకేతాలు వెన్నుపాముకు చేరే దగ్గర అయాన్ పంపు చిప్‌ను అమరిస్తే గనక.. ఇది అక్కడ ‘గామా అమైనోబ్యుటిరిక్ యాసిడ్’ అనే నాడీ రసాయన అణువులు సహజంగానే విడుదలయ్యేలా చేస్తుంది. దీంతో ఇవి నొప్పి సంకేతాలను అక్కడే అడ్డుకుంటాయి. ఫలితంగా నొప్పి అన్న భావనే కలగదు! ఈ చిప్ ఎలుకల్లో విజయవంతంగా పనిచేసిందని, ఐదేళ్లలో మనుషులలో వాడేందుకూ సిద్ధమవుతుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా 7 శాతం మంది దీర్ఘకాలిక నొప్పులతో బాధపడుతున్నారని, అలాంటి వారికి దీనితో ఉపశమనం కలుగుతుందన్నారు. దీర్ఘకాలిక నొప్పుల నివారణకే కాకుండా.. అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి వ్యాధుల చికిత్సకు, గుండెను పేస్‌మేకర్‌కు అనుసంధానించేందుకూ ఈ అయాన్ పంపు ఉపయోగపడుతుందని చెబుతున్నారు.