నొప్పికి అడ్డుకట్ట..!
కూర్చుంటే నొప్పి.. లేస్తే నొప్పి.. నడిస్తే నొప్పి! నడుము, వెన్ను నొప్పులతో పాటు రోజూ వేధించే నొప్పులెన్నో.. అలాంటి దీర్ఘకాలిక బాధలకు ఇక చెల్లు! పెయిన్ కిల్లర్లు అక్కర్లేదు.. ఎలక్ట్రోడ్లు అవసరం లేదు.. ఒక చిన్న చిప్‌ను వెన్నుపాము వద్ద అమర్చుకుంటే చాలు.. నొప్పి సంకేతాలు మెదడుకు చేరకుండా అడ్డుకుంటుంది.
వెన్నుపాము వద్ద అమర్చిన అయాన్ పంపు ఊహాచిత్రమిది. అంతర్ చిత్రంలో.. ప్లస్ గుర్తులో ఉన్నవి నొప్పి సిగ్నళ్లు కాగా, పసుపురంగులోనివి నొప్పిని అడ్డుకుంటున్న సిగ్నళ్లు
శరీరంలో ఎలాంటి నొప్పి అయినా మనకు తెలియాలంటే.. ముందుగా ఆ నొప్పి సిగ్నళ్లు మెదడును చేరాలి. అప్పుడే మనకు నొప్పి అనుభూతి కలుగుతుంది. ఆ తర్వాతే బాధ నుంచి ఉపశమనం కలిగించే నాడీ రసాయనాలు విడుదలయ్యేలా మెదడు ఆదేశాలిస్తుంది. ఇదంతా దేహంలో జరిగే సహజమైన ప్రక్రియ. కానీ నొప్పి సిగ్నళ్లు నిరంతరం మెదడును చేరుతూ ఉంటే.. ఇక రోజూ నరకమే! అందుకే.. నొప్పి సంకేతాలు మెదడును చేరకుండా అడ్డుకునేందుకు శాస్త్రవేత్తలు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. స్వల్పస్థాయి కరెంటు షాక్‌లు ఇచ్చే ఎలక్ట్రోడ్లను వెన్నుపాము వద్ద అమర్చడం, పెయిన్ కిల్లర్ మందులను ఇవ్వడం వంటివి చేస్తున్నారు. కానీ వీటి వల్ల దుష్ర్పభావాలు కలుగుతున్నాయి. మరి.. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నొప్పికి అడ్డుకట్ట వేయడం కుదురుతుందా? అంటే అవుననే అంటున్నారు స్పెయిన్‌లోని లైనికోపిన్ యూనివర్సిటీ, కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్ శాస్త్రవేత్తలు. శరీరంలో నొప్పిని నివారించే నాడీ రసాయనాలను సహజంగానే విడుదలయ్యేలా చేసే ‘ఆర్గానిక్ అయాన్ పంప్’ని వారు తయారు చేశారు.
ఉదాహరణకు.. ఒక వ్యక్తికి నడుము దగ్గర నాడులు దెబ్బతిని నడుమునొప్పి వేధిస్తుందనుకుందాం. దెబ్బతిన్న నాడుల దగ్గర నుంచి నొప్పి సంకేతాలు(నాడీ రసాయనాలు) వెన్నుపాముకు, అక్కడి నుంచి మెదడుకు చేరతాయి. అయితే, ఈ సంకేతాలు వెన్నుపాముకు చేరే దగ్గర అయాన్ పంపు చిప్‌ను అమరిస్తే గనక.. ఇది అక్కడ ‘గామా అమైనోబ్యుటిరిక్ యాసిడ్’ అనే నాడీ రసాయన అణువులు సహజంగానే విడుదలయ్యేలా చేస్తుంది. దీంతో ఇవి నొప్పి సంకేతాలను అక్కడే అడ్డుకుంటాయి.
ఫలితంగా నొప్పి అన్న భావనే కలగదు! ఈ చిప్ ఎలుకల్లో విజయవంతంగా పనిచేసిందని, ఐదేళ్లలో మనుషులలో వాడేందుకూ సిద్ధమవుతుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా 7 శాతం మంది దీర్ఘకాలిక నొప్పులతో బాధపడుతున్నారని, అలాంటి వారికి దీనితో ఉపశమనం కలుగుతుందన్నారు. దీర్ఘకాలిక నొప్పుల నివారణకే కాకుండా.. అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి వ్యాధుల చికిత్సకు, గుండెను పేస్‌మేకర్‌కు అనుసంధానించేందుకూ ఈ అయాన్ పంపు ఉపయోగపడుతుందని చెబుతున్నారు.