గాయని పి.సుశీలతో బాలాదిత్య
బాల నటుడిగా అలరించి, హీరోగా ఎదిగిన బాలాదిత్య... నటుడిగానే అందరికీ తెలుసు. కానీ అతడిలో ఒక కవి కూడా ఉన్నాడు. ఓ పక్క నటుడిగా కొనసాగుతూనే ఆదిత్య అక్షరాలతో చెలిమి చేశాడు. పాటలల్లాడు. కవితలు రాశాడు. అలా రాసిన కొన్ని కవితల్లో ఇదొకటి. గానకోకిల సుశీలమ్మపై అతడికున్న అభిమానానికి అక్షర రూపమిది. నటుడిగానే కాక కవిగా కూడా పేరు తెచ్చుకోవాలని తపిస్తోన్న బాలాదిత్య... త్వరలో తన కవితా సంకలనాన్ని వెలవరించాలని ఆశిస్తున్నాడు!
విశాలమైన ఈ సినీగీతాల జగత్తులో
సుశీలగారిదో ప్రత్యేక స్థానం... అది మరపురాని గానం
ఆ కంఠం వినగా వైకుంఠమే కనవచ్చు
ఆమె స్వరం కొరకై స్వర్గవాసులే దిగి వచ్చు
పాత పాటకి పసిడి పూత - ఆ స్వర మాధుర్యం
పాట పాటకీ నవనీత - ఆమె గళ చాతుర్యం
‘చిటపట చినుకు’ల పలుకులు విన్నా...
‘నీవని నేనని’ ఈవిడ అన్నా...
అతి మధురం ప్రతి గీతం - మన మదికే నవనీతం
‘జననీ శివకామిని’ అంటూ స్తుతించి ఆ దేవిని
జనులందరి జేజేలొందెను సుతిమెత్తని గాయని
‘సఖియా వివరించవె’ అన్నా - ‘హిమగిరి సొగసు’లనే కన్నా
‘నీవు లేక వీణ’ను విన్నా - ‘గోదారి గట్టుంది’ అన్నా
ఆ గాత్రం తనకే సొంతం - తను మాత్రం అందరి సొంతం
తెలుగువారింటి ఆడపడుచుగా - తమిళ నాట్ట్‌కే వీట్ట్ పొన్నుగా - కన్నడ గడ్డే కన్న తీరుగా - కేరళ కోరిన
గళము వీరుగా
‘ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై’
అని తానీ దేశంలోనే ఉత్తమ గాయనై
అమ్మయై ‘వటపత్ర సాయికి’ లాలిని
కొమ్మపై కోయిలై ‘ఇది మల్లెల వేళయని’
‘గుడివాడ వెళ్లాను’ అని కొంటెగ కూతపెట్టి
‘నిను వీడని నీడను నేనే’నని భయపెట్టి
‘శ్రీరస్తు - శుభమస్తు’ అని జంటలను కలిపి
‘అహ నా పెళ్లంట’ అంటూ తను పలికి
సాక్షాత్తూ సావిత్రి స్వరమే అన్నట్టుగా
నిజముగా జమునయే పాడేస్తున్నట్టుగా
వాణిశ్రీ నుండి మాలాశ్రీ దాకా
గాత్రంతో పాత్రలకే ప్రాణం పోసేసి
ఎందు పాడినా అందరికీ ఓ బంధువు భావన కలిగించి
విందు చేసె మన డెందముకి స్వరబంధము తానే కల్పించి
ఒకటుందా రెండున్నాయా ఆమె నోటి పాటలు
చెబుతున్నా సరిపోతాయా ఆమె గూర్చి మాటలు
ప్రతి పాట నాటుకుపోయే జనుల గుండె గూటిలో
ఎంచమంటె మంచివి తరమా... ఇన్ని వేల వీటిలో
సినీ సీమ నిర్మించేను సుశీలమ్మ పాటల హారం
సుశీలమ్మ నిర్మించేను శ్రోతలకో సాగర తీరం
ఆవిడకి పాటే జీవితం - ఆవిడ జీవితం పాటకే అంకితం
అందుకే... ఆవిడ పాట శాశ్వతం.