చిత్రం... భళారే విచిత్రం!
హృదయం
ఇప్పటిదాకా మీరు చాలా ప్రేమకథలు చూసి ఉండొచ్చు. చదివి ఉండొచ్చు. స్వయంగా మీకే ఒక ప్రేమకథ ఉండి ఉండొచ్చు. కానీ ఇలాంటి ప్రేమకథను మాత్రం చూసి ఉండరు. చదివి ఉండరు. విని ఉండరు. అనుభవించి ఉండరు! అంత ప్రత్యేకత ఏముందా ప్రేమకథలో అంటారా? అయితే చదవండి!
ఒకరికి ఒకరు తెలియకుండా, కనీసం ఒక్కసారైనా కలుసుకోకుండా ముఖం కూడా చూసుకోకుండా ఇద్దరూ కలిసి ఓ పాపకు జన్మనివ్వడం, ఆ పాపకు ఏడాది వయసొచ్చాక, ఆ ఇద్దరూ తొలిసారి కలవడం... ఆపై ప్రేమికులుగా మారడం, కలిసి జీవనం సాగించడం ఎంత చిత్రమో కదా! అదే జరిగింది ఆస్ట్రేలియాకు చెందిన అమినా హార్ట్, స్కాట్ ఆండర్సన్‌ల విషయంలో. అదెలా సాధ్యమంటే... ముందు మనం బాలీవుడ్‌లో సూపర్‌హిట్టయిన ‘విక్కీ డోనర్’ సినిమా గురించి మాట్లాడుకోవాలి. పిల్లలు పుట్టని మహిళలు... ఎవరో తెలియని అనామకుడి నుంచి వీర్యం పొంది, తల్లులుగా మారడం గురించి అందులో చూశాం కదా. అదే జరిగింది అమినా విషయంలో.
మెల్‌బోర్న్‌కు చెందిన అమినా ఒకటికి రెండుసార్లు పెళ్లి చేసుకుంది. మొదటి భర్తతో కలిసి మగబిడ్డకు జన్మనిస్తే, ఆ బిడ్డ నాలుగు నెలలకే చనిపోయాడు. తన మొదటి భర్త నుంచి విడిపోయి ఇంకో వ్యక్తిని పెళ్లి చేసుకున్న అమినా.. అతడితోనూ ఓ బిడ్డను కంది. ఆ బిడ్డ బతికింది 14 నెలలే. ఎందుకిలా అవుతోందని పరీక్షలు చేయించుకుంటే, ఆమెకు ఓ జెనెటిక్ డిజార్డర్ ఉన్నట్లు తేలింది. ఓ అరుదైన వీర్యం తోడైతే తప్ప, ఆరోగ్యమైన బిడ్డను కనడం సాధ్యం కాదని తేల్చేశారు వైద్యులు.
పిల్లలంటే ఎంతో ఇష్టమున్న అమినా ఒకటికి రెండుసార్లు బిడ్డను కోల్పోవడంతో తీవ్ర నైరాశ్యంలో కూరుకుపోయింది. తన రెండో భర్తకు కూడా విడాకులిచ్చేసింది. 42 ఏళ్ల వయసులో ఇక పిల్లల మీద ఆశలు వదులుకుని, ఒంటరి అయిపోయిన అమినాకు జీవితం మీదే విరక్తి పుట్టింది. ఈ స్థితిలో ఓ స్నేహితురాలు ‘వీర్య దానం’ గురించి చెప్పింది. వీర్య దాతల మెడికల్ హిస్టరీ స్టడీ చేసి, తనకు నప్పే వీర్యాన్ని ఎంచుకుని బిడ్డను కనవచ్చని తెలిపింది. దీంతో వైద్యుల్ని కలిసి వీర్య దాతల గురించి సమాచారం సేకరించింది అమినా. కొన్ని నెలల పరిశీలన తర్వాత ఫిలిప్ ఐలాండ్ ప్రాంతానికి చెందిన స్కాట్ ఆండర్సన్ అనే వ్యక్తి వీర్యంతో బిడ్డను కనాలని నిర్ణయించుకుంది. వైద్యులు అందుకవసరమైన ఏర్పాట్లు చేశారు. ఫలితంగా 3.9 కిలోల బరువుతో ఆరోగ్యకరమైన ఆడబిడ్డకు జన్మనిచ్చింది అమినా. కొన్ని రోజుల తర్వాత ఓ సర్జరీ చేయాల్సి వచ్చింది కానీ అదయ్యాక, ఏ ఇబ్బందీ లేకుండా పెరిగింది అమినా కూతురు. ఆ పాపకు లైలా అని పేరు పెట్టుకుని అల్లారుముద్దుగా పెంచుకుంది.
అయితే పాపకు ఆరు నెలల వయసు వచ్చాక, వీర్య దాత గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి పుట్టింది అమినాకు. స్కాట్ ప్రొఫైల్‌లో ఉన్న వివరాల్ని బట్టి గూగుల్‌లో వెతికి మరీ అతడి గురించి సమాచారం సేకరించింది. తర్వాత అతడికి ఫోన్ చేసి మాట్లాడింది. తన వల్ల తాను ఆరోగ్యకరమైన బిడ్డకు జన్మనిచ్చానని చెప్పడంతో చాలా సంతోషించాడు స్కాట్. ఆ తర్వాత తరచుగా మాట్లాడుకున్నారిద్దరూ. లైలా తొలి పుట్టినరోజుకు కొన్ని రోజుల ముందు తనను కలవాలన్న కోరిక వ్యక్తం చేశాడు స్కాట్. తన అడ్రస్ తెలుసుకుని, లైలాను తీసుకుని తనింటికే వెళ్లింది అమినా. అచ్చం తన పోలికలతోనే ఉన్న లైలాను చూసి, మురిసిపోయాడు స్కాట్.
అలవాట్లు, ప్రవర్తన కూడా తనలాగే ఉండటంతో అతడి ఆనందానికి అవధుల్లేవు. తన ఊళ్లో వ్యవసాయం చేసుకునే స్కాట్, ఆ తర్వాత తరచుగా లైలాను చూసేందుకు మెల్‌బోర్న్ వచ్చేవాడు. క్రమక్రమంగా లైలాతో, అమినాతో అతడి బంధం బలపడింది. స్కాట్‌కు అప్పటికే నలుగురు పిల్లలు. అయితే తను కూడా విడాకులు తీసుకున్నాడు. దీంతో అమినాతో కలిసి సాగుదామనిపించిందతనికి. స్కాట్ లైలా మీద చూపించే ప్రేమ... వాళ్లిద్దరి అనుబంధం చూసి, అమినాకు కూడా అతడిపై ప్రేమ పుట్టింది. ముందుగా స్కాట్ ప్రపోజ్ చేశాడు. అమినా ఒప్పుకుంది. త్వరలోనే పెళ్లి చేసుకుందామనుకుంటున్న ఈ జంట... తమ బిడ్డతో కలిసి జీవితాన్ని ఆస్వాదిస్తోందిప్పుడు.