‘ఆహా’లీవుడ్ తార
సొంత గడ్డ మీద విజయం సాధించడమే పెద్ద విషయం. మరి మనది కాని దేశానికి వెళ్లి అక్కడ మన జెండా పాతడం అంటే సామాన్యమైన విషయమా! కానే కాదు. కానీ ఈ బాలీవుడ్ బ్యూటీలు హాలీవుడ్‌కు దూసుకెళ్లి, అక్కడి చిత్రాల్లో నటించి శభాష్ అనిపించుకున్నారు.
ఐశ్వర్యారాయ్
అందానికి నిర్వచనం చెప్పమంటే ప్రపంచంలోని సగానికి పైగా దేశాలు ఐశ్వర్యారాయ్ పేరు చెప్తాయంటే అతిశయోక్తి కాదు. మన దేశంలో పుట్టిన ఆ అందం విదేశీయులను సైతం అంతగా ముగ్ధుల్ని చేసింది మరి. అదే ఆమెకు హాలీవుడ్ అవకాశాలనూ తెచ్చిపెట్టింది. బ్రైడ్ అండ్ ప్రెజ్యుడీస్, మిస్ట్రెస్ ఆఫ్ స్పైసెస్, ప్రొవోక్డ్, పింక్ పాంథర్ 2 లాంటి చిత్రాలతో హాలీవుడ్ ప్రేక్షకులకు కూడా అభిమాన నటి అయిపోయింది ఐష్.
టబు
సక్సెస్‌ఫుల్ హీరోయిన్ల లిస్టులో టబు పేరుండదేమో కానీ, గొప్ప నటీమణుల లిస్టులో తప్పక ఉంటుంది. డబ్బు కోసం, పాపులారిటీ కోసం పాకులాడకుండా కేవలం తన ప్రతిభనే నమ్ముకుని సాగిపోతోన్న నటి ఆమె. ఆ లక్షణమే ఆమెను ఉత్తమ నటిని చేసింది. హాలీవుడ్‌కి కూడా తీసుకెళ్లింది. నేమ్‌సేక్, లైఫ్ ఆఫ్ పై వంటి చిత్రాలతో అక్కడి వారికి కూడా తన టాలెంట్‌ను రుచి చూపించింది టబు.
ప్రియాంకా చోప్రా
ఒక హీరోయిన్‌కి ఎన్ని ప్రత్యేకతలు ఉండాలో అన్నీ ఉంటాయి ప్రియాంకకి. ఒక నటి ఎన్ని సెన్సేషన్లు క్రియేట్ చేయగలదో అన్నీ చేసి చూపించిందామె. ఆమె సాధించిన వాటిలో అతి పెద్ద విజయం... హాలీవుడ్‌లో పాదం మోపడం. అయితే నిజానికి ఆమె నటిగా అక్కడివారికి పరిచయం కాలేదు. ఒక సింగర్‌గా తన పాప్ సాంగ్స్‌తో చేరువైంది. వారి మనసుల్లో స్థానం సంపాదించి ఇటీవలే ఓ హాలీవుడ్ చిత్రంలో నటించే చాన్స్ కొట్టేసింది.
మల్లికా శెరావత్
బాలీవుడ్‌లోనే హాలీవుడ్‌ని తలదన్నేలా అందాలు ఒలకబోసిన ఘనత మల్లికాది. అలాంటిది ఏకంగా అక్కడ నటించే అవకాశం వస్తే ఊరుకుంటుందా! అందరి మతులూ పోగొట్టేసింది. జాకీచాన్ సరసన మల్లిక నటించిన ‘ద మిత్’ హాలీవుడ్‌తో పాటు మన దేశ ప్రేక్షకులనూ అలరించింది. ఆ తర్వాత ‘పాలిటిక్స్ ఆఫ్ లవ్’ అనే ఆంగ్ల చిత్రంలో కూడా నటించింది మల్లిక.