పిల్లచేష్టలు,తుంటరి వేషాలు
టీవీక్షణం
టామ్ అండ్ జెర్రీ... ఈ పేరు వినగానే పిల్లలకే కాదు, పెద్దవాళ్లకు కూడా చెప్పలేనంత హుషారు వచ్చేస్తుంది. ఓ బుజ్జి ఎలుక, ఓ చిన్న పిల్లి కలిసి దాదాపు ఏడు దశాబ్దాలుగా జనాలను తమ చుట్టూ తిప్పుకుంటున్నాయంటే అదేమైనా సామాన్యమైన విషయమా! అసలు పిల్లలతో పాటు పెద్దలను కూడా ఇంతగా ్రఅటాక్ట్ చేసిన కార్టూన్ షో మరొకటి లేనే లేదని తాజాగా అమెరికాలో జరిపిన ఓ సర్వే తెలిపింది.
కార్టూన్ షోలు నిస్సందేహంగా పిల్లల కోసమే. కానీ పెద్దలు కూడా సమానంగా, ఇంకా చెప్పాలంటే పిల్లలకంటే కూడా ఎక్కువ ఎంజాయ్ చేసిన షో ఏదైనా ఉంది అంటే, అది కేవలం టామ్ అండ్ జెర్రీనే. అసలేముంది ఈ షోలో? ఏమీ ఉండదు. కాసిన్ని పిల్ల చేష్టలు, ఇంకాసిన్ని తుంటరి వేషాలు. వాటిని చూడ్డానికే జనం పిచ్చిగా ఎగబడ్డారంటే... అది నిజంగా వాటి రూపకర్తల గొప్పదనమే!
దాని పనేదో అది చూసుకుంటుంది పాపం టామ్ (పిల్లి). కానీ ఈ జెర్రీ (ఎలుక) కుదురుగా ఉంటుందా? ఏదో ఒక తుంటరి పని చేసి దాన్ని రెచ్చగొడుతుంది. అది కయ్యిమంటుంది. ఇది జంప్ జిలానీ అవుతుంది. అంతే... ఆట మొదలు. టామ్ తరమడం, జెర్రీ తప్పించుకునే ప్రయత్నంలో టామ్‌ని ముప్పుతిప్పలు పెట్టడం... ప్రేక్షకుల పొట్టలు పగిలిపోయే కామెడీ. యేళ్లు గడిచినా బోరే కొట్టని కామెడీ.
సరిగ్గా గమనిస్తే... టామ్ అండ్ జెర్రీ షోలో ఎప్పటికప్పుడు ఆ సిరీస్‌లో ఏదో ఒక కొత్త ఎపిసోడ్ కనిపిస్తూనే ఉంటుంది. అంతేకాదు, ఒక ఎపిసోడ్‌ని ఎన్నిసార్లు చూసినా కొత్తగానే ఉంటుంది. అవి యానిమేటెడ్ చిత్రాలే అయినా... జీవం ఉట్టిపడుతుంది. ఆ రంగుల కలబోత కళ్లను కట్టిపడేస్తుంది. అందుకే ఈ షో రోజురోజుకీ తన అభిమానుల సంఖ్యను పెంచుకుంటూనే ఉంది!