జలుబు చేసిందా | Classic comedy story | Sakshi
Sakshi News home page

జలుబు చేసిందా

Published Sun, May 31 2015 1:01 AM | Last Updated on Sun, Sep 3 2017 2:57 AM

జలుబు చేసిందా

జలుబు చేసిందా

క్లాసిక్ కామెడీ కథ
 ‘‘ఏవిట్రా చప్పుడు’’ తుళ్లిపడి కప్పులో కాఫీ చీరమీద వంపేసుకుంటూ అడిగింది పరమహంసగారి భార్య గీత.
 దక్షిణాన భూకంపం వచ్చిందన్నా, అధమం మా బాత్ రూము పడిపోయిందనేనా చెప్తేగాని నమ్మే పరిస్థితిలో లేదు ఆవిడ. నిజానికి ఈ రెండింటిలో ఏది జరిగినా బావుండేది. కానీ అంతకంటే ఘోరం జరిగింది.
 ‘‘మా ఆయన తుమ్మేరు’’ అన్నాను.
 
వీలైనంత నెమ్మదిగా, లోపల పెరుగుతున్న ఆతృత కనపడకుండా.
 మావారికి కోపం వస్తే ఒళ్లు తెలీదు, జలుబు వస్తే ప్రపంచమే తెలీదు.
 ‘‘జడ్జిగారు తుమ్మేరా?’’ అంది గీత అదేదో నమ్మరానిదన్నట్లు. ఆవిడ ఇంకా ఆ షాక్ నుండి కోలుకోలేదనడానికి సాక్ష్యం - ఆవిడ చేతిలో కప్పు, చీరమీద ఒలికిన కాఫీ ఇంకా అలాగే ఉన్నాయి.
 ‘‘ఏం? ఆయనకు తుమ్మడం రాదనుకున్నావా? లేకపోతే జడ్జిలు తుమ్మకూడదా?’’ అన్నాను. ఆ సంభాషణ అంతటితో ఆపేద్దామని.
 ‘‘అబ్బే, అది కాదు...’’ ఏదో అనబోయి మాటలు రాక ఆగిపోయింది పాపం. ఆవిడ పరిస్థితి నాకు పూర్తిగా తెలుసు. ఆవిడ తప్పేంలేదు. ఆయనలా తుమ్ముతారు. బిందెనిండా పటాసూ, గంధకం కుక్కి అంటించినట్లు.
 
ఒకసారి... మా తోడికోడలు వడ్డన ఏర్పాట్లు చేస్తూ కంచు మరచెంబుతో నీళ్లు పట్టుకొని వంటింట్లోకి వెళ్తోంది. అదే టైములో ఆయన ఆఫీసు గదిలో తుమ్మేరు. వెంటనే మాకందరికీ వినిపించింది వంటింట్లోంచి ఓ గావు కేక. మత్తు మందు లేకుండా ఆపరేషన్ చేయించుకుంటున్న రోగి ఆ కేకను ఇమిటేట్ చేస్తే కొంతవరకు సక్సెస్ అవొచ్చు. అంతా వంటింట్లోకి పరిగెత్తేం. మా తోటికోడలు పరిగెత్తడానికి వీల్లేనంత భయపడి ‘‘ఏమైంది?’’ అంది వెర్రిచూపులు చూస్తూ - పడిపోడానికి ఓపిక లేక నిల్చొనే పేషెంట్ అయినదానిలా ఉంది.
 
మరోసారి - మాకో కుక్కపిల్ల ఉండేది. కుక్కలు రాత్రి మేలుకొని పగలు పడుకుంటాయట. అది మాత్రం కేవలం భోజనం టైములోనే మేలుకొని ఉండేది. అప్పుడైనా భోజనానికి ఏవైపు వెళ్లాలో చూసి ఆవైపుకన్నే విప్పేది. అది ఎప్పుడూ ఎవరిమీదా అరవగా నేను చూళ్లేదు. ఆఖరికి తోటి కుక్కమీద కూడా. అది కొంచెం పెద్దయ్యేక మా ఇంట్లో దొంగలుపడ్డారు. ఆశకొద్దీ పడ్డారే కానీ, మా ఇంట్లోవాళ్లు తీసుకెళ్లడానికి పనికొచ్చేవి ఏవీ కనిపించలేదు.

అంత శ్రమపడి వచ్చేక ఏవీ తీసుకెళ్లకుండా వెళ్లడానికి మనసొప్పక ఏవో తువ్వాళ్లూ, చీరలూ వగైరాలు పట్టుకుపోయేరు. వగైరాలలో మా కుక్క కూడా ఉంది. అసలు మా ఇంట్లో ఏ వస్తువూ వాళ్లకి నచ్చినట్లు లేదు. నిజం చెప్పాలంటే దొంగకి కాకపోయినా, మా ఇంట్లో వస్తువు నాకూ నచ్చదు కానీ ఏం చేస్తాం? దొంగలకున్న చాయిస్ నాకు లేదు.
 
ఇంతకీ చెప్పొచ్చేదేటంటే... అది... అంటే మా కుక్క ఒక సాయంత్రం అరుగుమీద పడుకుంది. అప్పటికి దానికి ఆరు నెలలుంటాయి. మా ఆయన మేడమీద తుమ్మేరు. అంతే! మా కుక్క పడుకున్న పోజులోనే గాలిలోకి గజం మీదకి ఎగిరి - అక్కడో అరక్షణం ఆగి, అదే పోజుతో నేలని పడి పరిగెత్తడం ప్రారంభించింది. అది రెండు కళ్లు ఒక్కసారి విప్పగలదనీ, పరిగెత్తగలదనీ కూడా అప్పుడే తెలిసింది మాకు. దాని వెనకాలే మేమూ బయలుదేరేసరికి అది ఊరవతలకి వెళ్లిపోయి, ఇంక పరిగెత్తలేక ఆగిపోయింది. మేమంతా దాన్ని ఇంటికి రమ్మని బతిమాలేం. అది లక్ష్యపెట్టలేదు.
 
‘‘ఇంకెప్పుడూ తుమ్మన్లే. రా’’ అని మావారు దానికి అభయం ఇచ్చేరు. అది ఠక్కున మా వెంట వచ్చేసింది.
 ఇంతకీ ప్రస్తుత విషయం ఆయన తుమ్మేరు. అంటే మా ఇంటి సూర్యుడికి వారం రోజులు గ్రహణం. ఈ వారం రోజులూ మా ఇంట్లో ఎవరూ మాట్లాడ్డానికి వీల్లేదు. కుక్క కూడా అరవడానికి వీల్లేదు. ఈ వారం రోజులూ అధమం రోజుకోసారైనా చేతిలో ఉన్న కప్పో, గ్లాసో గోడకి విసిరి కొట్టేస్తారు. ఈ వారం రోజులూ మా పిల్లలు ఆయన కంటపడరు. జవాన్లకీ, నాకూ తప్పదు.
 
అసలు వాళ్ల వంశంలోనే ఉంది, ఈ రొంప (జలుబు పిచ్చి అనాలో - పిచ్చి రొంప అనాలో). మా మావగారు మరీను. అతని ప్రకారం జలుబుని మించిన జబ్బు ఇంకోటి లేదు. అతనికోసారి రొంప చేసింది అప్పుడు మా ఇంట్లో దూరపుబంధు వొకడున్నాడు. ఉన్నవాడు ఊరుకోక - మెహర్బానీ కోసవేవో - ‘‘పడిశం పదిరోగాలపెట్టు అంటారు’’ అన్నాడు.
 ‘‘అలా అన్న గాడిదకొడిక్కి పదికి మించి రోగాలుంటాయని తెలియదు’’ అన్నారు మా మావగారు.
 మా మావగారి దగ్గర ఓ కర్రపెట్టి ఉండేది. దాన్ని ఎవరూ ముట్టుకోవడానికి వీల్లేదు, రొంపకి ఆయన సంపాదించిన మందులన్నీ అందులో ఉంటాయి. అందులో సుమారు వందకి పైనే ఉంటాయి. ఏ ఒక్కటీ రెండుసార్లు వాడలేదు. ఏ ఒక్కటీ పని చెయ్యలేదు.
 
అతను మొదటి తుమ్ము తుమ్మగానే భూతవైద్యుడికీ, మంత్రసానికీ మినహా వైద్యంతో సంబంధించిన అంత మందికీ కబుర్లు వెళ్లేవి. ఒకసారి ఏదో ఊరు వెళ్లి రాత్రి భోజనాల టైముకి చేతిలో కిరసనాయిలు సీసా అంత సీసాతో వచ్చారు. అప్పుడు యుద్ధం రోజులు కిరసనాయిలు దొరకదు కాబట్టి ఎక్కడైనా దొరికితే కిరసనాయిలే తెచ్చేరనుకున్నాను. కానీ కాదుట. అప్పుడే భోజనం చేసి చేయికడుక్కుంటున్న ‘వారాలబ్బాయి’ అప్పల నరసింహ తుమ్మేడు.
 
‘‘ఒరేయ్ ఇలారా’’ అన్నారు మా మావగారు. ద్రోహం చేసినవాళ్లా వెళ్లేడు ఆ అబ్బాయి.
 ‘‘తుమ్మేవా?’’ అన్నారు.
 కాదంటే కాల్చేస్తారేమోనని అవునన్నాడు.
 ‘‘అయితే గ్లాసు తీసుకురా’’ అని, ఇదిగో, ఇది రొంపకి దివ్యౌషధమంటే, శ్రీపాద ఆయన స్వంతంగా కనిపెట్టేట్ట. రొంప రావడానికి, పోవడానికి కూడా అదే మందుట’’ అన్నారు మా అందరితో.
 అప్పల నరసింహం గ్లాసు పట్టుకొని వచ్చేడు గ్లాసు సగం వరకు మందుపోసి ‘‘అంతా ఒక్క గుక్కలోనే మింగేయ్యాలి’’ అంటూ అతనికిచ్చేరు.
 
ఒక్క గుటకలోనే మింగేసేడు పాపం ఆ అబ్బాయి. అంతే తర్వాత ఏమైందీ మాకు కనిపించలేదు. మాకు వినిపించిందల్లా గ్లాసు నేలని ఎత్తేసిన శబ్దం మనిషి పరిగెడుతున్న శబ్దం. మేము ఏం జరిగిందో గ్రహించే లోపునే ఆ అబ్బాయి వీధి దాటి ఎటో వెళ్లిపోయేడు. ఆ రాత్రి అతని కోసం వెతికేం కానీ కనిపించలేదు. మర్నాడు పొద్దునే ‘‘చెరువు గట్టుమీద పడి వున్నాడని’’ చెప్పి ఎవరో తీసుకొచ్చేరు.
 ఆ తర్వాత మళ్లీ మా ఇంటికి వారానికి రాలేదు అతను.
 మరోనాడు...
 
మా మావగారికి రొంప పట్టినప్పుడు రంగాచారిగారు పాలూ, మిరియాలు కలిపి తీసుకోమన్నారుట. ఇంటి కొస్తూనే ‘‘ఉట్టి పాలూ, ఉట్టి మిరియాలూనట. కలిపి తీసుకుంటే చాలుట’’ అన్నా మా అత్తగారితో. ‘‘ఉట్టి పాలంటే - ఒట్టిపోయిన ఆవులు ఇస్తాయనుకున్నా. ఉట్టి మిరియాలెక్కడ దొరుకుతాయి?’’ అందావిడ.
 
తర్వాత ఆయనే మిరియాలు రోట్లోవేసి కొట్టడం ప్రారంభించేరు. ‘‘ఈ మిరియాలు వస్త్రక్షాళితం చెయ్యాలేవిటో కనుక్కురా’’ అని ఆచారిగారి దగ్గరకు మనిషిని పంపేరు. చెయ్యమన్నారు ఆచారిగారు. తర్వాత మళ్లీ ‘‘కప్పుడు పాలల్లో మిరియాల పొడివెయ్యాలా? కప్పుపొడిలో పాలు వెయ్యాలా?’’ కనుక్కోమని మనిషిని పంపేరు; ఇక్కడే ఏదో పొరపాటు జరిగింది. కప్పుడు పొడిలో పాలు వేసుకోమన్నారట ఆచారిగారు. వైద్యం పూర్తయ్యేసరికి రాత్రి ఎనిమిదైంది. ఎనిమిదిన్నర తర్వాత పెరట్లో నూతి దగ్గరకు వెళ్లి నీళ్లు తోడుకొని అరగంటసేపు చన్నీళ్ల స్నానం చేశారు. తడి బట్టల్తోనే ఇంట్లోకి
వస్తూ ‘‘ఈ రాత్రి నాకంట ఎవరు పడినా ఖూనీ చేసేస్తానని’’ వార్నింగిచ్చి గదిలోకి వెళ్లి తలుపు గడియ పెట్టేసుకున్నారు. రాత్రి పన్నెండు వరకూ భక్తి పాటలూ, తర్వాత బండ బూతులూ వినిపించేయి. ఆ మందు బాధ వదిలేసరికి వారం పట్టింది.
 
ఇంకోసారి... మా మావగారికి మందుల పాత్రుడు మరో చిట్కా చెప్పేడు. ఒక చదరపుటడుగు తెలక పిండి తెచ్చి ఆవిరి మీద ఆకారం పోకుండా ఉడకపెట్టి, తులం ఏలకుల గుండజల్లి దానికి అయిదు లవంగాలు గుచ్చి, రెండు గంటలు చల్లార్చి గుండెలకు కట్టుకొని పడుకుంటే ఏనుగు జలుబైనా సరే ఎగిరిపోతుందిట, నాకు ఈ వైద్యంలో నమ్మకం ఏర్పడింది. ఎంచేతనంటే రొంప రాగానే ప్రయత్నిస్తే, పోయే టైముకి దొరకవచ్చు చదరపుటడుగు తెలక పిండి ముక్క. ఎలాగైతేనేం తెలక పిండిని పాత్రుడోక్తంగా తయారుచేసేసరికి మధ్యాహ్నం ఒంటిగంటైంది. వరండాలో మంచం మీద పడుకున్న మావగారు మందుని పక్కనే టేబిలు మీద పెట్టి, ‘‘మీరు పాపం పన్లు చూసుకోండి. నేను కట్టుకుంటాను’’ అన్నారు.

బతుకు జీవుడా అనుకొని మేవంతా వెళ్లి పోయేం. ఆయన ఇలా కన్నుమూసేసరికి మా పక్కింటి గొల్లపూడి వారి గేదె, దానికి తెలకపిండి ఇష్టమో, లవంగాలు ఇష్టమో ఏలకపొడి ఇష్టమో, లేకపోతే దానికీ జలుబు చేస్తే దాని డాక్టరు ఈ వైద్యం చెప్పేడో (గేదెల్లో కూడా ఆచార్లుంటారేమో) గాని - అది వచ్చి ఆ మూడు కలిపి తినేసిందట.
 
అబ్బ; ఏవాకలే దాన్ది!! ఆ సోమయాజులు వెధవ దానికెప్పుడూ గడ్డి పెట్టడేవిటో గాని, నా ఆరోగ్యం బావుంటే నన్ను కూడా తినేసేది. గోడవాల్ పోస్ట్టర్లూ, పెరళ్లలో గావంచాలూ తినే అది పాలిస్తోందా వెధవకి’’ అని పక్కింటి గొల్లపూడి వారిని ప్రత్యేకంగానూ, వారి వంశాన్ని, వారి గేదె గుణాల్ని జనరల్‌గానూ అరగంట తిట్టేరు. మళ్లీ ఆ వైద్యం ప్రయత్నించడానికి వీల్లేకపోయింది, ఆ రాత్రే ఆయన  ఊరెళ్లిపోవడం వల్ల.
 
సరిగ్గా అక్షరాలా ఆ తండ్రికి కొడుకే ఈయన. ఒక్క విషయం నేను కూడా ఒప్పుకోవాలి. మా వారు మైనర్ రొంప మహర్షి లాంటివారు. అందుచేత రొంప చేసినప్పుడు మాత్రం నోరెత్తను. ఆయన తన రొంపకి ఆల్లోపతీ, యునాని, ఆయుర్వేద, హోమియోపతి మొదలగు వైద్యాలూ - పాలూ మిరియం, వగైరా చిట్కాలూ అన్నీ వాడేవారు. కాకపోతే ఒక్కటే నియమం, క్రిందటి సారి వాడినది వాడకూడదని.
 ఈ మధ్య మాకు కొంతమంది కుర్ర డాక్టర్లు పరిచయం అయ్యేరు. (పాపం! వాళ్లని చూస్తే నాకెంతో జాలి. ఇంత మంచివాళ్లు కూడా దొంగ డాక్టర్లు అయిపోతారుగదాని).

 ఒకసారి రొంప చేసినప్పుడు ఈ డాక్టర్ల బృందానికి కబురుపెట్టేం.
 మొదట వచ్చింది కృష్ణమూర్తి. రాగానే ‘‘అసలు రొంప ఎందుకు వస్తుంది?’’ అన్నారు ఈయన ఓరల్సు ఎగ్జామినర్‌లాగా.
 ‘‘అసలు రొంపైనా, వడ్డీ రొంపైనా వైరస్ ఇన్‌ఫెక్షన్’’ అన్నాడు కృష్ణమూర్తి.
 ‘‘నాకు రొంప పట్టింది, ఏమందూ పనిచెయ్యడం లేదు’’ అన్నారు ఈయన.
 ‘‘దానికి మేమంతా చేసుకునే వైద్యం ఒక క్వార్టర్ బాటిల్ బ్రాందీ - తీసుకోండి. కానీ మీరు కొంటే ఏం బావుంటుంది! నేను తెచ్చి పెడతాలెండి’’ అని వెళ్లిపోయేడు.
 
ఆ సాయంత్రం ఇద్దరూ చెరో క్వార్టరు బాటిలూ తెచ్చి ఇచ్చేరు. రొంప విషయంలో మాత్రం ఎవరేం చెప్పినా పాటించే నియమం ఉంది కాబట్టి ఇద్దరు తెచ్చినవీ తాగెయ్యాలన్నారు ఆయన. ఆయన జీనియస్‌లో నాకెలాంటి డౌటూలేదు కానీ, రొంప పట్టినప్పుడు మాత్రం ఆయనకి పదో ఎక్కం కూడా రాదు. అంచేత ఒక్క సీసా తాగితేచాలని నమ్మించడానికి ప్రయత్నించిన నేనూ, పిల్లలూ కూడా చేసిన  ప్రయత్నాలేం పనిచెయ్యలేదు. పోనీ మనిషికి ‘మందు’ వ్యామోహమా, అంటే గాంధీ లాంటి మనిషి.
 
రాత్రి పదైంది రెండు బాటిల్సూ పూర్తి అయ్యాయి. ఆ రాత్రంతా నిద్రాలేదు, రొంపాలేదు. ఒంటిమీద తెలివీ లేదు. మర్నాడుదయం తెలివి పూర్తిగా రాలేదుగాని రొంప విత్ తలనొప్పి పూర్తిగా వచ్చేసింది. ఆ మధ్యాన్నం పాపం కాస్త కునుకు పట్టింది, అమ్మయ్య అనుకున్నాను. కానీ అనుకున్నంతసేపు కూడా లేదు. నిద్రలో ఏదో గొణగడం ప్రారంభించేరు. తర్వాత ఆ గొణుగు కేకలుగా మారి దిగ్గున లేచి కూర్చున్నారు.
 
‘‘జడుసుకున్నావేవిటి నాన్నా? ఇలా కేకలేస్తున్నావ్?’’ మా చిన్ని ధైర్యంగా అడిగాడు. ఆయన్తో - విత్ ఆర్ వితౌట్ రొంప. ఏమాటైనా అనగల, ఏ జోకైనా వెయ్యగల ధైర్యం మా ఇంట్లో వాడొక్కడికే ఉంది.
 ‘‘అలా చెప్పు, నా కేకలేనన్నమాట అంత గట్టిగా వినిపించేయి. నా కేకలకి నేనే లేచిపోయేనా? మంచి జోకే’’ అని మళ్లీ పడుకున్నారు. ఇంకా నయం. నేను కేకలెయ్యకుండా కాపలాకాయి అని నన్ను పురమాయించలేదు.
 
ఆ తర్వాత కృష్ణమూర్తే బ్రాందీ వైద్యం మానేసి ఇంకేదో వైద్యం చేసేడు. ఎలాగైతేనేం రొంప పూర్తిగా పోయేసరికి వారం పట్టింది. అంచేతే కాబోలు రొంప మందు పుచ్చుకుంటే వారంలోనూ, పుచ్చుకోకపోతే ఏడు రోజుల్లోనూ పోతుందంటారు.
 మరోసారి ఆయనకి రొంప వచ్చినప్పుడు కృష్ణమూర్తే కాబోలు. కాబోలేంటి, అతనికే ఆయన దగ్గర ఆ చనువుంది.  
 
‘‘ఈ మందులు సంగతలా వుంచండి. ఫీడ్ ది కోల్డ్ అండ్ స్టార్వ్ ది ఫీవర్’’ అంటారు అన్నాడు.
 ఇన్నాళ్లూ చెప్పేవే కాదేవిటి? నాక్కొంచెం జ్వరం వుందనుకో. దానికి ఉపవాసం పెడతాను రాత్రి అని సుష్టు పూర్తిగా రొంపకి భోజనం పెట్టేరు. పెరుగూ అన్నం తిన్న పడిశం పెరిగింది. ఉపవాసం వుండబోయే జ్వరం కూడా పెరిగింది.
 ‘‘స్టార్వేషన్ ఈజ్ ది బెస్ట్ డయట్ అని చేప విషయంలోనే అన్నారనుకున్నాను. జ్వరానిక్కూడా వర్తిస్తుందన్నమాట’’ ఆశ్చర్యపోయేరు ఆయన.
 
ఇంతకీ అసలు విషయం, బాత్‌రూమ్‌లో ఆయన తుమ్మేరు. తుమ్మేక వార్ క్లౌడ్‌లా డైనింగ్ హాల్లోకి వచ్చి ‘‘ఆయనేరీ? ఎప్పుడొచ్చేరు మీరు? ఒకసారి నా రూమ్‌లోకి రా’’ అని గీతతోనూ, నాతోనూ ఒక్క గుక్కలోనే మాట్టాడి జవాబు అక్కర్లేనట్లు తన గదిలోకి పరిగెత్తారు. నేను వెళ్లేసరికి పక్కమీద బోర్లా పడుకున్నారు. చెప్పొద్దూ, ఎంత మొగుడైనప్పటికీ నాకు నిజంగానే జాలేసింది. ఎంతటి మనిషి ఎలా అయిపోయేరు కడవంత గుమ్మడికాయ కత్తిపీటకు లోకువ - అన్నట్టు.
 
నేనేం. అతి తెలివైనదాన్ని కాను. కానీ ఆయనతో ఎప్పుడు మాట్లాడకూడదో మాత్రం బాగా తెలుసు అందుచేత వెళ్లి మంచం పక్కన మాట్లాడకుండా నిలుచున్నాను.
 ‘‘వచ్చేవా!’’ అన్నారు వీలైనంత శాంతంగా.
 ‘‘ఆ’’ అన్నాను.
 ‘‘చూడూ, నాకు రొంప వచ్చేసింది. గీత బహుశా నాలుగు రోజులుంటారు. ఈ రొంప వారం ఉంటుంది. మరంచేత ఈ నాలుగు రోజులూ నువ్వు నాకు కనిపిస్తే బహుశా చంపక మానను, చంపడానికి మొహమాటపడితే కురుక్షేత్రం తప్పదు. మరంచేత కాఫీ వగైరాలన్నీ నా గదిలోకే పంపించీ, వింటున్నావా?’’ అన్నారు.
 
‘‘ఊ’’
 ‘‘ఇప్పుడు దయచేసి గెటవుట్’’ అని గట్టిగా అరిచారు. ఆ అరుపుకి గోడనున్న ఫోటో ఒకటి కిందపడి భళ్లుమంది. నేను గబగబా బైటికి పోయి తలుపులు ఢామ్మని వేసేసేను.
 ఈ గెటవుటూ, భళ్లుమన్న శబ్దం విన్న గీత భయపడిపోయి ‘‘ఏవైంది?’’ అంది, ఏవౌతుంది?
 ఇంక ఆపేస్తాను. ఎంచేతంటే మావారు ఇప్పుడే తుమ్మేరు.    
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement