అద్దెకు ఉండడం అంటే ఫస్ట్ తారీఖు వోనరంకుల్ చేతిలో డబ్బు పెట్టడం మాత్రమే కాదు... నెలలోని 30రోజుల్లో ప్రతిరోజు ఒక పరీక్ష ఉంటుంది. ఆ పరీక్ష గట్టెక్కితేనే... ఇంట్లో అద్దెకుండే అర్హత కంటిన్యూ అవుతుంది. లేనిచో...ఏ క్షణమైనా ఇల్లు ఖాళీ చేయాల్సిందే. మరో ఇల్లు చచ్చినట్లు వెదుక్కోవాల్సిందే...‘వెధవ జీవితం’ అని తిట్టుకోవాల్సిందే.అది ఒక పట్టణం. ఆ పట్టణంలోని ఒక ఇంటిలో సుబ్బారావు–ఆమని అనే దంపతులు అద్దెకుంటున్నారు. వారు ఫేస్ చేస్తున్న పరీక్షలు మచ్చుకు కొన్ని...
నా పేరే కాంచనమాల....రగిలిస్తా అగ్నిజ్వాలా:
‘‘ఏమ్మా ఆమని ఇంట్లో ఉన్నావా!’’ అంటూ సరాసరి ఇంట్లోకి దూసుకు వచ్చింది వోనరాంటీ కాంచనమాల (ఇంటి యజమాని భార్య)‘‘రండీ ఆంటీ’’ అంటూ భయంభయంగా ఇంట్లోకి స్వాగతం పలికింది ఆమని.‘‘ఏమ్మా...రాత్రి నువ్వూ మీ ఆయన తెగ వాదులాడుకుంటున్నారు. ఏంటీ విషయం?’’ అని అడిగింది వోనరాంటీ.ఆమె చెవుల నిండా పరమ ఆసక్తి.‘‘ఏదో లెండి. భార్యాభర్తలన్నాక ఏవో చిన్న చిన్న గొడవలు ఉంటాయి కదా...’’ అంటే సరిపోయేది.కానీ ఆమని కళ్ల కన్నీళ్ల ఆనకట్ట తెగిపోయింది.‘‘ఏం చెప్పమంటారు ఆంటీ...ఈయనకు కట్టబెట్టి నా గొంతు కోశారు.
పెళ్లయినప్పుడు ఈయన జీతం ఎంతో...ఇప్పుడూ అంతే. గొర్రె తోకైనా పెరుగుతుందేమోగానీ ఈయన జీతం పెరగడం లేదు...ఎప్పుడూ డబ్బులకు కటకటే’’ అని ఏడుస్తూ ముక్కు చీదింది ఆమని.‘‘పెళ్లయిన కొత్తలో మా ఆయన కూడా ఇంతేనమ్మా...’’ అంటూ ఆ ఏడుపు జ్వాలల్లో వోనరాంటీ లీటర్ పెట్రోలు పోసింది.సుమారు రెండు గంటల తరువాత...‘‘అత్తా ఒకింటి కోడలే సీరియల్ టైమవుతుంది.... నేను వెళ్తొస్తానమ్మా...’’ అంటూ లేచింది వోనరాంటీ.‘‘కాఫీ తాగి వెళ్లండి ఆంటీ’’ మాటవరసకు అంది ఆమని.‘‘ఎందుకే లేమ్మా’’ అంటూనే కుర్చీలో మళ్లీ కూర్చుంది వోనరాంటీ.
:ఎక్కడికీ పోతావు చిన్నవాడా:
‘‘ఏమిటోయ్ సుబ్బారావు హడావుడిగా వెళుతున్నావు?’’ దారిలో తనకు ఎదురైనా సుబ్బారావును అడిగాడు వోనరంకుల్ అప్పారావు.‘‘ఆఫీసులో అర్జంటుగా పని ఉంది అంకుల్’’ అన్నాడు సుబ్బారావు.(పనా పాడా! వోనరంకుల్ ఎదురొస్తున్నాడని, దొరికితే అతడి సుత్తి కత్తికి బలికావాల్సి వస్తుందనే భయంతో వేగంగా నడుస్తూ తప్పించుకునే ప్రయత్నం చేశాడుగానీ...వీధిరాత వల్ల ఇలా దొరికిపోయాడు)‘‘పద టీ తాగి వెల్దువుగానీ’’ అని సుబ్బారావును ఇరానీ కేఫ్‌లోకి తీసుకెళ్లాడు వోనరంకుల్.‘‘రెండు గరం గరం టీ’’ అని ఆర్డర్ ఇచ్చాడు.వోనరంకుల్ జేబులో నుంచి చిల్లిగవ్వ కూడా తీయడు. పొరపాటున ఎక్కడ తీయాల్సివస్తుందేమోనని చొక్కకు, ప్యాంటుకు జేబులు కుట్టించుకోడు.
మరి అలాంటి అంకుల్ నోరారా రెండు టీలకు ఆర్డర్ ఇచ్చాడంటే? వామ్మో! సుబ్బారావు గుండెల్లో ఖాళీ కప్పులు పడ్డాయి.‘‘ఇంతకీ పెద్దనోట్ల రద్దు సక్సెస్ అయినట్లేనంటావా...మోదీ మళ్లీ వస్తాడంటావా?’’ టీ గట్టిగా జుర్రుతూ అడిగాడు వోనరంకుల్.ఏమాత్రం ‘తెలివి’ ప్రదర్శించిన సునామి ఒడిలో తలదాచుకోవడమే అనే విషయం తెలిసిన సుబ్బారావు...‘‘నాకు పాలిటిక్స్ మీద పెద్దగా ఐడియా లేదండీ’’ అన్నాడు.‘ఐడియా’ అనే మాట వినగానే వోనరంకుల్ ఫేస్ వేయి బల్బులతో వెలిగిపోయింది.‘‘ఏది ఏమైనా వొడాఫోన్ ఇండియా, ఐడియా మెర్జ్ కావడం అనేది ఒక చారిత్రక పరిణామమేనని చెప్పుకోవాలి.
అప్పటికీ ఇప్పటికీ ఎంత తేడా అంటే...’’ దంచుకుపోతున్నాడు వోనరంకుల్.వరదకు అడ్డుకట్ట వేయాలని...‘‘మీకు సెల్‌ఫోన్‌లపై మంచి పట్టు ఉంది అంకుల్’’ అన్నాడు సుబ్బారావు దీనంగా.‘‘సెల్‌ఫోన్లేమి ఖర్మ, హ్యూమన్ సెల్‌స్ట్రక్చర్ మీద కూడా మనకు బ్రహ్మాండమైన ఐడియా ఉంది. ది హ్యూమన్ బాడీ ఈజ్ కంపోజ్‌డ్ ఆఫ్ ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్. దే ప్రొవైడ్ స్ట్రక్చర్ ఫర్ ది బాడీ...’’ నాన్‌స్టాప్‌గా దూసుకుపోతున్నాడు వోనరంకుల్.‘‘ఆపవయ్యా నీ సుత్తి’’ అంటే ఎక్కడ అద్దె పెంచుతాడో అనే భయం చేత ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వింటూనే ఉన్నాడు సుబ్బారావు.
ఆహా ఏమి రుచి తినవోయ్ మై మరచి:
ఆమె వోనరంకుల్ కోడలు. పేరు రుచిత.ఎప్పుడు చూసిన యూ ట్యూబ్‌లో వంటల వీడియోలు చూస్తుంటుంది. అప్పుడప్పుడు వంటింట్లోకి దూరుతుంది. అప్పుడే ప్రాబ్లం.
మచ్చుకు ఒకటి:
‘‘ఆమనిగారు...ఆమనిగారు...ఇంట్లో ఉన్నారా?’’‘‘ వచ్చేయమ్మా. అలా కూర్చోమ్మా.....ఏంటీ విశేషాలు..’’‘‘జంపక్ జంపక్ జపాక్...అని కొత్తరకం మైసూరుపాక్ తయారుచేశాను. మీకిచ్చి వెళ్దామని వచ్చాను. బాగా కుదిరింది. మీకు బాగా నచ్చుతుంది...’’‘‘థ్యాంక్యూ తల్లీ...ఇలా ఇవ్వు’’‘‘వెళ్తొస్తాను ఆమనిగారు’’రుచిత అలా బయటికి వెళ్లిందో లేదో ‘జంపక్ జంపక్ జపాక్’ను వేడివేడిగా చెత్త బుట్టలో వేస్తుంది ఆమని. సాయంత్రం మాత్రం...‘‘నీ చేతులు ఇంత అద్భుతం చేస్తాయనుకోలేదు తల్లీ. జంపక్ జంపక్ జపాక్ ఎంత బాగుందో. మళ్లీ మళ్లీ తినాలనిపించిదనుకో...’’ అంటుంది.ఈ పొగడ్తల పుణ్యమా అని రెండో రోజు మరో కొత్త రకం వంటకంతో ఇంట్లోకి దూరుతుంది రుచిత.‘‘ఆమనిగారు...ఇంట్లో ఉన్నారా...ఏమీలేదండీ...కందగడ్డ బొందగడ్డ అని కొత్తరకం పులుసు చేశాను. బాగా కుదిరిందండీ...ఎలా ఉందో చెప్పరా’’ అని గోముగా అడుగుతుంది.
‘‘ఏమిటి చెప్పేది నీ బొంద. నీ యెంకమ్మ....నీ ప్రయోగాలకు నేనేమన్నా ఎలుకలాగా కనిపిస్తున్నానా....నోర్ముసుకొని ఇక్కడి నుంచి వెళ్లు’’ అని ఆమనికి అనాలనే ఉంటుంది....కానీ అనలేదు. అలా అంటే అద్దె పెరగవచ్చు. ఏదో సాకుతో ఇంటి నుంచి ఖాళీ చేయించవచ్చు. ఈ రెండు కాకపోతే ‘కరెంటు ఎక్కువ కాలుస్తున్నారు’ ‘నీళ్లు ఎక్కువ వాడుతున్నారు’లాంటి సాకులతో పొద్దస్తమానం తిట్టనూ వచ్చు. ఎందుకొచ్చిన లొల్లి! అని అడ్జెస్టై ‘నీ వెరైటీ వంటలు మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది తల్లీ’ అంటూ ఎప్పటికప్పుడు కృత్రిమ లొట్టలు వేస్తుంటుంది ఆమని.
– యాకుబ్ పాషా
Comments
Please login to add a commentAdd a comment