కథ ఇప్పుడే మొదలైంది! | Crime file | Sakshi
Sakshi News home page

కథ ఇప్పుడే మొదలైంది!

Published Sun, Jan 24 2016 1:55 AM | Last Updated on Sat, Aug 11 2018 8:45 PM

కథ ఇప్పుడే మొదలైంది! - Sakshi

కథ ఇప్పుడే మొదలైంది!

  క్రైమ్ ఫైల్
 ఫిబ్రవరి 25, 2000... మేరీల్యాండ్ (అమెరికా)...‘‘హా మిన్ లీని దారుణంగా హత్య చేసినందుకుగాను... అద్నన్ సయ్యద్‌కు జీవిత ఖైదును విధిస్తున్నాను.’’తీర్పు వింటూనే అవాక్కయి పోయాడు అద్నన్. ‘‘అయ్యో దేవుడా... నా బిడ్డని కాపాడు’’ అంటూ అరిచి సొమ్మసిల్లి పోయింది అద్నన్ తల్లి. ‘‘అమ్మా’’ అంటూ కేక పెట్టాడు అద్నన్. అతడి కాళ్లు వణుకు తున్నాయి. బాధతో గుండె పగిలిపోయేలా ఉంది. ‘‘సార్... జడ్జిగారూ... దయ చూపించండి. నేను ఏ నేరమూ చేయలేదు. ఒక్కసారి మళ్లీ ఎంక్వయిరీ చేయించండి.
 
 నా మాట వినండి సార్. ప్లీజ్.’’అరుస్తూనే ఉన్నాడు అద్నన్. కానీ ఆ అరుపులు జడ్జి వినిపించుకోలేదు. పోలీసులు వచ్చి అద్నన్ చేయి పట్టుకున్నారు. ‘పద’ అన్నట్టు సైగ చేశారు. సొమ్మసిల్లిపోయిన తల్లి వైపు, ఆమెకు సపర్యలు చేస్తోన్న తండ్రివైపు దీనంగా చూస్తూ వారి వెంట నడిచాడు అద్నన్. అతనికి ఏమీ అర్థం కావడం లేదు. తాను ఏ నేరమూ చేయలేదు. మరి ఎందుకు తనకీ శిక్ష అని పదే పదే ప్రశ్నించుకుంటున్నాడు. కానీ జవాబు చెప్పేవారే లేరు.
 
 1999, జనవరి 13న... మేరీ ల్యాండ్‌లోని బాల్టిమోర్‌లో నివసించే పంతొమ్మిదేళ్ల హా మిన్ లీ అదృశ్య మయ్యింది. స్కూలుకు వెళ్లిన ఆమె తిరిగి ఇంటికి రాకపోవడంతో, తల్లిదండ్రులు పోలీస్ కంప్లయింట్ ఇచ్చారు. పోలీసులు రంగంలోకి దిగారు. కానీ ఆమె జాడ తెలియలేదు. చివరికి ఫిబ్రవరి 19న, ఓ పార్కులో ఆమె మృతదేహం కనిపించింది. అయితే ఆమెను చంపిందెవరో ఎంత ఎంక్వయిరీ చేసినా తెలియలేదు. దాంతో కన్‌ఫ్యూజన్‌లో ఉన్న పోలీసులకు ఓ ఫోన్ కాల్ వచ్చింది.
 
  లీ మాజీ ప్రియుడు అద్నన్ సయ్యదే ఆమెను చంపాడని ఆ అదృశ్య వ్యక్తి చెప్పాడు. లీ కనిపించకుండా పోయిన రోజు అద్నన్ పార్కు చుట్టు పక్కలే ఉన్నాడని, అతడు ఆమెకి ఫోన్ కూడా చేశాడని అతని కాల్ రికార్డ్స్ చెప్పాయి. దాంతో పోలీసులు అతణ్ని అరెస్ట్ చేశారు. తాను నిర్దోషిని వాదించాడే తప్ప, ఎవరినీ కన్విన్స్ చేయలేక పోయాడు అద్నన్. దాంతో జైలు గోడల మధ్యకు వెళ్లక తప్పలేదు.
   
 నవంబర్ 6, 2015.
 జైలు గదిలో ఓ మూలగా కూర్చుని శూన్యంలోకి చూస్తున్నాడు అద్నన్. ఓ వ్యక్తి వచ్చి అతని పక్కన కూర్చున్నాడు. ‘‘అద్నన్ సయ్యద్... నేను ‘ఇన్నోసెన్స్ ప్రాజెక్టు నుంచి వచ్చాను. మీ కేసు రీ ఓపెన్ చేయబోతున్నాం’’ అన్నాడు. చివ్వున తలతిప్పి చూశాడు అద్నన్. కళ్లలో ఆశ్చర్యం. అంతకు మించిన ఆనందం. ‘‘ఏంటి మీరనేది?’’ అన్నాడు నమ్మలేనట్టుగా.
 
 ‘‘అవును అద్నన్. ఏదైనా కేసులో ఎవరికైనా అన్యా యంగా శిక్ష పడిందని తెలిస్తే, ఆ కేసును రీ ఓపెన్ చేయించి, వారి నిర్దోషిత్వాన్ని నిరూపిం చడమే మా పని. మీక్కూడా అన్యాయం జరిగిందని మాకనిపిస్తోంది. అందుకే కోర్టుకు అప్పీల్ చేశాం. మీ కేసు మళ్లీ తెరవబోతున్నాం.’’అతని రెండు చేతులూ పట్టుకున్నాడు అద్నన్. ‘‘థాంక్యూ సర్. నేనా నేరం చేయ లేదని ఎంత చెప్పినా ఎవరూ నమ్మలేదు. ఇప్పుడు దేవుడిలా మీరు వచ్చారు’’’ అంటుంటే కన్నీళ్లు ఉప్పొంగాయి.
 
 ‘‘ధైర్యంగా ఉండు అద్నన్’’ అని భుజం తట్టి వెళ్లిపోయాడతను. అంతకు కొద్ది రోజుల క్రితం అద్నన్ కేసు ‘ఇన్నో సెన్స్ ప్రాజెక్టు’ సభ్యుల దృష్టికి వెళ్లింది. దానికి కారణం, అతని కేసు ఓ సీరి యల్‌గా ప్రసారం కావడం. దాన్ని చూశాక విచారణ అంతా ఒన్ సెడైడ్‌గా నడిచిందని అర్థమైంది. ఎంక్వయిరీ చేస్తే అద్నన్ చాలా తెలివైన పిల్లాడని, మంచి క్రీడాకారుడని, అతడి మీద ఒక్క బ్లాక్‌మార్క్ లేదని తెలిసింది. అలాంటివాడు ఏకంగా హత్య చేశాడంటే నమ్మబుద్ధి కాలేదు వారికి. దాంతో కేసును మళ్లీ తెరిపించాలని నిర్ణయించుకున్నారు.
 
 అద్నన్ కేసులో కొన్ని పొరపాట్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పోలీసులు అవుట్ గోయింగ్ కాల్స్ తప్ప ఇన్‌కమింగ్ కాల్స్ చూడలేదు. వాలీబాల్ మ్యాచ్ గురించి మాట్లాడ్డానికి లీ కాల్ చేస్తే తాను చూసుకోలేదని, ఆ తర్వాత చూసి తిరిగి చేశానని అద్నన్ చెప్పిన మాటను వాళ్లు పట్టించుకోలేదు. పార్కు చుట్టుపక్కల అద్నన్ ఉన్నాడని లోపలేసేశారు తప్ప... ఆరోజు లీ తనను డ్రాప్ చేయమని అడి గితే తీసుకెళ్లానని, పార్క్ దగ్గర తాను దిగి పోయిందని అద్నన్ చెప్పినా వినిపించు కోలేదు. ఇవన్నీ కావాలనే నిర్లక్ష్యం చేశారా అన్న కోణంలో దర్యాప్తు జరుగుతోంది. నేర చరిత్ర లేని అద్నన్ మీద ఇంత దృష్టి పెట్టినప్పుడు, ఆ ప్రాంతంలో ఇలాంటి మరికొన్ని నేరాలకు పాల్పడిన నేరస్తుల మీద ఎందుకు దృష్టి పెట్టలేదు అన్న అంశాన్నీ పరిశీలిస్తున్నారు. ఇవన్నీ ఒక కొలిక్కి వస్తే ఈ కేసు విడిపోతుంది. అంతవరకూ అద్నన్ దోషా నిర్దోషా అన్నది మాత్రం సస్పెన్సే!                
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement