పొలాల్లో కన్నా 15 రెట్లు ఎక్కువ!
పొలాల్లో కూరగాయల ఉత్పాదకత కన్నా ఇంటి పెరట్లో/భవనాలపైన కుండీలు, మడుల్లో సాగు చేసే కూరగాయల ఉత్పాదకత 15 రెట్లు ఎక్కువ. ప్రపంచ ఆహార సంస్థ (ఎఫ్‌ఏఓ) గణాంకాల ప్రకారం.. ఇంటిపట్టున చదరపు మీటరు విస్తీర్ణంలో ఏడాదికి 20 కిలోల ఆహారాన్ని పండించవచ్చు. ఎఫ్‌ఏఓ ఇంకా ఏమన్నదంటే..
ఇంటిపంటల సాగు వల్ల దూరం నుంచి ఆహారోత్పత్తుల్ని పట్టణాలు, నగరాలకు తరలించాల్సిన అవసరం తగ్గి, ఆ మేరకు ఇంధనం ఆదా అవుతుంది. కాలుష్యం తగ్గుతుంది. పోషకవిలువలతో కూడిన తాజా సహజాహారం లభిస్తుంది.
కూరగాయల సాగు కాలం తక్కువ. కొన్ని రకాలైతే విత్తిన 60 రోజుల్లోనే దిగుబడినిస్తాయి. పట్టణాలు, నగరాల్లో సాగుకు అనుకూలం. ప్రపంచవ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో 80 కోట్ల మంది కూరగాయలు, ఆకుకూరలు సాగు చేస్తున్నారు. పట్టణాల్లో నివసిస్తున్న అల్పాదాయ వర్గాల ప్రజలు కూరగాయలు, ఆకుకూరలను తమకున్న కొద్దిపాటి చోటులో పండించుకుంటూ ఆహారంపై ఖర్చును తగ్గించుకుంటున్నారు.
పట్టణాల పరిసరాల్లో సాగయ్యే కూరగాయలు, పండ్ల తోటల్లో ప్రతి వంద చదరపు మీటరుకు ఒకరికి చొప్పున ఉపాధి దొరుకుతుంది! 1.5 నుంచి 2 చదరపు మీటర్ల విస్తీర్ణంలో మొక్కలు పెంచితే ఒకరికి సరిపోయే ఆక్సిజన్ వెలువడుతుందట. కమ్మటి కూరలతోపాటు ఈ బోనస్ బాగుంది కదండీ..!