అన్నా సాహెబు సంకల్పం | Determination of anna saheb | Sakshi
Sakshi News home page

అన్నా సాహెబు సంకల్పం

Published Sun, May 20 2018 12:11 AM | Last Updated on Sun, May 20 2018 12:11 AM

Determination of anna saheb - Sakshi

‘సాయిపథం’ అంటే సాయి నడిచిన మార్గం అని. అంటే – ఆయన ఏం చేశాడో? ఏం చేయాల్సి ఉందని భక్తులకి ఉపదేశించేవాడో? వేటిని ఆయన చేస్తే వాటిని మనం లీలలుగా భావించే వాళ్లమో, ఏయే భక్తులకి ఏయే విధంగా ఆయన వారి వారి అనుభవాల్లో కనిపించేవాడో.. వాటన్నింటినీ తెలుపడమన్నమాట. ఇక ‘అంతర్వేదం’ అంటే – పైన అనుకున్న తీరుగా సాయి చేసిందాన్నుంచి మనం గ్రహించవల్సిందేమిటో, దేన్ని మనం ఎలా గ్రహించాలనే అభిప్రాయంతో సాయి అలా చేశాడో, అదే తీరుగా భక్తులకి ఉపదేశించిన ప్రతిపలుకులోని అంతరార్థమేమిటో... మొత్తం మీద తన చేష్టల ద్వారా, తన బోధనల ద్వారా సాయి చెప్పదలచిన భావమేమిటో దాన్ని వివరించడమన్నమాట. ఈ నేపథ్యంలో మనం చదువుకుంటూ వెళ్లాల్సి ఉంది.


ప్రేరణ
సాయిదేవుని చరిత్రని రచించడానికి పూనుకున్న ‘అన్నా సాహెబు ధాబోల్కర్‌’ మొదట్లో మహాభక్తుడు కాదు. సమస్త తీర్థయాత్రల్ని చేసే లక్షణమున్న వాడూ కాదు. పైగా ప్రతి విషయాన్నీ హేతుబద్ధంగా ఆలోచించి, తన బుద్ధికి నచ్చిందన్నప్పుడే అంగీకరించే గట్టిదనం కలవాడు కూడా. ఏ ఫలితానికైనా కార్యకారణ సంబంధం ఉండాలి. ఉదాహరణకి ఒక దీపం తన వెలుగుని ప్రసరింపజేస్తోందంటే ప్రమిద, నూనె, వత్తి, నిప్పు వల్లనే. ఈ కారణాల్లో ఏది లేకున్నా దీపమనేది వెలగదు, ప్రకాశాన్ని ఇవ్వలేదు. ఇది అనుభవంలో కనిపించే సత్యం. అయితే, కేవలం గోధుమపిండిని చల్లితే షిరిడీలోని విజృంభించిన కలరా వ్యాధి పూర్తిగా తగ్గిపోవడమా? అనే సంశయం గట్టిగా పీడించసాగింది అన్నా సాహెబుని. దాంతో దానిమీద దృష్టి సారించాడాయన. ఎవరీ సాయి? ఏమిటాయన గొప్పదనం? అని. ఏదైనా ఒక మంచి పంట పండాలంటే నాటబడే విత్తనంతో పాటు భూమి సారవంతమైనదయ్యుండాలి.

ఆ కారణంగా అన్నాసాహెబు ముందుగా నాటబడే విత్తనం ‘సాయి చరిత్రం’ అవుతుంటే, దాన్ని చక్కగా లోకానికి అందించగల సారవంతమైన భూమిగా తాను కాగలనా? అని ఆలోచించుకున్నాడు. మహానుభావులెప్పుడూ ఇలాగే ఆలోచిస్తారు. దీన్నే ప్రారంభ భీరుత్వం అంటుంది శాస్త్రం. ఈ భయంతో, పిరికితనంతో ఆగిపోవడం అధముల లక్షణం. ప్రారంభించి కొద్దిదూరం వెళ్లాక ఏదో విఘ్నం కారణంగా పనిని విడిచివేయడం మధ్యముల స్వభావం. ఏది ఏమైనా తనకి తానే ప్రశ్నించుకుంటూ, సమాధానం కోసం శతవిధాల బుద్ధిని ఆలోచనలకి గురిచేస్తూ అనుకున్న పనిని సాధించడం ఉత్తముల లక్షణం – అని భావించిన అన్నా సాహెబు మడమని వెనక్కి తిప్పదలచలేదు. తన పునాదిని గురించి తాను ఆలోచించుకున్నాడు.సంస్కార సాంప్రదాయాలు నిండిన ఆద్యగౌడ బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చాడు తాను. తల్లికీ, తండ్రికి, తాత ముత్తాతలకీ విశేషమైన దైవ భక్తి ఉంది. కాబట్టి సాయి చరిత్రాన్ని ‘నచ్చితే రాద్దాం! ఏ మాత్రపు అవిశ్వాసం తోచినా ఆగిపోదాం!’ అనే నిశ్చయంతోనే అన్నా సాహెబు తనని తాను స్థిరపరుచుకున్నాడు.

ఒక అడుగు వేస్తే పది అడుగులు
సాయిది ఒకే ప్రేమ సూత్రం. భక్తుడైన నువ్వు ఒక అడుగుని నా వైపుకి వేస్తే చాలు, నేను ఎక్కువ అనే ఆలోచనని మాని నీ దిక్కుగా పది అడుగులు వేస్తాననేది ఆయన అభిప్రాయం. సాయి – సర్వజ్ఞుడు కాబట్టి అన్నా సాహెబులోని ఆలోచనని గమనించి 1910వ సంవత్సరంలో అన్నా సాహెబుని బాంద్రా అనే పట్టణంలో రెసిడెంటు మెజిస్ట్రేటుగా బదిలీ చేయించాడు (కాబోలు)! పోనీ అప్పుడైనా అన్నా సాహెబుకి సాయిని గురించిన చరితాన్ని రాయడమెందుకనే ఆలోచన కలగలేదు సరికదా ఆయన గురించి గొప్పవారైన పదిమందీ ఏమన్నారో ఆ విశేషాలను తెలుసుకోవాలనే తపన ప్రారంభమయింది. తాను మూఢ విశ్వాసి కానే కాదు కాబట్టి, పైగా చేసేది ప్రత్యక్ష సాక్ష్యం ఉన్నప్పుడు మాత్రమే నమ్మే ఉద్యోగం కాబట్టి తనతో సమానమైన సహేతుకమైన బుద్ధిగల మేధావుల రచనలని చదవడం ప్రారంభించాడు అన్నా సాహెబు.

ఇందూరు హైకోర్టు జడ్జి గారు ఎమ్‌.బి.రేగే గారు ‘బాబా శరీరం భౌతికంగా మనకి కనిపించకపోయినా, ఆయన సమాధి దగ్గర నిలబడి ప్రార్థిస్తే – ఆయన సమాధి కాకముందున్న తీరుగానే మనసులో భావిస్తే నిశ్శబ్దంగా ఆయన ఏదో తోవని చూపుతూ మన సమస్యకి పరిష్కారాన్ని చెప్తారు’ అని రాసిన మాటలు కనిపించాయి. దీంతో అన్నా సాహెబు మనసులో సాయి చరిత్రని అందించాలనే ఊహ చిగురించింది. బి.వి. నరసింహస్వామి గారు కూడా హైకోర్టు జడ్జిగారే. వారు సాయిని గురించి రాస్తూ – ‘నేనిప్పటికీ సాయి లేడని నమ్మలేకపోతున్నాను. ఇప్పటికీ ఉన్నారనే నేను గట్టిగా నమ్ముతున్నాను. నా మనోవీధిలో నిరంతరం నాకు కనిపిస్తూ ఉంటారు. ఏ సంశయాన్నైనా ధర్మబద్ధంగా తీరుస్తూ ఉంటారు’ అన్నాడు. దీంతో అన్నా సాహెబు మనసులో సాయిచరిత్రాన్ని రాయాలనే ఆలోచన దృఢమయింది. కేవలం న్యాయాధికారులు చెప్పిందాని ప్రకారమే నేనూ ఒక న్యాయాధికారిని కాబట్టి నమ్మి సాయిచరిత్రాన్ని రాయడమా? అని ఆలోచించిన అన్నా సాహెబు ఇతరుల వాక్యాలేమైనా ప్రమాణబద్ధంగా ఉన్నవి కనిపిస్తాయా? అని పరిశీలించాడు.

అంతే, ఒక ఇంజనీరింగ్‌ కాలేజీ ప్రొఫెసర్‌ జి.జి.నార్కే రాసిన మాటలు కనిపించాయి ఇలా.. ‘నా మామగారూ, నా భార్యా, నా తల్లీ సాయికి గొప్ప భక్తులు. వాళ్లకి భగవంతుడంటూ ఎవరైనా ఉన్నారంటే ఆయన సాయి మాత్రమే. ఈ అభిప్రాయాన్ని మనసులో పెట్టుకుని అంత గొప్పదనం ఆయనలో ఏముందా? అనే ఊహతో నేను కూడా ఓసారి వాళ్లతో షిరిడీకి వెళ్లాను. నా అభిప్రాయాన్ని పూర్తిగా తలకిందులు చేస్తూ ఆ రోజున సాయి హారతి సమయంలో తీవ్రమైన కోపంతో ఊగిపోతూ భక్తుల్ని శపిస్తూ తిడుతూ అందరూ భయపడేలా చేస్తున్నారు. నేను బయల్దేరే సమయంలో సాయి గురించి అర్ధవిశ్వాసం కాస్తా పూర్తిగా శూన్య విశ్వాసంగా మారి – ఈయన ఓ పిచ్చివాడు మాత్రమే. ఈ పిచ్చివాణ్ని దైవంగా భావించే నా భార్యా, నా మామా, నా తల్లీ కూడా.. వాళ్లే అనే నిర్ణయానికొచ్చేశాను. అయితే అందరితో పాటు నేను కూడా సాయిహారతి పూర్తి అయ్యాక ఆయన పాదాలని స్పృశించి మొక్కాను. ఆయన నా తలని మాత్రమే నిమురుతూ, నవ్వుతూ ప్రేమ పూర్వకంగా నన్ను చూస్తూ ‘నేను పిచ్చివాడిని కాను!’ అన్నారు. దాంతో నా మనోభిప్రాయాన్ని ఆయన ఎలా గమనించగలిగారా? అనే ఆశ్చర్యం, అద్భుతం నా మనసులో కలిగి మరోమారు ఆయన పాదాలని నిజమైన భక్తితో స్పృశించి మొక్కాను’ అని.

అంతే! అన్నా సాహెబుకి కనిపించిన ఈ ప్రత్యక్ష ఆధారాలన్నీ ఒక గట్టి ఆలోచనకి రూపాన్నిచ్చాయి. తాను కూడా ఓసారి సాయిని చూసి ఆయనతో తనకి కలిగిన అనుభవాన్ని గమనించుకుని, హృదయపూర్వకంగా నచ్చితే నమ్ముదాం! లేదా మానేద్దాం!! అని. ఇలా ఆలోచనలతో ఉన్న అన్నా సాహెబుకి ఆ సమయంలోనే మరికొందరి అనుభవాలు కనిపించాయి. ఇక ఆలస్యం చేయడం తగదనే అభిప్రాయం కలిగింది అన్నా సాహెబుకి. బాబాతో మరింత దగ్గర సంబంధం ఉన్నవారితో పరిచయాన్ని గాని ఏర్పాటు చేసుకుంటే స్వయంగా బాబాని దర్శించగల వీలుంటుందనీ, అవసరమైతే సాయి చరిత్రాన్ని రాసే ఆలోచనకి ఓ రూపాన్ని ఇవ్వవచ్చని భావించాడు. అలాంటివారిని గురించి ప్రత్యేకించి అన్వేషించాల్సిన అవసరం లేకపోయింది ఆయనకి. షిరిడీ భక్తులందరిలో ఎవరిని పలకరించినా సాయి బాబాకి అతి సన్నిహితులుగా శ్యామా (ఈయన అసలు పేరు మాధవరావు దేశ్‌పాండే) అనే ఆయనని చెప్తుండేవారు. ఆయన సాక్షాత్తు బాబాని పరోక్షంగా భక్తులతో మాట్లాడుతున్న సందర్భంలో ‘దేవుడు!’ అని మాత్రమే అంటుండేవారు. ‘సాయిదేవా!’ అని తరచూ సంబోధిస్తూండేవారు.

ఇంకా అవసరమా?
అన్నా సాహెబుకి సాయి చరిత్రాన్ని లోకానికి అందించాలనే ఆలోచనైతే బలంగా కలిగింది గానీ, ఎందరెందరో సాయిచరిత్రాన్ని స్వీయ అనుభవాలతో సాయి లీలలతో మహిమలతో పూర్తిగా రాసేసి, ముద్రించి లోకంలోకి వ్యాప్తి చేసేశాక ఇంకా తానేదో రాయాల్సి ఉందంటూ రాయాల్సిన అవసరం ఉందా? అనే ఆత్మ అవిశ్వాసం కలిగింది. ఒక్క క్షణం పాటు ఇక్కడే ఈ ప్రధాన చరిత్ర నుండి పక్కకి జరిగి చూడాల్సి ఉంది. కాళిదాసు అంతటి మహాకవి కావ్యాలని రాయడం ప్రారంభిస్తూ – ఎందరెందరో మహా కావ్యాలని అందించేసి ఉండగా, పొట్టివాడొకడు ఎల్తైన చెట్లకి వేలాడుతున్న తియ్యటి మామిడి పళ్లని కోసుకోడానికి అనేక పర్యాయాలు ఎగురుతున్నట్లుగా ఎందుకీ ప్రయత్నం అనుకున్నాడు. వాల్మీకి మహర్షంతటి వాడు శ్రీమద్రామాయణాన్ని పూర్తిగా రచించి తన ఆశ్రమంలో అందరికీ వినిపించి, వాళ్లంతా చాలా బాగుందని ప్రశంసిస్తే ఆనందపడ్డాడు ప్రారంభంలో. ‘అయ్యో! నేనూ ఆశ్రమ జీవినే. వీళ్లూ ఆశ్రమవాసులే కదా! నేను రాసిన దేన్నైనా ఆశ్రమ సాహచర్య జీవనం కారణంగా ఆమోదించి ఉంటారు’ అనే భావనతో ఇతర ఆశ్రమ మహర్షులకి వినిపించాలనుకుని వాళ్లని ఆహ్వానించాడు.

వాళ్లంతా వచ్చారు. విన్నారు. చెప్పలేనంత రమ్యంగా ఉందని శ్లాఘించారు. మళ్లీ వాల్మీకి అనుకున్నాడు – ‘ఇంతకుముందు విన్న వాళ్లూ వీళ్లు కూడా ఆశ్రమవాసులే. అయితే వాళ్లు నా ఆశ్రమవాసులూ, వీళ్లు ఇతరాశ్రమవాసులూను. వీళ్లు కాకుండా సాక్షాత్తు రాముడే విని ఆమోదముద్ర వేస్తే దీన్ని లోకానికి అందిద్దాం’ అనుకున్నాడాయన.
రాముడు కొంతకాలానికి ఆ ప్రాంతానికి రాగా ఆయనకే వినిపించాడు. ఆయన అంతా విని ‘చక్కగా ఉంది’ అని చెప్తూ, ‘నా కథని నేనే విని బాగుందని అనక మరోలా అంటానా?’ అని తనని గురించి ఎవరైనా అనుకుంటారేమోనని భావిస్తూ రామకథ జరిగిన కాలంలో ఎందరెందరున్నారో అందరి సమక్షంలోనూ అది కూడా అయోధ్యలోనే వినిపిస్తే అందరూ బాగుందని అన్న పక్షంలోనే లోకానికి అందిద్దామన్నాడు రాముడు. అలాగే జరిగింది. ఆమోదించబడింది సభలో. లోకానికి విడుదలయింది.

‘నిజమైన గ్రంథకర్త ఎవరు?’ అంటే తనని గురించి తాను భయపడుతూ, తన రచన వల్ల ఎవరైనా నమ్మకూడని విషయాన్ని నమ్మి వెళ్లకూడని మార్గానికి గాని వెళ్లినట్లయితే ఆ దోషమంతా తనదిగా భావించేవాడెవరో అతడు మాత్రమే సరైన గ్రంథకర్త. ఆదరాబాదరగా రెండు మూడు విషయాలని సేకరించి రాసేసేవాడు సరైన గ్రంథకర్త కాడు. తాను సంపూర్ణంగా నమ్మి, అలా నమ్మడానికి గల కారణాలని సహేతుకంగా వివరించి నమ్మింపజేయగలవాడే సరైన గ్రంథకర్త అనేది దీని భావం. అలాంటి గ్రంథకర్తకి కావలసిన సర్వలక్షణాలూ కలవాడు అన్నా సాహెబు అనేది దీని లక్ష్యం. ఇంతటి ఉత్తమ లక్ష్యాలతోనూ సాయి చరిత్రాన్ని రాయదలిచిన అన్నా సాహెబుకి కలిగిన చివరి సందేహం ‘ఇంకా అవసరమా?’ అని. ఇక్కడే ఉంది రహస్యం. ‘ఇంకా అవసరమా?’ అనే విషయం తేలాలంటే, ఇంతకుముందు ఎవరెవరు ఏమేం రాశారో వాటిని చూడాల్సి ఉందిగా! అదుగో ఈ పనిని సాయి మాత్రమే పరోక్షంగా అన్నా సాహెబుని ప్రేరేపించి చేయిస్తున్నాడన్నమాట. కొద్దిలోతుగా ఆలోచిస్తే ఇంతగా అన్నా సాహెబు సాయిని గూర్చి తపన పడుతున్నాడంటే, సాయి అనుగ్రహం తనకి లభించేసినట్లే! సాయి చరిత్రాన్ని రాసేందుకు సాయిదేవుని అనుగ్రహానికి పాత్రుడైనట్లే.

సాయిచరిత్రం అవసరమే!
అన్నా సాహెబు దృష్టిలో గురుచరిత్ర గ్రంథం పడింది. దాని రచయిత సరస్వతీ గంగాధరుడు. ఆయన గ్రంథాన్నైతే లోకానికి అందించాడు గాని, సాయిబాబాకి ముందు అవతారాలైన శ్రీపాద శ్రీవల్లభ స్వామి, నరసింహ సరస్వతి స్వామి గార్ల చరిత్రలనీ విశేషాలనీ బాగా వివరించారు. కాబట్టి తాను రాయబోయే సాయిచరిత్రం అవసరం లోకానికి ఉంది. గురు చరిత్రం ఉంది గాని అది కన్నడంలో ఉన్న కారణంగా అందరికీ అర్థం కాదు. అదీ కాక గురుచరిత్ర లోకానికొచ్చిన తర్వాత ఎన్నో సాయి లీలలు భక్తుల్లోకి అనుభవంలోకి వచ్చాయి. అవన్నీ లోకానికి తెలియజేయాలంటే మరో గ్రంథం అవసరమే కదా! ఇలా అనేక కోణాల్లో పరిశీలించుకుని, తనని తానే పరీక్షించుకుని ఆ మీదట సాయిచరిత్ర అవసరం ఉందని నమ్మి – ఓ వ్యాసుడు భారతాన్నీ, ఓ వాల్మీకి రామాయణాన్నీ, ఓ కాళిదాస మహాకవి పంచకావ్యాలనీ నాటకాలనీ లోకానుగ్రహ కాంక్షతో రాయాలని భావించినట్టుగా అన్నాసాహెబు సాయి గురించిన గ్రంథ రచనకి మానసికంగా పూనుకున్నాడు.
    
ఆ రెండూ ముఖ్యం
ఇంత జరిగాక అన్నా సాహెబుకి సారాంశంగా అర్థమైన విషయం ఒక్కటే. ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలంటే ఓ ఆలోచనని కార్యరూపం దాల్చేలా చేయాలంటే శ్రద్ధ – సబూరి ‘స్థిరమైన నమ్మకం, తీవ్రమైన ఓపిక’ అనేవి కావాలని. ఆ రెండు ఆయుధాలతో షిరిడీకి ప్రయాణమయ్యాడు అన్నా సాహెబు.. సాయి దర్శనం కోసం...

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement