భవిష్యత్ కాలంలో....‘సంపన్న స్థాయి’ని అంచనా వేయడానికి కరెన్సీ, బంగారం, భూములు, షేర్లు... ఇవేమీ అక్కర్లేదు. చెప్పాలంటే... చెట్లు చాలు! ‘‘ఆయనకేమండీ బాబూ... వాళ్ల ఇంట్లో ఒక చెట్టు ఉంది.’’ ‘‘నీకో విషయం తెలుసా మా ఫ్రెండ్ తోడల్లుడి ఇంట్లో మూడు నాలుగు చెట్లు ఉన్నాయి. ఏ జన్మలో ఏ అదృష్టం చేసుకున్నారో.’’
‘‘అబ్బాయి అన్ని విధాలా నచ్చాడండీ. మీ ఇంటి గురించే బెంగ. ఒక్క చెట్టూ లేదంటున్నారు. బ్యాంకు బ్యాలెన్సును పీల్చి బతకలేము కదా... దీని గురించే ఆలోచిస్తున్నాం.’’ ఇలాంటి మాటలు బహుశా భవిష్యత్తులో వినిపించవచ్చు. ‘ఐక్యరాజ్య సమితిలోని అన్ని దేశాలూ కలిసి ట్రీ ప్రొటెక్షన్ ఫోర్స్ పేరుతో ఒక సరికొత్త సాయుధ దళాన్ని తయారు చేశాయి’లాంటి బ్రేకింగ్ న్యూస్‌లూ వినిపించవచ్చు. ‘చెట్టు కొమ్మను నరికిన నిందితుడికి న్యాయస్థానం అయిదేళ్ల కఠిన కారాగార శిక్షను విధించింది’ లాంటి సరికొత్త తీర్పులూ వెలువడవచ్చు. భవిష్యత్తులో ఇలాంటివి ఏమైనా జరగవచ్చు! ఈ ఆలోచనతో గీసిన కార్టూనే ఇది.
‘చెట్లను రక్షించండి. అవి మిమ్మల్ని రక్షిస్తాయి’ అనే మంచి మాట ఎంత చెప్పినా ఎవరికీ పెద్దగా వినిపించడం లేదు. అందుకే రాబోయే రోజుల్లో చెట్లకు సాయుధ కాపలా అవసరం కావచ్చు అని రేఖమాత్రంగా చెబుతున్నాడు అర్జెంటినా కార్టూనిస్ట్ మొర్డీల్లో. అసలు మాటలే లేని కార్టూన్లను గీయడంలో దిట్ట అని పేరు మోసిన ఈ కార్టూనిస్ట్... ప్రేమ, ఆటలు, జంతువులు, పర్యావరణం మొదలైన వాటిపై ఎన్నో కార్టూన్‌లను గీసి ‘బాస్... శబ్బాష్’ అనిపించు కున్నాడు. దానికి ఈ కార్టూనే సాక్షి. మరొక్కసారి ఈ చెట్టు కార్టూన్ చూడండి. ప్రమాద ఘంటికల శబ్దం వినిపిస్తుందా?!
చె.ర.సా.ద!
Published Sun, Jan 24 2016 1:53 AM | Last Updated on Sun, Sep 3 2017 4:10 PM
Advertisement
Advertisement