Famous toon
-
ఐ... లాస్ట్... యూ!
ఫేమస్ టూన్ ఇరాన్ ప్రభుత్వం పత్రికలపై విధిస్తున్న కనిపించీ కనిపించని సెన్సార్షిప్ మీద టెహ్రాన్ కార్టూనిస్ట్ బొజర్గమేర్ పదునైన కార్టూన్లు గీశారు. గత రెండు దశాబ్దాలుగా ఇరాన్ దినపత్రికలలో విరివిగా కార్టూన్స్ గీస్తున్న ఈ కార్టూనిస్ట్ గీత, రాత రెండూ బాగుంటాయి. ‘‘మనం గీసిన దానిలో బొమ్మ కనిపించడం కాదు... మనం ఏం చెప్పదలుచుకున్నామో అది కనిపించాలి’’ అంటాడు బొజర్గమేర్. నిజమే. రాత లేక పోయినా సరే, ఆయన గీతలో స్పష్టత ఉంటుంది. పొలిటికల్ కార్టూన్లు మాత్రమే కాదు... మానవ సంబంధాల్లోని భావోద్వేగాలను, ప్రేమను ఆయన బలంగా చిత్రించారు. కింద మీరు చూస్తున్న కార్టూన్ ఈ కోవకు చెందినదే. ఒక తోటలో రెండు పూలు చాలా స్నేహంగా ఉండేవి. చిరుగాలి సితార సంగీతమై వినిపిస్తున్న ఒక రోజు ‘ఐ లవ్ యూ’ చెప్పింది ఒక పువ్వు మరొక పువ్వుకు. ఈ క్షణం కోసమే ఎన్నో యుగాల నుంచి ఎదురు చూస్తున్నట్లుగా ఉన్నాయి ఆ పూల కళ్లు. వాటి మౌనభాషలో... ఎన్ని మధురభావాలో! ఇంతలో ఒక హస్తం క్రూరంగా ‘ఐ లవ్ యూ’ చెప్పిన పువ్వును పెరికేసింది. ఆ చేయి తన ప్రియురాలి చేతికి ఆ పువ్వును ఇచ్చి ‘ఐ లవ్ యూ’ చెప్పింది. ప్రియురాలి కళ్లలో ఆనందబాష్పాలు. పువ్వు మనసులో విషాద సాగరాలు! చిరుగాలి పెనుతుఫాను అయింది. పువ్వు ప్రియురాలు నిర్జీవమైపోయింది!! బొజర్గమేర్ కార్టూన్ స్ట్రిప్‌ను చూస్తే ఇలాంటి కథలు ఎన్నయినా ఊహల్లోకి రావచ్చు. ప్రేమకు ఉండే అనేక కోణాలను గుర్తుకు తెచ్చే కార్టూన్ ఇది. పూలకూ ఒక మనసు ఉందనేది భావుకత కాదు... శాస్త్రీయ నిజం. అంటే మన ప్రేమ కోసం పూబాలల మనసు నొప్పిస్తున్నామా? ఛ! -
చె.ర.సా.ద!
భవిష్యత్ కాలంలో....‘సంపన్న స్థాయి’ని అంచనా వేయడానికి కరెన్సీ, బంగారం, భూములు, షేర్లు... ఇవేమీ అక్కర్లేదు. చెప్పాలంటే... చెట్లు చాలు! ‘‘ఆయనకేమండీ బాబూ... వాళ్ల ఇంట్లో ఒక చెట్టు ఉంది.’’ ‘‘నీకో విషయం తెలుసా మా ఫ్రెండ్ తోడల్లుడి ఇంట్లో మూడు నాలుగు చెట్లు ఉన్నాయి. ఏ జన్మలో ఏ అదృష్టం చేసుకున్నారో.’’ ‘‘అబ్బాయి అన్ని విధాలా నచ్చాడండీ. మీ ఇంటి గురించే బెంగ. ఒక్క చెట్టూ లేదంటున్నారు. బ్యాంకు బ్యాలెన్సును పీల్చి బతకలేము కదా... దీని గురించే ఆలోచిస్తున్నాం.’’ ఇలాంటి మాటలు బహుశా భవిష్యత్తులో వినిపించవచ్చు. ‘ఐక్యరాజ్య సమితిలోని అన్ని దేశాలూ కలిసి ట్రీ ప్రొటెక్షన్ ఫోర్స్ పేరుతో ఒక సరికొత్త సాయుధ దళాన్ని తయారు చేశాయి’లాంటి బ్రేకింగ్ న్యూస్‌లూ వినిపించవచ్చు. ‘చెట్టు కొమ్మను నరికిన నిందితుడికి న్యాయస్థానం అయిదేళ్ల కఠిన కారాగార శిక్షను విధించింది’ లాంటి సరికొత్త తీర్పులూ వెలువడవచ్చు. భవిష్యత్తులో ఇలాంటివి ఏమైనా జరగవచ్చు! ఈ ఆలోచనతో గీసిన కార్టూనే ఇది. ‘చెట్లను రక్షించండి. అవి మిమ్మల్ని రక్షిస్తాయి’ అనే మంచి మాట ఎంత చెప్పినా ఎవరికీ పెద్దగా వినిపించడం లేదు. అందుకే రాబోయే రోజుల్లో చెట్లకు సాయుధ కాపలా అవసరం కావచ్చు అని రేఖమాత్రంగా చెబుతున్నాడు అర్జెంటినా కార్టూనిస్ట్ మొర్డీల్లో. అసలు మాటలే లేని కార్టూన్లను గీయడంలో దిట్ట అని పేరు మోసిన ఈ కార్టూనిస్ట్... ప్రేమ, ఆటలు, జంతువులు, పర్యావరణం మొదలైన వాటిపై ఎన్నో కార్టూన్లను గీసి ‘బాస్... శబ్బాష్’ అనిపించు కున్నాడు. దానికి ఈ కార్టూనే సాక్షి. మరొక్కసారి ఈ చెట్టు కార్టూన్ చూడండి. ప్రమాద ఘంటికల శబ్దం వినిపిస్తుందా?! -
సెల్ మోహనరంగా!
ఫేమస్ టూన్ ‘సెల్‌ఫోన్ వాడడం లేదా!’.... ‘లేదు’ అంటే పరమ వింత! ‘ఇప్పటికీ ఆ పాత సెల్‌ఫోనే వాడుతున్నావా?’... ‘అవును’ అంటే చిన్నచూపుతో కూడిన చిరు వింత! ‘అవసరం మేరకు, కొద్దిసేపు మాత్రమే మాట్లాడతావా?’... ‘అవును’ అంటే అకారణ వింత! ఈ వింతల నుంచి తప్పించుకోవడానికి ‘నేను సైతం’ అంటూ కొత్త ఖరీదైన సెల్‌ఫోన్ కొనాల్సిందే. అది పాత బడకుండానే లేటెస్ట్ లిస్ట్‌లోకి జంప్ చేయాల్సిందే. కొన్నాం సరే. అన్ని డబ్బులు పెట్టి కొన్న సెల్‌ను సెల్లో బంధించినట్లు అలా ఒక మూలన పెడితే ఎలా? మాట్లాడాలి. మాట్లా......డు......తూ.....నే.... ఉండాలి! అప్పుడుగానీ గిట్టుబాటు కాదు. రోడిన్ ప్రపంచ ప్రఖ్యాత శిల్పం ‘ద థింకర్’ను చూసీ చూడగానే నిలువెత్తు మౌనం, ఆ చిక్కటి మౌనంలో ఉదయించిన తత్వం గుర్తుకు వస్తాయి. దేన్నీ వదలని ‘సెల్’ఫోను ఆ ఆలోచనాపరుడిని మాత్రం ఎందుకు వదులుతుంది? అంటున్నాడు రికో. అందుకే ఇప్పటి ‘థింకర్’ మౌనంగా ఉండడం కంటే, ఆలోచించడం కంటే...సెల్ లోకంలో తలమునకలవ్వడానికే ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఓ కార్టూన్‌ను చిత్రించాడు. ‘రికో’ పేరుతో కార్టూన్లు గీసే ఇటలీయుడు ఫెడెరికో రికియార్డీ స్వతహాగా ఆర్కిటెక్ట్. అయితే దీనికంటే ఇలస్ట్రేటర్, గ్రాఫిక్ డిజైనర్‌గా అతడికి ఉన్న గుర్తింపే ఎక్కువ. కళాకారుడికి ‘లోచూపు’ ఎక్కువగా ఉండాలి అనేది వాస్తవమైతే...అది రికోలో చాలా ఎక్కువగానే ఉందని ఈ కార్టూన్ని చూసీచూడగానే ఒప్పుకోవచ్చు. -
వీడెవడండీ బాబూ!
ఫేమస్ టూన్ ఇండోనేషియన్లకు ఏదైనా కార్టూన్ నచ్చితే చాలు... నవ్వడమే కాదు, గుండెలో గుడి కట్టేసి ఆ కార్టూన్‌ను అందులో పెట్టుకుంటారు. అయిదు సంవత్సరాల క్రితం ఈ దేశంలో కార్టూన్ మ్యూజియం ఏర్పడటమే అందుకు సాక్ష్యం. ఈ మ్యూజియమ్‌లో ఇండోనేషియాకు చెందిన ప్రసిద్ధ కార్టూన్లన్నీ కొలువుతీరి ఉన్నాయి. ‘బాలి’లోని ఈ మ్యూజియానికి ప్రారంభోత్సవం చేసిన ఇండోనేషియాకు చెందిన సీనియర్ కార్టూనిస్ట్ ప్రియంటో... ‘‘ఇదో నవ్వుల ఖజానా’’ అని వ్యాఖ్యానించారు. ఇండోనేషియన్ కార్టూనిస్ట్ డిడియై సా కార్టూన్లను టోకుగా ఒక దగ్గర చూసినప్పుడు కూడా ‘నవ్వుల ఖాజానా’ అన్న మాట మన నోటి వరకు వస్తుంది. డిడిైయెు సా మంచి ఇలస్ట్రేటర్, కార్టూనిస్ట్, డిజైనర్‌గా రకరకాల పత్రికలు, అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీలలో తన ప్రతిభను చాటుకున్నాడు. కాలుష్య భూతం, మహానగరాల్లోని ఇరుకు జీవితం, డిజిటల్ జీవితంలోని గందరగోళం... ఇలా ఎన్నో సామాజిక సమస్యలను ఆయన కుంచె ప్రపంచం ముందు పెట్టింది. ఆయన వేసిన ‘డ్రైల్యాండ్’ కార్టూన్ అయితే ఒక మౌన కావ్యం అనిపిస్తుంది. అయితే అంత వేడి వేడి కార్టూన్లు మనకు ఎందుకు అనుకుంటే... ఆయన వేసిన ఈ కార్టూన్ని చూసి కాసేపు చల్లగా నవ్వుకుందాం రండి! -
జీవిత చక్రం
ఫేమస్ టూన్ కదిలేది, కదిలించేది, పెను నిద్ర వదిలించేది ‘కవిత్వం’ మాత్రమే కానక్కర్లేదు... ‘కార్టూన్’ కూడా కావొచ్చు. దీనికి ఒక పెద్ద ఉదాహరణ మఖ్మూద్ ఇశోంక్లోవ్ కార్టూన్లు. ఈ ఉజ్బెకిస్తాన్ కార్టూనిస్ట్ గీసే రేఖలలో ‘హాస్యం’ మాత్రమే ఉండదు. మెదడుకు పదును పెట్టే ‘ఆలోచన’ కూడా ఉంటుంది. అవి మనసును తట్టి లేపి ‘హద్భుతం’ అనేలా చేస్తాయి! సిరియా శరణార్థుల కన్నీటిని ఒక్క మాట లేకుండా వేల పుటల్లో చెప్పినా, సామాజిక సహాయాన్ని కూడా ‘తిరుగులేని వ్యక్తిగత వ్యాపారం’ చేసుకున్న నకిలీ మానవతావాదులకు చుర్రుమనిపించేలా చురక అంటించినా... ఇశొంక్లోవ్ కుంచె తీరే వేరు. నిజానికి అది కుంచె కాదు... అంకుశం! ఉజ్బెకిస్తాన్‌లోని బేషరిఖ్ జిల్లాలో ఉన్న టెలొవ్ గ్రామంలో పుట్టిన ఇశోంక్లోవ్ గ్రాఫిక్ ఆర్ట్‌లో పట్టా తీసుకున్నాడు. ప్రస్తుతం తాష్కెంట్ సిటీలో నివాసం ఉంటున్నారు. ‘ఉజ్బెకిస్తాన్ ఆర్టిస్ట్స్ యూనియన్’, పోలెండ్ ‘గుడ్ హ్యూమర్ పార్టీ’లలో ఆయన సభ్యుడు. మనిషి ఈ భూమి మీదికి వచ్చేటప్పుడు ఏమీ తీసుకు రాలేదు. పెరిగే క్రమంలో, పెద్దవుతున్న క్రమంలో, జీవితంలో స్థిరపడుతున్న క్రమంలో, దర్జా చాటుకునే సమయంలో... ఆ మనిషికి ‘వాహనం’ కావాల్సి వచ్చింది. చివరికి మనిషిని, వాహనాన్ని వేరు చేయలేని పరిస్థితి వచ్చింది. తప్పుటడుగులు వేస్తున్నప్పుడు చిట్టి వాహనాన్ని ఆశ్రయించిన మనిషికి... చనిపోయిన తరువాత కూడా చిట్ట చివరి వాహనం ఒకటి కావాల్సి వచ్చింది. వాహనమయమైన మనిషి జీవితాన్ని, జీవిత చక్రాన్ని గురించి ఒక్క మాట కూడా లేకుండా చెప్పడానికి ఈ కార్టూన్‌ను మించింది మరేముంటుంది!