భయం | fear story! | Sakshi
Sakshi News home page

భయం

Published Sun, Dec 6 2015 3:34 AM | Last Updated on Sun, Sep 3 2017 1:33 PM

భయం

భయం

మల్లాది వెంకట కృష్ణమూర్తి క్రైమ్ కథలు -  26
మిస్టర్ వెల్డన్ గొప్ప దొంగ. అతనిలోని ఏకైక లోపం భయం. ఐతే అతనిలో ఊహా శక్తి అధికం కాబట్టి భయమూ అధికమే. ఊహాశక్తి లేకపోతే గొప్ప దొంగ అవడం కష్టం. తన భయాన్ని చుట్టుపక్కలవారు గమనిస్తున్నారేమో అని వెల్డన్‌లో ఇంకో అనుబంధ భయం కూడా ఉంది. వీటికి తోడు అతనికి చచ్చేంత మొహమాటం. ఆరోజు వెల్డన్ ఓ దుకాణంలోని వస్తువుల్ని దొంగిలించడానికి వెళ్లాడు. ముర్రేస్ మెన్స్ స్టోర్‌లో అమ్మేవన్నీ విలువైనవే కాబట్టి లోపలికి వెళ్లాడు.

ఖరీదైన చేతి గడియారాలు అతని దృష్టిని ఆకర్షించాయి. దేని ధరా వెయ్యి డాలర్లకి తక్కువ లేదు. ఓ ర్యాక్ నించి మూడు డజన్ల గడియారాలు వేలాడున్నాయి. వాటిని పరిశీలిస్తున్నట్లు నటిస్తూండగా మూడో గడియారం లాఘవంగా అతని మోచేతి పైకి వెళ్ళిపోయింది. చుట్టూ చూశాడు. టై విభాగంలోని ఆ సేల్స్‌మేన్ తన వంకే చూస్తున్నాడా? అతను తనవైపే చూస్తున్నా అతని దృష్టి తన తలమీద కొద్దిగా పైకిఉందని గుర్తించాడు.

నాలుగో వాచీ కూడా మూడో వాచీ పక్కన అతని చేతిలోకి చేరింది. ఇంక వెళ్దామనుకుంటుండగా ఆ టై సేల్స్‌మేన్ తనవైపు వస్తున్నాడని గ్రహించాడు. వాటిని తిరిగి యథాస్థానంలో ఉంచుదామని అను కుంటూండగా ఆ సేల్స్ మేన్ మొహంలో చిరు నవ్వు మొలిచింది. అది కస్టమర్ని గ్రీట్ చేసే నవ్వుగా గ్రహించి స్థిమిత పడ్డాడు.
 ‘‘ఐ బెగ్ యువర్ పార్డన్ సార్. మీరు దేని కోసం చూస్తున్నారో అది కనిపించిందా?’’ అతని ప్రశ్న ఇది.
 ‘‘లేదు. షర్ట్‌లని చూద్దామని వచ్చా.’’
 
నిజానికి ‘లేదు’ దగ్గర మాట్లాడటం ఆపేసి బయటికి నడవాలి. కాని భయంతో తనకి తెలీకుండానే ఆ రెండో వాక్యం మాట్లాడాడు.
 ‘‘ఎక్స్‌లెంట్ సార్. ఇటు రండి.’’ వాల్డన్‌కి అతని వెంట నడవక తప్పలేదు.
 ‘‘మీ సైజు తెలుసా? లేదా మీ స్లీవ్, కాలర్‌లని కొలవనా? దయచేసి మీ కుడి చేతిని చాపుతారా?’’ అతను జేబులోంచి టేప్ తీశాడు.

‘‘ఆ అవసరం లేదు. అది ముప్ఫై మూడు. కాలర్ సైజ్ పదిహేను’’ వాల్డన్ వెంటనే చెప్పాడు.
 ‘‘ఐదు డాలర్లవి రెండు ఇవ్వండి.’’
 ‘‘మీరు డజను పెట్టెని కొంటే దాని ధర యాభై డాలర్లే. అంటే మీకు రెండు షర్ట్‌లు ఉచితంగా వచ్చినట్లు. మెటీరియల్ చూడండి’’ అతను వెల్డన్ చేతిని అందుకుని ఓ షర్ట్ మీదకి తీసుకెళ్లాడు.
 ‘‘సరే’’ తన వాచీ ఉన్న చేతిని లాక్కుంటూ వెల్డన్ చెప్పాడు.
 
డబ్బు చెల్లించి రసీదు తీసుకుని వెళ్లడానికి వెనక్కి తిరిగాడు. అప్పటికే నుదుటికి పట్టిన చెమటని రుమాలుతో రెండుసార్లు తుడుచు కున్నాడు వెల్డన్.
 ఆ సేల్స్‌మేన్ కౌంటర్ నించి వెల్డన్ ముందుకి వచ్చి నిలబడి చేతిని అడ్డుపెట్టి ఆపాడు. ‘‘మీరు మా కొత్త టైలు చూడకుండా మిమ్మల్ని వెళ్లనివ్వను. షర్ట్ కొన్నప్పుడే టైలని కొనాలి కదా సర్’’ అతను వెల్డన్ చేతిని పట్టుకుని టైల కౌంటర్ దగ్గరికి తీసు కెళ్లాడు.

వెల్డన్ అతని చేతిని సాధ్యమైనంత మృదువుగా విడిపించుకున్నాడు. సేల్స్‌మేన్ చేతిలో ఓ డజను టైలు ప్రత్యక్షం అయ్యాయి. ‘‘ఇది చూశారా? గ్రే. మీరు కొన్న షర్ట్‌కి సూట్ అవుతుంది. ఇది బ్లూ. ఇది రెండు షర్ట్‌లకి సూట్ అవు తుంది. డజను పెట్టె పాతిక డాలర్లు. ప్లస్ ట్యాక్స్ సర్. కాని కొత్త షర్ట్ వేసుకున్నప్పు డల్లా మీ పాత టైలలో ఏది మేచింగ్ అని వెదికే శ్రమ తప్పుతుంది. అవునా సర్?’’
 
‘‘అవును. ఇవీ తీసుకుంటాను.’’
 మళ్లీ ఇద్దరూ కౌంటర్ దగ్గరికి వెళ్లారు. బిల్ చెల్లించి రసీదు తీసుకున్నాడు. వెల్డన్ తలుపు వైపు నడుస్తుండగా సేల్స్‌మేన్ అరుపు వినిపించింది. ‘‘ఆగండి.’’
 తల తిప్పి చూశాడు. అతను తనని ఉద్దేశించే ఆ మాట అన్నాడని గ్రహించ గానే వణుకు పుట్టింది. అతను వెల్డన్ దగ్గరికి వచ్చి కుడి చేతి వేలుని హెచ్చరికగా ఊపాడు.
 ‘‘మీరు బయటికి వెళ్లడానికి వీల్లేదు. కాసేపు ఆగాలి.’’
 ‘‘దేనికి?’’ తడారిన గొంతుతో వినపడీ వినపడనట్లు వెల్డన్ ప్రశ్నించాడు.
 
‘‘బూట్లు సార్. మీరు బూట్లు కొన కుండా వెళ్లకూడదు. రండి.’’
 వెల్డన్ తన చెయ్యి అతని చేతికి అందకుండా వెనక దాచి అతని పక్కనే నడుస్తూ చెప్పాడు. ‘‘చూద్దాం పద.’’
 వెల్డన్ మొసలి చర్మం బూట్లని, ఇంట్లో వేసుకునే చెప్పులని, ఎన్నడూ టెన్నిస్ ఆడకపోయినా టెన్నిస్ షూస్‌ని కొన్నాడు. తను మెయిన్ డోర్‌కి మూడు కౌంటర్ల దూరంలో ఉన్నాడని వెల్డన్ గుర్తించాడు.

ఐతే ప్రతి కౌంటర్‌లో సేల్స్‌మేన్ వెల్డన్‌ని ఆపి సాక్స్, టై పిన్స్ కొనిపించాడు. తను లెదర్ వస్తువులు ఏమీ వాడనని, తను బుద్ధిజాన్ని తీసుకున్నానని, హింస జరిగితే కాని జంతువుల నించి తోలు రాదు కాబట్టి అవి తమకి నిషిద్ధం అని లామా చెప్పాడని అప్పటికప్పుడు అబద్ధాన్ని ఆడాడు.
 
‘‘ఇవాళ వేడిగా ఉంది’’... చెమటని తుడుచుకుంటూ చెప్పాడు. తన చేతి నించి ఆ వాచీల టిక్‌టిక్ బయటికి వినిపిస్తోందా అనే కొత్త భయం కలిగింది. సాక్స్‌కి, టై పిన్స్‌కి డబ్బు చెల్లించి మెయిన్ డోర్ దగ్గరికి చేరుకునేసరికి సేల్స్‌మేన్ కనిపించాడు - చేతిలో స్కార్ఫ్‌తో.
 ‘‘అన్నీ మీకు కొనుక్కున్నారు. మీ ఆవిడకి ఏమైనా కొనుక్కెళ్తే సంతోషిస్తుంది.’’
 ‘‘లేదు. లేదు. నేను తొందర పనిమీద ఉన్నాను, వెళ్లాలి’’ వెల్డన్ అభ్యంతరం చెప్పాడు.
 
సేల్స్‌మేన్ తలని విచారంగా అడ్డంగా ఊపాడు. ‘‘మీ విషయంలో ఇక నేను నిర్దయగా ఉంటాను.’’
 ‘‘ఏమిటి?’’ ఉలిక్కిపడ్డాడు.
 ‘‘ముర్రేస్ మెన్స్ స్టోర్ నుంచి కేవలం భార్యల కోసం ఉంచిన ఏకైక వస్తువైన సిల్క్ స్కార్ఫ్‌ని కొనుక్కెళ్లకుండా ఇంటికి వెళ్లడం నిర్దయ సార్. నా సలహా విని రెండు స్కార్ఫ్‌లని కొనండి.

ఒక్కోటీ పదిహేను డాలర్లే. రెండూ పాతిక డాలర్లు. ఐదు డాలర్లని ఆదా చేయొచ్చు.’’
 ‘‘లేదు’’... వెల్టన్ చేతిలోని ప్యాకెట్లు కింద పడ్డాయి. ఒంగి తీసుకోబోతూంటే సేల్స్‌మేన్ అతని కుడి చేతిని పట్టుకుని ఆపి చెప్పాడు.
 ‘‘నేనుండగానా సార్. నా మాట విని వీటిని తీసుకుని పాతిక డాలర్లు ఇవ్వండి. మీకు టైం ఉంది సార్’’ ఆఖరి వాక్యాన్ని నెమ్మదిగా, హెచ్చరిస్తున్న కంఠంతో చెప్పాడు.
 ‘‘ఏ... ఏమిటి?’’
 
‘‘టైం సార్. మీ దగ్గర చేతి గడియారం ఉందా సార్?’’
 ‘‘గడియారమా? లేదు. నా దగ్గర గడియారం లేదు. అది చాలా చక్కటి స్కార్ఫ్. రెండూ బావున్నాయి. ఇంద పాతిక.’’
 ‘‘ఆఖరి కొనుగోలు సార్ ఇది. చేతి రుమాళ్లు. మగవాళ్లవే. డజను పది డాలర్లే.’’
 వాటినీ కొని వెల్డన్ షాప్‌లోంచి బయటికి వస్తుండగా సేల్స్‌మేన్ చెప్పాడు.
 
‘‘సర్. మిమ్మల్ని టైం ఎందుకు అడిగానో తెలుసా? క్లోజింగ్ టైమ్‌లో ఏ సేల్స్‌మేన్ ఆఖరి అమ్మకాన్ని చేస్తాడో అతనికి ఐదు వందల డాలర్ల బోనస్‌ని ఇస్తూంటారు.’’
 అకస్మాత్తుగా ఓ చెయ్యి తన కుడి చేతిని పట్టుకోవడం, షర్ట్ స్లీవ్‌ని పైకి ఎత్తి ఆ వాచీలని చూడటం, వెంటనే తన రెండు చేతులకీ బేడీలు పడటం వెల్డన్‌కి అర్థం అయ్యే లోపలే జరిగి పోయాయి. ఆ సేల్స్‌మేన్ బాధగా నవ్వుతూ కనిపించాడు.
 ‘‘సారీ సార్. మీ అంత మంచి కస్టమర్ని అరెస్ట్ చేయడాన్ని చూడటం నాకు బాధగా ఉంది’’ చెప్పాడు.
 (చార్లెస్ మేకిన్‌తోష్ కథకి స్వేచ్ఛానువాదం)

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement