బాలీవుడ్ హీరో షారూక్ ఖాన్ చేతికి ఒకసారి సుమారు 4.75 కోట్ల విలువ చేసే నీలంరంగు ఆడెమర్స్ పిగ్యూట్ వాచ్‌తో మెరిపించాడు. కోట్ల నుంచి ఐదు లక్షల విలువ చేసే టగ్ హెయర్ వరకు ఏడెనిమిది వాచ్‌లతో కనిపిస్తాడు ఎస్‌ఆర్‌కే. టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ అయితే నాలుగు కోట్ల విలువైన రిచర్డ్ మిల్లె ఎఫ్ 1లో టైమ్ చూసుకుంటాడు. రామ్‌చరణ్ దగ్గర మూడు కోట్ల విలువ చేసే రిచర్డ్ మిల్లె నుంచి ఆరు లక్షల విలువ చేసే రోలెక్స్ యాచ్ మాస్టర్ వరకు అరడజనుకు పైగా వాచ్‌లున్నట్లు సమాచారం. ఇక నటీమణుల విషయానికి వస్తే నయనతార కోటికి పైగా ధర పలికే రిచర్డ్ మిల్లె ఆర్ ఎమ్ 11 వాచ్‌తో కాలాన్ని వాచ్ చేస్తుంది.
స్మార్ట్ ఫోన్ వచ్చినా రిస్ట్ వాచ్‌లకు ‘కాలం’ చెల్లలేదు. నిజమే, సెల్ ఫోన్ వచ్చిన తర్వాత రిస్ట్ వాచ్‌లకు కాలం చెల్లిందనిపించింది. ఓ దశాబ్దం పాటు వాచీల మార్కెట్ డీలా పడిన మాట కూడా నిజమే. అయితే ఆ రోజుల్లో కూడా సెలబ్రిటీలు, సంపన్నులు, తరచూ విదేశీ టూర్‌లు చేసే వాళ్లు లక్షల ఖరీదు చేసి వాచ్‌లు పెట్టుకోవడం మాత్రం కొనసాగింది. మన సినీ సెలబ్రిటీలైతే రిచర్డ్ మిల్లె, టగ్ హెయర్, హబ్లాట్, ఫ్రాంక్ ముల్లర్, ఆడెమర్స్ పిగ్యూట్, రాడో, పటేక్ ఫిలిప్పె, ఓమెగా, రోలెక్స్ నుంచి ఐడబ్ల్యూసీ వరకు ఐదు కోట్ల విలువ చేసే వాచ్‌ల నుంచి ఐదు లక్షల రూ΄ాయల వాచ్‌లు వాడుతున్నారు. ఈ ట్రెండ్ సెలబ్రిటీల దగ్గరే ఆగి΄ోకుండా గడచిన రెండేళ్లుగా కామన్ మ్యాన్ వరకు విస్తరించింది. ఎగువ మధ్యతరగతి, మధ్య తరగతి కూడా యాభై వేల నుంచి లక్షల రూ΄ాయల రిస్ట్ వాచ్‌లు కొనుగోలు చేస్తోంది. ప్రపంచ గడియారాల తయారీ కేంద్రం స్విట్జర్లాండ్ నుంచి మనదేశానికి దిగుమతి అవుతోన్న వాచ్‌ల సంఖ్య ఏడాదకేడాదికీ పెరుగుతోంది. 2026 నాటికి స్విస్ నుంచి వాచ్‌లు దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో భారత్ టాప్‌టెన్‌లో ఉంటుందని చెబుతున్నారు ఆ దేశ మార్కెట్ నిపుణులు.
ఉంగరంలా
మనదేశంలో 40 ఏళ్లుగా వేళ్లూనుకుని ఉన్న టైటాన్‌తో΄ాటు దాదాపు 30 కంపెనీలున్నాయి. వీటి మార్కెట్ వీటికి ఉంది. మనదేశీయ కంపెనీలు వందల నుంచి లక్షల విలువ చేసే గోల్డ్ వాచ్‌లు కూడా తయారు చేస్తున్నాయి. రెండు దశాబ్దాల కిందట సంపన్న మహిళలు బంగారు వాచ్ ధరించి మురిసి΄ోయేవాళ్లు. ఇప్పుడు రోలెక్స్, రాడో కపుల్ వాచ్‌లు, రోజ్‌గోల్డ్ మీద మనసు పడుతున్నారు. యూఎస్‌కి చెందిన ఫాజిల్ కంపెనీ మహిళల కోసం తయారు చేస్తున్న రోజ్ గోల్డ్ ఫినిషింగ్ వాచ్‌ల మీద మనసు పారేసుకుంటున్నారు. ఇందుకు కారణం ఇండియా నుంచి యూఎస్‌కి మైగ్రేషన్ ఎక్కువ కావడమే. యూఎస్‌లో సెటిలైన యువత వాళ్ల తల్లులకు ఈ వాచ్‌లను బహుమతిగా ఇస్తున్నారు. దాంతో వేడుకల్లో మహిళల మణికట్టుకు రోజ్‌గోల్డ్ వాచ్ మెరుస్తోంది. మొత్తానికి మనదేశంలో వాచ్‌ల ప్రేమికులు ఒక్కొక్కరు ఒకటి కంటే ఎక్కువ వాచ్‌లు కొంటున్నారు. యువతులు మాత్రం వాచ్ అంటే మణికట్టుకే ఎందుకు పెట్టుకోవాలంటూ వేలికి ఉంగరంలా ధరించే వాచ్‌లకు మొగ్గుచూపుతున్నారు.
– వి.ఎమ్.ఆర్.
Comments
Please login to add a commentAdd a comment