మేడపైనే కూరగాయల మడి! | Food Forest | Sakshi
Sakshi News home page

మేడపైనే కూరగాయల మడి!

Published Sat, Nov 5 2016 11:37 PM | Last Updated on Thu, Oct 4 2018 5:08 PM

మేడపైనే కూరగాయల మడి! - Sakshi

మేడపైనే కూరగాయల మడి!

విష రసాయనాల అవశేషాలతో కూడిన కూరగాయలు, ఆకుకూరలను మార్కెట్‌లో కొనుక్కొని తినడం కన్నా... ఉన్నంతలో తమకు తామే పండించుకోవడమే మిన్న అనే చైతన్యం పట్టణ ప్రాంత వినియోగదారుల్లో క్రమంగా పరివ్యాప్తమవుతోంది. నగరాల్లో, పట్టణాల్లో స్థిర నివాసం ఏర్పాటుచేసుకున్న గృహయజమానులు ఇంటి దగ్గరే పండించుకోవడానికి తమకు తగిన ప్రత్యామ్నాయాలు వెతుకుతున్నారు. ఈ దిశగా అక్కడక్కడా కొందరు ఇప్పటికే ముందడుగు వేశారు. ఇంటి చుట్టూ పెద్దగా స్థలం లేని పరిస్థితి ఉన్నా... ఇంటిపైనే ప్రత్యేక మడులు ఏర్పాటు చేసుకొని కూరగాయలు, ఆకుకూరలు ఎంచక్కా పెంచుతున్నారు.
 
 తమ కుటుంబ ఆరోగ్యం కోసం రసాయనాలు వాడకుండా సహజ సేద్యం చేస్తున్నారు. అంటే.. ఇళ్లమయం అయిపోయిన నగరాలు, పట్టణాల్లోనూ పక్కా ఇళ్ల పైనే వ్యవసాయ క్షేత్రాలు కొలువుదీరడం ప్రారంభమైందన్న మాట. ఇలా ఇంటిపైనే కూరగాయల మడిని నగరాలు, పట్టణాల్లో నివాసం ఉండే వారే కాదు.. పల్లెల్లో పక్కా భవనాల్లో ఉండే వాళ్లూ ఏర్పాటుచేసుకోవచ్చు. పొలంలో పంటలు పండించే వాళ్లయినా.. అవి ఏడాది పొడుగునా అందుబాటులో ఉండవు కాబట్టి... ఇంటి పట్టున కూడా ఆకుకూరలు, కూరగాయలు పండించుకోవచ్చు కదండీ..!
 మేడపై మడుల్లో సమృద్ధిగా ఆకుకూరలు,
 
 కూరగాయలు..
 నగరాలు, పట్టణ ప్రాంతవాసుల్లో ఆరోగ్య స్పృహ విస్తృతమవుతున్నకొద్దీ రోజువారీ ఆహారంలో కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల వాడకం పెరుగుతోంది. అన్నం తక్కువగా.. కూరగాయలు ఎక్కువగా వాడాలన్న చైతన్యం పెరుగుతోంది. ఎక్కడో దూరాన ఎటువంటి నీటితో, ఎటువంటి విష రసాయనాలు విచ్చలవిడిగా వాడి పండిస్తున్నారో తెలియని కూరగాయలు, ఆకుకూరలు తినడం కన్నా... మొదట్లో కొంచెం శ్రమ అనిపించినా.. ఇంటిపైన ఉన్న ఖాళీని పొలంగా మార్చుకునే సులువైన మార్గాలను అన్వేషిస్తున్నారు. బియ్యం తదితర ఆహార ధాన్యాలైతే నగరాల్లో నమ్మకమైన సేంద్రియ దుకాణంలో కొంచెం ఖరీదైనా కొనుక్కోవడానికి అవకాశం ఉంది.
 
 లేదంటే.. గ్రామాల నుంచి నెలకోసారో, రెండు నెలలకోసారో తెప్పించుకోవచ్చు. అయితే.. విష రసాయనాలు వాడకుండా సహజంగా పండించిన కూరగాయలు, ఆకుకూరలు ఎక్కడో, ఎప్పుడో గాని దొరకని పరిస్థితి ప్రస్తుతం నెలకొని ఉంది. దీన్ని అధిగమించడానికి ఎవరికి వాళ్లు ఇళ్లపైనే ప్రత్యేకంగా మడులు ఏర్పాటు చేసుకోవడమే ఉత్తమమన్న భావం నగరవాసుల్లో అంతకంతకూ ప్రబలమవుతోంది. కుండీల్లోనూ ఆకుకూరలు, కూరగాయలు పెంచుతున్నా.. టైపై ఖాళీని ఉపయోగించి కుటుంబానికి సరిపడా సమృద్ధిగా పండించుకోవచ్చన్న ఆలోచన మడుల ఏర్పాటుకు దారితీస్తోంది. కుటుంబం ఆరోగ్యం రక్షించుకోవడం కోసం.. కొంచెం శ్రమ అనిపించినా మేడపైనే కుండీలతోపాటు వీలైనన్ని మడులు ఏర్పాటుచేసుకుంటున్నారు.
 
 శ్లాబ్ లీకవుతుందేమో..!
 మేడపైన కూరగాయల మడి ఏర్పాటుచేసుకుంటే నీటి వల్ల శ్లాబ్ దెబ్బతింటుందేమోనన్న సందేహం ఉండొచ్చు. అయితే, అటువంటి సందేహం అక్కర్లేదని అంటున్నారు హైదరాబాద్‌లోని ఉప్పల్‌కు చెందిన మురళి. ఆయన తన ఇంటిపైన మడిలో ఆకుకూరలు ఏడాది క్రితం నుంచే పుష్కలంగా పెంచుతున్నారు. గత ఏడాది అత్యధికంగా వర్షాలు కురిసినా ఇబ్బందేమీ రాలేదన్నారు. ఇల్లు కట్టేటప్పుడే వర్షం నీరు ఇంకకుండా ఉండేందుకు తగిన జాగ్రత్త ఎవరైనా తీసుకుంటారు. అది చాలు. ప్రత్యేకించి ఏమీ చేయనక్కరలేదని మురళి అంటున్నారు.
 
 తమ ఇంటికి సాధారణంగా 6 అంగుళాల మందానే శ్లాబ్ వేశామన్నారు. కూరగాయల మడిపై నీరు కూడా తగుమాత్రంగానే చల్లుతుంటాం కాబట్టి దీని గురించి అంతగా వర్రీ అవనక్కరలేదు. మడి అడుగున కొంచెం మందపాటి పాలిథిన్ షీట్ పరిస్తే ఇక అసలు ఏ ఇబ్బందీ రాదు. అయితే... ఇక్కడ ఒక విషయం గమనించాలి. బాగా పాతపడిన ఇళ్లు, చాలా ఏళ్ల క్రితం పిల్లర్లు వేయకుండా శ్లాబ్ వేసిన ఇళ్లపై మడి ఏర్పాటుచేసుకునేటప్పుడు ఇంజనీర్ సలహా తీసుకోవడం ఉత్తమం. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ప్రగతి రిసార్ట్స్ అధినేత డాక్టర్ జీబీకే రావు తన ఇంటిపైన అనేక మడుల్లో కూరగాయలు, ఆకుకూరలు నాలుగేళ్లుగా పెంచుతున్నారు. మడి అడుగున పాలిథిన్ షీట్ వేశారు. మొక్కలకు అవసరం మేరకు కొద్ది లీటర్ల నీటిని టిన్నుతో చల్లుతున్నారు.
 
 అంటే.. నీటి లభ్యత తక్కువగా ఉన్న వారు సైతం... నిక్షేపంగా ఇంటిపైన కూరగాయల మడిని ఏర్పాటు చేసుకోవచ్చన్నమాట! వట్టి మట్టి వాడినప్పటికన్నా ప్రత్యేకంగా సిద్ధం చేసుకున్న మట్టి, కంపోస్టు, కొబ్బరి పొట్టు మిశ్రమం వాడితే... బరువుకు బరువూ తగ్గుతుంది.. పోషకాలు పుష్కలంగా అందుతాయి కాబట్టి దిగుబడికి దిగుబడీ బాగా వస్తుంది.
 
 ఎండాకాలం గ్రీన్ షేడ్‌నెట్‌తో రక్షణ
 మేడ మీద కూరగాయల మడి అనగానే ఎండాకాలం వస్తుంటే ఇప్పుడెలా? అనుకునేరు. ఆకుకూరలు 30,40 రోజుల్లో వచ్చేస్తాయి. టమాటో, వంగ మొక్కలు నాటినా.. మరీ ఎండలు ముదురుతున్నప్పుడు గ్రీన్ షేడ్‌నెట్ ఏర్పాటు చేసుకుంటే సరి! 35 డిగ్రీల సెల్షియస్ వరకూ కూరగాయలకు, ఆకుకూరలకు (క్యాబేజీ, క్యారట్, బీట్‌రూట్ వంటి కొన్ని నీడను కోరుకునే మొక్కలకు తప్ప) ఇబ్బంది ఉండదు. షేడ్ కింద కనీసం పది డిగ్రీల ఎండ తక్కువగా ఉంటుంది. కాబట్టి గ్రీన్ షేడ్ ఏర్పాటు చేసుకుంటే ఎండాకాలం ముదిరినా ఏ పంటలైనా నిక్షేపంగా పండించుకోవచ్చు. వేసవి సెలవులకు వెళ్లేటప్పుడు మడిని ఎవరో ఒకరికి అప్పగించ వెళ్లవచ్చు. లేదా అప్పటికల్లా పూర్తయ్యే ఆకుకూరలు, కొత్తిమీర, పుదీనా.. మడిలో వేసుకోవచ్చు. తిరిగి వచ్చాక మళ్లీ ప్రారంభించవచ్చు. ఏమంటారు...?   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement