Crop Home
-
మేడపైనే కూరగాయల మడి!
విష రసాయనాల అవశేషాలతో కూడిన కూరగాయలు, ఆకుకూరలను మార్కెట్లో కొనుక్కొని తినడం కన్నా... ఉన్నంతలో తమకు తామే పండించుకోవడమే మిన్న అనే చైతన్యం పట్టణ ప్రాంత వినియోగదారుల్లో క్రమంగా పరివ్యాప్తమవుతోంది. నగరాల్లో, పట్టణాల్లో స్థిర నివాసం ఏర్పాటుచేసుకున్న గృహయజమానులు ఇంటి దగ్గరే పండించుకోవడానికి తమకు తగిన ప్రత్యామ్నాయాలు వెతుకుతున్నారు. ఈ దిశగా అక్కడక్కడా కొందరు ఇప్పటికే ముందడుగు వేశారు. ఇంటి చుట్టూ పెద్దగా స్థలం లేని పరిస్థితి ఉన్నా... ఇంటిపైనే ప్రత్యేక మడులు ఏర్పాటు చేసుకొని కూరగాయలు, ఆకుకూరలు ఎంచక్కా పెంచుతున్నారు. తమ కుటుంబ ఆరోగ్యం కోసం రసాయనాలు వాడకుండా సహజ సేద్యం చేస్తున్నారు. అంటే.. ఇళ్లమయం అయిపోయిన నగరాలు, పట్టణాల్లోనూ పక్కా ఇళ్ల పైనే వ్యవసాయ క్షేత్రాలు కొలువుదీరడం ప్రారంభమైందన్న మాట. ఇలా ఇంటిపైనే కూరగాయల మడిని నగరాలు, పట్టణాల్లో నివాసం ఉండే వారే కాదు.. పల్లెల్లో పక్కా భవనాల్లో ఉండే వాళ్లూ ఏర్పాటుచేసుకోవచ్చు. పొలంలో పంటలు పండించే వాళ్లయినా.. అవి ఏడాది పొడుగునా అందుబాటులో ఉండవు కాబట్టి... ఇంటి పట్టున కూడా ఆకుకూరలు, కూరగాయలు పండించుకోవచ్చు కదండీ..! మేడపై మడుల్లో సమృద్ధిగా ఆకుకూరలు, కూరగాయలు.. నగరాలు, పట్టణ ప్రాంతవాసుల్లో ఆరోగ్య స్పృహ విస్తృతమవుతున్నకొద్దీ రోజువారీ ఆహారంలో కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల వాడకం పెరుగుతోంది. అన్నం తక్కువగా.. కూరగాయలు ఎక్కువగా వాడాలన్న చైతన్యం పెరుగుతోంది. ఎక్కడో దూరాన ఎటువంటి నీటితో, ఎటువంటి విష రసాయనాలు విచ్చలవిడిగా వాడి పండిస్తున్నారో తెలియని కూరగాయలు, ఆకుకూరలు తినడం కన్నా... మొదట్లో కొంచెం శ్రమ అనిపించినా.. ఇంటిపైన ఉన్న ఖాళీని పొలంగా మార్చుకునే సులువైన మార్గాలను అన్వేషిస్తున్నారు. బియ్యం తదితర ఆహార ధాన్యాలైతే నగరాల్లో నమ్మకమైన సేంద్రియ దుకాణంలో కొంచెం ఖరీదైనా కొనుక్కోవడానికి అవకాశం ఉంది. లేదంటే.. గ్రామాల నుంచి నెలకోసారో, రెండు నెలలకోసారో తెప్పించుకోవచ్చు. అయితే.. విష రసాయనాలు వాడకుండా సహజంగా పండించిన కూరగాయలు, ఆకుకూరలు ఎక్కడో, ఎప్పుడో గాని దొరకని పరిస్థితి ప్రస్తుతం నెలకొని ఉంది. దీన్ని అధిగమించడానికి ఎవరికి వాళ్లు ఇళ్లపైనే ప్రత్యేకంగా మడులు ఏర్పాటు చేసుకోవడమే ఉత్తమమన్న భావం నగరవాసుల్లో అంతకంతకూ ప్రబలమవుతోంది. కుండీల్లోనూ ఆకుకూరలు, కూరగాయలు పెంచుతున్నా.. టైపై ఖాళీని ఉపయోగించి కుటుంబానికి సరిపడా సమృద్ధిగా పండించుకోవచ్చన్న ఆలోచన మడుల ఏర్పాటుకు దారితీస్తోంది. కుటుంబం ఆరోగ్యం రక్షించుకోవడం కోసం.. కొంచెం శ్రమ అనిపించినా మేడపైనే కుండీలతోపాటు వీలైనన్ని మడులు ఏర్పాటుచేసుకుంటున్నారు. శ్లాబ్ లీకవుతుందేమో..! మేడపైన కూరగాయల మడి ఏర్పాటుచేసుకుంటే నీటి వల్ల శ్లాబ్ దెబ్బతింటుందేమోనన్న సందేహం ఉండొచ్చు. అయితే, అటువంటి సందేహం అక్కర్లేదని అంటున్నారు హైదరాబాద్‌లోని ఉప్పల్‌కు చెందిన మురళి. ఆయన తన ఇంటిపైన మడిలో ఆకుకూరలు ఏడాది క్రితం నుంచే పుష్కలంగా పెంచుతున్నారు. గత ఏడాది అత్యధికంగా వర్షాలు కురిసినా ఇబ్బందేమీ రాలేదన్నారు. ఇల్లు కట్టేటప్పుడే వర్షం నీరు ఇంకకుండా ఉండేందుకు తగిన జాగ్రత్త ఎవరైనా తీసుకుంటారు. అది చాలు. ప్రత్యేకించి ఏమీ చేయనక్కరలేదని మురళి అంటున్నారు. తమ ఇంటికి సాధారణంగా 6 అంగుళాల మందానే శ్లాబ్ వేశామన్నారు. కూరగాయల మడిపై నీరు కూడా తగుమాత్రంగానే చల్లుతుంటాం కాబట్టి దీని గురించి అంతగా వర్రీ అవనక్కరలేదు. మడి అడుగున కొంచెం మందపాటి పాలిథిన్ షీట్ పరిస్తే ఇక అసలు ఏ ఇబ్బందీ రాదు. అయితే... ఇక్కడ ఒక విషయం గమనించాలి. బాగా పాతపడిన ఇళ్లు, చాలా ఏళ్ల క్రితం పిల్లర్లు వేయకుండా శ్లాబ్ వేసిన ఇళ్లపై మడి ఏర్పాటుచేసుకునేటప్పుడు ఇంజనీర్ సలహా తీసుకోవడం ఉత్తమం. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ప్రగతి రిసార్ట్స్ అధినేత డాక్టర్ జీబీకే రావు తన ఇంటిపైన అనేక మడుల్లో కూరగాయలు, ఆకుకూరలు నాలుగేళ్లుగా పెంచుతున్నారు. మడి అడుగున పాలిథిన్ షీట్ వేశారు. మొక్కలకు అవసరం మేరకు కొద్ది లీటర్ల నీటిని టిన్నుతో చల్లుతున్నారు. అంటే.. నీటి లభ్యత తక్కువగా ఉన్న వారు సైతం... నిక్షేపంగా ఇంటిపైన కూరగాయల మడిని ఏర్పాటు చేసుకోవచ్చన్నమాట! వట్టి మట్టి వాడినప్పటికన్నా ప్రత్యేకంగా సిద్ధం చేసుకున్న మట్టి, కంపోస్టు, కొబ్బరి పొట్టు మిశ్రమం వాడితే... బరువుకు బరువూ తగ్గుతుంది.. పోషకాలు పుష్కలంగా అందుతాయి కాబట్టి దిగుబడికి దిగుబడీ బాగా వస్తుంది. ఎండాకాలం గ్రీన్ షేడ్‌నెట్‌తో రక్షణ మేడ మీద కూరగాయల మడి అనగానే ఎండాకాలం వస్తుంటే ఇప్పుడెలా? అనుకునేరు. ఆకుకూరలు 30,40 రోజుల్లో వచ్చేస్తాయి. టమాటో, వంగ మొక్కలు నాటినా.. మరీ ఎండలు ముదురుతున్నప్పుడు గ్రీన్ షేడ్‌నెట్ ఏర్పాటు చేసుకుంటే సరి! 35 డిగ్రీల సెల్షియస్ వరకూ కూరగాయలకు, ఆకుకూరలకు (క్యాబేజీ, క్యారట్, బీట్రూట్ వంటి కొన్ని నీడను కోరుకునే మొక్కలకు తప్ప) ఇబ్బంది ఉండదు. షేడ్ కింద కనీసం పది డిగ్రీల ఎండ తక్కువగా ఉంటుంది. కాబట్టి గ్రీన్ షేడ్ ఏర్పాటు చేసుకుంటే ఎండాకాలం ముదిరినా ఏ పంటలైనా నిక్షేపంగా పండించుకోవచ్చు. వేసవి సెలవులకు వెళ్లేటప్పుడు మడిని ఎవరో ఒకరికి అప్పగించ వెళ్లవచ్చు. లేదా అప్పటికల్లా పూర్తయ్యే ఆకుకూరలు, కొత్తిమీర, పుదీనా.. మడిలో వేసుకోవచ్చు. తిరిగి వచ్చాక మళ్లీ ప్రారంభించవచ్చు. ఏమంటారు...? -
వంటింటి వ్యర్థాలతో కంపోస్టు ఇలా...
ఈ ప్రశ్న ‘ఇంటి పంట’కు ఉపక్రమించిన వారిని ఇబ్బందిపెడుతోంది. సమస్య ఎక్కడ ఉందో పరిష్కారం కూడా అక్కడే ఉంటుంది! కంపోస్టును ఎక్కడికో వెళ్లి ప్రతిసారీ కొనుక్కోవడం ఎందుకు? మనమే.. మన ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు!! ఎలా అంటారా..? వెరీ సింపుల్! వంటింట్లో చెత్తబుట్టలోకి చేరుతున్న వ్యర్థ పదార్థాలతోనే.. ‘నల్ల బంగారం’ తయారుచేసుకోవచ్చు!! కూరగాయ తొక్కలు, పండ్ల తొక్కలు, ఆకుకూర వ్యర్థాలు... అంతెందుకు మిగిలిపోయిన అన్నం, కూరలు... ఇంకా చెప్పాలంటే కుళ్లే స్వభావం ఉన్న ఏదైనా... కంపోస్టు తయారీకి వాడొచ్చు. రోజూ వంటింటి వ్యర్థాలను ఇంటి బయట ఒక మట్టి పాత్ర (కంపోస్టర్)లో వేస్తే 90 రోజుల్లో చక్కటి కంపోస్టు తయారవుతుంది. పర్యావరణానికీ ఎంతో మేలు! దీని వల్ల ‘ఇంటి పంట’కు ఇంటిపట్టునే చక్కటి సేంద్రియ ఎరువు తయారవ్వడమే కాదు.. మునిసిపాలిటీ వాళ్లకు తలనొప్పిగా, భారంగా మారిన చెత్త సమస్యకు మీ అంతట మీరే చక్కటి పరిష్కారం చూపుతున్నారన్నమాట. నలుగురూ ఈ విధంగా వంటింటి వ్యర్థాలను చెత్తబుట్టలో పడెయ్యకపోతే.. పర్యావరణానికీ ఎంతో మేలు జరుగుతుంది! నిజమేనండీ..!! మునిసిపాలిటీ వాళ్లు చెత్తనంతా ఊరుబయట డంపింగ్ యార్డుల్లో కుమ్మరిస్తున్నారు. ఈ యార్డులు దుర్గంధంతో ముక్కుపుటాలను అదరగొట్టడంతో పాటు పర్యావరణానికి హాని చేస్తున్నాయి! అంటే... వంటింటి వ్యర్థాలతో కంపోస్టు తయారుచేసే వారంతా పర్యావరణానికి మేలు చేస్తున్నట్లేనన్నమాట. దుర్గంధం రాదు..! అసలే ఇరుకు ఇళ్లు.. ఖాళీ స్థలాలుండే పల్లెల్లో చేయొచ్చు గానీ... ఇక్కడెక్కడ కంపోస్టు తయారుచేస్తాం? అన్న సందేహం మహానగరవాసులకూ అక్కర్లేదు. ఎందుకంటే.. పద్ధతి ప్రకారం కంపోస్టు చేస్తే.. వ్యర్థాలు మురిగే పరిస్థితి ఉండదు కాబట్టి.. దుర్వాసన రాదు. మట్టితో ప్రత్యేకంగా తయారుచేసిన పాత్ర (టైట కంపోస్టర్)ను వాడి సులువుగా కంపోస్టును తయారుచేసుకోవచ్చు. కంపోస్టర్‌ను ఉపయోగించేది ఇలా.. కంపోస్టర్ ద్వారా ఏరోబిక్ (ఆక్సిజన్ పుష్కలంగా సోకే) పద్ధతిలో కంపోస్టు తయారవుతుంది. నిలువుగా ఒకదానిపై మరొకటి.. మూడు కుండలు పేర్చినట్టు ఉంటుంది.. కంపోస్టర్. వంటింటి వ్యర్థాలు (ప్లాస్టిక్ వ్యర్థాలను వేరుచేసి పారేయాలి) మొదట పైన కుండలో వేస్తుండాలి. నలుగురు సభ్యులున్న కుటుంబంలో వంటింటి నుంచి రోజుకు ముప్పావు కిలో నుంచి కిలో వరకూ తడి చెత్త వస్తుందని అంచనా. ఆ చెత్తతో 20 రోజుల్లో పైకుండ నిండుతుంది. ఆ కుండను మధ్యలోకి మార్చి... మధ్యలో కుండను పైకి పెట్టాలి. అదీ నిండాక.... ఆ చెత్తను మధ్యలోని కుండలో పోయాలి. అదీ నిండాక అట్టడుగున ఉన్న కుండలోకి పోయాలి. ఇలా చేస్తే 3 నెలల్లో చక్కటి కంపోస్టు తయారవుతుంది. వ్యర్థ పదార్థాలతో... నాణ్యమైన సేంద్రియ ఎరువు తయారైందన్న మాట. కంపోస్టు చక్కటి మట్టి వాసన వస్తుంది. ఇంతకన్నా పుష్కలంగా పోషకాలన్నీ ఉన్న సహజ ఎరువు మరేమీ ఉండదు! తడి చెత్త.. పొడి చెత్త కలిపి వేయాలి! వంటింటి వ్యర్థాలను టైట కంపోస్టర్లో వేయడానికి రోజుకు 5 నిముషాలకన్నా పట్టదు. తడి వ్యర్థాలను కంపోస్టర్లో వేసిన ప్రతిసారీ.. గుప్పెడు ఎండు ఆకులో లేదా రంపపు పొట్టో వేయాలి. ఇవి దొరక్కపోతే.. పాత న్యూస్ పేపర్‌ను సన్నటి పీలికలుగా చింపి కూడా వేయొచ్చు. తడి, పొడి వ్యర్థాలను వేసినప్పుడల్లా కలియతిప్పడం మరువరాదు. మామూలు కుండలతోనూ కంపోస్టర్! టైట కంపోస్టర్లు అందుబాటులో లేనిచోట మామూలు కుండలతోనే కంపోస్టర్‌ను తయారుచేసుకోవచ్చు. మూడు కుండలు తీసుకోండి... కార్పెంటర్ వద్ద డ్రిల్లింగ్ మిషన్‌తో మూడు కుండలకూ నాలుగు దిక్కులా (గాలి ఆడడం కోసం) నెమ్మదిగా చిన్నచిన్న బెజ్జాలు పెట్టించండి. పైన పెట్టే రెండు కుండలకు.. అడుగున కూడా ఒక బెజ్జం పెట్టించండి. వ్యర్థాలలో ఉండే తడి ఊట ఏదైనా ఉంటే కిందికి దిగడానికే ఈ బెజ్జం. అట్టడుగున పెట్టే కుండకు అడుగున బెజ్జం అక్కర్లేదు. అంతే.. కంపోస్టర్ సిద్ధం!! మరిన్ని వివరాల కోసం www.dailydump.org వెబ్ పేజీని చూడొచ్చు. -
ఫేస్బుక్ ఫ్రెండ్స్ & ఎన్వరాన్‌మెంటలిస్ట్
ఇంటిపంట సాగుదారులంతా ఫేస్బుక్లో ఫ్రెండ్స్. ఏయే పంటలు పండిస్తున్నారు? ఏం తింటున్నారు? ఏం వండుతున్నారు?.. ఇవన్నీ పోస్ట్స్, షేర్స్ చేసుకుంటూ ఉంటారు. తాజాగా బంజారాహిల్స్‌లోని లామకాన్‌లో మీట్ అయ్యారు. ముచ్చటపడి ఇంట్లో పండించే ఆకు, కాయగూరలను ఆహారంగా ఎలా తీసుకోవాలనే విషయమై వర్క్‌షాపు నిర్వహించుకున్నారు. దీనికి హాజరైన ఎన్వరాన్‌మెంటలిస్ట్ సీతా ఆనంద్ వారందరికీ చెప్పిన విషయాలు మనకీ ఉపయోగపడేవే.. - ఓ మధు మనం ఇంట్లో పండించుకునే ఆకుకూరలు వారం.. పదిహేను రోజులకు చేతికొచ్చేవై ఉంటే మంచిది. ఇక మనం మోజుపడి పెరటిలోనే పండించుకునే వాటిని ఎలా తింటున్నామన్నది ముఖ్యం. ఉదాహరణకు చిక్కుడు, వంకాయ వంటివి వండేటప్పుడు బాగా నూనె వేసి డీప్ ఫ్రై చేసేస్తుంటాం. అది ఆరోగ్యానికి మంచిది కాదు. ఏ కూరగాయలైనా, పప్పులైనా ఎంత పచ్చివి తినగలిగితే ఆరోగ్యానికి అంత మంచిది. శ్రీరామ నవమికి తినే వడపప్పు చక్కటి రా ఫుడ్ రెసిపీ. అలాంటివి రెగ్యులర్‌గా అన్ని పప్పులతో కలిపి కాంబినేషన్‌గా చేసుకోవచ్చు. పచ్చివి తింటేనే.. సలాడ్ చేసుకునేందుకు వీలైన కూరగాయలను కూడా ఇంట్లో పెంచవచ్చు. చాలా కూరగాయలను సలాడ్స్ చేసుకోవటం కుదరదని అనుకుంటాం. కానీ అది నిజం కాదు. బీరకాయ, సొరకాయ, బూడిద గుమ్మడి కాయలు వంటివి పచ్చివి తినటమే ఉత్తమం. నీటి పరిమాణం ఎక్కువగా ఉండే కూరగాయల్ని వేడి చేయకూడదు. అంటే వండకూడదు. ఆ నీటిలో చాలా పోషకాలుంటాయి. వండటం వలన నీరు పోయి పోషకాలు నశిస్తాయి. ఆ కూరగాయల్లో ఉండే రసాయనాలు మారిపోతాయి. అలా కాంపోజిషన్స్ మారిపోతే ఆరోగ్యానికే హాని. తీగకూరగాయలన్నిటినీ సలాడ్స్‌గా చేసుకుని తింటేనే మంచిది. టమోటా, బాదం లాంటివి ఆ సలాడ్స్‌లోకి చేరిస్తే మంచి రుచి వస్తుంది. గంగవాయిలీ, పాలకూరలు కూడా సలాడ్‌లో వేసుకోవచ్చు. తోటకూర తినటం కొంచెం కష్టం. దీంట్లో కీరదోస, టమోటా, పచ్చిమిర్చి, నువ్వులు, పచ్చి నూనె.. ఇలా కాంబినేషన్స్‌తో ట్రై చేస్తే టేస్టీగా మారుతుంది. గానుగ నూనె వాడాలి. ఆహార క్రమం.. మనం తీసుకునే ఆహారంలో మొదటి స్థానంలో ఫ్రూట్స్ ఉండాలి. ఆ తరువాత స్థానం ఆకు, కూరగాయలకు ఇవ్వాలి. పప్పులకు కూడా ప్రాధాన్యమివ్వాలి. సమ్మర్లో ఎక్కువగా సలాడ్స్, ఫ్రూట్స్ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. సీజనల్ ఫుడ్నుసమపాళ్లతో తీసుకోవాలి. సమ్మర్ స్పెషల్ స్మూదీ.. నచ్చిన ఆకుకూర ఒక కప్పు, అరటిపండు, బాదం లేదా కొబ్బరిపాలు మిక్సీలో వేసుకోవాలి. అరటిపండు... లేకపోతే ఖర్జూరాన్ని వేసుకోండి. జ్యూస్‌లా చేసుకోవాలి. దానిలో సబ్జా గింజలు వేస్తే.. సమ్మర్ స్పెషల్ స్మూదీ రెడీ. ఇందులో కావాలంటే కొంచెం కొబ్బరి కూడా కలపొచ్చు.