వంటింటి వ్యర్థాలతో కంపోస్టు ఇలా... | Black Gold | Sakshi
Sakshi News home page

వంటింటి వ్యర్థాలతో కంపోస్టు ఇలా...

Published Sat, Nov 5 2016 11:35 PM | Last Updated on Mon, Sep 4 2017 7:17 PM

వంటింటి వ్యర్థాలతో కంపోస్టు ఇలా...

వంటింటి వ్యర్థాలతో కంపోస్టు ఇలా...

 ఈ ప్రశ్న ‘ఇంటి పంట’కు ఉపక్రమించిన వారిని ఇబ్బందిపెడుతోంది. సమస్య ఎక్కడ ఉందో పరిష్కారం కూడా అక్కడే ఉంటుంది! కంపోస్టును ఎక్కడికో వెళ్లి ప్రతిసారీ కొనుక్కోవడం ఎందుకు? మనమే.. మన ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు!! ఎలా అంటారా..? వెరీ సింపుల్!  వంటింట్లో చెత్తబుట్టలోకి చేరుతున్న వ్యర్థ పదార్థాలతోనే.. ‘నల్ల బంగారం’ తయారుచేసుకోవచ్చు!! కూరగాయ తొక్కలు, పండ్ల తొక్కలు, ఆకుకూర వ్యర్థాలు... అంతెందుకు మిగిలిపోయిన అన్నం, కూరలు... ఇంకా చెప్పాలంటే కుళ్లే స్వభావం ఉన్న ఏదైనా... కంపోస్టు తయారీకి వాడొచ్చు. రోజూ వంటింటి వ్యర్థాలను ఇంటి బయట ఒక మట్టి పాత్ర (కంపోస్టర్)లో వేస్తే 90 రోజుల్లో చక్కటి కంపోస్టు తయారవుతుంది.
 
 పర్యావరణానికీ ఎంతో మేలు!
 దీని వల్ల ‘ఇంటి పంట’కు ఇంటిపట్టునే చక్కటి సేంద్రియ ఎరువు తయారవ్వడమే కాదు.. మునిసిపాలిటీ వాళ్లకు తలనొప్పిగా, భారంగా మారిన చెత్త సమస్యకు మీ అంతట మీరే చక్కటి పరిష్కారం చూపుతున్నారన్నమాట. నలుగురూ ఈ విధంగా వంటింటి వ్యర్థాలను చెత్తబుట్టలో పడెయ్యకపోతే.. పర్యావరణానికీ ఎంతో మేలు జరుగుతుంది! నిజమేనండీ..!! మునిసిపాలిటీ వాళ్లు చెత్తనంతా ఊరుబయట డంపింగ్ యార్డుల్లో కుమ్మరిస్తున్నారు. ఈ యార్డులు దుర్గంధంతో ముక్కుపుటాలను అదరగొట్టడంతో పాటు పర్యావరణానికి హాని చేస్తున్నాయి! అంటే... వంటింటి వ్యర్థాలతో కంపోస్టు తయారుచేసే వారంతా పర్యావరణానికి మేలు చేస్తున్నట్లేనన్నమాట.
 
 దుర్గంధం రాదు..!
 అసలే ఇరుకు ఇళ్లు.. ఖాళీ స్థలాలుండే పల్లెల్లో చేయొచ్చు గానీ... ఇక్కడెక్కడ కంపోస్టు తయారుచేస్తాం? అన్న సందేహం మహానగరవాసులకూ అక్కర్లేదు. ఎందుకంటే.. పద్ధతి ప్రకారం కంపోస్టు చేస్తే.. వ్యర్థాలు మురిగే పరిస్థితి ఉండదు కాబట్టి.. దుర్వాసన రాదు. మట్టితో ప్రత్యేకంగా తయారుచేసిన పాత్ర (టైట కంపోస్టర్)ను వాడి సులువుగా కంపోస్టును తయారుచేసుకోవచ్చు.
 
 కంపోస్టర్‌ను ఉపయోగించేది ఇలా..
 కంపోస్టర్ ద్వారా ఏరోబిక్ (ఆక్సిజన్ పుష్కలంగా సోకే) పద్ధతిలో కంపోస్టు తయారవుతుంది. నిలువుగా ఒకదానిపై మరొకటి.. మూడు కుండలు పేర్చినట్టు ఉంటుంది.. కంపోస్టర్. వంటింటి వ్యర్థాలు (ప్లాస్టిక్ వ్యర్థాలను వేరుచేసి పారేయాలి) మొదట పైన కుండలో వేస్తుండాలి. నలుగురు సభ్యులున్న కుటుంబంలో వంటింటి నుంచి రోజుకు ముప్పావు కిలో నుంచి కిలో వరకూ తడి చెత్త వస్తుందని అంచనా. ఆ చెత్తతో 20 రోజుల్లో పైకుండ నిండుతుంది. ఆ కుండను మధ్యలోకి మార్చి... మధ్యలో కుండను పైకి పెట్టాలి. అదీ నిండాక.... ఆ చెత్తను మధ్యలోని కుండలో పోయాలి. అదీ నిండాక అట్టడుగున ఉన్న కుండలోకి పోయాలి. ఇలా చేస్తే 3 నెలల్లో చక్కటి కంపోస్టు తయారవుతుంది. వ్యర్థ పదార్థాలతో... నాణ్యమైన సేంద్రియ ఎరువు తయారైందన్న మాట. కంపోస్టు చక్కటి మట్టి వాసన వస్తుంది. ఇంతకన్నా పుష్కలంగా పోషకాలన్నీ ఉన్న సహజ ఎరువు మరేమీ ఉండదు!
 
 తడి చెత్త.. పొడి చెత్త కలిపి వేయాలి!
 వంటింటి వ్యర్థాలను టైట కంపోస్టర్‌లో వేయడానికి రోజుకు 5 నిముషాలకన్నా పట్టదు. తడి వ్యర్థాలను కంపోస్టర్‌లో వేసిన ప్రతిసారీ.. గుప్పెడు ఎండు ఆకులో లేదా రంపపు పొట్టో వేయాలి. ఇవి దొరక్కపోతే.. పాత న్యూస్ పేపర్‌ను సన్నటి పీలికలుగా చింపి కూడా వేయొచ్చు. తడి, పొడి వ్యర్థాలను వేసినప్పుడల్లా కలియతిప్పడం మరువరాదు.
 
 మామూలు కుండలతోనూ కంపోస్టర్!
 టైట కంపోస్టర్లు అందుబాటులో లేనిచోట మామూలు కుండలతోనే కంపోస్టర్‌ను తయారుచేసుకోవచ్చు. మూడు కుండలు తీసుకోండి... కార్పెంటర్ వద్ద డ్రిల్లింగ్ మిషన్‌తో మూడు కుండలకూ నాలుగు దిక్కులా (గాలి ఆడడం కోసం) నెమ్మదిగా చిన్నచిన్న బెజ్జాలు పెట్టించండి. పైన పెట్టే రెండు కుండలకు.. అడుగున కూడా ఒక బెజ్జం పెట్టించండి. వ్యర్థాలలో ఉండే తడి ఊట ఏదైనా ఉంటే కిందికి దిగడానికే ఈ బెజ్జం. అట్టడుగున పెట్టే కుండకు అడుగున బెజ్జం అక్కర్లేదు. అంతే.. కంపోస్టర్ సిద్ధం!! మరిన్ని వివరాల కోసం www.dailydump.org వెబ్ పేజీని చూడొచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement