Black gold
-
కోనసీమలో ‘నల్ల బంగారం’
సాక్షి అమలాపురం: కోనసీమలో తయారయ్యే ‘కొబ్బరి చిప్ప బొగ్గు’ దేశంలోనే ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. ముఖ సౌందర్యానికి ఫేస్‌ప్యాక్‌గా, తాగునీటిని శుద్ధిచేసేందుకు వినియోగించడంతో పాటు పెట్రోలియం ఉత్పత్తులు, దేశ రక్షణకు చెందిన విడి భాగాలు, ఆటో మొబైల్ పరిశ్రమలలో కీలక విడిభాగాల తయారీలో ఈ బొగ్గు అత్యంత కీలక పాత్ర పోషిస్తోంది. తయారీదారుల ఇంట నల్ల బంగారమై మెరుస్తోంది. ఇటువంటి అత్యుత్తమమైన, నాణ్యమైన కొబ్బరి చిప్ప బొగ్గు తయారీకి కేరాఫ్ అడ్రస్‌గా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా నిలుస్తోంది. నదీతీరంలో బొగ్గు తయారీ.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని పి.గన్నవరం, అంబాజీపేట మండలాల్లో వైనతేయ నదీతీరంలో బొగ్గు తయారవుతోంది. ఇక్కడ నుంచి ఏడాదికి రూ. 2 కోట్ల విలువ చేసే 700 నుంచి 900 టన్నుల బొగ్గును ఉత్పత్తి చేస్తున్నారు. తమిళనాడు లోని కాంగాయం, పల్లడం, కోయింబత్తూరు, కర్ణాటకలోని బెంగళూరు, తెలంగాణలోని హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలకు, మన రాష్ట్రంలోని నెల్లూ రు, గూడూరు వంటి ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. ప్రయోజనాలెన్నో.. కొబ్బరి చిప్ప బొగ్గు ప్రయోజనాలు తెలిస్తే నిజంగా నల్ల బంగారమే అంటారు. సౌందర్య పోషణకు వాడే ఫేస్‌ప్యాక్‌లతోపాటు కాస్మోటిక్స్, సబ్బులలో వాడకం అధికం. ఆటోమొబైల్‌లో కీలకమైన స్పేర్ పార్టుల తయారీ, రక్షణ రంగంలో యుద్ధ పరికరా లు, గ్యాస్ మాస్కుల తయారీలో వినియోగిస్తారు. పెట్రోలియం, గ్యాస్ ఉత్పత్తిలో అధిక శాతం రికవరీకి ఇది దోహదపడుతుంది. నీటిలోని క్లోరిన్, పురుగు మందులు, మలినాలను, వైరస్, బ్యాక్టీరియాలను నివారిస్తుంది. దీనిలో అధిక ఉష్ణ విలువ ఉంటుంది. మండించడానికి సమర్థవంతమైన ఇంధన వనరు గా ఉపయోగపడుతుంది. చిప్ప బొగ్గుతో భూమిలో వేగంగా సేంద్రియ కర్భనం ఉత్పత్తి అవుతుంది. బాగా ఆరిన కొబ్బరి చిప్ప బొగ్గు అత్యధిక ధర కేజీ రూ.35 నుంచి రూ.38 వరకు ఉండగా, ఈ ఏడాది ఆశించిన ఎగుమతులు లేకపోవడంతో ధర తగ్గిపోయింది. ప్రస్తుతం కేజీ రూ.24 నుంచి రూ.26 కాగా, తడిసిన బొగ్గు ధర రూ.19 వరకు మాత్రమే ఉంది. దీనివల్ల నష్టపోతున్నామని, ఎగుమతులు లేక సరుకు పెద్ద ఎత్తున పేరుకుపోయిందని, అక్టోబర్ నుంచి మంచి ధర వస్తుందని తయారీదారులు ఆశలు పెట్టుకున్నారు. పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వ ప్రోత్సాహం వన్ డిస్ట్రిక్ట్.. వన్ ప్రొడెక్టులో భాగంగా కోనసీమ జిల్లాను కొబ్బరికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఇక్కడ చిప్ప బొగ్గు తయారీ పరిశ్రమలను ప్రోత్సహించాలని జిల్లా యంత్రాంగం భావిస్తోంది. కోకోనట్ బోర్డు, ఉద్యానశాఖ ఆధ్వర్యంలో రూ.25 లక్షల విలువైన యూనిట్‌కు 35 శాతం వరకు రాయి తీ అందించనుంది. అంతకన్నా పెద్ద ప్రాజెక్టు పెట్టుకుంటే రూ.పది లక్షల వరకు రాయితీ ఇవ్వనున్నా రు. జపాన్ ఇంటర్నేషనల్ కోపరేషన్ ఏజెన్సీ (జైకా) ఆధ్వర్యంలో రూ.3 కోట్లతో జిల్లాలో కోకోనట్ మిల్క్ యూనిట్‌తోపాటు కోకోనట్ చార్ కోల్ పరిశ్రమ ఏర్పాటుకు ఉద్యానశాఖ సన్నాహాలు చేస్తోంది. మన్నిక ఎక్కువ.. దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కేరళ, కర్ణాటక కన్నా ఇక్కడ ఉత్పత్తి అవుతున్న బొగ్గు నాణ్యమైంది. చిప్ప దళసరి కావడంతోపాటు దీనిలో అధిక శాతం గ్యాస్ నిక్షిప్తమైనందున ఇది వేగంగా మండుతోంది. మిగిలిన రాష్ట్రాలలో ఆరు బయట బొగ్గు తయారీ ఎక్కువ. కోనసీమలో బొగ్గు తయారీ డ్రమ్ములలో చేస్తారు. దీనివల్ల బూడిద శాతం తక్కువగా ఉంటోంది. ఇక్కడ తయారయ్యే బొగ్గు ఎక్కువ కాలం మన్నిక ఉండడంతోపాటు ధృడంగా ఉంటుంది. మార్కెట్ అవకాశాలు పెరగాలి మనం తయారు చేసే బొగ్గే అత్యంత నాణ్యమైంది. మార్కెటింగ్ అవకాశాలు పెద్దగా లేక అనుకున్న ధర రావడం లేదు. ఇతర ప్రాంతాల వారు ఇక్కడ నుంచి బొగ్గు తీసుకెళ్లి మరింత నాణ్యంగా తయారు చేసి కేజీ రూ.50 నుంచి రూ.70 చేసి అమ్మకాలు సాగిస్తున్నారు. మనకు మాత్రం ఆ ధర రావడం లేదు. మార్కెటింగ్ అవకాశాలు పెరిగితే మరింత ధర వచ్చే అవకాశముంది.– మట్టపర్తి రామకృష్ణ,ముంజువరం, పి.గన్నవరం మండలం అత్యంత ధృడమైంది ఇక్కడ తయారయ్యే కొబ్బరి చిప్పలో 80 నుంచి 90 శాతం మేర చిన్న చిన్న రంధ్రాలు ఉండడంతో ఎక్కువ కాలం మన్నిక ఉండడంతోపాటు ధృడంగా ఉంటోంది. ఆటోమొబైల్, రక్షణ పరికరాలు, పెట్రోలియం ఉత్పత్తుల తయారీలో అధికంగా వాడుతున్నారు. – ఎ.కిరిటీ, ఉద్యాన శాస్త్రవేత్త, డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన పరిశోధనా స్థానం, అంబాజీపేట -
పాత టైర్లు కావవి.. ఆ దేశంలో అవిప్పుడు ‘బంగారమే’?
Nigerian Ifedolapo Runsewe Success story: దేశాలకు అతీతంగా అన్ని చోట్ల బంగారానికి విలువ ఉంది. మన దగ్గర పత్తిని తెల్లబంగారమని, బొగ్గుని నల్ల బంగారమని అంటుంటాం. కానీ నైజీరియాలో వాడి పడేసిన పాత టైర్లు నల్ల బంగారంలా మారిపోయాయి. ఇప్పుడు వాటికి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. నైజీరియాకు చెందిన ఔత్సాహిక పారిశ్రామికవేత్త ఇఫిడేలాపో రాన్‌సేవే అనే మహిళా ప్రిటెన్ వేస్ట్‌మేనేజ్‌మెంట్ రీసైకిలింగ్ కంపెనీని స్థాపించింది. రెండేళ కిందట కేవలం ఇద్దరు వ్యక్తులతో చిన్న షెడ్డులో ఈ కంపెనీ మొదలైంది. రోడ్ల పక్కన, చెత్త కుప్పల్లో, డ్రైనేజీ కాలువల్లో పడి ఉన్న పాత టైర్లను సేకరించేవారు. వాటిని తమ రీసైకిలింగ్ ప్లాంట్‌కి తీసుకువచ్చి ప్రత్యేక పద్దతిలో కరిగించి పేవ్మెంట్ బ్రిక్స్‌గా తయారు చేశారు. రీసైకిలింగ్ పద్దతిలో తయారు చేసిన పేవ్మెంట్ బ్రిక్స్ క్వాలిటీ రోడ్లు, పార్కులు, పాఠశాల ఆవరణల్లో వీటికి వేసేందుకు అక్కడి ప్రజలు ఆసక్తి చూపించారు. అంతే దీంతో ఒక్కసారిగా ఆమె కంపెనీకి ఆర్డర్లు వెల్లువలా వచ్చి పడ్డాయి. పాత మెషినరీ స్థానంలో కొత్త మెషినరీ ఏర్పాటు చేసినా డిమాండ్‌కు తగ్గ స్థాయిలో బ్రిక్స్‌ను అందివ్వలేని పరిస్థితి నెలకొంది. దీంతో రెండేళ్లలోనే నలుగురితో ప్రారంభమైన కంపెనీ ఇప్పుడు 128 మందికి చేరుకుంది. పేవ్మెంట్ బిక్స్తో పాటు మరికొన్ని ఇతర ఉత్పత్తులు కూడా తయారు చేస్తోంది రాన్‌సేవే. ఈమె ఆధ్వర్యంలో నడుస్తున్న ప్లాంటుకు పాత టైర్లు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. ఒక్కో టైరుకు 0.20 డాలర్లు (సుమారు రూ.15) చెల్లిస్తున్నారు. దీంతో కరోనా ఉపాధి కరువైన వారంతా పాత టైర్ల వేటలో పడ్డారు. ఎక్కడ టైరు కనిపించినా వాటిని పోగేసి ఈ ప్లాంటుకు తెస్తున్నారు. దీంతో రన్సువే సక్సెస్‌పై రాయిటర్స్ ప్రత్యేక కథనం ప్రసారం చేసింది. పాత టైర్లు కావవి బ్లాక్‌గోల్డ్ అంటూ పేర్కొంది. In Nigeria, hundreds of thousands of tires which would otherwise be dumped across the country have emerged as a new ‘black gold.’ Entrepreneur Ifedolapo Runsewe is transforming old tires into paving bricks, tiles and other goods, creating an entire value chain around tires pic.twitter.com/raCRbFqTOV — Reuters Business (@ReutersBiz) November 15, 2021 -
‘పశ్చిమ’లో నల్ల బంగారం నిక్షేపాలు
చింతలపూడి ప్రాంతంలో అపారంగా ఉన్నట్లు గుర్తింపు భూగర్భంలో తక్కువ లోతులోనే కనుగొన్న వైనం చింతలపూడి: పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి దేశవ్యాప్త ఖ్యాతి గడించబోతోంది. ఈ ప్రాంతంలో అపారమైన బొగ్గు నిక్షేపాలు ఉన్నట్టు వెల్లడి కావడం తో ఆంధ్రా సింగరేణిగా వార్తల్లోకి ఎక్కుతోంది. కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో బొగ్గు నిక్షేపాల అన్వేషణ కోసం జియా లాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) ఆధ్వర్యంలో సౌత్ వెస్ట్ పినాకిల్, మహేశ్వరి సంస్థలు పెద్దఎత్తున డ్రిల్లింగ్ పనులు చేపట్టాయి. చింతలపూడి, శెట్టివారిగూడెం ప్రాంతాల్లో 50–70 మీటర్ల లోతులోనే అపారమైన బొగ్గు నిల్వలు ఉన్నట్టు గుర్తించారు. మహేశ్వరి కంపెనీ నిర్వహించిన సర్వే(డ్రిల్లింగ్)లో నామవరం ప్రాంతంలోని రిగ్గు నంబర్–1 వద్ద 70 మీటర్ల దిగువన, రెండో రిగ్గు వద్ద 67 మీటర్ల దిగువన, 3వ రిగ్గు వద్ద 51 మీటర్ల దిగువన బొగ్గు నిల్వలు ఉన్నట్టు తేలింది. మిగిలిన ప్రాంతాల్లో 115 మీటర్ల లోతునుంచి 280 మీటర్ల లోతున నాణ్యమైన బొగ్గు నిల్వలున్నట్టు కనుగొన్నారు. 6 నెలల్లో సర్వే పూర్తి సర్వే పూర్తి కావడానికి ఆర్నెల్లు పడుతుం దని జియాలజిస్ట్ ఎ.సతీష్ తెలిపారు. ప్రస్తుతం చింతలపూడి ప్రాంతంలో 120 పాయింట్లను గుర్తించి డ్రిల్లింగ్ చేస్తున్నా మన్నారు. ఈ ప్రాంతంలో సింగరేణి కన్నా నాణ్యమైన బొగ్గు ఉందన్నారు. సర్వే పూర్తయ్యాక కేంద్రానికి నివేదిక పంపాలని, నిక్షేపాల వెలికితీతకు అనుమతులు రావడానికి మాత్రం సమయం పడుతుందని చెప్పారు. 2 వేల మిలియన్ టన్నుల నిల్వలు కృష్ణా జిల్లా చాట్రాయి మండలం సోమవరం నుంచి మొదలుకొని పశ్చిమ గోదా వరి జిల్లా చింతలపూడి వరకు సుమారు 2 వేల మిలియన్ టన్నుల నల్ల బంగారం ఉన్నట్టు తాజా సర్వేలో వెల్లడైంది. భూమి ఉపరితలానికి 500 మీటర్ల లోపు చింతలపూడి ప్రధాన కేంద్రంగా 30 కిలోమీటర్ల పరిధిలో ఈ నిల్వలున్నట్లు సర్వే నివేదికలు వివరిస్తున్నాయి. మరిన్ని యంత్రాలు రప్పిస్తాం బొగ్గు అన్వేషణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. మరిన్ని అధునాతన యంత్రాలను రప్పించే పనిలో ఉన్నాం. – వీపీ యాదవ్, డీలర్, (జీఎస్ఐ) -
వంటింటి వ్యర్థాలతో కంపోస్టు ఇలా...
ఈ ప్రశ్న ‘ఇంటి పంట’కు ఉపక్రమించిన వారిని ఇబ్బందిపెడుతోంది. సమస్య ఎక్కడ ఉందో పరిష్కారం కూడా అక్కడే ఉంటుంది! కంపోస్టును ఎక్కడికో వెళ్లి ప్రతిసారీ కొనుక్కోవడం ఎందుకు? మనమే.. మన ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు!! ఎలా అంటారా..? వెరీ సింపుల్! వంటింట్లో చెత్తబుట్టలోకి చేరుతున్న వ్యర్థ పదార్థాలతోనే.. ‘నల్ల బంగారం’ తయారుచేసుకోవచ్చు!! కూరగాయ తొక్కలు, పండ్ల తొక్కలు, ఆకుకూర వ్యర్థాలు... అంతెందుకు మిగిలిపోయిన అన్నం, కూరలు... ఇంకా చెప్పాలంటే కుళ్లే స్వభావం ఉన్న ఏదైనా... కంపోస్టు తయారీకి వాడొచ్చు. రోజూ వంటింటి వ్యర్థాలను ఇంటి బయట ఒక మట్టి పాత్ర (కంపోస్టర్)లో వేస్తే 90 రోజుల్లో చక్కటి కంపోస్టు తయారవుతుంది. పర్యావరణానికీ ఎంతో మేలు! దీని వల్ల ‘ఇంటి పంట’కు ఇంటిపట్టునే చక్కటి సేంద్రియ ఎరువు తయారవ్వడమే కాదు.. మునిసిపాలిటీ వాళ్లకు తలనొప్పిగా, భారంగా మారిన చెత్త సమస్యకు మీ అంతట మీరే చక్కటి పరిష్కారం చూపుతున్నారన్నమాట. నలుగురూ ఈ విధంగా వంటింటి వ్యర్థాలను చెత్తబుట్టలో పడెయ్యకపోతే.. పర్యావరణానికీ ఎంతో మేలు జరుగుతుంది! నిజమేనండీ..!! మునిసిపాలిటీ వాళ్లు చెత్తనంతా ఊరుబయట డంపింగ్ యార్డుల్లో కుమ్మరిస్తున్నారు. ఈ యార్డులు దుర్గంధంతో ముక్కుపుటాలను అదరగొట్టడంతో పాటు పర్యావరణానికి హాని చేస్తున్నాయి! అంటే... వంటింటి వ్యర్థాలతో కంపోస్టు తయారుచేసే వారంతా పర్యావరణానికి మేలు చేస్తున్నట్లేనన్నమాట. దుర్గంధం రాదు..! అసలే ఇరుకు ఇళ్లు.. ఖాళీ స్థలాలుండే పల్లెల్లో చేయొచ్చు గానీ... ఇక్కడెక్కడ కంపోస్టు తయారుచేస్తాం? అన్న సందేహం మహానగరవాసులకూ అక్కర్లేదు. ఎందుకంటే.. పద్ధతి ప్రకారం కంపోస్టు చేస్తే.. వ్యర్థాలు మురిగే పరిస్థితి ఉండదు కాబట్టి.. దుర్వాసన రాదు. మట్టితో ప్రత్యేకంగా తయారుచేసిన పాత్ర (టైట కంపోస్టర్)ను వాడి సులువుగా కంపోస్టును తయారుచేసుకోవచ్చు. కంపోస్టర్‌ను ఉపయోగించేది ఇలా.. కంపోస్టర్ ద్వారా ఏరోబిక్ (ఆక్సిజన్ పుష్కలంగా సోకే) పద్ధతిలో కంపోస్టు తయారవుతుంది. నిలువుగా ఒకదానిపై మరొకటి.. మూడు కుండలు పేర్చినట్టు ఉంటుంది.. కంపోస్టర్. వంటింటి వ్యర్థాలు (ప్లాస్టిక్ వ్యర్థాలను వేరుచేసి పారేయాలి) మొదట పైన కుండలో వేస్తుండాలి. నలుగురు సభ్యులున్న కుటుంబంలో వంటింటి నుంచి రోజుకు ముప్పావు కిలో నుంచి కిలో వరకూ తడి చెత్త వస్తుందని అంచనా. ఆ చెత్తతో 20 రోజుల్లో పైకుండ నిండుతుంది. ఆ కుండను మధ్యలోకి మార్చి... మధ్యలో కుండను పైకి పెట్టాలి. అదీ నిండాక.... ఆ చెత్తను మధ్యలోని కుండలో పోయాలి. అదీ నిండాక అట్టడుగున ఉన్న కుండలోకి పోయాలి. ఇలా చేస్తే 3 నెలల్లో చక్కటి కంపోస్టు తయారవుతుంది. వ్యర్థ పదార్థాలతో... నాణ్యమైన సేంద్రియ ఎరువు తయారైందన్న మాట. కంపోస్టు చక్కటి మట్టి వాసన వస్తుంది. ఇంతకన్నా పుష్కలంగా పోషకాలన్నీ ఉన్న సహజ ఎరువు మరేమీ ఉండదు! తడి చెత్త.. పొడి చెత్త కలిపి వేయాలి! వంటింటి వ్యర్థాలను టైట కంపోస్టర్లో వేయడానికి రోజుకు 5 నిముషాలకన్నా పట్టదు. తడి వ్యర్థాలను కంపోస్టర్లో వేసిన ప్రతిసారీ.. గుప్పెడు ఎండు ఆకులో లేదా రంపపు పొట్టో వేయాలి. ఇవి దొరక్కపోతే.. పాత న్యూస్ పేపర్‌ను సన్నటి పీలికలుగా చింపి కూడా వేయొచ్చు. తడి, పొడి వ్యర్థాలను వేసినప్పుడల్లా కలియతిప్పడం మరువరాదు. మామూలు కుండలతోనూ కంపోస్టర్! టైట కంపోస్టర్లు అందుబాటులో లేనిచోట మామూలు కుండలతోనే కంపోస్టర్‌ను తయారుచేసుకోవచ్చు. మూడు కుండలు తీసుకోండి... కార్పెంటర్ వద్ద డ్రిల్లింగ్ మిషన్‌తో మూడు కుండలకూ నాలుగు దిక్కులా (గాలి ఆడడం కోసం) నెమ్మదిగా చిన్నచిన్న బెజ్జాలు పెట్టించండి. పైన పెట్టే రెండు కుండలకు.. అడుగున కూడా ఒక బెజ్జం పెట్టించండి. వ్యర్థాలలో ఉండే తడి ఊట ఏదైనా ఉంటే కిందికి దిగడానికే ఈ బెజ్జం. అట్టడుగున పెట్టే కుండకు అడుగున బెజ్జం అక్కర్లేదు. అంతే.. కంపోస్టర్ సిద్ధం!! మరిన్ని వివరాల కోసం www.dailydump.org వెబ్ పేజీని చూడొచ్చు. -
ఇంటి దొంగలపై సింగరేణి విజిలెన్స్ విచారణ
► ఒకరి సస్పెన్షన్... రికార్డులు స్వాధీనం ► పక్కదారిపడుతున్న నల్ల బంగారం గోదావరిఖని(కరీంనగర్) : సింగరేణి బొగ్గు పక్కదారి పడుతున్న సంఘటన ఇటీవల వెలుగు చూసింది. దీంతో రంగంలోకి దిగిన విజిలెన్స్ విభాగం ఇంటి దొంగలపై విచారణ ప్రారంభించింది. రామగుండం రీజియన్ పరిధిలోని ఆర్జీ-1 డివిజన్లోని మేడిపల్లి ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టు నుంచి ఆర్జీ-1 సీహెచ్‌పీ వరకు ప్రతీ రోజు బొగ్గును టిప్పర్ల ద్వారా రవాణా చేస్తారు. ఓసీపీ నుంచి సీహెచ్‌పీకి చేరుకున్న తర్వాత అక్కడ బంకర్లో బొగ్గు పోస్తే దానిని రైలు వ్యాగన్లో వినియోగదారులకు పంపిస్తారు. అయితే మేడిపల్లి ఓసీపీలో బొగ్గును టిప్పర్‌లో నింపుకున్న తర్వాత అక్కడే ఉన్న ఎస్అండ్పీసీ చెక్‌పోస్టు వద్ద అవుట్ స్లిప్ తీసుకోవాలి. తిరిగి సీహెచ్‌పీకి టిప్పర్ చేరుకున్న తర్వాత అక్కడ ఉన్న మరో ఎస్అండ్పీసీ చెక్‌పోస్టు వద్ద ఇన్స్లిప్ తీసుకుంటారు. అక్కడికి కొద్దిదూరంలో ఉన్న సీహెచ్‌పీ బంకర్ వద్దకు వెళ్లి బొగ్గును అన్లోడ్ చేయగా... టిప్పర్ వచ్చి అన్లోడ్ చేసినట్టు మొకద్దాం (సూపర్వైజర్) బుక్‌లో నమోదు చేస్తాడు. మళ్లీ టిప్పర్ సీహెచ్‌పీ సమీపంలోని చెక్‌పోస్టు వద్ద అవుట్, మేడిపల్లి ఓసీపీ వద్ద గల చెక్‌పోస్టులో ఇన్ పడాలి. ఈ ప్రక్రియ నిరంతరం జరుగుతుంది. అసలేం జరిగింది...? మార్చి 30న రాత్రి షిప్టులో బర్ల సదయ్యకు చెందిన (ఏపీ 15టిబి 9099 ) టిప్పర్‌ను బొగ్గు లోడుతో మేడిపల్లి ఓసీపీ నుంచి ఆర్జీ-1 సీహెచ్‌పీకి డ్రైవర్ రేగుల లక్ష్మణ్ మొదటి ట్రిప్ తీసుకెళ్లాడు. రెండో ట్రిప్‌లో భాగంగా రాత్రి 1.50 గంటలకు బొగ్గు లోడ్ చేసుకుని మేడిపల్లి ఓసీపీ ఎస్అండ్పీసీ చెక్‌పోస్టు వద్ద అవుట్ స్లిప్ రాయించుకున్నాడు. తిరిగి తెల్లవారుజామున 4.30 గంటలకు మేడిపల్లి ఓసీపీకి ఖాళీ టిప్పర్‌తో వచ్చాడు. అక్కడ డ్యూటీలో ఉన్న గణేశ్ అనే సెక్యూరిటీ గార్డుకు అనుమానం వచ్చి స్లిప్ పరిశీలించడంతో అసలు నిజం వెలుగుచూసింది. స్లిప్‌లపై ఫోర్జరీ సంతకాలు చేసి బొగ్గును దారి మళ్లించినట్టు గుర్తించాడు. సీహెచ్‌పీ వద్ద చెక్‌పోస్టులో ఎలాంటి రికార్డు నమోదు కాకపోగా... దానికంటే ముందున్న బంకర్ వద్ద బొగ్గు అన్లోడ్ అయినట్టు అక్కడి సూపర్వైజర్ సంతకం చేసినట్టు ఉంది. ఈ ఘటనలో ఇంటిదొంగల పాత్ర ఉన్నట్టు గుర్తించిన యూజమాన్యం విజిలెన్స్ అధికారులను రంగంలోకి దించింది. ఇటుక బట్టీలకు బొగ్గు విక్రయం? మార్చి 30న రాత్రి షిఫ్టులో 1.50 గంటలకు మేడిపల్లి ఓసీపీ చెక్‌పోస్టు నుంచి బయలుదేరిన బొగ్గు టిప్పర్ తెల్లవారుజామున 4.30 గంటలకు రాగా... సుమారు మూడు గంటల సమయం ఆ టిప్పర్ ఎటు వెళ్లిందనే విషయమై విచారణ జరుపుతున్నారు. మేడిపల్లి నుంచి సీహెచ్‌పీకి వెళ్లకుండా నేరుగా రాజీవ్ రహదారిపైకి చేరుకుని పెద్దపల్లి దర్గా సమీపంలోని ఇటుకబట్టీల వద్ద ఈ బొగ్గును అన్లోడ్ చేసినట్టు సమాచారం. ఈ అనుమానంతో సింగరేణి సెక్యూరిటీ అధికారులు రామగుండం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో టిప్పర్ యజమానితోపాటు డ్రైవర్‌పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఆర్జీ-1 సీహెచ్‌పీ వద్ద బొగ్గు అన్లోడ్ చేయకపోయినా... చేసినట్టు నమోదు చేసిన సూపర్వైజర్ తిరుపతిని సింగరేణి యాజమాన్యం సస్పెండ్ చేసింది. ప్రస్తుతం కొత్తగూడెం నుంచి వచ్చిన విజిలెన్స్ విభాగం అధికారులు గడిచిన మూడు నెలలుగా బొగ్గు రవాణాకు సంబంధించిన రికార్డులను స్వాధీనం చేసుకుని అనుమానితులందరినీ విచారణ చేస్తున్నారు. ఆచూకీ లేని మరో టిప్పర్? మార్చి 30న రాత్రి మూడో ట్రిప్పులో భాగంగా మేడిపల్లి ఓసీపీ నుంచి బొగ్గు లోడుతో బయటకు వెళ్లిన ఏపీ 15 ఎక్స్ 5679 నంబర్ టిప్పర్ కూడా సీహెచ్‌పీకి కాకుండా బయటకు వెళ్లింది. ఒక టిప్పర్‌ను సెక్యూరిటీ గార్డులు పట్టుకోవడంతో రెండో టిప్పర్ మేడిపల్లి ఓసీపీకి చేరుకోలేదు. ఘటన జరిగి నాలుగు రోజులైనా ఆ టిప్పర్ ఆచూకీ లభించలేదు. దీంతో ఇటు సింగరేణి విజిలెన్స్ అధికారులు, అటు పోలీస్ అధికారులు బొగ్గుమాయం ఘటనపై లోతుగా అధ్యయనం చేస్తున్నారు. ఇందులో మేడిపల్లి ఓసీపీ, ఆర్జీ-1 సీహెచ్‌పీ అధికారుల ప్రమేయం ఉందా? ఈ దందా ఎన్నేళ్లుగా సాగుతోంది? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. -
కేశాల పరిశ్రమకు కష్టకాలం
అంతర్జాతీయ మార్కెట్‌కు నిలిచిన ఎగుమతులు భారీగా పతనమవుతున్న ధరలు పుణ్యక్షేత్రాల్లో తలనీలాల వేలం పాటకు స్పందన శూన్యం తణుకు/ద్వారకాతిరుమల: నల్ల బంగారంగా పేరొందిన తలనీలాల(కేశాల) ధర తలకిందులైంది. గతేడాదితో పోలిస్తే మార్కెట్లో కేశాలకు డిమాండ్ తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో సంక్షోభం వల్ల ధర పతనమవుతోంది. దీంతో ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో కేశాల వేలం పాటకు వ్యాపారులు ముందుకు రావడం లేదు. తలనీలాల ఎగుమతిలో పశ్చిమ గోదావరి జిల్లా అంతర్జాతీయంగా ప్రాచుర్యం పొందింది. జిల్లాలో గతేడాది తలనీలాల ఎగుమతిలో రూ.వెయ్యి కోట్ల టర్నోవర్ జరగ్గా ఈ ఏడాది అందులో 50 శాతం కూడా దాటే అవకాశాలు కనిపించడం లేదు. కేశాలకు ధర లేకపోవడానికి ప్రధాన కారణం భారత్ నుంచి చైనాకు ఎగుమతులు లేకపోవడమే. కేశాల కొనుగోళ్లను చైనా పూర్తిగా నిలిపివేసిందని, అందుకే నిల్వలు పెరిగి ధర పతనమైందని వ్యాపారులు చెబుతున్నారు. ఏడాది క్రితం రూ.కోటికి అమ్ముడైన స్పెషల్ గ్రేడ్ సరుకు ప్రస్తుతం మార్కెట్లో కేవలం రూ.25 లక్షలు పలుకుతోంది. సాధారణంగా తలనీలాలను పుణ్యక్షేత్రాల్లో కేశఖండనశాలల నుంచి సేకరిస్తుంటారు. వీటిని శుభ్రపర్చి గ్రేడ్లుగా విభజించి చైనా, అమెరికా, యూరప్, ఆఫ్రికా వంటి దేశాలకు ఎగుమతి చేస్తుంటారు. కేవలం ఐదు శాతం మాత్రం ఇలా పుణ్యక్షేత్రాల నుంచి సేకరిస్తుండగా మిగిలినదంతా ఇళ్ల నుంచి సేకరిస్తారు. ఇళ్లనుంచి కేశాలను సేకరించే చిన్న వర్తకులపై ఇటీవలి కాలంలో సేల్ ట్యాక్స్ పేరుతో అధికారులు వేధింపులకు పాల్పడుతుండడంతో ఈ ప్రభావం ఎగుమతులపై పడుతోంది. పన్ను పేరుతో అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రానికి విజ్ఞప్తి చేశాం ‘‘యూరప్ దేశాల్లో ఆర్థిక మాంద్యం కారణంగా తలనీలాల ఎగుమతులు క్షీణించాయి. చిరు వ్యాపారులపై సేల్ ట్యాక్స్ పేరుతో అధికారులు వేధింపులకు పాల్పడుతున్నారు. ఇంటింటికీ తిరిగి కేశాలను సేకరించే చిన్న వర్తకులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. సేల్ ట్యాక్స్ అధికారుల తీరుపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాం. ఇదే పరిస్థితి కొనసాగితే కేశాల పరిశ్రమల్లో పనిచేసే వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోతారు’’ - వంక రవీంద్రనాథ్, ఇండియన్ హెయిర్ ఇండస్ట్రీస్ అధినేత, తణుకు -
కోల్ మాఫియా డాన్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: సింగరేణిలో ‘నల్ల బంగారం’ అక్రమ దందా అంతా ఓ వ్యక్తి కనుసన్నల్లో జరుగుతోంది. రెండు దశాబ్దాల క్రితం వంటవాడిగా, హరిదాసు వేషాలు వేస్తూ పొట్ట నింపుకున్న సదరు వ్యక్తి బొగ్గుదందాలోకి ప్రవేశించి నేడు ఏటా రూ.100 కోట్ల విలువైన బొగ్గును నల్ల బజారుకు తరలిస్తూ మాఫియా డాన్‌గా ఎదిగాడు. బొగ్గు గనుల ప్రాంతం నుంచి ఎన్టీపీసీ విద్యుత్ కేంద్రం, ఇతర పరిశ్రమలకు రైల్వే వ్యాగన్ల ద్వారా వెళ్లే బొగ్గును తస్కరించి దానిని లారీలు, ట్రాక్టర్లలో రోడ్డు మార్గం ద్వారా తీసుకెళ్లడం వరకు అంతా అతడి డెరైక్షన్లోనే నడుస్తోందంటే అతిశయోక్తి కాదు. సామాన్యులెవరైనా బొగ్గు దందాకు ఎదురుతిరిగితే ఎంతకైనా తెగిస్తాడని తెలుస్తోంది. ఇక పోలీసులు, ఎన్టీపీసీ, సింగరేణికి చెందిన వారిని మాత్రం మామూళ్లతో కొడుతుంటాడు. కొత్తగా వచ్చిన పోలీసు అధికారులు అడ్డుతగిలినప్పుడు తన చీకటి వ్యాపారానికి కొంత విరామమిచ్చి సెటిల్మెంట్ చేసుకున్న తర్వాత షరా‘మామూలు’గానే దందాను కొనసాగించడం అతని ప్రత్యేకత. రామగుండం ఎరువుల కర్మాగారం స్థాపించిన సమయంలో వేములవాడ నుంచి బతుకుదెరువు కోసం ఓ వ్యక్తి వలసవ చ్చాడు. టౌన్షిప్ సమీపంలోనే నివాసముంటూ చుట్టుపక్కల ప్రాంతాలలో కూలి పనులు చేసేవాడు. సంక్రాంతి పండుగకు హరిదాసు వేషం వేసేవాడు. తర్వాత కొంతకాలం చిన్న హోటల్ ప్రారంభించి వంటవాడిగా అవతారమెత్తాడు. ఆ తరువాత సింగరేణికి చెందిన 7వ గని వద్ద గల బంకర్ నుంచి బొగ్గును సేకరించి సంచులలో నింపుతూ సైకిళ్లపై తీసుకెళ్లి ఎఫ్‌సీఐ టౌన్షిప్లో విక్రయించేవాడు. 1999లో ఎరువుల కర్మాగారం మూతపడ్డ తర్వాత ‘హరిదాసు’ దందాకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. 2010 నుంచి అక్రమ బొగ్గు దందాను పూర్తిగా తన చేతుల్లోకి తీసుకుని రూ.కోట్లు ఆర్జిస్తూ కోల్ మాఫియా డాన్‌గా మారాడు. ఈ అక్రమ దందాకు ఎవరైనా అడ్డుతగలకుండా ఉండేందుకు చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన కొంతమంది యువకులతో ‘ఎస్కార్ట్’ తయారు చేసుకున్నాడు. ద్విచక్రవాహనాలపై తిరుగుతూ వీరు నిత్యం పర్యవేక్షిస్తుంటారు. చీకటి పడిన తర్వాత బొగ్గుతో నిండిన లారీలను ఎటువంటి ఆటంకాలు ఎదురుకాకుండా ఈ ఎస్కార్ట్ ఆరు ద్విచక్రవాహనాలతో (లారీకి మూడు ముందు, మరో మూడు వెనకాల) రక్షణ కవచంగా ఉంటాయి. ఇందుకు గాను సదరు యువకులకు నెలకు రూ.2 లక్షల చొప్పున ముట్టజెపుతున్నట్లు సమాచారం. నకిలీ వేబిల్లులతో... సింగరేణి నుంచి ఎన్టీపీసీకి వెళ్లే రైలువ్యాగన్ల నుంచి అక్రమంగా తస్కరించిన బొగ్గును లారీలలోకి ఎక్కించి రాచమార్గంలో తరలించేందుకు మార్గమధ్యంలో వే బిల్లును తయారు చేస్తున్నట్లు సమాచారం. స్థానికంగా నేతలు, ప్రజాప్రతినిధులను ప్రసన్నం చేసుకుంటాడని తెలుస్తోంది. ప్రజాప్రతినిధులైతే కొంత ఎక్కువ... మాజీలైతే వారికంటే కొంత తక్కువ సొమ్మును ఇస్తాడు. అలాగే ఎఫ్‌సీఐ నుంచి ఎల్కలపల్లి గేట్లోకి ఎవరైనా వస్తే... వారి సమాచారాన్ని వెంటనే చెప్పేందుకు ఏజంట్లను కూడా పెట్టుకున్నాడు. వారు ఆయా హోటళ్ల వద్ద తిష్టవేసి సమాచారం ఇచ్చినందుకు డబ్బులు ఇచ్చి పోషిస్తున్నాడు. ఇక సింగరేణి నుంచి వ్యాగన్లు బయలుదేరిన తర్వాత రైలును నెమ్మదిగా నడిపించేందుకు లోకో పైలట్లకు, ఈ తతంగం జరుగుతున్నా చూసీచూడనట్టుగా వ్యవహరించినందుకు సింగరేణి సెక్యూరిటీ విభాగం అధికారులకు, గార్డులకు కూడా నెలవారీగా లక్షల రూపాయల్లో మామూళ్లు ముట్టుజెపుతున్నట్లు సమాచారం. ఈ అక్రమదందా ఇన్నాళ్లుగా సాఫీగా సాగడానికి పోలీస్ వ్యవస్థ కూడా సంపూర్ణ సహకారాన్ని అందించినట్లుగా స్పష్టమవుతోంది. ఇందుకోసం కోల్‌బెల్ట్ ఏరియాలోని పోలీస్స్టేషన్లతో పాటు రాజీవ్ రహదారిపై ఉండే పోలీస్స్టేషన్లకు కూడా నెలవారీగా లక్షలాది రూపాయల నజరానాలను ముట్టజెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. సైకిల్ నుంచి స్కార్పియో దాకా... ఒకప్పుడు సైకిల్‌పై బొగ్గు సంచులను పెట్టుకుని క్వార్టర్లు, ఇళ్లల్లో బొగ్గును అమ్మిన వ్యక్తి స్వస్థలం వేములవాడ. హరిదాసు వేషాలేసినా, వంట పని చేసినా కాలం కలిసిరాకపోవడంతో ఆంధ్రా ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి దగ్గర అనుచరుడిగా చేరి బొగ్గు రవాణా చేయడం ఆరంభించాడు. వ్యాపారంలో నష్టం రావడంతో సదరు ఆంధ్రావ్యక్తి ఇక్కడ నుంచి వెళ్లిపోవడంతో ఇక తానే రంగంలోకి దిగి మాఫియా డాన్‌గా మారాడు. ఒకనాడు సైకిల్‌పై తిరిగిన ఈ వ్యక్తి ప్రస్తుతం రూ.కోట్లకు పడగలెత్తాడు. సుల్తానాబాద్ రాజీవ్ రహదారి సమీపంలో కోట్ల రూపాయల విలువైన స్థలాలు కొనుగోలు చేశాడు. వేములవాడలో పెద్ద భవనం. ఎల్కలపల్లి ప్రాం తంలో ఇండ్లు, భూములు కొన్నాడు. రాజకీ య నాయకుల అండదండలు పుష్కలంగా ఉండడంతో తన అనుచరులపై కేసులు నమోదైతే బెయిల్ ఇప్పించడం, తిరిగి దందాకు ప్రోత్సహించడం, వినాయకచవితి నవరాత్రోత్సవాలకు భారీగా చందాలు ఇవ్వడం ఇతని ప్రత్యేకత. ఇంటి వద్ద నిత్యం పదుల సంఖ్యలో యువకులు తిరుగుతుం టారు. దాదాపు వంద మందికిపైగా యువకులను పెంచిపోషిస్తూ తన అక్రమ బొగ్గు దందాను మూడు ట్రాక్టర్లు, ఆరు లారీల లాగా కొనసాగిస్తున్నాడు. -
రూ. 100 కోట్ల దొంగ దందా
నల్లబజారుకు తరలుతున్న బొగ్గు సాక్షి ప్రతినిధి, కరీంనగర్: నల్లబంగారం నల్లబజారు పాలవుతోంది. అంతాఇంతా కాదు. రోజుకు రెండొందల టన్నులను దొంగలు కొల్లగొడుతున్నారు. ఏటా వంద కోట్ల రూపాయల దందా చేస్తున్నారు. కదిలే రైలులోంచే బొగ్గును కాజేస్తున్నారు. కాసులకు కక్కర్తి పడిన ఇంటిదొంగలు బొగ్గు దొంగలకు సహకరిస్తున్నట్లు సమాచారం. ఇదీ సిరులు కురిపించే సింగరేణి బొగ్గును బుక్కుతున్న తీరు. కరీంనగర్ జిల్లా రామగుండం రీజియన్ పరిధిలో కొన్నేళ్లుగా ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు(ఓసీపీ)-1 కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్(సీహెచ్‌పీ), ఓసీపీ-3 గనుల నుంచి నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్(ఎన్టీపీసీ)కి రోజూ సగటున 8 నుంచి 12 రేకుల బొగ్గు సరఫరా అవుతోంది. అయితే, బొగ్గులోడుతో రైలు నెమ్మదిగా ఎన్టీపీసీకి వెళుతుండగా మార్గమధ్యంలోనే సుమారు 40 మంది దొంగలు యైటింక్లరుున్ కాలనీ, లక్ష్మీపూర్ ప్రాంతాల్లో రెండు బృందాలుగా విడిపోయి బొగ్గును చోరీ చేస్తుంటారు. వీరు రైలు వ్యాగన్లలోకి ఎక్కి బొగ్గుపెళ్లను లోపలి భాగంలో చుట్టూ అమరుస్తారు. అల్లూరు నుంచి న్యూమారెడుపాక, లక్ష్మీపురం వరకు దారి మధ్యలోనున్న చెట్లపొదల వద్దకు(బొగ్గు నిల్వ చేసే పాయింట్లు) రాగానే ఆ బొగ్గును కింద పడేస్తారు. ఆ వెంటనే ఆయా ప్రాంతాల్లో మరో 20 మంది యువకులు కింద పడిన బొగ్గును బస్తాల్లోకి నింపుతారు. కొద్దిసేపటికే వాటిని లారీల్లోకి ఎక్కించి ఎల్కల్‌పల్లి, రాణాపూర్, కన్నాల మీదుగా పెద్దపల్లి, కరీంనగర్, వరంగల్, హైదరాబాద్‌కు తరలిస్తారు. రోజూ 200 టన్నులకుపైగా దందా రోజూ సుమారు 200 టన్నులకుపైగా బొగ్గును పక్కదారి పట్టిస్తున్నట్లు తెలుస్తోంది బహిరంగ మార్కెట్లో టన్ను బొగ్గు రూ.20 వేలకుపైగా పలుకుతోంది. ఈ లెక్కన ప్రతినెలా రూ.10 కోట్లు చొప్పున ఏటా రూ.100 కోట్లకు పైగా బొగ్గు దందా నడుస్తోంది. సిరామిక్, ఇనుప పరిశ్రమలు, ఇటుక బట్టీలకు పెద్ద ఎత్తున బొగ్గు అవసరం. సింగరేణి బొగ్గుకు బాగా డిమాండ్ ఉండటంతో ఆయా సంస్థలు బొగ్గు మాఫియాకు పెద్దమొత్తంలో అడ్వాన్స్‌గా సొమ్ము చెల్లించి సరుకును కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రాణాలకు తెగించి... నడుస్తున్న రైలును ఎక్కుతున్న యువకుల్లో ఎక్కువ మంది గోదావరిఖని సమీపంలోని ల క్ష్మీపూర్ ప్రాంతానికి చెందిన నిరుద్యోగులే. ఒక్కో యువకుడికి మధ్యాహ్నం భోజనం, క్వార్టర్ మందుతోపాటు రూ.200 చెల్లిస్తున్నారు. రెండు గంటలు కష్టపడితే రోజుకు సరిపడా డబ్బులొస్తాయనే ఉద్దేశంతో ప్రాణాలకు తెగించి యువకులు బొగ్గు మాఫియాకు సహకరిస్తున్నారు. వచ్చిన డబ్బుతో వ్యసనాలకు లోనవుతున్నారు. నడుస్తున్న రెలైక్కబోయి కాళ్లు, చేతులు విరగ్గొట్టుకున్నవారూ ఉన్నారు. గత ఏడాది ఓ యువకుడు ప్రాణాలను సైతం పోగొట్టుకున్నాడు. కేసులు, అరెస్టులు అంతంతమాత్రమే ఏటా రూ.కోట్లలో బొగ్గు దందా జరుగుతున్నా పోలీసులు, సింగరేణి, ఎన్టీపీసీ బీట్ అధికారులు ఏం చేస్తున్నారనేది ప్రశ్నార్థకంగా మారింది. 2015లో బొగ్గు దొంగలపై పోలీసులు 10 కేసులు నమోదు చేసి 35 మంది అరెస్టు చేశారు. అయితే, సింగరేణి, ఎన్టీపీసీలోని కొందరు ఇంటిదొంగలు ఈ దందాకు సహకరిస్తున్నట్లు తెలిసింది. వీరికి నెలనెలా మామూళ్లు అందుతున్నందుకే చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. ఉన్నతాధికారుల నుంచి ఒత్తిళ్లు వచ్చినప్పుడు, టార్గెట్ల కోసమే అప్పుడప్పుడు బొగ్గు లారీలను పట్టుకుని కేసు నమోదు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. బొగ్గు దందా వెనుక రాజకీయ పలుకుబడి గల వ్యక్తులు, మాజీ, తాజా ప్రజాప్రతినిధులున్నట్లు తెలుస్తోంది. ఈ దందా ద్వారా వచ్చిన ఆదాయంలో 50 శాతం ముఠా నాయకుడికి, మరో 20 శాతం బొగ్గును దొంగలకు, మిగతా 30 శాతం సింగరేణిలోని ఇంటిదొంగలకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. -
RTPPలో బొగ్గు కొరత