కోల్ మాఫియా డాన్ | Coal Mafia Don! | Sakshi
Sakshi News home page

కోల్ మాఫియా డాన్

Published Mon, Jan 18 2016 8:48 AM | Last Updated on Mon, Oct 8 2018 4:18 PM

కోల్ మాఫియా డాన్ - Sakshi

కోల్ మాఫియా డాన్

సాక్షి ప్రతినిధి, కరీంనగర్: సింగరేణిలో ‘నల్ల బంగారం’ అక్రమ దందా అంతా ఓ వ్యక్తి కనుసన్నల్లో జరుగుతోంది. రెండు దశాబ్దాల క్రితం వంటవాడిగా, హరిదాసు వేషాలు వేస్తూ పొట్ట నింపుకున్న సదరు వ్యక్తి బొగ్గుదందాలోకి ప్రవేశించి నేడు ఏటా రూ.100 కోట్ల విలువైన బొగ్గును నల్ల బజారుకు తరలిస్తూ మాఫియా డాన్‌గా ఎదిగాడు. బొగ్గు గనుల ప్రాంతం నుంచి ఎన్టీపీసీ విద్యుత్ కేంద్రం, ఇతర పరిశ్రమలకు రైల్వే వ్యాగన్ల ద్వారా వెళ్లే బొగ్గును తస్కరించి దానిని లారీలు, ట్రాక్టర్లలో రోడ్డు మార్గం ద్వారా తీసుకెళ్లడం వరకు అంతా అతడి డెరైక్షన్‌లోనే నడుస్తోందంటే అతిశయోక్తి కాదు. సామాన్యులెవరైనా బొగ్గు దందాకు ఎదురుతిరిగితే ఎంతకైనా తెగిస్తాడని తెలుస్తోంది.

ఇక పోలీసులు, ఎన్టీపీసీ, సింగరేణికి చెందిన వారిని మాత్రం మామూళ్లతో కొడుతుంటాడు. కొత్తగా వచ్చిన పోలీసు అధికారులు అడ్డుతగిలినప్పుడు తన చీకటి వ్యాపారానికి కొంత విరామమిచ్చి సెటిల్‌మెంట్ చేసుకున్న తర్వాత షరా‘మామూలు’గానే దందాను కొనసాగించడం అతని ప్రత్యేకత. రామగుండం ఎరువుల కర్మాగారం స్థాపించిన సమయంలో వేములవాడ నుంచి బతుకుదెరువు కోసం ఓ వ్యక్తి వలసవ చ్చాడు. టౌన్‌షిప్ సమీపంలోనే నివాసముంటూ చుట్టుపక్కల ప్రాంతాలలో కూలి పనులు చేసేవాడు. సంక్రాంతి పండుగకు హరిదాసు వేషం వేసేవాడు. తర్వాత కొంతకాలం చిన్న హోటల్ ప్రారంభించి వంటవాడిగా అవతారమెత్తాడు.  

ఆ తరువాత సింగరేణికి చెందిన 7వ గని వద్ద గల బంకర్ నుంచి బొగ్గును సేకరించి సంచులలో నింపుతూ సైకిళ్లపై తీసుకెళ్లి ఎఫ్‌సీఐ టౌన్‌షిప్‌లో విక్రయించేవాడు. 1999లో ఎరువుల కర్మాగారం మూతపడ్డ తర్వాత ‘హరిదాసు’ దందాకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. 2010 నుంచి అక్రమ బొగ్గు దందాను పూర్తిగా తన చేతుల్లోకి తీసుకుని రూ.కోట్లు ఆర్జిస్తూ కోల్ మాఫియా డాన్‌గా మారాడు.

ఈ అక్రమ దందాకు ఎవరైనా అడ్డుతగలకుండా ఉండేందుకు చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన కొంతమంది యువకులతో ‘ఎస్కార్ట్’ తయారు చేసుకున్నాడు. ద్విచక్రవాహనాలపై తిరుగుతూ వీరు నిత్యం పర్యవేక్షిస్తుంటారు. చీకటి పడిన తర్వాత బొగ్గుతో నిండిన లారీలను ఎటువంటి ఆటంకాలు ఎదురుకాకుండా ఈ ఎస్కార్ట్ ఆరు ద్విచక్రవాహనాలతో (లారీకి మూడు ముందు, మరో మూడు వెనకాల) రక్షణ కవచంగా ఉంటాయి. ఇందుకు గాను సదరు యువకులకు నెలకు రూ.2 లక్షల చొప్పున ముట్టజెపుతున్నట్లు సమాచారం.
 
నకిలీ వేబిల్లులతో...
సింగరేణి నుంచి ఎన్టీపీసీకి వెళ్లే రైలువ్యాగన్ల నుంచి అక్రమంగా తస్కరించిన బొగ్గును లారీలలోకి ఎక్కించి రాచమార్గంలో తరలించేందుకు మార్గమధ్యంలో వే బిల్లును తయారు చేస్తున్నట్లు సమాచారం. స్థానికంగా నేతలు, ప్రజాప్రతినిధులను ప్రసన్నం చేసుకుంటాడని తెలుస్తోంది. ప్రజాప్రతినిధులైతే కొంత ఎక్కువ... మాజీలైతే వారికంటే కొంత తక్కువ సొమ్మును ఇస్తాడు. అలాగే ఎఫ్‌సీఐ నుంచి ఎల్కలపల్లి గేట్‌లోకి ఎవరైనా వస్తే... వారి సమాచారాన్ని వెంటనే చెప్పేందుకు ఏజంట్లను కూడా పెట్టుకున్నాడు. వారు ఆయా హోటళ్ల వద్ద తిష్టవేసి సమాచారం ఇచ్చినందుకు డబ్బులు ఇచ్చి పోషిస్తున్నాడు.

ఇక సింగరేణి నుంచి వ్యాగన్లు బయలుదేరిన  తర్వాత రైలును నెమ్మదిగా నడిపించేందుకు లోకో పైలట్లకు, ఈ తతంగం జరుగుతున్నా చూసీచూడనట్టుగా వ్యవహరించినందుకు సింగరేణి సెక్యూరిటీ విభాగం అధికారులకు, గార్డులకు కూడా నెలవారీగా లక్షల రూపాయల్లో మామూళ్లు ముట్టుజెపుతున్నట్లు సమాచారం. ఈ అక్రమదందా ఇన్నాళ్లుగా సాఫీగా సాగడానికి పోలీస్ వ్యవస్థ కూడా సంపూర్ణ సహకారాన్ని అందించినట్లుగా స్పష్టమవుతోంది. ఇందుకోసం కోల్‌బెల్ట్ ఏరియాలోని పోలీస్‌స్టేషన్లతో పాటు రాజీవ్ రహదారిపై ఉండే పోలీస్‌స్టేషన్లకు కూడా నెలవారీగా లక్షలాది రూపాయల నజరానాలను ముట్టజెప్పినట్లు ప్రచారం జరుగుతోంది.
 
సైకిల్ నుంచి స్కార్పియో దాకా...
ఒకప్పుడు సైకిల్‌పై బొగ్గు సంచులను పెట్టుకుని క్వార్టర్లు, ఇళ్లల్లో బొగ్గును అమ్మిన  వ్యక్తి స్వస్థలం వేములవాడ. హరిదాసు వేషాలేసినా, వంట పని చేసినా కాలం కలిసిరాకపోవడంతో ఆంధ్రా ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి దగ్గర అనుచరుడిగా చేరి బొగ్గు రవాణా చేయడం ఆరంభించాడు. వ్యాపారంలో నష్టం రావడంతో సదరు ఆంధ్రావ్యక్తి ఇక్కడ నుంచి వెళ్లిపోవడంతో ఇక తానే రంగంలోకి దిగి మాఫియా డాన్‌గా మారాడు. ఒకనాడు సైకిల్‌పై తిరిగిన ఈ వ్యక్తి ప్రస్తుతం రూ.కోట్లకు పడగలెత్తాడు. సుల్తానాబాద్ రాజీవ్ రహదారి సమీపంలో కోట్ల రూపాయల విలువైన స్థలాలు కొనుగోలు చేశాడు.

వేములవాడలో పెద్ద భవనం. ఎల్కలపల్లి ప్రాం తంలో ఇండ్లు, భూములు కొన్నాడు. రాజకీ య నాయకుల అండదండలు పుష్కలంగా ఉండడంతో తన అనుచరులపై కేసులు నమోదైతే బెయిల్ ఇప్పించడం, తిరిగి దందాకు ప్రోత్సహించడం, వినాయకచవితి నవరాత్రోత్సవాలకు భారీగా చందాలు ఇవ్వడం ఇతని ప్రత్యేకత. ఇంటి వద్ద నిత్యం పదుల సంఖ్యలో యువకులు తిరుగుతుం టారు. దాదాపు వంద మందికిపైగా యువకులను పెంచిపోషిస్తూ తన అక్రమ బొగ్గు దందాను మూడు ట్రాక్టర్లు, ఆరు లారీల లాగా కొనసాగిస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement