
ఫుడ్ ఈజ్ ఫస్ట్ మెడిసిన్!
ఆరోగ్యమే మహాభాగ్యం అని మనందరికీ తెలుసు. ఆయురారోగ్యాలనిచ్చేది ఆహారమే. రసాయనిక అవశేషాల్లేని అమృతాహారమే ఆరోగ్యదాయకమైనది. పోషకాహార నిపుణులు చెబుతున్నదేమిటంటే.. పెద్దగా శారీరక శ్రమ చేయని వారంతా రోజువారీ అన్నం లేదా రొట్టె కంటే కూర ఎక్కువ పరిమాణంలో తినాలి. తినే కూరలో సగం ఆకుకూరలుండాలి. మిగతా సగంలో దుంపలు, కూరగాయలు ఉండాలి. కానీ, కూరగాయలే ఎక్కువగా తింటున్నాం. హైదరాబాద్ నగరవాసులకు మార్కెట్లో అందుబాటులో ఉన్న కూరగాయలు, ఆకుకూరల నాణ్యత ఎలాంటిది?
కలుషిత జలాలతోటి, అధిక మోతాదుల్లో రసాయనిక ఎరువులు, విష రసాయనాలు వేసి సాగు చేసిన వ్యవసాయోత్పత్తులే ఎక్కువగా అందుబాటులో ఉన్నాయి. నగరవాసులను అత్యధికంగా సుగర్, గుండెజబ్బులు, కేన్సర్ తదితర వ్యాధుల బారిన పడెయ్యడంలో రసాయనిక అవశేషాలు మెండుగా ఉన్న ఆహారోత్పత్తుల పాత్ర చాలా ఎక్కువన్న స్పృహ ప్రజల్లో ఇటీవల విస్తృతమవుతోంది. ఈ పూర్వరంగంలో రసాయన అవశేషాల్లేని ఇంటిపంటల సాగు ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. ఇంటిపంటల వల్ల అదనపు ప్రయోజనాలూ ఉన్నాయి.
చేతికి మట్టి అంటితే మనసు తేలికపడుతుందని ఇటీవలి వైద్య పరిశోధనలు తేల్చాయి. చిటికెడు మట్టిలోనే కోటానుకోట్ల సూక్ష్మజీవరాశి ఉంటుంది. చెంచాడు సారవంతమైన మట్టి జీవంతో తొణకిసలాడుతూ ఉంటుంది. అటువంటి మట్టిలో ప్రపంచంలోని మనుషుల సంఖ్య కన్నా ఎక్కువ సూక్ష్మజీవులుంటాయని ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్.ఏ.ఓ.) ప్రకటించింది. మట్టిని చేతులు, కాళ్లతో తాకినప్పుడు అందులోని సూక్ష్మజీవుల వల్ల మనసు తేలికపడుతున్నదని శాస్త్రవేత్తలు గుర్తించారు. అందుకే కాసేపు మొక్కల్లో పని చేస్తే మనోల్లాసం కలుగుతుంది. మానసిక వత్తిడి తగ్గుతుంది. దీన్నే ‘హార్టీకల్చర్’ థెరపీ’ అంటున్నారు!