యువరాజు సుసేనుడు తనకెంతో ఇష్టమైన వేటకు బయలుదేరాడు సపరివార సమేతంగా. ఒకసారి వేటకు వస్తే కనీసం వారం పదిరోజులైనా సమయం తెలియక లీనమైపోతాడు. ఈసారి మహారాణి అనారోగ్యం, మహారాజు దేశ సుభిక్షానికై తలపెట్టిన యజ్ఞం వంటి కార్యక్రమాలవల్ల ఆరునెలలు వేటకు వెళ్ళలేకపోయాడు. ఇప్పుడిక అవన్నీ ఓ కొలిక్కివచ్చి కాస్త వీలు చిక్కగానే వేటకు బయలుదేరాడు సుసేనుడు తండ్రి వారింపదలచినా పట్టించుకోకుండా.అందమైన ఒక లేడి పిల్లను అనుసరిస్తూ వాయువేగంతో వెళ్ళగల తన గుర్రాన్నేసుకుని సైన్యానికంటే చాలాదూరమైపోయి అడవిలోలోపలికి వచ్చేశాడు సుసేనుడు. వున్నట్టుండి కళ్ళముందు వెళ్ళిన లేడి కనిపించకుండా మాయమైపోయింది. సుసేనుడు చుట్టూ పరికించాడు. మరికాస్తముందుకెళ్ళే సరికి ఓ పర్వతం కనిపించింది. దానిమీదికి ఎక్కిందేమోనని విశాలంగా ఉన్న ఆ పర్వతం మొదలు నుంచి గుర్రాన్ని కొంచెం పైకి ఎక్కించాడు సుసేనుడు.
వేగంగా చీకట్లు అలుముకున్నాయి. ఒక చెట్టు క్రింద గుర్రాన్ని వదిలి, చిన్న నెగడు వెలిగించి క్రూరమగాలు దగ్గరికి రాకుండా చేసి చెట్టెక్కి పెద్ద కొమ్మమీద విశ్రమించాడు. ఉదయకిరణాల పలకరింపుతో మెలకువ వచ్చింది. గబగబా చెట్టు దిగి గుర్రాన్నెక్కి పర్వతం క్రిందకు వచ్చాడు. కానీ, రాత్రి తాను వచ్చిన చోటు కాదని త్వరగానే గ్రహించాడు. అదొక నదీ తటాకం. స్వచ్ఛంగా వుంది నీళ్ళు.స్నానపానాలుచేసి దొరికిన పళ్ళేవో తిన్నాడు. గుర్రం కూడా గడ్డి మేయసాగింది.దగ్గర్లో గలగల నవ్వులు వినిపించి ఉలిక్కి పడ్డాడు. మెల్లగా ఆ దిక్కుకు వెళ్ళి చూస్తే, కొందరు కన్యలు నదిలో జలకాలాడుతూ తనకు అర్ధం కాని భాషలో మాట్లాడుకోసాగారు. వారిలో ఒకమ్మాయి సుసేనుడ్ని పసిగట్టి తోటి వారికి తెలియకుండా అతన్ని సమీపించింది.
సుసేనుడు ఆశ్చర్యంగా చూశాడు. ‘ఎవర్నువ్వు? ప్రాణాలమీద ఆశలేక వచ్చావా?‘ అంటూ గంభీరంగా గద్దించి అడిగింది.‘మీరెవరు? ఇది అడవి కదా? ఎవరైనా వచ్చే అవకాశం వుంది. నేనెందుకు రాకూడదు? మీలాగే నేనూ వచ్చా‘ అన్నాడు సుసేనుడు.‘ఇది అడవికాదు. పర్వతపురి ద్వీపం. మేము నలుగురం పర్వతపురి రాజు గోవర్ధనుని పుత్రికలం. నీవిక్కడికి ఎలా వచ్చావు?‘ అని ప్రశ్నించింది. అతనాశ్చర్యపోయి తన వృత్తాంతం చెప్పాడు.‘ఓ..అయితే రాత్రి మేము వాహ్యాళిగా ఎక్కి వచ్చిన శంఖు పర్వతాన్ని నీవు ఎక్కావన్నమాట‘ అని నవ్వింది.‘అదేమి పర్వతం? దాన్నెక్కితే నేనిక్కడికి ఎలా రాగలిగాను?‘ అంటూ అడిగాడు ప్రసేనుడు.‘అది మా ప్రయాణాలకోసం వాడుకునే రెక్కల పర్వతం. సరే. నీ వునికి గుర్తిస్తే శిరచ్ఛేదం చేయిస్తారు రాజు. నిన్ను నా మందిరం లో దాస్తాను. ఈలోపు మరోసారి అక్కడికెళ్ళినపుడు నిన్ను అక్కడికి చేర్చుతాను‘ అని సుసేనుడ్ని, గుర్రాన్ని ముత్యం, పగడం గా మార్చి హారంలో ధరించి తన భవనానికి వెళ్ళింది.ఆమెకున్న శక్తి వల్ల రాత్రి మనిషి, గుర్రమై పగలు ముత్యం పగడం గా మారటం మరో సోదరి గమనించి ఆరాత్రి తాను తస్కరించి గులాబి, బంతి పువ్వులుగా మార్చి తనమందిరానికి తీసుకెళ్ళింది. మూడవ రోజు మరో సోదరి చూసి ఉంగరము, కంకణముగా చేసి తనతో పట్టుకుపోయింది. నాలుగవరోజు అందరికంటే చిన్న చెల్లెలు తెలుసుకుని తన శక్తితో పావురము, చిలుకగా మార్చి వారిమీది జాలితో బయటకుతెచ్చి వదిలిపెట్టింది. ఇద్దరూ శంఖుపర్వతం చేరగానే దానికి పెద్దపెద్ద రెక్కలు మొలిచి గాల్లోకి ఎగిరింది. సముద్రాలుదాటి వారిని మళ్ళీ అడవిలో వదిలి వెళ్ళిపోయింది.బ్రతుకుజీవుడా అనుకుంటూ యువరాజు తనకోసం భయపడి గాలిస్తున్న సైనికులను చేరి కోటకు వెళ్ళాడు. కానీ, అతనా నలుగురు కన్యలనూ వారి అపురూప లావణ్యాన్ని మరువలేక బెంగతో మంచం పట్టాడు.విషయం తెలుసుకున్న మహారాజు గోవర్ధనుడికి సందేశం పంపగా, అప్పటికే అతని గారాల పుత్రికలు సుసేనుడినే తమ కలల రాకుమారుడని తండ్రికి తెలిపి వుండటంతో సంతోషించి తన పుత్రికలనిచ్చి వివాహం చేశాడు. వారి శక్తి యుక్తులే కాక, మామగారి అండ కలిగినందున శత్రువుల భయం లేకుండా అనేక సంవత్సరాలు నిరాటంకంగా రాజ్యపాలనచేశాడు సుసేనుడు.
రెక్కల పర్వతం
Published Sun, Dec 30 2018 1:45 AM | Last Updated on Sun, Dec 30 2018 1:45 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment