కోరిక | funday crime story | Sakshi
Sakshi News home page

కోరిక

Published Sun, Dec 3 2017 12:40 AM | Last Updated on Tue, Oct 2 2018 4:09 PM

funday crime story - Sakshi

నీ భార్యని కిడ్నాప్‌ చేశాం. ఐదు లక్షలు రెడీ చేస్కో. ఇరవై నాలుగు గంటలు టైమ్‌. డబ్బు ఎక్కడ ఇవ్వాలో రేపు చెబుతాం.

అమృత హోటల్‌లో మీల్స్‌ సెక్షన్‌లో హడావుడి మొదలైంది. కార్తీక మాసం చలిరాత్రి.. ఎనిమిదింటికే వణికిస్తోంది. హోటల్‌ పక్కనే పార్క్‌ ఉండటంతో చల్లటి గాలి వీస్తోంది. హోటల్‌ ముందు బైక్‌ ఆపి.. కౌంటర్‌లో కూర్చున్న నరసింహ దగ్గరకు వచ్చాడు భూమయ్య. అతను ప్రశాంతి నగర్‌ కాలనీలో నరసింహ ఇంటిపక్కన ఇంట్లో ఉంటాడు. అప్పుడప్పుడు చపాతీలో, మసాలా దోశలో పార్సిల్‌ చేయించుకుని తీసుకెళ్లడానికి వస్తాడు భూమయ్య! ఇప్పుడు అందుకే అనుకున్నాడు నరసింహ. ‘‘నరసింహా..! మీ ఆవిడ గుడికని వెళ్లి ఇంకా ఇంటికి రాలేదు. పిల్లలు మా ఇంట్లో ఉన్నారు. అమ్మ... అమ్మా అని చిన్నది ఏడుస్తోంది. నువ్వు ఒక సారి ఇంటికి రా!’’ అన్నాడు తగ్గుస్వరంతో.. నరసింహ తలెత్తి వాల్‌ క్లాక్‌ వైపు చూశాడు. ఎనిమిదిన్నర దాటింది. ‘‘ఇంకా రాలేదా?’’ గొనుగుతున్నట్లు అన్నాడు.
భూమయ్య తలూపాడు.

‘‘వస్తున్నా.. నువ్వు పదా!’’ అన్నాడు నరసింహ ‘‘తొందరగా రా!’’ అని భూమయ్య వెళ్లిపోయాడు.నరసింహలో కంగారు మొదలైంది. కార్తీక మాసంలో శివుడి గుడికి వెళ్లి దీపాలు వెలిగించి వెంటనే వచ్చేస్తుంది. ఆరింటికి వెళ్లి ఏడింటి లోపలే వస్తుంది. ఈ రోజు ఎందుకు రాలేదు? అని ఆలోచనలో పడ్డాడు. నరసింహ కిచెన్‌లోకి వెళ్లి ‘‘అమ్ములూ..! కౌంటర్‌లో కూర్చో..! ఇంటికెళ్లొస్తా!’’ అన్నాడు.‘‘ఇప్పుడేంది? అవతల భోజనాల హడావుడి..!’’ అన్నది అమ్ములు.‘‘అర్జెంట్‌ పని ఉందిలే..!’’ అని హడావుడిగా బైక్‌ ఎక్కి బయలుదేరాడు.ప్రశాంతినగర్‌ కాలనీలో అన్నీ ఇండిపెండెంట్‌ ఇళ్లే. ఇప్పుడిప్పుడే డెవలప్‌ అవుతోంది. చాలా వరకూ ఖాళీ ప్లాట్‌లే ఉన్నాయి.నరసింహ వెళ్లే సరికి అతని ఇంటి ముందు ఇరుగుపొరుగు ఆడవాళ్లు కొందరు నిలబడి మాట్లాడుకుంటున్నారు.నరసింహ బైక్‌ ఆపగానే చిన్న కూతురు లత.. ‘‘నాన్నా!’’ అంటూ ఏడుస్తూ వచ్చింది. నరసింహ లతని ఎత్తుకున్నాడు.‘‘ఎందుకురా ఏడుస్తున్నావు?’’ అన్నాడు కన్నీళ్లు తుడుస్తూ...‘‘అమ్మా... అమ్మా..!’’ అన్నది ఏడుస్తూ..అక్కడికి రెండు ఫర్లాంగుల దూరంలో గుట్టమీద ఉంది శివాలయం. తమకంటే ముందే బయలుదేరి ఇంటికి వెళ్తున్నట్లు దేవకి చెప్పినట్లు కొందరు ఆడవాళ్లు నరసింహతో చెప్పారు.పిల్లలకు అన్నం పెట్టమని భూమయ్య భార్యకి చెప్పి నరసింహ, భూమయ్యా.. శివాలయం వైపు బయలుదేరారు.

గుడిలో జనం పల్చగా ఉన్నారు. దీపాలు వెలుగుతున్నాయి. గుడి వెనుక ఉన్న తోటలో వెతికారు. దేవకి జాడ తెలియలేదు. నరసింహలో భయం మొదలైంది. గుడికి వెళ్లిన దేవకి ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్లిందో అతడికి అర్థం కాలేదు.ఇక అక్కడ చేసేదేం లేక ఇంటికి వెళ్లారు. పిల్లలు అన్నం తిని భూమయ్య ఇంట్లోనే నిద్రపోతున్నారు. నరసింహకు ఇప్పుడు ఏం చెయ్యాలో అర్థం కావడంలేదు.‘‘నరసింహా! ఎందుకైనా మంచిది పోలీస్‌ స్టేషన్‌కి వెళ్లి రిపోర్ట్‌ ఇద్దాం పదా’’ అన్నాడు భూమయ్య.దేవకి ఎక్కడికీ వెళ్లే అవకాశంలేదు. ఆమెకి తల్లిదండ్రులు లేరు. అన్న మిర్యాలగూడలో ఉంటాడు. పెద్దగా రాకపోకలు కూడా లేవు.  నరసింహ జేబులో సెల్‌ఫోన్‌ రింగ్‌ అయ్యింది. అమ్ములు కాల్‌ చేసింది.‘‘ఎక్కడున్నావ్‌’’ తొమ్మిదిన్నర అయ్యింది. నేను ఇంటికి వెళ్లొద్దా? అర్జెంట్‌ పని అన్నావు. ఏంది?’’ అన్నది అమ్ములు.‘‘కొంచెం ఆగు.. వచ్చేస్తా..!’’ అని స్విచ్‌ ఆఫ్‌ చేశాడు.తర్వాత పోలీస్‌ స్టేషన్‌కి వెళ్లి దేవకి ఫొటో ఇచ్చి.. గుడికి వెళ్లి తిరిగి రాలేదని కంప్లైంట్‌ రాసిచ్చాడు నరసింహ.

దేవకి ఫొటో సిటీలోని అన్ని స్టేషన్‌లకి పంపించారు పోలీసులు. ఎస్సై రామ్‌కుమార్‌ ప్రశాంతినగర్‌ కాలనీలో దేవకి గురించి ఎంక్వైరీ చేశాడు. దేవకి ప్రవర్తనలో తేడాలేదని, ఆమెకు భక్తి ఎక్కువని, గుళ్లకే కాకుండా మిర్యాలగూడ దగ్గరలో ఉన్న జాన్‌పాడు దర్గాకు పిల్లలను తీసుకెళ్లి మొక్కుబడులు చెల్లిస్తుందని చెప్పారు.మంచి ప్రవర్తన గల గృహిణి దేవకి ఏమైనట్లు? వారి కుటుంబానికి శత్రువులు ఉన్నట్లు కూడా లేరు. ఎవరితోనూ శత్రుత్వం లేదని నరసింహ పోలీసులకు చెప్పారు.మరునాడు ఉదయం ఏడింటికి నరసింహ సెల్‌కి కాల్‌ వచ్చింది.‘‘నీ భార్యని కిడ్నాప్‌ చేశాం. ఐదు లక్షలు రెడీ చేస్కో. ఇరవై నాలుగు గంటలు టైమ్‌. డబ్బు ఎక్కడ ఇవ్వాలో రేపు చెబుతాం.’’‘‘నా దగ్గర అంత డబ్బులేదు.’’ అన్నాడు నరసింహ.‘‘మాకు అంతా తెలుసు. అమ్ములు మొగుడు యాక్సిడెంట్‌లో పోతే ఏడు లక్షలు నీకే ఇచ్చింది. హోటల్‌ బాగా నడుస్తోంది. ఎవరికీ చందాలు ఇవ్వవు. ఏ పార్టీ వాళ్లనీ లెక్కచెయ్యవు. డబ్బంతా ఏం చేస్తున్నావ్‌?’’‘‘అమ్ములు హోటల్‌ బిజినెస్‌లో పెట్టుబడి పెట్టింది. ఆమె నా పార్ట్‌నర్‌. నాకు ఊరకనే ఇవ్వలేదు.’’ అన్నాడు నరసింహ.‘‘అదంతా అనవసరం మాకు. ఐదు లక్షలు రెడీ చెయ్యకపోతే నీ భార్యని చంపేస్తాం. తరువాత ఏడుస్తావు.’’ అన్నాడు కిడ్నాపర్‌.కాల్‌ కట్‌ అయ్యింది. నరసింహ పోలీసులకు చెప్పాడు. దేవకిని ఎవరో కిడ్నాప్‌ చేసి ఐదులక్షలు డిమాండ్‌ చేశారని.నరసింహ సెల్‌లో రికార్డ్‌ అయిన నంబర్‌ టెలిఫోన్‌ డిపార్ట్‌మెంట్‌కి పంపించి.. ఎంక్వైరీ చేయించారు. అది ఒక కాయిన్‌ బాక్స్‌ నంబర్‌ అని తేలింది. ‘‘ఎవరైనా పిల్లలని కిడ్నాప్‌ చేసి డబ్బు డిమాండ్‌ చేస్తారు. వీడెవడయ్యా తల్లిని కిడ్నాప్‌ చేశాడు. అంతా విడ్డూరంగా ఉంది.’’ అన్నాడు ఇన్‌స్పెక్టర్‌ గోపీనాథ్, ఎస్సై రామ్‌ కుమార్‌తో...‘‘సార్‌...! నాకైతే నరసింహ మీదే అనుమానంగా ఉంది.’’ అన్నాడు ఎస్సై.‘‘ఎందుకు?’’

‘‘అతని భార్యను డబ్బుకోసం ఎవరో కిడ్నాప్‌ చేశారంటే నమ్మకం కలగడం లేదు. నరసింహకి అమ్ములుతో సంబంధం ఉందని హోటల్‌ వర్కర్స్‌ చెబుతున్నారు. ఆ విషయంలో భార్య గొడవ పెడుతూ ఉండి ఉంటుంది. అమ్ములు ఎర్రగా బుర్రగా చలాకీగా ఉంటుంది. తనని వదులుకోలేడు. అంతకంటే పెళ్లాన్ని వదిలించుకుంటేనే హ్యాపీ అనుకొని కిడ్నాప్‌ నాటకం ఆడుతున్నాడని నా అనుమానం.’’ చెప్పాడు ఎస్సై.
ఇన్‌స్పెక్టర్‌ గోపీనాథ్‌ ఆలోచనలో పడ్డాడు. ‘నేరాలు డబ్బుకోసం, ఆడదాని కోసమేగా ఎక్కువగా జరిగేది. అక్రమ సంబంధాల విషయంలో మనిషి ఎంతకైనా తెగిస్తాడు’ అనుకున్నాడు.‘‘సార్‌! కిడ్నాప్‌ అంతా నాటకం. గుడికి వెళ్లే దారిలో కొంతమేర స్ట్రీట్‌లైట్స్‌ లేవు. చీకటిగా ఉంటుంది. దేవకి గుడి నుంచి ఒంటరిగా ఇంటికి బయలుదేరింది. చీకటిగా ఉన్న ప్రాంతానికి రాగానే ఆమెను ఏ కారులోనో లాక్కెళ్లి పోయుంటారు.’’ అన్నాడు ఎస్సై.‘‘అది కరక్టే. దుండగులు దేవకిని ఎక్కడో బంధించారు. డబ్బును డిమాండ్‌ చేశారు. ఇరవై నాలుగు గంటలు డెడ్‌లైన్‌. ఇప్పుడు మనం వాళ్లు ఎక్కడి నుంచి కాల్‌ చేస్తున్నారో తెలుసుకోవాలి.’’‘‘సార్‌! వాళ్లు ఎక్కువసేపు మాట్లాడరు. ఏ కాయిన్‌ బాక్స్‌ నుంచో కాల్‌ చేస్తారు. అంతకంటే డబ్బు రెడీగా ఉందని, ఎక్కడ అందజేయాలో చెప్పమని అడిగి ట్రాప్‌ చేద్దాం’’ అన్నాడు ఎస్సై.‘‘యు ఆర్‌ కరెక్ట్‌.’’ అన్నాడు ఇన్‌స్పెక్టర్, ఎస్సైవైపు మెచ్చుకోలుగా చూస్తూ.  మర్నాడు ఉదయం ఏడుగంటలకు కిడ్నాపర్‌ చెప్పిన గడువు ముగుస్తుంది. ఆ సమయానికి నరసింహ పోలీస్‌ స్టేషన్‌లో ఉన్నాడు. కిడ్నాపర్‌ డబ్బు ఎక్కడికి తెమ్మంటాడో దాన్నిబట్టి వ్యూహరచన చెయ్యాలనుకున్నారు పోలీసులు.

‘‘నరసింహా..! చెప్పండి. మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా?’’ ప్రశ్నించాడు ఇన్‌స్పెక్టర్‌.‘‘సార్‌..! కార్పొరేటర్‌ ముకుంద తన బర్త్‌డే అని రెండు వందల మందికి భోజనాలు పెట్టమన్నాడు. నేను హోటల్‌ పెట్టిందే కొత్తగా. ఇంకా పుంజుకోలేదు. ప్రస్తుతం నష్టాల్లో ఉంది. అంతమందికి భోజనాలు పెట్టలేను. పదివేలు డొనేషన్‌ ఇస్తానన్నాను. ముష్టి వేస్తావా? అవసరం లేదన్నాడు. అప్పటినుంచి నా మీద కోపంగా ఉంది అతనికి.’’ చెప్పాడు నరసింహ.కార్పొరేటర్‌ ముకుందకు నేరచరిత్ర ఉన్న మాట వాస్తవమే. అతణ్ని కూడా అనుమానించాల్సిందే అనుకున్నాడు ఇన్‌స్పెక్టర్‌.కేవలం డబ్బు కోసమే దేవకిని కిడ్నాప్‌ చేయించింది కార్పొరేటర్‌ అనుకోవచ్చు. డబ్బు ముట్టగానే ఆమెను వదిలేస్తాడు. కానీ, నరసింహ అయితే కేవలం డబ్బుకోసం కిడ్నాప్‌ నాటకం ఆడే అవకాశం లేదు. ఆ సాకుతో ఆమెను మర్డర్‌ చేయించడానికి ప్లాన్‌ చేశాడా?పోలీస్‌ స్టేషన్‌లో పోలీసులు కిడ్నాపర్‌ నుంచి వచ్చే ఫోన్‌ కోసం ఎదురు చూస్తున్నారు. కానీ, ఎంతకీ కాల్‌ రాలేదు. నరసింహ సెల్‌ఫోన్‌ టేబుల్‌ మీద పెట్టి ఇన్‌స్పెక్టర్‌ ఎదురుగా కూర్చున్నాడు.
ఉదయం తొమ్మిది దాటింది. కిడ్నాపర్‌ పెట్టిన గడువు దాటి రెండు గంటలైంది. డబ్బు ఎక్కడికి తెచ్చి ఇవ్వమంటాడో సమాచారం లేదు. బహుశా నరసింహ పోలీస్‌ రిపోర్ట్‌ ఇచ్చి ట్రాప్‌ చేసే సన్నాహాలలో ఉన్నట్టు కనిపెట్టారా? ఏమో?అందరికీ విసుగ్గా ఉంది.‘‘సార్‌..! ఇంటికి వెళ్తాను. పిల్లలు ఎట్లున్నారో?’’ అన్నాడు నరసింహ.‘‘ఇంట్లో మీవాళ్లు ఎవరూ లేరా?’’‘‘మా అమ్మానాన్నా ఊరి నుంచి వచ్చారు. మా వదిన కూడా తోడుగా ఉంది. పిల్లలకు వాళ్లతో పెద్దగా చనువు లేదు. నేనుంటే ధైర్యంగా ఉంటారు. చిన్నది బాగా బెంగ పెట్టుకుంది’’ అన్నాడు నరసింహ.‘‘సరే..! వెళ్లండి. కాల్‌ వస్తే, వాళ్లేం చెప్పారో విని ఇక్కడికి రండి.’’ అన్నాడు ఇన్‌స్పెక్టర్‌.నరసింహ తల ఊపి అక్కడి నుంచి బయటికి వెళ్లాడు.ఆ రోజంతా కిడ్నాపర్‌ నుంచి ఏ సమాచారం రాలేదు.

తెల్లావారుతూనే పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌నుంచి ఇన్‌స్పెక్టర్‌ గోపీనాథ్‌కు సమాచారం వచ్చింది.బొంగులూరు దగ్గర యాక్సిడెంట్‌ జరిగింది. తెల్లవారు జామున నాలుగు గంటల సమయంలో అక్కడ ఆగి ఉన్న ట్రక్‌ను క్వాలీస్‌ వాహనం వెళ్లి గుద్దుకుంది. అందులో ఓ స్త్రీ, నలుగురు మగవాళ్లు ఉన్నారు. ఆడమనిషి, ముగ్గురు మగవాళ్లు స్పాట్‌డెడ్‌. ఇంకొక్కడు కొన ఊపిరితో ఉన్నాడు. ఆడమనిషి కిడ్నాపైన దేవకిలా ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. బాడీ ఉస్మానియాలో ఉంది. వెళ్లి కన్ఫార్మ్‌ చేస్కోండి.ఇన్‌స్పెక్టర్‌ గోపీనాథ్, ఎస్సై రామ్‌కుమార్, ఇద్దరు కానిస్టేబుల్స్‌తో ఉస్మానియా చేరుకున్నారు. వెళ్తూ నరసింహకు కాల్‌ చేసి హాస్పిటల్‌కు రమ్మన్నారు. మార్చురీలో దేవకి శవాన్ని చూసి గొల్లుమన్నాడు నరసింహ. డబ్బు డిమాండ్‌ చేసినవాళ్లు సమాచారం చెప్పకుండా దేవకిని తీసుకొని ఎక్కడికి బయలుదేరినట్లు?మోస్ట్‌మార్టమ్‌ రిపోర్ట్‌లో సమాచారం దొరికింది. దేవకి యాక్సిడెంట్‌లో చనిపోలేదు. రాత్రి ఎనిమిది గంటలకే ఆమె ప్రాణం పోయింది. గొంతు పిసికి చంపేశారు. శవాన్ని ఎక్కడికో తరలిస్తున్నారు.ఆ నలుగురు మనుషులు రౌడీషీటర్‌ జంగ్లీ యూసఫ్‌ గ్యాంగ్‌కు చెందినవారు. చావుబతుకుల్లో కొట్టుకుంటున్న ఫిరోజ్‌ అనేవాడికి తెలివొచ్చింది. ఆమెను చంపడానికి జంగ్లీ యూసఫ్‌ సుపారీ తీసుకున్నాడని స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు.

జంగ్లీ యూసఫ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అతడికి సుఫారీ ఇచ్చింది అమ్ములూ అని తెలిసి నివ్వెర పోయారంతా. అమ్ములును కస్టడీలోకి తీసుకోగా నేరం ఒప్పుకుంది.పటాన్‌చెరువులో ఉన్న బేరింగ్‌ ఫ్యాక్టరీ క్యాంటీన్‌లో వంట చేసేది అమ్ములు. ఆమె భర్త లారీ డ్రైవర్‌. అక్కడే క్యాంటీన్‌ సరుకు మాస్టర్‌ నరసింహ. అమ్ములు భర్త యాక్సిడెంట్‌లో చనిపోయాడు. నరసింహ, ‘మనం సొంతంగా హోటల్‌ పెట్టుకుందామ’ని అమ్ములుకు చెప్పాడు. వాళ్లకు అప్పటికే సంబంధం ఉంది. హోటల్‌ పెట్టాక తనను పెళ్లి చేసుకోమని అమ్ములు నరసింహను ఒత్తిడి చేసింది. భార్య బతికి ఉండగా మళ్లీ పెళ్లి చేసుకుంటే, చెడ్డపేరు వస్తుందని, అలాగే ఉందామని దాటవేస్తుండేవాడు నరసింహ.భర్తవల్ల పిల్లలు కలగలేదు అమ్ములుకు. పిల్లలు కావాలనే కోరిక బలంగా ఉందామెకు. నరసింహ వల్ల నెల తప్పింది. పెళ్లి చేసుకుందామంటే అబార్షన్‌ చేయించుకోమన్నాడు. భార్య బతికుందనే కదా పెళ్లి చేసుకోవడం లేదు, ఆమెను తప్పిస్తే సరిపోతుంది అని అమ్ములు డిసైడ్‌ అయింది. జంగ్లీ యూసఫ్‌కి సుఫారీ ఇచ్చింది.నరసింహ అక్రమ సంబంధం అతని భార్య ప్రాణాలు తీసింది. పిల్లలు  కావాలనే అమ్ములు కోరిక అందుకు దారి తీసింది.
- వాణిశ్రీ

కేవలం డబ్బు కోసమే దేవకిని కిడ్నాప్‌ చేయించింది కార్పొరేటర్‌ అనుకోవచ్చు. డబ్బు ముట్టగానే ఆమెను వదిలేస్తాడు. కానీ, నరసింహ అయితే కేవలం డబ్బుకోసం కిడ్నాప్‌ నాటకం ఆడే అవకాశం లేదు. ఆ సాకుతో ఆమెను మర్డర్‌ చేయించడానికి ప్లాన్‌ చేశాడా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement