
‘‘రాంబాబూ, నా పెళ్లిని ఓ కోటీశ్వరుడితోనే జరపాలనుకుంటున్నాడు మా నాన్న. అందుకే నీకు బాగా ఆస్తిపాస్తులున్నాయని నాన్నకి అబద్ధం చెప్పాను. కానీ నువ్వు పేదవాడివని ఆయనకి తెలిస్తే మన పెళ్లికి అసలు ఒప్పుకోడు. ఇప్పుడేం చేద్దాం? ’’ దిగులుగా అడిగింది రాణి. ప్రేయసి మాటలు విని రాంబాబు నిరాశగా నిట్టూర్చాడు.‘‘ఇప్పుడు నేను హఠాత్తుగా కోటీశ్వరుణ్ని కావాలంటే రాత్రికి రాత్రే ఏదైనా బ్యాంకు లూటీ చేయాలి లేదా ఎవరైనా కోటీశ్వరుని బిడ్డను కిడ్నాప్ చెయ్యాలి’’ చిరాగ్గా అన్నాడు.ఆ మాట వినగానే రాణి ముఖం వెలిగిపోయింది. ‘‘ఎస్... నీ రెండో ఐడియా బాగుంది. ఒకర్ని కిడ్నాప్ చేస్తే చాలు. నువ్వు ఒక్కరోజులో కోటీశ్వరుడివైపోతావ్’’ ఉత్సాహంగా అంది.‘‘నీకు వేళాకోళంగా ఉందా? కిడ్నాపింగ్ అంటే చిన్నపిల్లలాట అనుకున్నావా?’’‘‘డోంట్ వర్రీ.. నువ్వు చెయ్యాల్సిన కిడ్నాపింగ్‌కి పెద్దగా కష్టపడనక్కర్లేదు. ఎందుకంటే నువ్వు కిడ్నాప్ చెయ్యాల్సింది నన్నే! నన్ను కిడ్నాప్ చేసి మా నాన్నని కోటి రూపాయలు అడుగు. వెంటనే ఇచ్చేస్తాడు.అలా నువ్వు కోటీశ్వరుడివయ్యాక మన పెళ్లి ఇట్టే జరిగిపోతుంది’’ అంది రాణి.‘‘ఒకవేళ మీ నాన్న పోలీస్ కంప్లెయింట్ ఇస్తే?’’ సందేహం వెలిబుచ్చాడు రాంబాబు.
‘‘ఆ అనుమానం నీకు అక్కర్లేదు. ఎందుకంటే నేనాయనకు ఏకైక సంతానం. నా కన్నా ఆయనకు కోటి రూపాయలు ముఖ్యం కాదు. ఆయన ఇనప్పెట్టెలో ఎప్పుడు చూసినా నాలుగైదు కోట్లు మూలుగుతుంటాయి’’ అంది రాణి. ఆ మాట వినగానే రాంబాబు కళ్లు మెరిశాయి. ‘‘అలాగైతే నువ్వు చెప్పినట్టే చేస్తాను’’ హుషారుగా అన్నాడు.రాణి, రాంబాబులు ఒకే కాలేజీలో బీటెక్ చదివారు. కోటీశ్వరుడైన బిల్డర్ కాంతారావు ఏకైక కూతురు రాణి. అందుకే చిన్నప్పటి నుంచి గారాబంగా పెరిగింది. కాలక్షేపం కోసం గ్రాడ్యుయేషన్ వరకు చదివింది. కాలేజీలో అబ్బాయిలతో విచ్చలవిడిగా తిరిగేది. దుస్తుల్ని మార్చినట్టు బాయ్‌ఫ్రెండ్స్‌ని మార్చేది. అయితే రాంబాబుతో పరిచయమయ్యాక తొలిచూపులోనే అతనికి మనసిచ్చేసింది. పెళ్లంటూ చేసుకుంటే అతన్నే చేసుకోవాలనుకుంది. కానీ పేదవాడైన రాంబాబుతో తన పెళ్లి జరపడానికి తండ్రి ఒప్పుకోడు కాబట్టి రాంబాబుని అడ్డదారిలో కోటీశ్వరుణ్ని చేసెయ్యాలనుకుంది. దానికోసం తనను తాను కిడ్నాప్ చేయించుకోవడానికి సిద్ధపడింది. రాంబాబుది రాయలసీమకి చెందిన ఓ కుగ్రామం. చదువు కోసం నగరానికొచ్చాడు. తన స్నేహితుడు రమేశ్‌తో కలసి నగర శివారులోగల ఓ చిన్న ఇంట్లో అద్దెకుంటున్నాడు. బీటెక్ చేసినా మంచి ఉద్యోగం దొరక్కపోవడంతో అవసరార్థం ఓ కాల్‌సెంటర్‌లో పని చేస్తున్నాడు. నిజానికి రాంబాబు.. రాణిని ప్రేమించలేదు. ఆమె వెనుక ఉన్న ఆస్తిపాస్తుల్ని మాత్రమే ప్రేమిస్తున్నాడు. తండ్రి ఆస్తికి ఆమె ఏకైక వారసురాలు కాబట్టి ఆమెను పెళ్లాడితే కష్టపడకుండానే కోటీశ్వరుడు కావచ్చుననుకుంటున్నాడు. అందుకే ఆమెను ప్రేమిస్తున్నట్టు నటిస్తున్నాడు.రాంబాబు ఒంటరిగా ఉన్న ప్రతిసారీ రాణి అతని గదికి వచ్చి కబుర్లు చెబుతూ కాలక్షేపం చేస్తుంటుంది. ఈ రోజు కూడా అలా వచ్చినప్పుడు మాటల మధ్య కిడ్నాపింగ్ ప్లాన్ గురించి చెప్పింది. ‘‘రాంబాబూ, ఓ హాలీవుడ్ సిన్మా చూశాక నాకీ కిడ్నాపింగ్ ప్లాన్ తట్టింది. రిస్కు లేకుండా నువ్వు కోటీశ్వరుడు కావడానికి ఇదొక్కటే మార్గం. అయితే మన కిడ్నాపింగ్ డ్రామా ముగిసే వరకు నేను దాక్కోవడానికి ఓ స్థలం కావాలి’’ అంది.
‘‘ఈ గదికన్నా సురక్షితమైన చోటు నీకు ఇంకెక్కడ దొరుకుతుంది?’’ అన్నాడు రాంబాబు.‘‘కానీ ఇక్కడ నీతోపాటు నీ ఫ్రెండ్ రమేశ్ కూడా ఉంటాడు కదా. మన ప్లాన్ గురించి అతనికి తెలియడం మంచిది కాదు’’ అంది రాణి.‘‘డోంట్ వర్రీ.. అతను వచ్చేవారం సంక్రాంతి సెలవులు గడపడానికి తన ఊరికెళ్తున్నాడు. అయిదారు రోజుల వరకు తిరిగిరాడు. అతను ఊరికి వెళ్లాకే మన ప్లాన్ అమలు చేద్దాం’’ ఉత్సాహంగా అన్నాడు.‘‘ఓకే! రమేశ్ వచ్చే వేళయింది. నేనిక వెళతాను. మళ్లీ రేపు వస్తాను. బై.. బై’’ అంటూ రాణి అక్కడి నుంచి లేచి బయటికొచ్చింది.రమేశ్ సంక్రాంతి సెలవుల్లో తన ఊరికి వెళ్లిపోయాక రాణి, రాంబాబులు తమ పథకాన్ని ఆచరణలో పెట్టారు. ఆ రోజు ఉదయం రాణి ఇంట్లోవారికి షాపింగ్‌కి వెళ్తున్నానని చెప్పి రహస్యంగా రాంబాబు గదికి చేరుకుంది. వెంటనే తన ఫోన్‌ను స్విచ్చాఫ్ చేసింది. సాయంత్రం వరకు కూతురు ఇంటికి రాకపోయేసరికి కాంతారావు రాణికి ఫోన్ చేశాడు. కానీ ఆమె ఫోన్ స్విచ్చాఫ్ కావటం చూసి కంగారుపడి కూతురి కోసం ఎక్కడెక్కడో వెతికాడు.చీకటిపడ్డాక రాంబాబు, రాణి ఫోన్‌ను ఓ నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి, అందులో ఉన్న సిమ్‌ను తీసేసి మరో కొత్త సిమ్‌ను వేశాడు. అందులో నుంచే కాంతారావుకి రింగ్ చేసి గొంతు మార్చి మాట్లాడాడు. ‘‘మిస్టర్ కాంతారావు.. నీ కూతుర్ని కిడ్నాప్ చేశాం. ఆమెను ప్రాణాలతో వదలాలంటే కోటి రూపాయలు ఇవ్వాలి’’ అన్నాడు రాంబాబు.
ఆ మాట వినగానే కాంతారావు హడలిపోయాడు. అయితే అతను బేరమాడకుండా డబ్బు ఇవ్వడానికి వెంటనే ఒప్పుకున్నాడు. అప్పుడు రాంబాబు ‘‘సరిగ్గా రాత్రి పది గంటలకు సిరిపురం శ్మశానం పక్కనగల పాడుబడ్డ శివాలయం మెట్లపై కోటి రూపాయలున్న బ్యాగుపెట్టి వెళ్లిపో, డబ్బు ముట్టగానే నీ కూతుర్ని వదిలేస్తాం’’ అన్నాడు. దానికి కాంతారావు ఒప్పుకున్నాడు.రాత్రి పదిగంటలకు కాంతారావు బ్యాగుపెట్టి వెళ్లిపోయాక అంతవరకు అక్కడే నక్కి ఉన్న రాంబాబు బ్యాగు తీసుకొని తన గదికి తిరిగొచ్చాడు. ఆ బ్యాగులో రెండువేల రూపాయల నోట్ల కట్టలు మొత్తం యాభై ఉన్నాయి. తమ పథకం సఫలం కావడంతో రాణి, రాంబాబులు ఆనందం పట్టలేక నాట్యం చేశారు. అప్పుడే రాంబాబు సెల్ మోగింది. స్క్రీన్‌పైన కొత్త నంబర్ కనిపించింది. ఫోన్ ఎత్తగానే ఓ అపరిచిత కంఠం వినిపించింది, ‘‘మిస్టర్ రాంబాబు, నువ్వు చేసిన ఘనకార్యం నాకు తెలిసిపోయింది. నీ రహస్యం బయటపెట్టకుండా ఉండాలంటే కాంతారావు ఇచ్చిన డబ్బులో సగం నాకివ్వాలి’’ కటువుగా అన్నాడా వ్యక్తి. ఆ మాట వినగానే రాంబాబు ఉలిక్కిపడ్డాడు.
ఆ వ్యక్తి ఎవరో, తమ ప్లాన్ గురించి అతనికెలా తెలిసిందో అర్థం కాలేదు. ఎందుకైనా మంచిదని తను కాంతారావు వద్ద వసూలు చేసింది రెండు లక్షలే అని అబద్ధం చెప్పాడు. ఆ వ్యక్తి రాంబాబు మాటల్ని నమ్మాడు. ‘‘సరే, లక్ష నువ్వుంచుకొని లక్ష నాకివ్వు. నేను హైవేలో ఉన్న బ్లూమూన్ రెస్టారెంట్ బయట నీ కోసం ఎదురు చూస్తుంటాను. వెంటనే ఇక్కడికొచ్చెయ్. డబ్బు ముట్టాక నేను మళ్లీ నీ జోలికి రాను’’ అన్నాడతను. రాంబాబు సరేనన్నాడు.సూట్‌కేసులోంచి లక్ష రూపాయలు తీసుకొని ఓ ఆటోలో హైవే పక్కనున్న బ్లూమూన్ రెస్టారెంట్‌కి చేరుకున్నాడు. కానీ రెస్టారెంట్ బయట అతనికెవరూ కనపడలేదు. తనకొచ్చిన నంబర్‌కి ఫోన్ చేసి చూశాడు. కానీ ఆ నంబర్ స్విచ్చాఫ్ అని వచ్చింది. చాలాసేపు చూసి చివరికి విసుగొచ్చి తన గదికి తిరిగొచ్చాడు.కానీ ఆ గదిలోకి అడుగుపెట్టగానే అదిరిపడ్డాడు. రాణి నేల మీద రక్తపు మడుగులో నిర్జీవంగా పడివుంది. ఎవరో ఆమెను కత్తితో గొంతుకోసి, డబ్బున్న సూట్‌కేసును ఎత్తుకుపోయారు. రాంబాబుకి ముచ్చెమటలు పట్టాయి. కళ్లు బైర్లు కమ్మాయి. ఇక అక్కడ ఉండటం ప్రమాదమనుకొని బయటికి పారిపోబోయాడు. కానీ అప్పుడే అక్కడికి చేరుకున్న పోలీసులు అతణ్ని పట్టుకున్నారు.
రాంబాబు జరిగిందంతా నిజాయితీగా ఇన్‌స్పెక్టర్ విజయ్‌కుమార్‌కి చెప్పేశాడు. అంతా విన్నాక రాంబాబు హంతకుడు కాదనిపించింది విజయ్‌కి. బంగారు గుడ్లు పెట్టే కోడిలాంటి తన ప్రేయసిని చేజేతులా ఎందుకు చంపుతాడు? ఒకవేళ చంపాలనుకున్నా పోలీసులకు అనుమానం రాకుండా, ఆమెను ఎక్కడికైనా తీసుకెళ్లి చంపేవాడు. తన గదిలోనే ఆ పని చేసి పోలీసులకు పట్టుపడేవాడు కాదు. ఈ హత్య కచ్చితంగా రాంబాబుకి ఫోన్ చేసిన అజ్ఞాతవ్యక్తి చేసిన పనే అయ్యుంటుంది. రాంబాబును బ్లూమూన్ రెస్టారెంట్ దగ్గరికి రమ్మని చెప్పి, పోలీసులకు ఫోన్ చేసి హత్య జరిగిన సమాచారమిచ్చి రాంబాబును ఇరికించాడని విజయ్‌కి అర్థమైంది.హత్య జరిగిన ప్రదేశం చుట్టుపక్కల జనసంచారం తక్కువ కనుక అర్థరాత్రిపూట హంతకుణ్ని ఎవరూ చూసే అవకాశం లేదు. ఇప్పుడతణ్ని పట్టుకోవడానికి ఉన్న ఏకైక ఆధారం రాంబాబు సెల్‌లో రికారై్డన అతని ఫోన్ నంబరే. అయితే విచారణలో ఆ ఫోన్ నంబర్ అక్కడికి దగ్గర్లో ఉన్న ఓ పబ్లిక్‌బూత్ నంబరని తెలిసింది. హంతకుడు తన ఆచూకీ దొరకకూడదని తన సెల్‌ఫోన్ వాడకుండా నిర్జన ప్రదేశంలో ఉన్న పబ్లిక్‌బూత్ నుంచి మాట్లాడాడు.
ఘటనాస్థలంలో తీసిన శవం ఫొటోలను పరిశీలిస్తుంటే విజయ్‌ని ఓ విషయం ఆకర్షించింది. మృతురాలి కళ్లు ఆశ్చర్యంతో విచ్చుకొని ఉన్నాయి. చనిపోయే ముందు ఆమె ఆశ్చర్యానికి గురైందంటే ఆమెకు బాగా తెలిసిన వ్యక్తే ఆమెను చంపి ఉండాలి. అలాంటి వ్యక్తి ఎవరై ఉండొచ్చు? విజయ్ తన పోలీసు బుర్రకి పదునుపెట్టాడు. హఠాత్తుగా అతని బుర్రలో మెరుపు మెరిసింది.వెంటనే హంతకుని ఊరికెళ్లి అతణ్ని అరెస్టు చేసి థర్డ్‌డిగ్రీ ప్రయోగించాడు. అప్పుడతను నేరాన్ని అంగీకరించి తన ఇంట్లో దాచిన తొంభై తొమ్మిది లక్షల్ని బయటికి తీశాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు. రాంబాబు రూమ్మేట్ రమేశే! ఇంటరాగేషన్‌లో రమేశ్ జరిగిందంతా వివరంగా చెప్పాడు. ‘‘రాణి, రాంబాబు కలసి కిడ్నాపింగ్ ప్లాన్ గురించి మాట్లాడుకోవడం నేను చాటుగా విన్నాను. అప్పుడే నాలో దుర్బుద్ధి కలిగింది. వారు కాంతారావు నుంచి కోటి రూపాయలు వసూలు చేశాక, అందులో సగం నేను చేజిక్కించుకోవాలనుకున్నాను. అందుకే మా ఊరికి వెళ్లకుండా నగరంలోనే మరోచోట ఉన్నాను. రహస్యంగా వారి కార్యకలాపాల్ని గమనించసాగాను. ఆ రోజు రాత్రి రాంబాబు డబ్బున్న సూట్‌కేస్ తీసుకురావడం చూశాక ఓ పబ్లిక్‌బూత్ నుంచి అతనికి ఫోన్ చేశాను. గొంతు మార్చి మాట్లాడటం వల్ల నన్నతను గుర్తుపట్టలేదు. అయితే తను కాంతారావు నుంచి వసూలు చేసింది రెండు లక్షలే అని అబద్ధం చెప్పినప్పుడు నాకు కడుపు మండింది. మొత్తం డబ్బు దోచుకోవాలనిపించింది. అందుకే రాంబాబుని అక్కడికి దూరంగా ఉన్న బ్లూమూన్ రెస్టారెంట్ దగ్గరికి రమ్మని పిలిచాను. అతను బయటికి వెళ్లగానే నేను గదిలోకి దూరి రాణిని చంపి డబ్బు తీసుకొని పరారయ్యాను’’ అని ముగించాడు.రమేశ్ స్టేట్‌మెంట్ ఆధారంగా పోలీసులు రాంబాబుపై నకిలీ కిడ్నాపింగ్ కేసు పెట్టారు. తర్వాత రాణి తండ్రి కాంతారావుని కూడా అరెస్ట్ చేశారు. ఎందుకంటే కాంతారావు, రాంబాబుకి ఇచ్చిన డబ్బంతా నకిలీ నోట్లే అని తెలిసింది. రియల్ ఎస్టేట్ వ్యాపారం ముసుగులో అతను దొంగనోట్ల వ్యాపారం చేసేవాడని పోలీసుల ఇన్వెస్టిగేషన్‌లో బయటపడింది.అంటే ఈ నకిలీ కిడ్నాపింగ్ కేసులో చేతులు మారిన డబ్బు కూడా నకిలీదే! మొత్తం మీద ఈ కేసులోని నిందితులతో పాటు బాధితులు కూడా దుర్మార్గులే...!
మహబూబ్ బాషా