
నాకు అప్పుడప్పుడూ స్మోకింగ్ చేసే అలవాటు ఉంది. ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు స్మోకింగ్ చేయడం మంచిది కాదనే విషయం నాకు తెలిసినా, ఈ అలవాటును మార్చుకోవడం కష్టంగా అనిపిస్తుంది. ‘నికోటిన్ రీప్లేస్‌మెంట్ థెరపీ’తో ఉపయోగం ఉంటుందని ఒకరు సలహా ఇచ్చారు. మరొకరేమో... ఈ థెరపీ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అంటున్నారు. నిజానిజాలేమిటో తెలియజేయగలరు. – ఎస్‌ఎన్, హైదరాబాద్
స్మోకింగ్‌వల్ల సిగరెట్స్‌లో ఉండే నికోటిన్, కార్బన్ మోనాక్సైడ్, టార్.. ఇంకా ఇతర కెమికల్స్ వల్ల గర్భిణీలకు, అలాగే కడుపులోని శిశువులకు హాని జరుగుతుంది. గర్భిణీలలో స్మోకింగ్ వల్ల ఊపిరితిత్తులలో సమస్యలు, ఆయాసం, బీపీ పెరగడం, అబార్షన్లు, అవయవ లోపాలు, బిడ్డ బరువు పెరగకపోవడం, కడుపులో చనిపోవడం, నెలలు నిండకుండానే కాన్పులు వంటి అనేక సమస్యలు ఏర్పడవచ్చు. ముందు నుంచి ఎక్కువగా సిగరెట్లు కాలుస్తూ ఉండి, ఉన్నట్టుండి మానలేరు. అలా మానేసినా.. వారిలో తలనొప్పి, వికారం, తెలియని బాధ, డిప్రెషన్ వంటి లక్షణాలు ఏర్పడవచ్చు. అలాంటప్పుడు ‘నికోటిన్ రీప్లేస్‌మెంట్ థెరపీ (ఎన్‌ఆర్‌టీ)’ని డాక్టర్ సలహా మేరకు వాడొచ్చు. కానీ దీని ప్రభావం బిడ్డపైన ఎంతవరకు ఉంటుందని చెప్పడం కష్టం. ఎన్‌ఆర్‌టీ వాడేకంటే ముందు స్మోకింగ్ అలవాటు ఉండి గర్భిణీౖయెన స్త్రీలకు సపోర్టివ్ కౌన్సెలింగ్, బిహేవియర్ థెరపీ, మానసిక ధైర్యం, కుటుంబ సభ్యుల అండతో వారిని స్మోకింగ్ నుంచి మెల్లిగా మరల్చవచ్చు. అలాకాని పక్షంలో ఎన్‌ఆర్‌టీ ప్రయత్నించవచ్చు. ఎన్‌ఆర్‌టీ అంటే నికోటిన్ ఉండే చూయింగ్ గమ్స్, చప్పరించే మిఠాయిలు ( ్డౌ్ఛnజ్ఛ), ఇన్‌హేలర్స్, ప్యాచెస్‌లో ఏదో ఒకటి వాడటం. వీటిలోని నికోటిన్.. స్మోకింగ్ వల్ల వచ్చే నికోటిన్ శాతం కన్నా చాలా తక్కువ. కొంత మోతాదు వరకే రక్తంలోకి మెల్లిగా చేరుతుంది. కాబట్టి స్మోకింగ్ ఉన్నట్టుండి ఆపడం వల్ల వచ్చే విత్‌డ్రాయల్ లక్షణాలను మెల్లిగా అధిగమించవచ్చు.
నా వయసు 34. ఒక బాబు ఉన్నాడు. ఒక అమ్మాయి కూడా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాం. అయితే రెండోసారి ప్రెగ్నెన్సీ రావడం లేదు. ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం కావడం లేదు. ‘సెకండరీ ఇన్‌ఫెర్టిలిటీ’ సమస్య వల్ల ఇలా జరుగుతుంది అని ఒకరు చెప్పారు. ఇది ఎంత వరకు నిజం? రెండోసారి గర్భం రాకపోవడానికి ప్రధాన కారణాలు ఏమిటి? – పి.నళిని, రాజమండ్రి
ఒక ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత సాధారణంగా ప్రయత్నించినా, గర్భం రాకపోవడాన్ని ‘సెకండరీ ఇన్‌ఫర్టిలిటీ’ అంటారు. దీనికి అనేక కారణాలు ఉంటాయి. మీరు మీ బాబు వయసు రాయలేదు. సాధారణ కాన్పు లేక సిజేరియన్ ద్వారా డెలివరీ అయ్యారా అనేది కూడా రాయలేదు. ఇప్పుడు∙మీ బరువు ఎంత? పీరియడ్స్ ఎలా ఉన్నాయి? ఇంకా ఇతర సమస్యలేమైనా ఉన్నాయా? లాంటివి కూడా రాయలేదు. మీవారి వయసు ఎంత, వారికేమన్నా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా అనే అనేక అంశాలనుబట్టి మీకు రెండోసారి ప్రెగ్నెన్సీ ఎందుకు రావడం లేదనేది అంచనా వేయడం జరుగుతుంది. దాన్నిబట్టి అవసరమైన రక్త పరీక్షలు, హార్మోన్ పరీక్షలు, స్కానింగ్, ట్యూబ్‌టెస్ట్ వంటివి చెయ్యడం జరుగుతుంది. సమస్యను బట్టి చికిత్స ఇవ్వడం జరుగుతుంది. మొదటిసారి గర్భం దాల్చడానికి ఇబ్బంది లేకపోయినా, కొంతమందిలో మరలా గర్భం దాల్చడానికి భార్యలో కానీ, భర్తలో కానీ కొన్ని సమస్యలు ఏర్పడవచ్చు. మగవారిలో వీర్యకణాల సంఖ్య, వాటి కదలిక, నాణ్యత తగ్గవచ్చు. అలాగే హార్మోన్ల అసమతుల్యత ఏర్పడవచ్చు. అలాగే ఆడవారిలో ఒక గర్భం తర్వాత ఇన్‌ఫెక్షన్స్ వల్ల లేక ఇంకా వేరే కారణాల వల్ల ఫెలోపియన్ ట్యూబ్స్ మూసుకుపోయే అవకాశాలు ఉంటాయి. దానివల్ల గర్భం రాకపోవచ్చు. థైరాయిడ్, ప్రొలాక్టిన్ వంటి ఇంకా ఇతర హార్మోన్ల అసమతుల్యత వల్ల అండం పెరగకపోవడం, విడుదల కాకపోవడం, అండం నాణ్యత సరిగా లేకపోవడం, గర్భాశయంలో ఇన్‌ఫెక్షన్లు, అండాశయంలో నీటిగడ్డలు.. వంటి అనేక కారణాల వల్ల మరలా గర్భం దాల్చలేకపోవచ్చు.
నేను లావుగా ఉంటాను. ఇప్పుడు నేను ప్రెగ్నెంట్‌ని. ఈ సమయంలో బరువు తగ్గడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయడంలేదు. అలాగని బరువు కూడా ఏమీ పెరగడంలేదు. అయితే, లావుగా ఉన్న స్త్రీలకు పుట్టే పిల్లలకు ఆటిజం రిస్క్ ఉంటుందనే వార్త చదివాను. ఇది ఎంత వరకు నిజం?– కళ్యాణి, అనంతపురం
జన్యుపరమైన సమస్యలు, ఆహారంలో పెస్టిసైడ్స్, కెమికల్స్, తల్లిలో కొన్ని రకాల ఇన్‌ఫెక్షన్స్ వంటి అనేక కారణాల వల్ల బిడ్డలో మెదడులోని కణజాలంలో, నిర్మాణంలో, పనితీరులో సమస్యలు ఏర్పడి ఆటిజమ్ రావడం జరుగుతుంది. లావుగా ఉండటం వల్లే .. పుట్టే పిల్లలకు ఆటిజం రావాలని ఏమీ లేదు. కాకపోతే లావుగా ఉండి, వారిలో మధుమేహ వ్యాధి రావడం, అలాగే వారి జన్యువుల్లో ఏదైనా సమస్య ఉన్నప్పుడు, మామూలు వారికంటే వీరికి పుట్టే పిల్లల్లో ఆటిజమ్ ఉండే అవకాశాలు కొద్దిగా ఎక్కువ. అంతేకానీ కేవలం బరువు ఎక్కువగా ఉన్నందువల్ల పిల్లలకు ఆటిజమ్ వచ్చే రిస్క్ పెరగదు.
డా‘‘ వేనాటి శోభ
రెయిన్‌బో హాస్పిటల్స్
హైదర్‌నగర్,హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment