వెనకే ఉంది | funday horror story | Sakshi
Sakshi News home page

వెనకే ఉంది

Published Sun, Jan 28 2018 12:47 AM | Last Updated on Sun, Jan 28 2018 12:47 AM

funday horror story - Sakshi

దేవుణ్ణి నమ్మేవారికి దేవుడు కనిపించినట్లుగా,   దెయ్యాలను నమ్మనివాళ్లకు దెయ్యాలు కనిపించకుండా ఉండవు.

‘‘...అండ్, మీట్‌ మిస్టర్‌ దీపక్‌ మిశ్రా.. దెయ్యాల స్పెషలిస్ట్‌!’’‘హోటల్‌ చోళా ఇంటర్నేషనల్‌’ కాన్ఫరెన్స్‌ హాలు బయట లాంజ్‌లో రాత్రి బాగా పొద్దుపోయాక జరిగింది ఈ పరిచయం. దీపక్‌ మిశ్రాను భగవాన్‌కి పరిచయం చెయ్యడానికి ముందు, భగవాన్‌ని దీపక్‌ మిశ్రాకు పరిచయం చేశాడు దేవన్‌.. ‘‘హి ఈజ్‌ మిస్టర్‌ భగవాన్, హెడ్‌ ఆఫ్‌.. ‘నో గాడ్, నో ఘోస్ట్‌.’’ దేవన్‌ జర్నలిస్ట్‌. చెన్నైలోని ఒక ఆంగ్ల దినపత్రికలో సీనియర్‌ రిపోర్టర్‌. చోళా ఇంటర్నేషనల్‌లో దెయ్యాలపై ఆ మర్నాటి నుండి మూడు రోజులపాటు డీప్‌ డిబేట్‌ జరగబోతోంది. మిశ్రాది ఢిల్లీ. డిబేట్‌ కోసం చెన్నై వచ్చి చోళా ఇంటర్నేషనల్‌లో దిగాడు. భగవాన్‌ది హైదరాబాద్‌. డిబేట్‌లో మిశ్రాను డీ కొనడం కోసం చెన్నై వచ్చి అదే హోటల్‌లో తనకు కేటాయించిన గదికి చేరుకున్నాడు. ‘చోళా’తో దేవన్‌కి మంచి సంబంధాలు ఉన్నాయి. ప్రముఖులెవరు వచ్చినా, వెంటనే దేవన్‌కు ఫోన్‌ వెళుతుంది. 

‘‘వెల్, మిస్టర్‌ భగవాన్‌.. మీరు నో గాడ్‌.. నో ఘోస్ట్‌ అంటున్నారు. నుదుటిపై పెద్ద బొట్టుతో కనిపిస్తున్నారు?!’’.. అడిగాడు మిశ్రా. భగవాన్‌ పెద్దగా నవ్వాడు. ‘‘అది దేవుడికీ, దెయ్యానికీ సంబంధం లేని బొట్టు. నా కూతురు తనకేమీ తోచకపోతే, ఒక్కోసారి నాకు జడేసి, రబ్బరు బ్యాండు పెడుతుంది. అలాగే వచ్చేస్తాను బయటికి. ఇవాళ పెద్ద బొట్టు పెట్టింది’’.. చెప్పాడు భగవాన్‌. ‘‘మరి భగవాన్‌ అనే పేరేమిటి?’’‘‘దేవుడిని నమ్మనివాళ్లకు భగవాన్‌ అనీ, దెయ్యాల్ని నమ్మేవాళ్లకు దీపక్‌ అని.. పేరు ఉండకూడదనేముందీ?’’అలా.. కొంత టాపిక్‌ నడిచాక.. ‘రేపు డిబేట్‌లోకలుద్దాం’ అని చెప్పి, దేవన్‌ వెళ్లిపోయాడు. దీపక్, భగవాన్‌ మిగిలారు.‘‘సో.. రేపు మీరు దెయ్యాలు లేవని నాతో వాదించబోతున్నారు..’’ నవ్వాడు దీపక్‌. ‘‘లేవని వాదించబోవడం లేదు మిస్టర్‌ మిశ్రా. ఉంటే చూపించండని వాదించబోతున్నాను’’ అన్నాడు భగవాన్‌ తనూ నవ్వుతూ. ‘‘ఇప్పుడు చూపిస్తాను, మీకేమైనా అభ్యంతరమా?’’ అన్నాడు మిశ్రా సడన్‌గా. దెయ్యాల్ని నమ్మేవాళ్లకు, దెయ్యాలున్నాయని వాదించేవాళ్లకు భగవాన్‌ విలువ ఇవ్వడు. ఇవ్వకపోగా, ఒక్కోసారి తేలిగ్గా తీసిపారేస్తాడు. ఇప్పుడు మిశ్రానీ అలాగే తీసిపారేశాడు. ‘‘చూపించనక్కర్లేదు. మిమ్మల్ని చూస్తున్నాను కదా’’ అన్నాడు!

మిశ్రా హర్ట్‌ కాలేదు. ‘దేవుణ్ణి నమ్మేవారికి దేవుడు కనిపించినట్లుగా, దెయ్యాలను నమ్మనివాళ్లకు దెయ్యాలు కనిపించకుండా ఉండవు మిస్టర్‌ భగవాన్‌’’ అందామనుకున్నాడు కానీ, భగవాన్‌.. దేవుడిని కూడా నమ్మడు. అందుకే దేవుడి ప్రస్తావన లేకుండా.. ‘‘దెయ్యాలు.. మనుషులకు కావలసినప్పుడు కనిపించవు. దెయ్యాలకు మనుషులు కావలసినప్పుడు కనిపిస్తాయి’’ అని మాత్రమే అన్నాడు. ‘‘మరి ఇందాక చూపిస్తానన్నారు!’’ అడిగాడు భగవాన్‌. ‘‘అవునవును. కానీ మీరు నాలో దెయ్యాన్ని చూశాక, నేను చూపించే దెయ్యంలో మీకేం ఇంట్రెస్టు ఉంటుంది చెప్పండి?’’‘‘అవుననుకోండి, మనుషులకు కావలసినప్పుడు దెయ్యాలు కనిపించవని అన్నారు కదా, దాంతో నాకు ఇంట్రెస్టు పెరిగింది. మీరెలా చూపిస్తారో చూద్దామని’’ అన్నాడు భగవాన్‌. ‘‘చూడదలచుకున్నారా.. చెప్పండి’’ అడిగాడు మిశ్రా. ‘‘చూశాక, అది దెయ్యం కాదంటే, మీరు ఒప్పుకుంటారా? ’’ అన్నాడు భగవాన్‌. ‘‘దెయ్యం అవునో కాదో మీ మనసుకు తెలిసినప్పుడు నా ఒప్పుకోలుతో ఇక పనేముంటుంది?’’‘‘మీరు దెయ్యం అని నాకు చూపించిన దాన్ని, నేను దెయ్యం కాదు అంటే మీరు ఒప్పుకోవాలి కదా!’’‘‘అదే అంటున్నా.. మిస్టర్‌ భగవాన్‌. దెయ్యాన్ని చూపించడం వరకే నా పని. అది దెయ్యమా కాదా అన్నది మీ మనసుకు అనిపించినదాన్ని బట్టి ఉంటుంది.’’‘‘అలాంటప్పుడు అది దెయ్యం ఎలా అవుతుంది మిస్టర్‌ మిశ్రా. మీరు దెయ్యాన్ని చూపించినప్పుడు, ఆ దెయ్యాన్ని నేను కూడా చూడగలిగితేనే కదా అది దెయ్యం అవుతుంది.’’

‘‘రైట్‌. మిస్టర్‌ భగవాన్‌. మీ వెనుక నేనిపుడు దెయ్యాన్ని చూస్తున్నాను. ఈ క్షణంలో చూస్తున్నాను. ఆ దెయ్యాన్ని మీరు చూడాలని అనుకుంటున్నారా?’’‘‘అనుకోవడం లేదు. ఎందుకంటే నా వెనుక ఏ దెయ్యమూ ఉండదని, ఏ దేవుడూ ఉండడని నాకు తెలుసు’’.‘‘ఒకే దెన్‌. మీరు మీ మాట మీద నిలబడగలరా?’’ అడిగాడు మిశ్రా. ‘‘ఎస్‌’’ అన్నాడు భగవాన్‌.‘‘అయితే ఈ క్షణంలో మీరు.. మీరొక్కరే వాష్‌రూమ్‌లోకి వెళ్లిరాగలరా?’’‘‘వెళ్లి?’’‘‘అద్దంలో మీ ముఖం చూసుకుని రండి.’’  ‘‘చూసుకుంటే?!’’  ‘‘మీ వెనుక.. ఎవరున్నారో మీకు కనిపిస్తుంది.’’‘‘కనిపించకపోతే?’’‘‘కనిపించకపోతే.. నా దగ్గరికి వచ్చి చెప్పండి’’ అన్నాడు మిశ్రా. భగవాన్‌ లేచి, వాష్‌రూమ్‌లోకి వెళ్లాడు. తిరిగొచ్చి చూస్తే.. అక్కడ మిశ్రా లేడు!లాంజ్‌లో లైట్స్‌ ఆఫ్‌ అయి ఉన్నాయి. డిమ్‌ లైట్‌లో.. ‘‘మిస్టర్‌ మిశ్రా.. మిస్టర్‌ మిశ్రా’’ అని వెతుక్కుంటున్నాడు భగవాన్‌. 

‘‘రాత్రి ఏమైపోయారు.. అకస్మాత్తుగా’’.. డిబేట్‌ హాల్‌లో గుసగుసగా అడిగాడు భగవాన్‌. ‘‘నిద్రొచ్చి వెళ్లిపోయాను. దెయ్యం కనిపించిందా?’’ ‘‘అది చెప్దామనే వచ్చాను. మీరు కనిపించలేదు’’ చెప్పాడు భగవాన్‌. ‘‘నేను కనిపించలేదు సరే, దెయ్యం కనిపించిందా?’’ అడిగాడు మిశ్రా. ‘‘కనిపించలేదు’’ చెప్పాడు భగవాన్‌. ‘‘నమ్మను. మీరు అద్దంలో చూసుకోకుండానే వచ్చేసి ఉంటారు’’ అన్నాడు మిశ్రా. ‘‘చూశాను. కనిపించలేదు’’.. అబద్ధం చెప్పాడు భగవాన్‌. ‘‘ఏం కనిపించలేదు?’’‘‘దెయ్యం’’మిశ్రా నవ్వుకున్నాడు. డిబేట్‌ హాల్‌లో భగవాన్‌ వెనుక మిశ్రాకు స్పష్టంగా దెయ్యం కనిపిస్తోంది. భయం అనే దెయ్యం! భయం ఉందంటే దెయ్యం ఉందనే. లేనిది మాత్రం..వాష్‌రూమ్‌లో అద్దం. 
- మాధవ్‌ శింగరాజు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement