ఎడిటర్ భార్గవ పెద్దగా నవ్వాడు. ఎంత పెద్దగా అంటే.. ఆ పత్రికా కార్యాలయమే కనుక ఒక పెద్ద ఊడల మర్రి అయి ఉంటే.. ఆ ఊడలన్నీ కదిలిపోయేంత పెద్దగా!గాయత్రి అనే చిన్న పాప రాసిన ఉత్తరం ఆయన చేతిలో ఉంది. ఆ ఉత్తరం చదివాడు. అందుకే అంత పెద్దగా నవ్వాడు. ‘ప్రళయ’ పత్రికా కార్యాలయం అది. ఆ పత్రిక ఎడిటరే భార్గవ. ప్రళయ.. న్యూస్ పేపర్ కాదు. ‘వ్యూస్’ పేపర్. దినపత్రికే కానీ, ఘటనలను ఇవ్వదు. ఘటనల వెనుక ఉన్నదేమిటో ఊహించి ఇస్తుంది. అది కూడా మామూలు ఘటనలు కావు. దెయ్యాలు, భూతాలు, పిశాచాలు, విలయాలు, విపత్తులు, విధ్వంసాలు.. ఇలాంటి వాటిపై వ్యూస్ ఉంటాయి. కేరళలో మొన్న వరదలు వచ్చినప్పుడు ‘అయ్యప్పస్వామికి కోపం వచ్చిందా?’ అని ఈ పత్రిక విరామం లేకుండా స్టోరీల మీద స్టోరీలు కొట్టింది! అయ్యప్పస్వామికి కోపం వచ్చిందో లేదో తేల్లేదు కాదు, ప్రళయపై విమర్శలు మాత్రం వచ్చాయి. కానీ, సర్క్యులేషన్ పెరిగింది! ఏదైనా పత్రికలో ఒకటీ రెండూ కాలమ్స్ బాగా పాపులర్ అయి ఉంటాయి. ‘ప్రళయ’లో అలాక్కాదు. ప్రతి కాలమ్, ప్రతి పేజీ పాపులరే! రోజూ మూడో పేజీలో వచ్చే దెయ్యం కథైతే.. హారరిన్దీమిడ్నైటే! ప్రళయ.. వాకిట్లో పడగానే, దాన్ని చేతుల్లోకి తీసుకున్నవాళ్లు.. వెంటనే పేజీ తిప్పి రైట్ సైడ్ మూడో పేజీలో ఉండే దెయ్యం కథ కోసం వెతుక్కుంటారు. దానికో పెద్ద దెయ్యం బొమ్మ ఉంటుంది. కథ చదవగానే ఎంతటి ధైర్యస్థులకైనా దెయ్యం పట్టినట్లు అవుతుంది. అంత ఘోస్టీ›్లగా ఉంటుంది. పేజ్ త్రీలో వచ్చే కథ.. ‘పేజ్ త్రీ గర్ల్’లా ఉండాలని అంటాడు భార్గవ. అంటే.. వ్యామోహం కలిగించేలా! దెయ్యాల బొమ్మల్ని కూడా అతడు అందమైన అమ్మాయిల్లా వేయిస్తాడు. అసలా పైశాచిక అందానికే సగం ఛస్తారు పాఠకులు. విరబోసుకున్న జుట్టు, ఎరుపెక్కిన కళ్లు, ‘వాడాయ్..’ అని పాట పాడుతున్నట్లు ఉంటుంది ఆ దెయ్యం ఇలస్ట్రేషన్.
నవ్వు ఆపుకోలేక పోతున్నాడు భార్గవ. అతడి చేతిలో గాయత్రి అనే ఆ పాప రాసిన ఉత్తరమింకా అలానే ఉంది. మళ్లీ ఒకసారి చదివాడు. ‘‘డియర్ అంకుల్.. మీరు వేసే కథల్లో, బొమ్మల్లో ఎప్పుడూ ఆడ దెయ్యాలే ఉంటాయెందుకు? దెయ్యాల్లో మగ దెయ్యాలు ఉండవా? దయచేసి నా సందేహానికి సమాధానం చెప్పగలరు’’– ఇట్లు మీ పత్రిక రీడర్, గాయత్రి, టెన్త్ క్లాస్, హైదరాబాద్.భార్గవకు సంతోషం వేసింది. ‘ప్రళయ’కు టీనేజ్ ఫ్యాన్స్ కూడా ఉన్నారన్న సంతోషం అది. కాలింగ్ బెల్ నొక్కాడు.ధడేల్‌మని తలుపు తోసుకుని వచ్చాడు ప్రళయ కిశోర్. ఆఫీస్ బాయ్ అతడు. అతడి పేరు కిశోర్ మాత్రమే. ప్రళయలో పని చేస్తున్నాడు కాబట్టి ప్రళయ కిశోర్. ఆ ఆఫీస్‌లో ప్రతి ఒక్కరి పేరుకు ‘ప్రళయ’ అన్న మాట ప్రీఫిక్స్‌గా ఉంటుంది. ఆ నియమం పెట్టింది కూడా భార్గవే. చేస్తున్న పని మీద, చేస్తున్న వృత్తి మీద గౌరవం ఉన్నా లేకున్నా, ఆఫీస్‌లో ఉన్నంత వరకు గౌరవం పాటించడానికి పెట్టిన నిబంధన అది. తనని కూడా ప్రళయ భార్గవ అనే అనమంటాడు భార్గవ.‘‘ప్రళయ మనోహర్‌ని రమ్మను’’.. బాయ్‌తో చెప్పాడు భార్గవ.
మనోహర్ వచ్చాడు. కూర్చోమనలేదు భార్గవ. అతడికి తెలుసు.. తన స్టాఫ్ ఎవరికీ ఎడిటర్ ఎదురుగా కూర్చునేంత తీరిక ఉండదని. ‘‘ఇవాళ్టి పేజ్ త్రీ దెయ్యం కథ వచ్చిందా?’’ అడిగాడు. ‘‘రాలేదు సార్’’ అన్నాడు ప్రళయ మనోహర్. ‘‘ఎందుకు రాలేదు?’’ పెద్దగా అరిచేశాడు భార్గవ. ఉలిక్కిపడ్డాడు ప్రళయ మనోహర్. మూడో పేజి ఇన్‌ఛార్జి అతడు. పేజ్ త్రీ దెయ్యం కథ బయటి నుంచి వస్తుంది. దాన్ని రాస్తున్నది ప్రళయ భయంకర్. భయంకర్ అసలు పేరు దీనదయాళ్. భార్గవే అతడికి భయంకర్ అనే పేరు పెట్టాడు.‘‘ఇంకా పది కథలు రెడీగా ఉన్నాయి సార్’’ అన్నాడు ప్రళయ మనోహర్.. ‘ఇంకో పది రోజుల దాకా ప్రళయ భయంకర్ కథ ఇవ్వకున్నా పర్లేదు’ అన్న టోన్‌లో. ‘‘సో.. మిస్టర్ ప్రళయ మనోహర్.. ఇంకో పది రోజులు మిమ్మల్ని నా క్యాబిన్‌లోకి పిలవక్కర్లేదనేనా మీరు అంటున్నారు!’’ అన్నాడు భార్గవ. ప్రళయ మనోహర్ భయంతో బిగదీసుకుపోయాడు. అతడి భయం చూసి భార్గవ కాస్త తగ్గుముఖం పట్టాడు. ‘‘ఎన్ని కథలు రెడీగా ఉన్నా, ఇవాళ్టి కథను మనం రెడీ చేసుకోవాల్సిందే మనోహర్. లేకుంటే పత్రికను నడపలేం’’ అన్నాడు. ‘‘సర్.. ఫోన్ చేశాను. వాళ్ల మిసెస్‌కి బాగోలేదట. అయినప్పటికీ, లెవన్త్ అవర్‌లోనైనా ఇచ్చేస్తానన్నారు’’.. చెప్పాడు మనోహర్.‘‘ఏం బాగోలేదట?’’.. క్యాజువల్‌గా అడిగాడు భార్గవ. చాలా క్యాజువల్‌గా. జనరల్‌గా అతడు అలా అడగడు. ఆఫీస్ స్టాఫ్‌లో కూడా లేడీస్‌కి ఎవరికైనా బాగోలేదని తెలిస్తే, ‘ఏమైంది?’ అని అడగడు. జస్ట్ బాగోలేదు అన్నంతవరకే ఆ టాపిక్‌కి ఆపేస్తాడు. ‘‘ఏం బాగోలేదట?’’ మళ్లీ అడిగాడు.. ఆ అడగడంలో, తనకు కథ రాలేదన్న అసహనం కన్నా, భయంకర్‌పై కన్సర్నే ఎక్కువగా ఉంది. ‘‘దెయ్యం పట్టిందట సర్.. వాళ్లావిడకు’’ చెప్పాడు మనోహర్. ‘‘వ్హాట్..!’’ అన్నాడు భార్గవ.
భార్గవ క్యాబిన్‌లో అతడి ఎదురుగా కూర్చొని ఉన్నాడు భయంకర్. అతడి చేతిలో ఆవేళ్టి కథ ఉంది. ఇస్తానన్నట్లుగానే క్రితం రోజు కథను క్రితం రోజు రాత్రే చివరి నిముషంలో పంపించాడు కూడా. ‘‘మిసెస్ భయంకర్ ఇప్పుడెలా ఉన్నారు’’ అడిగాడు భార్గవ. ‘‘తను ఓకే.. నేనే బాగోలేనట..’’ ‘‘డాక్టర్ చూసింది తననా, మిమ్మల్నా?’’ నవ్వాడు భార్గవ.‘‘తనని చూసి, నాకు చెప్పాడు. దెయ్యం పట్టినట్లు బిహేవ్ చేస్తోంది డాక్టర్ అని చెప్పాను. ‘అయితే అది ఆమె ప్రాబ్లమ్ కాదు, మీ ప్రాబ్లమ్’ అన్నాడు. ‘అదేంటి డాక్టర్?’ అన్నాను. మీరు ఆమెను పట్టించుకోకపోవడం వల్లనే, ఆ స్పేస్‌లో ఆమెకు దెయ్యం పట్టింది’ అన్నాడు!’’.. చెప్పాడు భయంకర్. భయంకర్ వెళ్లిపోయాక, శ్రీకంఠను పిలిపించాడు భార్గవ. దెయ్యం కథకు రెగ్యులర్‌గా బొమ్మలు వేస్తుండే ఆర్టిస్ట్ అతడు.‘‘ఇవాళ్టి నుంచి, దెయ్యం కథకు మగ దెయ్యం బొమ్మ వెయ్యండి’’ చెప్పాడు భార్గవ. సంశయంగా అక్కడే ఆగిపోయాడు శ్రీకంఠ. ‘‘సర్క్యులేషన్ పడిపోయినా పర్లేదు.. మగదెయ్యం బొమ్మ వెయ్యండి’’ చెప్పాడు భార్గవ.
- మాధవ్ శింగరాజు
హారరిన్దీమిడ్నైట్
Published Sun, Sep 9 2018 12:34 AM | Last Updated on Sun, Sep 9 2018 12:34 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment