
పెద్ద భవంతి... గదుల్లోంచి గదులు.. వసారాల మీద వసారాలు! ఆ మేడ వైశాల్యానికి తగ్గట్టే నిండా మనుషులు. ముత్తాత, జేజమ్మ, తాత, నానమ్మ, నాన్న, అమ్మ, పెద్దమ్మలు, పెద్దనాన్నలు, అత్తలు, పిన్నులు, మామయ్యలు, బాబాయ్‌లు, అక్కలు, బావలు, అన్నలు, వదినలు, చెల్లెళ్లు, తమ్ముళ్లు, పిల్లలు.. పిల్లులు, కుక్కలు..! ‘‘గమనించావా?’’ అధికారం పెద్ద కోడలి మాటల్లో. ‘‘ఇంకా లేదు. కాని ఆమె స్పీడ్ .. అదీ చూస్తుంటే అనుమానమేమీ రావట్లే’’ చెప్పింది.‘‘అయినా కీన్‌గా అబ్జర్వ్ చెయ్’’ అని చెప్పి బయటకు వెళ్లిపోయింది పెద్దకోడలు. తలూపి పనిలో పడిపోతుండగా... ‘‘అభయంక్... ఆగు.. నేను పట్టి ఇస్తాను...’’ అంటూ మూడేళ్ల పిల్లాడి వెనకాల పరిగెడ్తూ సెక్రటరీ గదిలోకి వచ్చింది నైరా. అభయంకేమో ఓ పిల్లిపిల్ల వెనకాల ఉరుకుతున్నాడు. ఆ కూన గదిలో నాలుగు మూలలు తిరుగుతూ చివరకు సెక్రటరీ కుర్చీ కింద నక్కింది. దాన్ని పట్టుకునే ప్రయత్నంలో నైరా .. సెక్రటరీ కుర్చీ కిందకు దూరబోతుంటే.. ఉలిక్కిపడ్డ సెక్రటరీ ‘‘ఏయ్ ఏం చేస్తున్నావ్’’ అంటూ గబుక్కున తన కాళ్లను కుర్చీ మీద పెట్టుకొని స్కర్ట్‌ను కిందకు లాక్కుంది. అదేమీ పట్టించుకోకుండా...ఆ మాటలేవీ వినిపించుకోకుండా పిల్లిని పట్టుకోవడం మీదే కాన్సన్‌ట్రేట్ చేసింది నైరా సీరియస్‌గా. పిల్లికూనను చేతచిక్కించుకుని కుర్చీ కింద నుంచి లేచింది నింపాదిగా నైరా. దాని తల నిమురుతూ తననే తదేకంగా చూస్తున్న అభయంక్ దగ్గరకు వెళ్లింది.
‘‘తీసుకో...’’ అంటూ వాడి చేతుల్లో పెట్టింది. వాడు వెంటనే దాన్ని వదిలేశాడు. నైరా తిక్క నషాళానికంటింది. ఓ గంట నుంచి ఇదే తంతు. వాడి జబ్బ పుచ్చుకుని బరబరా లాక్కెళ్లి గదిలో పడేసి తాళం వేయాలన్నంత కోపంగా ఉంది. మొహంలో ఆ భావంతోనే వాడి వైపు గుడ్లురిమింది నైరా.ఆమె కోపాన్ని లెక్క చేయకుండా అభయంక్ మళ్లీ పిల్లిపిల్ల వెంట ఇంకో గదిలోకి పరిగెత్తాడు. అయితే నైరా వైల్డ్ ఎక్స్‌ప్రెషన్‌ను సెక్రటరీ లక్ష్యపెట్టింది. కనుబొమలు ముడివేసింది. ‘‘మేడం చెప్పినట్టు కీన్‌గా అబ్జర్వ్ చేయాల్సిందే’’ అనుకుంటూ లేచి నిలబడింది సెక్రటరీ. అప్పుడే నైరా ఫోన్ మోగింది. జీన్స్ ప్యాంట్ జేబులోంచి ఫోన్ తీస్తూ మరో గదిలోకి వెళ్లింది ఫోన్ మాట్లాడుకోవడానికి. ఆమె వెనకాలే సెక్రటరీ. నైరాకు కనిపించకుండా!‘‘ఆ... అమ్మా... చెప్పు’’ నైరా ఫోన్ లిఫ్ట్ చేస్తూ!‘‘లంచ్ చేశావా?’’ అమ్మ పలకరింపు అవతలి నుంచి.‘‘ఆ.. తిన్నాలే..’’ ఉదాసీనంగా నైరా. ‘‘ఎలా ఉంది కొత్త ఉద్యోగం?’’ కలవరంగా అమ్మ. ‘‘ వీళ్లు పిల్లలు కాదే..పిశాచాలు..’’ నైరా నొక్కి పలికింది.ఆ మాటను చెవులు రిక్కించి మరీ విన్నది సెక్రటరీ.పి..శా..చా..లు.. స్పష్టంగా వినపడగానే అక్కడి నుంచి కదిలింది. ‘‘ఏమైందో చెప్పు అంటుంటే..’’ ఫోన్‌లో అమ్మ కంటిన్యుయేషన్.‘‘లంకంత కొంప... ఇంటెడు మనుషులు.. వాళ్లకు పిల్ల దయ్యాలు.. చంపుతున్నాయే..’’ గోడు వెళ్లబోసుకుంది.‘‘ఎందుకొచ్చిన బేబీ సిట్టర్ ఉద్యోగం అంటే విన్నావా? లైఫ్ అంటే ఎక్స్‌పెరిమెంటల్‌గా ఉండాలి. రేప్పొద్దున ఎబ్రాడ్ వెళితే.. ఏ జాబ్ చేయడానికైనా రెడీగా ఉండాలి..అంటూ పెద్ద స్పీచ్ ఇచ్చావ్ కదే.. అనుభవించు’’ రెచ్చగొట్టింది అమ్మ.‘‘ఆపమ్మా... నువ్వొకదానివి! ఏదో బుద్ధి తక్కువై అన్నాను. నా తిప్పలేవో నే పడ్తాలే.. పెట్టేయ్ ఫోన్..’’ ఉక్రోషంతో ఫోన్ డిస్కనెక్ట్‌చేసింది నైరా.ఆపాటికే వివిధ వయసుల్లో ఉన్న ఒక డజన్ మంది పిల్లలంతా నైరా చుట్టూ చేరి గోల చేయసాగారు.ఓ చేతిలో ఫోన్.. ఇంకో చేత్తో నుదురు పట్టుకుని కూలబడి పోయింది నైరా నీరసంగా!
∙∙
నైరా ఆ జాబ్‌లో చేరి వారం అవుతోంది. అంతకుముందు ఎమ్‌ఎన్‌సీలో చేసేది. కాస్ట్‌కటింగ్‌లో ఆ ఉద్యోగం పోయింది. ‘‘బేబీ సిట్టర్’’ జాబ్ కోసం ఇంటర్వ్యూకి వచ్చినప్పడు ఈ పిల్లలను చూసి చాలా ముచ్చటపడింది. ఓసోస్.. ఈ బుజ్జిగాళ్లను సంభాళించలేనా అని అనుకుంది. అంత బుద్ధిగా కనిపించారు. మొదటి రోజే దర్శనమిచ్చారు ఆ పిల్లల్లోని రాక్షసులు!తిండి పెడ్తూనే ఉండాలి.. అల్లరి చేస్తూనే ఉంటారు. అంత తిండి ఎలా అరిగించుకుంటున్నారో.. అంత అల్లరికి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందో.. పెద్ద పజిల్ నైరాకి. సాయంకాలానికల్లా ఇల్లు పీకి పందిరేస్తారు. తెల్లవారి డ్యూటీకి వచ్చేటప్పటికిఎక్కడిదక్కడ చక్కగా నీట్‌గా సర్దేసి ఉంటుంది. అంత ఓపిక ఉన్నావాళ్లు తనను.. తనలాంటి ఇంకొంతమంది నౌకర్లను ఎందుకు పెట్టుకున్నట్టు? ఆ పెద్దల ప్రవర్తనా వింతే ఆమెకు. మిగతా నౌకర్ల తీరు కూడా!ఎవరూ ఎవరితో ఏమీ మాట్లాడుకోరు. అందరి షెడ్యూల్ ఆ ఇంటి పెద్ద కోడలే నిర్ణయిస్తుంది. ఇంప్లిమెంట్ అయ్యేలా చూస్తుంది సెక్రటరీ. కురు వృద్ధులు.. ఎప్పుడూ వాళ్ల గది దాటి బయటకు రారు. వాళ్లు నడుస్తుంటే ప్రత్యేకించి నేలను శుభ్రం చేయక్కర్లేదు. జుట్టే శుభ్రం చేస్తుంది. పిల్లలకూ అంతే జుట్టు. ఎవరు ఏ పని చేస్తున్నారో తెలీదు కాని అందరూ బిజీగా ఉంటారు. ఇంటికొస్తూంటారు.. పోతూంటారు!ఎప్పుడూ సందడే.. కాని సంబరమే ఉండదు! అన్నిటికన్నా విస్మయం ..నైరా తప్ప మిగిలిన నౌకర్లంతా ఒకేరకంగా ఉండటం. ఈ ఇల్లు ఊరు అవుట్‌స్కట్స్‌లో ఉందని ప్రత్యేకించి వెహికిల్ కూడా పంపుతున్నారు నైరా కోసం. అదో చిత్రం. ఒకసారి వచ్చిన డ్రైవర్ మళ్లీ కనిపించడు. తనను పెద్ద కోడలెప్పుడూ అనుమానాస్పదంగా చూస్తుంది. ఎందుకో.. నైరా అనుకుంటూండగా..పెద్ద కోడలు వచ్చింది బయట నుంచి. ఆమె వెనకాలే సెక్రటరీ గబగబా లోపలకి వెళ్లింది. ‘‘మేడం.. మన దగ్గర జాయిన్ అయినప్పటి నుంచీ ఆమె లాంగ్ స్కర్ట్సే వేసుకొని వచ్చింది. సో.. అబ్జర్వ్ చేయలేకపోయా. బట్ ఈరోజు మీరుగుర్తు చేశాక.. పనిగట్టుకొని మరీ గమనించా.. ఆమె మాటలు కూడా విన్నా. పిశాచాల్లా అని చెప్తుంది ఫోన్లో ఎవరికో మరి. ప్లస్ ఆమె పాదాలు... స్ట్రయిట్’’ చెప్పింది. పెద్ద కోడలు ఎడమ కన్ను ఐబ్రో పైకి లేచింది. చెవులు నిటారయ్యాయి. ‘‘హూ.. తప్పదన్నమాట’’ అంది.‘‘యెస్ మామ్’’
‘‘ఈ రోజు వెహికిల్ ఎందుకు పంపలేదు? ఫోన్ చేస్తుంటే కూడా అవుటాఫ్ కవరేజ్ ఏరియా వస్తుంది. ఏమై ఉంటుదబ్బా..? కొంపదీసి నా సర్వీసెస్ చాలని చెప్పడానికి ఇండికేషన్ కాదుకదా ఇది?’’ క్యాబ్‌లో కూర్చున్నాక నూట ముప్పయో సారి నైరా అలా అనుకోవడం. నైరా పెట్టిన డెస్టినేషన్ దగ్గర ఆపాడు క్యాబ్.. డ్రైవర్. ఆలోచనలకూ బ్రేక్ పడడంతో అడిగింది డ్రైవర్‌ని... ‘‘ఏమైందీ?’’ అని. ‘‘మీ డెస్టినేషన్ వచ్చింది మేడమ్’’ అంటూ ఫోన్లో ఫేర్ చూస్తున్నాడు డ్రైవర్. కార్ విండోలోంచి అవతలికి చూసింది. అపరిచిత ప్లేస్‌లా అనిపించి ‘‘ఎటు తీసుకొచ్చావ్?’’ అడిగింది. ‘‘మీరు పెట్టిన పాయింట్‌కే. థౌజెండ్ ట్వంటీఅయింది మేడం ఫేర్’’ అని డ్రైవర్ చెప్తూంటే చెవికెక్కడం లేదు ఆమెకు.. కార్ దిగింది. అక్కడేమీ లేదు. శ్మశానం తప్ప. ‘‘ఇదేంటి? శ్మశానం..?’’నైరా.‘‘మేడం.. మీరు పెట్టిన డెస్టినేషనే చూసుకోండి..’’చెప్పాడు. నిజమే! చూస్తే.. ప్లాట్ నెంబర్ 420.. రీచ్డ్ అని చూపిస్తోంది జీపీఎస్ మ్యాప్. నైరా మొహంలో నెత్తురు చుక్కలేదు.
∙సరస్వతి రమ
Comments
Please login to add a commentAdd a comment