‘‘రేపటి నుంచి ఈ షెడ్యూల్ షూటింగ్ మొత్తం చిత్రకుటీర్ స్టూడియోలో’’ చెప్పాడు ద్యుతికి ఆమె తండ్రి.ఆ క్షణం నుంచి ఆమె కాలు నేల మీద నిలవడం లేదు. ఎక్సైట్‌మెంట్‌తో ఆ రాత్రి నిద్ర కూడా పోలేదు. తనకు ఊహ తెలిసిననాటి నుంచి సినిమాలంటే పిచ్చి ఉండేది కాని నటి కావాలని మాత్రం ఎప్పుడూ అనుకోలేదు. చిత్రకుటీర్ స్టూడియో గురించి కథలు కథలుగా చెప్తూంటే వింటూ పెరిగింది. ఆ ప్రొడక్షన్ సినిమాలు దాదాపుగా చూసింది. ఎప్పటికైనా ఆ స్టూడియో చూడాలని ఆశ. తన భరతనాట్య ప్రదర్శనలు చూసిన ప్రతివాళ్లూ తండ్రికి సలహా ఇచ్చేవారు.. ‘‘అమ్మాయి చక్కగా ఉంది.. అభినయం అద్భుతం.. సినిమాల్లో ట్రై చేయలేకపోయారా?’’ అంటూ. చిత్రకుటీర్ మీదున్న ఆకర్షణతో తండ్రి చేసే ప్రయత్నాలకు అడ్డు చెప్పలేదు ధ్యుతి.ఫస్ట్ చాన్స్ తమిళ్‌లోనే వచ్చింది. యూరేకా అనుకుంది మనసులో. చాలా తమిళ సినిమాల ఇండోర్ షూటింగ్ అంతా చెన్నైలో ఉన్న చిత్రకుటీర్‌లోనే అవుతుంది కాబట్టి. తీరా తొలి క్లాప్ తర్వాత తెలిసిందేంటంటే ఆ సినిమా మొత్తం అవుట్‌డోరేనని. నీరసపడిపోయింది. ఆనక చేసిన మూడు తెలుగు సినిమాలూ చిత్రకుటీర్‌కు దూరంగానే పూర్తయ్యాయి. అయిదో సినిమా.. అదీ సెకండ్ షెడ్యూల్‌కి గానీ అవకాశం రాలేదు. చిత్రకుటీర్.. తనకే కాదు.. సినిమా రంగంలోని నటీనటులు అందరికీ ఇష్టమైన స్టూడియో. వావ్... ఆ ఉద్విగ్నతతోనే బలవంతంగా నిద్రలోకి జారుకుంది ద్యుతి. మరిచిపోనివ్వకుండా కలలోనూ కదలాడింది చిత్రకుటీర్. కొండలు.. కోనలు.. జలపాతాలు.. సెలయేర్లు.. పూల వనాలు.. దట్టమైన అడవులు.. రాజభవనాలు.. కోటలు.. మాంత్రికుల గుహలు.. దయ్యాల పొదలు.. గుళ్లు.. గోపురాలు.. మోడర్న్ కాలనీలు.. థియేటర్లు.. పార్క్‌లు.. ఫ్లై ఓవర్‌లు.. రైల్వే స్టేషన్.. ఒక్కటేమిటి.. చిన్న సైజు దేశాన్నే కట్టేశారు.విప్పారిన కళ్లు.. ఉప్పొంగిన మనసుతో... స్టూడియో అంతా తిరిగింది... ఆడింది... పాడింది.. ఆ అనుభూతిని ఆలింగనం చేసుకుంటూ.. ఓ చోట ఆగిపోయింది ద్యుతి... చప్పున లేచి కూర్చుంది. ‘‘అంత అందంగా ఊరించి ఇంత భయపెట్టిందేంటి? పాడు కల.. బాబోయ్..’’ అనుకుంటూ తన చేత్తో తనే వీపుని చరుచుకుంది... భయం పోవడానికి.
‘‘ఇంకా ఎంతసేపూ.. అవతల డైరెక్టర్ కేకలేస్తున్నాడు..’’ విసుక్కుంటూ అసిస్టెంట్ డైరెక్టర్.‘‘మేకప్.. అయిపోవచ్చింది..’’ అపాలజీ ఇస్తున్నట్టుగా ద్యుతి తండ్రి. ‘‘హీరో వచ్చే టైమ్‌కల్లా ఉండకపోతే.. ఈ రోజు సత్తెనాశ్...చెప్తున్నా...’’ హెచ్చరిస్తూ వెళ్లిపోయాడు అసిస్టెంట్ డైరెక్టర్.ధ్యుతి తండ్రీ అంతే హడావిడిగా మేకప్ రూమ్ వైపు పరిగెత్తాడు. తలుపు వేసి ఉంది. ‘‘ద్యుతీ... త్వరగా రా.. హీరో వచ్చేశారు’’తలుపుకొడుతూ చెప్పాడు. ‘‘అయిదు నిమిషాలు నాన్నా..’’ తలుపు తీయకుండానే జవాబు చెప్పింది ధ్యుతి. అయిదు నిమిషాలు అంది కాని.. అయిదు గంటలే పట్టేట్టుంది. ఇప్పుడప్పుడే అక్కణ్ణించి కదలాలని లేదు ద్యుతికి. గ్రీన్ రూమా ఇది? తాము ముస్తాబు కావడానికి దేవకాంతలు స్వయంగా డిజైన్ చేసుకున్నారేమో అన్నంత అద్భుతంగా ఉంది... అన్నీ అద్దాలే... గోడల్లేవ్. ఒకదాన్నిమించి ఒకటి... తనను అందంగా చూపించడానికి పోటీ పడుతున్నట్టున్నాయ్!అద్దాల ముందు రకరకాల పోజుల్లో నిలబడి తన సౌందర్యానికి తానే ముగ్ధురాలవుతోంది ద్యుతి...అభినయిస్తోంది... కెమెరా కన్ను కన్నా.. సిల్వర్ స్క్రీన్ కన్నా గొప్పగా ప్రొజెక్ట్ చేస్తున్నాయి ఆ అద్దాలు.. నవ్వుతోంది.. ఏడుస్తోంది.. చిలిపిగా చూస్తోంది.. కొంటెగా కళ్లెగరేస్తోంది... బుంగమూతితో అలుగుతోంది.. కోపంగా కళ్లురుముతోంది.. ఒక్క అద్దం ముందు నిలబడి ఇస్తున్న ఎక్స్‌ప్రెషన్స్‌ను అన్ని అద్దాలు ప్రతిబింబింపజేస్తు్తన్నాయి.. ఆశ్చర్యంగా మెడను మాత్రమే తిప్పి వెనక ఉన్న అద్దాల్లోకి చూసింది.. వాటి ఎదురుగా నిలబడి ఉన్నట్లు తన ప్రతిబింబాన్ని చూపిస్తున్నాయి. మళ్లీ ముందుకు తిరిగింది.. తన వెనకాలో ఎందరో మనుషులున్నట్లు కనపడ్తోంది ప్రతి అద్దంలో. అందరూ ఆడవాళ్లే! పదహారేళ్ల అమ్మాయి నుంచి డెబ్భై ఏళ్ల వయసుదాకా !
ఓ అమ్మాయి ఏడుస్తోంది.. ఇంకో యువతి నవ్వుతోంది.. ఒకావిడ కోపంగా చూస్తోంది.. ఓ అమ్మ దీనంగా మొహం పెట్టింది.. ఇంకో అవ్వ జాలిపడ్తూన్నట్టు... చటుక్కున్న వెనక్కి తిరిగింది ద్యుతి.. ఎవ్వరూ లేరు.. మళ్లీ అద్దంలోకి చూసింది.. ఏడుస్తూ.. నవ్వుతూ.. కోపంగా.. దీనంగా.. జాలిపడుతూ.. ఆ స్త్రీలే! ఈసారి వాళ్ల వెనకాల రకరకాల వయస్సుల్లోని మగవాళ్లు గుంపులు గుంపులుగా! భృకుటి ముడి వేసి తీక్షణంగా చూస్తున్నారు.. ఆ మహిళలందరినీ కంట్రోల్ చేస్తున్నట్టుగా! ఒక్కో అద్దం ముందుకు పరిగెడ్తోంది ద్యుతి.. అన్ని అద్దాల్లో అవే ప్రతిబింబాలు... ఆమెను చుట్టిముట్టి... ట్రాలీలా తిరుగుతున్నట్టు... భరించలేక రెండు అరచేతులతో చెవులను మూసుకుంటూ తలవంచి కుర్చీలో కూలబడ్డది. కొన్ని క్షణాలకు శాంతించినట్టయి నెమ్మదిగా తల పైకెత్తింది...ఎదురుగా ఉన్న నిలువుటద్దంలో.. అచ్చం తనలాగే.. తనలాగే ఏంటి.. తనే! విరబోసుకున్న జుట్టును ముందుకు వేసుకొని.. అద్దంలోంచి బయటకు వచ్చి తన పాదాల మీద పడ్తోంది జుట్టు.. ఒళ్లు జలదరించినట్టయి చటుక్కున పాదాలను వెనక్కి లాక్కుంది.. ఆ చర్యకు అద్దంలోని «ఆమె నవ్వింది.. కనుబొమలెగరేస్తూ! అంతలోకే చేతులు చాచి.. తన చుబుకం పట్టుకొంది..‘‘ఏయ్.. ఎవరు నువ్వు?’’ అంటూ ఆ చేయిని తోసేయబోయింది..ద్యుతి. ఏ స్పర్శా తగలక చేయి గాల్లోనే ఆడింది. ఆ విసురికి ఎదురుగా ఉన్న అద్దానికి కొట్టుకొని దెబ్బ తగిలింది. ‘‘ప్చ్.. ప్చ్..ప్చ్.. పాపం’’ అంటూ వెటకారం చేస్తోంది అద్దంలోని ««ఆమె. ‘‘ఏయ్... ’’అరిచింది అహం దెబ్బతిన్న ద్యుతి. ‘‘ష్.. అరవకు.. నీ కేకలు ఈ గది దాటి మూడో చెవికి వినిపించవ్’’ కోపంగా అద్దంలోని బింబం. ఏడుపొస్తోంది ద్యుతికి.. కలా ? నిజమా? కలంటే గుర్తొకొచ్చింది.. రాత్రి కలలో.. ఇదే మేకప్ రూమ్.. ఈ మనుషులే.. !ఆ జ్ఞాపకానికి వెన్నులోంచి వణుకు.. లేచి నిలబడింది...వెంటనే ఎదురుగా ఉన్న అద్దంలోని ఆమె కూర్చుంది. ఇవతల ద్యుతికి షాక్.. అసంకల్పితంగానే తనూ కుర్చీలో కూర్చుంది అద్దంలోంచి చూపు మరల్చకుండానే. తక్షణమే అద్దంలోని «ఆమె నిలబడింది!
‘‘దేవుడా.... ఏంటిదంతా? నన్నెందుకు వేటాడుతున్నావ్? ఇందాకటి వాళ్లంతా ఎవరు? అసలు ఈ గది ఏంటి?’’ఏడుస్తోంది ద్యుతి. ‘‘హూ..దేవుడా? ఎక్కడా? ఇక్కడ దేవుళ్లుండరు. కన్నీళ్లు దాచుకో .. ముందు ముందు అవసరమవుతాయ్. ఏడుస్తూనే చావాలి కదా’’ అద్దంలోంచి.బిత్తరపోయింది ఆ మాటలకు ద్యుతి. ‘‘ఊ.. అవును. నీలాగే మేమంతా నటులమే. చిత్రకుటీర్ గురించి ఎన్నో డ్రీమ్స్‌తో వచ్చినవాళ్లమే. మా వెనకాల కనిపించిన మగవాళ్లంతా.. మమ్మల్ని వాడుకుని మా జీవితాల్ని ఇక్కడే సమాధి చేశారు. రేపు నీ గతీ అంతే! వెళ్లిపో.. ఇక్కడినుంచి కదులు.. వీళ్లంతా చెబితే నేను వినలేదు.నాలాగా.. వీళ్లందరిలా నువ్వు కావొద్దు.. పో... వెళ్లిపో! ’’ గద్దిస్తోంది అద్దంలోంచే తన పైపైకి వస్తూ ఆమె.చిగురుటాకులా వణికిపోతూ... ‘‘పోతా.. ఇప్పుడే వెళ్లిపోతా.. నన్నేం చేయొద్దు ప్లీజ్..’’ అని చేతులు జోడించి.. వెనక్కి తిరిగి.. తిరిగి ప్రాధేయ పడుతూ.. తలుపు తెరిచి..బయటకు పరిగెత్తింది ద్యుతి.గది అవతల సిగరేట్ కాలుస్తూ నిలబడ్డ ద్యుతి తండ్రికి తన కూతురు ఎందుకలా పరిగెడ్తోందో.. అర్థం కాలేదు. సిగరేట్ కిందపడేసి కాలితో నులిమి ‘‘ద్యుతీ.. ఆగు.. ఆగమ్మా.. ’’ అంటూ కూతురి వెనక పరుగులు తీశాడు.
- సరస్వతి రమ
చిత్రకుటీర్
Published Sun, Apr 21 2019 12:26 AM | Last Updated on Sun, Apr 21 2019 12:26 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment