అదా బలమైనది... తనో బక్కప్రాణి | Funday Kukka Bathuku Story On A Stray Dog Life | Sakshi
Sakshi News home page

కుక్క బతుకు

Published Sun, May 24 2020 3:22 PM | Last Updated on Sun, May 24 2020 3:24 PM

Funday Kukka Bathuku Story On A Stray Dog Life - Sakshi

కుక్క బతుకు

జూలు లేని గ్రామ సింహం నిద్దుర లేచింది. కాదు, కాదు, ఆకలి నిద్దుర లేపింది. ‘అబ్బా నిన్న రాత్రే కదా కడుపునిండా నీళ్లు తాగింది. అప్పుడే ఆకలేంటి’ అనుకుంది. తన చుట్టుపక్కల మొత్తం ఇష్టమైన ఆహారంతో నిండిపోయి ఉన్నట్లు రాత్రి కల వచ్చింది దానికి. సగం తెరిచిన కళ్లతో చూట్టూ చూసింది. చెత్త, చెదారం తప్ప ఏమీ కనిపించలేదు. మళ్లీ నిరాశ. 
మెల్లగా పైకి లేచి, బద్ధకంగా ఒళ్లు విరిచింది. 

అలవాటుగా ఎంతో ఉత్సాహంతో బస్తీలోని పూరిగుడిసెల వైపు పరుగులు తీసింది. కొద్ది సేపటి తర్వాత ఓ గుడిసె ముందు ఆగి, లోపలికి చూస్తూ ఉండిపోయింది. ఇంతలో ఓ పదేళ్ల కుర్రాడు గుడిసెలోంచి బయటకు వచ్చాడు. ఒకరిని, ఒకరు చూసుకున్నారు. స్నేహ పూర్వకంగా పలకరిస్తున్నట్లు తోక ఊపిందది. 
ఆ పిల్లాడు సంతోషంతో ‘‘అమ్మా! నల్లకుక్క వచ్చిందే’’ అన్నాడు లోపలికి చూస్తూ. 
ఓ మధ్య వయస్కురాలైన మహిళ బయటకు వచ్చి, దాని వైపు కోపంగా చూస్తూ..‘‘ పాడు కుక్క మళ్లీ వచ్చిందా! దీని నడుం విరగ్గొట్టినా పాపం లేదు’’ అంటూ నేల మీద ఉన్న కర్ర తీసుకుని దానిపైకి విసిరిగొట్టింది. అది నేరుగా వెళ్లి దాని తలకు బలంగా తగిలింది. 
నల్లకుక్క బాధతో గట్టిగా కుయ్, కుయ్‌ అంటూ అక్కడి నుంచి పరుగుపెట్టింది. 

వారం రోజులక్రితం ఆ సంఘటన జరగనంత వరకు నల్లకుక్కకు ఆ కుటుంబంతో మంచి అనుబంధమే ఉండేది. కూలీ పని కోసం నగరానికి వలస వచ్చిన ఆ కుటుంబం తమతో పాటు తెచ్చుకున్న దాన్ని సొంత మనిషిలా చూసుకునేది. 
దానికి స్నూపీ, టామీ, జాకీలాంటి ముద్దు పేర్లు పెట్టకపోయినా... కడుపునిండా నాలుగు ముద్దలు పెట్టేవారు. 
కరోనా లాక్‌డౌన్‌తో వారి జీవితాలే కాదు దాని జీవితం కూడా అధ్వాన్నంగా తయారైంది. 

దాతలు సహాయం చేస్తే గానీ, కడుపు నింపుకోలేని పరిస్థితి వారిది. మూడు పూటలా కడుపునిండా తిని రోజులు గడుస్తున్నాయి. నల్లకుక్క మీద ఉన్న ప్రేమతో కొన్ని రోజులు తినేదాంట్లో కొంత దానికి పెట్టేవారు. ఆకలి బాధ పెరుగుతూ వస్తున్న కొద్దీ దాని మీద ప్రేమ తగ్గుతూ వచ్చింది. ఒక్కపూట తిండితో తాము బ్రతకటమే కష్టం... ఈ కుక్కకు ఎక్కడినుంచి తెచ్చిపెట్టాలి అనుకున్నారు. అప్పటినుంచి దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయటం మొదలుపెట్టారు. 
 వారి పరిస్థితి అర్థంకాని అది, పొద్దున్నుంచి రాత్రి వరకు ఎదైనా పెట్టక పోతారా అని ఆశగా ఎదురుచూసేది. ఒక్కోసారి మెతుకులు కూడా దొరికేవి కావు. 

ఓ రోజు బాగా ఆకలిగా ఉన్న సమయంలో పచ్చిక బయలులో ఏపుగా పెరిగిన గడ్డి తింటున్న మేక కనిపించింది దానికి. ఆ దృశ్యాన్ని చూడగానే దాని మెదడులో ఓ ఆలోచన మెదిలింది. ఆ వెంటనే మేక గడ్డి తింటున్న వైపు పరుగులు తీసింది. కుక్క తనవైపు పరిగెత్తుకుంటూ రావటం గమనించిన మేక భయంతో యాజమాని వైపు వెళ్లిపోయింది. నల్లకుక్క మాత్రం ఆ గడ్డి దగ్గరే ఆగి దాన్ని పరపరమంటూ నమలడం మొదలుపెట్టింది. కష్టంగా ఉన్నా ఇష్టం వచ్చినట్లు గడ్డిని నమిలి మింగేసింది. 
కొద్దిగా కడుపు నిండగానే అక్కడినుంచి గుడిసె దగ్గరకు వచ్చేసింది. సరిగ్గా ఓ గంట తర్వాత దాని కడుపులో తిప్పేసినట్లై గడ్డితో పాటు, అంతకుముందు రాత్రి తిన్న పాచిపోయిన అన్నం కూడా వాంతి చేసుకుంది. 

కడుపు పూర్తిగా ఖాళీ అయిపోవటంతో దానికి విపరీతంగా ఆకలి వేసింది. 
ఇంట్లో వాళ్లు గుర్రుపెట్టి నిద్రపోతుండగా చప్పుడు చేయకుండా ఇంట్లోకి ప్రవేశించింది. పొయ్యి గడ్డపై పెద్ద గిన్నె కనపించింది దానికి. మెల్లగా గిన్నె దగ్గరకు చేరుకుని పైనున్న ప్లేటు పక్కకు జరిపి, దాంట్లో ఉన్న అన్నాన్ని తినటం మొదలుపెట్టింది. కొద్దిసేపటికి గిన్నె పైనున్న ప్లేటు పక్కకు జరిగి కింద పడింది. పెద్ద శబ్దం! అందరూ లేచారు. అన్నం తింటున్న నల్లకుక్కను వెంటపడి తరిమారు. 

ఇక అప్పటినుంచి ఆ ఇంటికి, నల్లకుక్కకు బంధం తెగిపోయింది. కానీ, ప్రతిరోజు ఓ సారి ఆ ఇంటి ముందుకు పోవటం దెబ్బలు తిని వెనక్కురావటం అలవాటైంది దానికి. 
కాసేపటి తర్వాత పెద్ద మార్కెట్‌ వీధిలోకి చేరుకుంది.
దానికంతా మాయగా ఉంది. రెండు నెలల ముందు వరకు ఈ వీధులన్నీ ఎంతో రద్దీగా ఉండేవి. వీధులంతా చెత్తతో నిండిపోయి ఉండి, తినడానికి బోలెడంత తిండి దొరికేది. హోటళ్లు, టిఫిన్‌ సెంటర్ల దగ్గర ఎంతో రుచికరంగా తినేది. అంతా ఒక్కసారిగా కళ్ల ముందునుంచి మాయమైనట్లు జరిగిపోయింది. ఇక మాంసపుకొట్ల సంగతి చెప్పనక్కర్లేదు. కాంపిటీషన్‌ బాగా పెరిగిపోయింది. కండలు తిరిగిన కుక్కలతో పోటీ పడలేక అటువైపు వెళ్లటమే మానేసింది. 

ఓ గంట పాటు వీధులు పట్టుకు తిరిగి బాగా అలిసిపోయింది. ఓ మెయిన్‌ రోడ్డు మీద ఉన్న గుడి దగ్గరి చెట్టు కింద చతికిలబడింది. రోడ్డు మీద అటు, ఇటు తిరుగుతున్న మనుషుల్ని గమనిస్తూ ఉండిపోయింది. ప్లాస్టిక్‌ కవర్లలో వాళ్లు తీసుకెళుతున్న తినుబండారాలు చూడగానే నోరూరింది. కొన్నిసార్లు అవి తీసుకెళుతున్న వారి వెంట ఆశగా తోక ఊపుతూ నడిచింది. కుక్క తమను వెంబడిస్తోందని గమనించిన సదరు వ్యక్తులు గట్టిగా అరిచి దాన్ని తరిమేశారు.
కొద్దిసేపు అటు, ఇటు తిరిగి గుడి ప్రాంగణంలోకి చేరింది. నీళ్ల కొళాయి ముందు ఏర్పడ్డ చిన్న నీటి చెలమలో నీళ్లు తాగి మళ్లీ చెట్టు కిందకు చేరింది. 

నిద్ర ముంచుకు వస్తుండటంతో కళ్లు మూతలు పడటం మొదలైంది. 
ఎక్కడి నుంచో గుర్‌.. గుర్‌ మనే శబ్ధాలు వినిపించాయి దానికి. ఎంతో శ్రద్ధతో చెవులు రిక్కించి వింది. ‘ఆ శబ్ధం చేస్తున్నది ఎలుకకానీ, పిల్లిగానీ ఈ రోజు నా ఆకలి తీరాల్సిందే!’ అని గట్టిగా అనుకుంది. మెల్లగా తల తిప్పి అటుఇటు చూసింది. ఏ ప్రాణీ కనిపించలేదు. కొద్దిసేపటి తర్వాత గుర్ర్‌ర్ర్‌ర్ర్‌ మనే శబ్ధం వచ్చింది. అప్పుడర్థమైంది దానికి ఆ చప్పుడు తన కడుపులోంచి వస్తోందని.  నీరసంగా పైకి లేచి, అడుగులో అడుగు వేసుకుంటూ అక్కడినుంచి కదిలింది.
                                                                                         ...
మధ్యాహ్నం ఎండ నిప్పుల కుంపటిలా ఉంది.
అంత ఎండలో తారు రోడ్డుమీద నడవటం చాలా కష్టంగా ఉంది దానికి. గబగబా పరిగెడదామంటే ఒంట్లో సత్తువ కూడా లేదు. అప్రయత్నంగా నాలుక బయటపెట్టబోయి ఆగింది. వేడి గాలులకు లాలాజలం ఊరటం మాట అటుంచి నాలుక కాలిపోయేలా ఉంది పరిస్థితి. కాళ్లీడ్చుకుంటూ ఓ చెట్టుకిందకు చేరింది. చుట్టూ కలియ చూసింది. ఎడమ వైపు కొద్ది దూరంలో ఓ వీధి కనిపించింది. 
ఆ వీధిలోకి చేరుకోగానే ఓ చోట పెద్ద చెత్త కుప్ప దర్శనమిచ్చింది. 

ఆశగా చెత్తకుప్ప దగ్గరకు వెళ్లి ఆహారం కోసం వెతకటం మొదలుపెట్టింది. తినడానికి పనికొచ్చేవి ఒక్కటి కూడా కనిపించలేదు. అయినా ఏదో ఆశ! పది నిమిషాల తర్వాత ఓ కవరు, దానిలో సగానికి ఎండిపోయిన బ్రెడ్డు ముక్కలు కనిపించాయి. ఆత్రంగా దాన్ని బయటకు లాగి కొద్దిగా పక్కకు తెచ్చుకుంది. తినడానికి వీలుగా కవర్‌ను పీలికలు చేసింది. 
 ఎంతో సంతోషంతో ఓ బ్రెడ్డు ముక్కను నోట్లో పెట్టుకుంది. 

ఎక్కడినుంచి వచ్చిందో కానీ, ఓ పెద్ద కుక్క దానిపైకి దూకింది. అది బెదిరి పక్కకు పడగానే పెద్దకుక్క బ్రెడ్‌ ముక్కల్ని ఆక్రమించింది. ‘ఇది నాది’ అన్నట్లుగా దాని వైపు చూస్తూ గుర్రుమని ఉరిమింది. నల్లకుక్క కొద్దిగా భయపడింది. కొన్ని క్షణాలు ఆగి ఎంతో వినయంగా తోకను ముడిచి, కవర్‌ వైపు తల పోనిచ్చింది. పెద్దకుక్క వెంటనే దాని తలను గట్టిగా కొరికింది! విడిపించుకోవటానికి ప్రయత్నం చేయగా ఇష్టం వచ్చినట్లు ఒళ్లంతా చీల్చిపడేసింది. 
అదా బలమైనది... తనో బక్కప్రాణి దాంతో తలబడే ధైర్యం లేక చావు తప్పించుకుని అక్కడినుంచి పరుగులు పెట్టింది.                                      
                                                                                       ...
పూర్తిగా నీరసించి కిందపడిపోయే స్థితిలో ఉండగా.. ఎడారిలో ఒయాసిస్సులా అడుగుల దూరంలో ఓ దృశ్యం కనిపించింది దానికి. 
బైకు మీద వచ్చిన ఓ వ్యక్తి రోడ్డు ప్రక్కన ఉన్న కుక్కపిల్లలకు బిస్కెట్లు పడేసి వెళ్లిపోయాడు. అవి వాటిని తినడం మొదలుపెట్టాయి. కనీకనిపించకుండా కనిపించిన ఆ బిస్కెట్‌ ముక్కలను చూడగానే నల్లకుక్క నోట్లో నీళ్లూరాయి. 
‘కుక్క పిల్లల్ని తరిమి కొట్టి బిస్కెట్లు తినేసెయ్‌!’ మెదడు వేగంగా ఆలోచించింది. 
అంతే వేగంగా మనసు మధ్యాహ్నం జరిగిన సంఘటనను గుర్తు చేసుకుంది. ఒంటి మీదైన గాయాల వైపు చూసుకుంది. కుక్కపిల్లల నోటి కాడి కూడు లాక్కోవటం తప్పు అనిపించింది.

పొట్టలోనుంచి గుర్ర్‌ర్ర్‌మని పెద్ద శబ్దం. తేరుకుంది.
‘ఛీ నీ కుక్క బతుకు!’ అనుకుని గట్టిగా అరుస్తూ కుక్కపిల్లల వైపు పరిగెత్తింది. 
 వాటిని పక్కకు తరిమేసి బిస్కెట్లను తినేయడానికి... 

♦ బండారు వెంకటేశ్వర్లు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement