అనగనగా ఒక ఊరిలో ఒక చిన్న పాప వాళ్ల తాతయ్యతో కలిసి నివసిస్తుండేది. అది శీతాకాలం. వాళ్ల తాతయ్య జబ్బు పడ్డాడు. అతనికి పొగతాగే అలవాటుంది. తాతయ్య పొగాకు కోసం, పాప బయటికొచ్చింది. వాళ్ల ఇంటి పక్కన ఒక రైల్వే స్టేషన్ ఉంది. దానికి అవతల పొగాకు అమ్మే దుకాణం ఉంది. అక్కడకు వెళ్లింది పాప. పొగాకు కొని ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు రైల్వేస్టేషన్‌లో సైనికులు కనపడ్డారు. ‘‘పాపా, ఏంటి నీ చేతుల్లో ఉన్నది’’ అడిగాడు ఓ సైనికుడు. ‘‘మా తాతయ్య కోసం పొగాకు తీసుకెళ్తున్నాను’’ అంది పాప. ‘‘నాకు కొంచెం అమ్ముతావా?’’ అన్నాడు సైనికుడు. ‘‘లేదు’’ అంది పాప. చిన్నబోయాడు సైనికుడు. ‘‘కొంచెం ఊరికెనే ఇస్తాను’’ అని ఆ సైనికుడికి కొంచెం పొగాకు ఇచ్చింది. ఎంతో ఆనందించిన సైనికుడు పాపకి బహుమతిగా ఓ ‘మాయా ఉంగరం’ ఇచ్చాడు. ‘‘ఇది అద్భుతమైన ఉంగరం. ఈ ఉంగరాన్ని మధ్యవేలుకు పెట్టుకుంటే, నీవు, మీ తాతయ్య ఆరోగ్యంగా ఉంటారు. ఈ ఉంగరాన్ని చూపుడువేలుకి పెట్టుకుంటే, నీవు చాలా ఆనందంగా ఉంటావు’’అన్నాడు సైనికుడు. ఆ సైనికుడికి మంత్రవిద్యలు తెలుసు. పాప ఆనందంతో మాయా ఉంగరాన్ని తీసుకుని సైనికునికి కృతజ్ఞతలు చెప్పింది. దారిలో వెళ్తూ ఆ మాయా ఉంగరాన్ని చిటికెన వేలుకు పెట్టుకుంది. పాప చిటికెన వేలు బాగా చిన్నది. ఉంగరం కొంచెం పెద్దది. కాబట్టి అది జారి మంచులో పడిపోయింది. ఎంత వెతికినా దొరకలేదు.
ఏడుస్తూ ఇంటికి పోయి, జరిగిన కథంతా వాళ్ల తాతకు చెప్పింది. తాతకు పొగాకు ఇచ్చింది.‘‘బాధపడకు, మన ఉడుత నీకు సాయం చేస్తుందేమో అడుగు’’ అని సలహా ఇచ్చాడు తాతయ్య.పాప ఉడుతని సాయమడిగింది. ఉడుత ముందు కొంచెం బెట్టు చేసింది. చివరికి ఒప్పుకుంది. ఉడుత, పాప కలిసి రోజూ ఆ ఉంగరం కోసం వెతికేవాళ్లు. చివరికి ఓ రోజు మాయా ఉంగరం పాపకు దొరికింది. పాప ఆనందానికి అవధుల్లేవు. ఉడుతకు కృతజ్ఞతలు చెప్పింది. మాయా ఉంగరాన్ని మధ్య వేలుకు ధరించింది. ఇంటికొచ్చి చూసేసరికి తాతయ్య ఆరోగ్యంగా అటూ ఇటూ తిరుగుతున్నాడు.‘‘చిన్నారీ! నీవు బయటకు వెళ్తూ తలుపు మూయలేదు. తాజా గాలి గదిలోకి వచ్చింది. నా జబ్బు నయం చేసింది’’ అన్నాడు తాతయ్య.ఉంగరం విశేషం చెప్పింది పాప. తాతయ్య వంట చెరకు నరకడం లాంటి పనుల్లో పడ్డాడు. వంట చేయడానికి పాప, తాతయ్యకు సాయంచేసేది. తరువాతి రోజు పాప మాయా ఉంగరాన్ని తన చూపుడువేలుకు పెట్టుకుంది.వాళ్ల ఇంటిపక్కనున్న అడవి ఎంతో ప్రకాశవంతంగా వెలిగింది. చెట్లు పువ్వులు పూశాయి. పండ్లను కాశాయి. నీలి ఆకాశం ఎంతో అందంగా మెరిసింది. సూర్యుడు మబ్బుల వెనక నుంచి ఠీవిగా బయటకు వచ్చాడు. ఈ దృశ్యాలను చూసి పాప, తాతయ్య, ఉడుత ఆనందంతో నృత్యం చేశారు. వాళ్లు ఈ రోజుకీ ఆనందంగానే ఉన్నారు.
- స్వేచ్ఛానువాదం : అనిల్ బత్తుల
మాయా ఉంగరం
Published Sun, Feb 18 2018 1:43 AM | Last Updated on Sun, Feb 18 2018 1:43 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment