అంకెల గారడి  | funday:story world | Sakshi
Sakshi News home page

అంకెల గారడి 

Published Sun, Apr 1 2018 1:52 AM | Last Updated on Sun, Apr 1 2018 1:52 AM

funday:story world - Sakshi

ఈ విషయ ప్రపంచాన్ని నిర్దేశించే మౌళిక సూత్రం అంకెలే. అంకెల్లోని మర్మం ఆసక్తిని రేకెత్తిస్తుంది. అంకెల మాయ గందరగోళపరుస్తుంది. ఎందుకంటే అంకెలు కేవలం రాసిని తెలిపేవి మాత్రమే కాదు, కొన్ని నిర్దిష్ట, విశిష్ట లక్షణాలను తెలియపర్చే గుర్తులు. జోస్యం చెప్పాలంటే గవ్వలు వేయాలి. పందెంలో పడ్డ అంకెను బట్టి భవిష్యత్తు నిర్ణయమవుతుంది.ప్రతి చర్యా దాని ప్రతిచర్యా సమన్వయంతో జరిగిపోవటానికి మూలం అంకెలే. సకల చరాచర జీవరాశి యొక్క ఉనికికి కదలికలకు అంకెలే ఆధారభూతాలు. అంకెల సంకెల వస్తువులను ఓ క్రమంలో పేర్చటానికి, వాటిని వేరువేరుగా గుర్తించడానికి ఉపయోగపడుతుంది. అయితే ఒకసారి మాత్రం అది పలు హత్యలు జరిగిన రంగాన్ని గుర్తించింది.వార్తాపత్రికలు, టీవీ చానళ్లు 9 చెర్రీ లేన్‌లో జరిగిన పలు హత్యల ఉదంతాన్ని కర్ణకఠోరంగా ఊదరగొట్టాయి ముఖ్యాంశాల్లో. ‘పోలీసుల కథనం ప్రకారం’ అంటూ జడ్సన్‌ కుటుంబం మొత్తం ఈ హత్యల్లో అసువులు బాయటాన్ని దారుణమైన దుర్ఘటనగా ఉదహరించాయి. వార్తల్లోని వాక్యాలు జాన్‌ జడ్సన్‌ అనేక కత్తిపోట్లకు గురై మృతి చెందాడని చెప్పాయి. ఆ పదబంధాలు అతని భార్య ఏలిస్‌ జడ్సన్‌ ఊపిరాడక చనిపోయినట్లు తెలిపాయి. 

గుర్తుతెలియని వ్యక్తులు జడ్సన్‌ ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించి పోలీసులకి అంతుచిక్కని ఏదో వస్తువు కోసం అణువణువూ గాలిస్తున్నప్పుడు పిల్లలు కూడా ఈ ఘోరానికి బలయ్యారు. ఆరు సంవత్సరాల బెట్సీ అందంగా అలంకరించుకున్న తన గదిలో రక్తపు మడుగులో పడి ఉంది. పసివాడు డేవిడ్‌ తను కంటున్న అందమైన కల భంగం కాకుండానే ముఖం మీద దిండు అదిమిపెట్టటం వల్ల మరణించాడు. పోలీసులు ఇంతకంటే వివరాలేమీ వెల్లడించలేదు.ఫోరెన్సిక్‌ నిపుణులకు, ప్రత్యేక విచారణాధికారులకు మాత్రమే శవాల అసలు పరిస్థితి తెలుసు. తండ్రి శరీరాన్ని పాక్షికంగా కప్పి ఉంచారు. తాళ్ళతో కట్టేయబడి, నోట్లో గుడ్డలు కుక్కబడి, అరికాళ్ళ కింద మంటలు పెట్టడం వల్ల చర్మం కాలిపోయి, బేస్మెంట్‌లో కాళ్ళు చేతులు బార్లా చాపి పడి ఉన్న స్థితిలో శవాన్ని కనుగొన్నామని తమ రిపోర్టులో రాశారు. తల్లి చనిపోయిన విధానాన్నైతే పూర్తిగా వైద్య పరిభాషలోనే చెప్పారు. ఆ భార్యాభర్తల శవాల్ని తెల్లగుడ్డలతో పూర్తిగా కప్పివేశాక కూడా మీడియా కంట పడనివ్వలేదు. ఈ దారుణ మారణకాండ జరిగిన ఇంట్లోని బేస్మెంట్, ఇతర గదులు కూడా సీల్‌ చేసి పోలీసు కాపలా పెట్టారు. పోస్ట్‌ మార్టం వ్యాన్‌లో ఎక్కిస్తున్నపుడు పిల్లల శవాల్ని చూసి అదిరిపడ్డారు అక్కడి జనం.విచారణ బృందం ప్రతినిధి ఇంట్లోంచి బయటకు రాగానే మీడియా రిపోర్టర్లు మూకుమ్మడిగా ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. ఆయన అందరినీ ఆగమంటూ చెయ్యెత్తాడు. ఉత్కంఠతో కూడిన నిశ్శబ్దం ఆవరించాక తన గంభీరమైన గొంతుతో ఈ హత్యలకు సంబంధించిన వివరాలు చెప్పాడు 

‘‘లభ్యమవుతున్న ఆధారాలను బట్టి ఈ రోజు తెల్లవారుజామున కొంతమంది ఈ ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించారు. భర్త మిస్టర్‌ జాన్‌ జడ్సన్‌ని వారు చేతులు వెనక్కి విరిచి పట్టి బేస్మెంట్‌లోకి తీసుకొచ్చి చిత్రహింసల పాలు చేశారు. కారణం తెలియదు. జాన్‌ ఎంతకూ రాకపోయేటప్పటికి ఏమైందోనని భార్య ఏలిస్‌ పడకగదిలోంచి బయటకు వచ్చింది. అపరిచితులను చూసి కంగారుపడింది. దుండగులు ఆమె నోట్లో గుడ్డలు కుక్కి పెనుగులాడుతున్నా విడువకుండా బేస్మెంట్లోకి ఈడ్చుకెళ్ళారు. అక్కడ ఆమెను గొంతు నులిమి చంపారు. ఆ తరువాత దేనికోసమో ఇల్లంతా వెతికారు. ఆ సమయంలోనే మేలుకున్న చిన్నారి బెట్సీ భయంతో పెడుతున్న కేకలు విని జడ్సన్‌ కుటుంబంలో మిగిలిన ఇద్దరు పసివాళ్ళని కూడా కనికరం లేకుండా చంపి ఈ కరకు చర్యను ముగించి వెళ్ళిపోయారు. బెట్సీకి ఆరేళ్ళు, డేవిడ్‌ కి రెండు. తెల్లవారాక వచ్చిన పనిమనిషి ముందుతలుపు తెరిచి ఉండటం, ఏదో పెనుగులాట జరిగిన గుర్తులుండటం చూసి కీడు శంకించింది. లోపల చెల్లాచెదురైన సామాన్ల మధ్య శవాలని చూసి పోలీసులకు వార్త తెలియజేసింది. దర్యాప్తు కొనసాగుతోంది. కేసులో ఏదైనా ముందంజ వేస్తే అది మీకు తప్పక తెలియజేస్తాం’’ అని చెప్పి ముగించాడు. ఇక ఆపై విలేకర్లు అడిగిన ఏ ప్రశ్నకీ సమాధానం చెప్పకుండా ఆయన హత్య జరిగిన ఇంటి లోపలికి వెళ్ళిపోయి తలుపు మూసేశాడు. 9‘తొమ్మిది’ అంకె సర్వ శక్తిమంతమైనది. అందులో త్రిక త్రయం (మూడు మూళ్ళు) ఉంది. అది సమాప్తికి, సంప్రాప్తికి, సంపూర్ణతకు చిహ్నం. తొమ్మిది దివ్య సంఖ్య. ‘పరిశుద్ధ’ సంఖ్య. ఎందుకంటే ‘9’ తర్వాత ఇక అంకెలు లేవు. ఇదే చివరిది. ఇదే అవధి. మిగిలిన సంఖ్యలన్నీ దీనితోనే ఉండి, దీని చుట్టూనే పరిభ్రమిస్తూ ఉంటాయి. భ్రమ(సున్నా) చుట్టూ ఉండే భ్రమణమే తొమ్మిది. తొమ్మిది గ్రహాల తర్వాత గాలి నీరు ఉండవు. అంటే శూన్యానికి ఆరంభం కూడా తొమ్మిదే. ప్రాచీనులు కాళరాత్రి కుమారుడైన కాలయముడిని ప్రసన్నం చేసుకోవటానికి గర్భగుడి చుట్టూ తొమ్మిది ప్రదక్షిణాలు చేసేవారు. తొమ్మిది ప్రళయావతారిణి, భీకర రూపిణి అయిన మహాదుర్గ చిహ్నం. ఇందులో లయం ఉంది. 

జాన్‌ జడ్సన్‌ బతికి ఉన్నప్పుడు ఆదర్శప్రాయుడైన ఫైనాన్షియల్‌ ఎగ్జిక్యూటివ్‌. ఏ పనినైనా పద్ధతిగా చేసేవాడు. అతని వస్త్రధారణ నిర్లోపం. ఇతరులతో ఎప్పుడూ గంభీరంగా మాట్లాడింది లేదు. ఎవరినీ పల్లెత్తు మాట అని ఎరుగడు. సదా నవ్వుతున్నట్టుండే నీలి కళ్ళు, ముఖం మీద చెరగని చిరునవ్వు. నడివయసుకు దగ్గరవుతున్నట్టు తెలిపే చిరుబొజ్జ ఈ మధ్యనే తోడైంది. జాన్‌ జడ్సన్‌ హైస్కూల్‌ రోజుల్నించే తాను ప్రేమించిన ఏలిస్‌ హాడ్జ్‌ను పెళ్ళి చేసుకున్నాడు. ఏలిస్‌ అందగత్తే! సొట్టలు పడే బుగ్గలు కొంచెం ఎత్తుగా ఉండి ఆమె అందాన్ని మరింత పెంచేవి. లేత పసుపు రంగు జుట్టుని పొడుగ్గా పెరగనీయకుండా కత్తిరించుకొని చక్కగా దువ్వుకునేది. బంగారు దొన్నెలో వెలిగిపోయే తామరపూవులా ఉండేది ఆమె ముఖం. వయసు మీరుతున్న కొద్దీ కొద్దికొద్దిగా లావైంది కానీ చేస్తున్న సెక్రటరీ ఉద్యోగానికి తగ్గట్టే గౌరవప్రదంగా ఉండేది ఆమె అలంకరణ.  జాన్, ఏలిస్‌ తమ ప్రపంచంలోకి ఒక అందమైన పాపను తెచ్చారు. బెట్సీ అనే పేరు పెట్టారు. కనుపాపగా పెంచారు. సంతోషం మూట గట్టినట్టుండే బెట్సీని ఆరేళ్ళ వయసులో ఓ క్రూరమైన చేయి తుడిచి పెట్టేసింది. రెండేళ్ళ డేవిడ్‌ ఆ కుటుంబం అనుభవిస్తున్న సంతోషానికి సంపూర్ణతను చేకూర్చాడు – మరణం వరకూ! జాన్‌ ఆశయాలు తొందరగానే నెరవేరాయి. పదవిలో ఉన్నతి, జీతంలో పెంపు అతనికి జీవితాన్ని మరింత సుఖవంతంగా అనుభవించే అవకాశం ఇచ్చాయి. ఇటీవలే కొనుక్కున్న చెర్రీ లేన్‌లోని తొమ్మిదవ నంబరు ఇంట్లో అతని కుటుంబం చీకూ చింతా లేకుండా ఉన్నారు. ఇంటిని తమ అభిరుచికి అనుగుణంగా మార్చుకునే సమయం చాలా ఉందనుకొని ఆ ఆనంద నిలయంలో తమ ఉజ్జ్వల భవిష్యత్తు కోసం కలలు కంటూ జీవించారు. ఇంటి ప్రవేశ ద్వారం మీద లతలు తీగలతో చెక్కిన ‘9’ ని ఎంతో గర్వంగా మేకులతో బిగించారు. కానీ సమాపనకు చిహ్నమైన ఆ గుర్తుతో ఇంటి మీద నీలి నీడలు కమ్ముకున్నాయి. 

‘ఆరు’ మతాధిపతుల అంకె. దీన్ని తర్కంతో సమానంగా చెప్తారు. మృత్యువులోని శూన్యమే ఈ అనంత విశ్వం అని సూచిస్తుందీ అంకె. ఇదే అంతిమ రహస్యం. ఆత్మ పరమాత్మల ఏక చిహ్నం. పారలౌకికతకు, అద్వైతానికి మరో రూపం ఆరు. పాచికలాటలో ఆరు పడితే గెలుపు. పడలేదా, జూదగాడు చిక్కుల్లో పడ్డట్టే! అదృష్టం, అందం, ఆరోగ్యం, ప్రేమ, అవకాశం, సమన్వయాల్ని సూచించే ఆరు పూర్ణ సంఖ్య. షష్ఠి సర్వదా వరద, సుఖద. విజయప్రాప్తి ఈ అంకె. చెర్రీ లేన్‌లో తొమ్మిదవ నంబరు ఇంటి ఎదురుగా ఉండే ఆరవ నంబరు ఇల్లు కొన్నేళ్ళుగా ఎవరూ సరిగా పట్టించుకోకపోవడంతో పాడుబడింది. దాని చుట్టూ ఉన్న పెరటిలో ఇప్పుడు గడ్డి మోకాలి ఎత్తుకి పెరిగింది. పూల మొక్కలుండాల్సిన చోట ఏపుగా కలుపు మొక్కలున్నాయి. పాదుల్లో రాలిన ఆకుల కుప్పలతో నిండిపోయి, గుబురుగా పెరిగిపోయిన పొదలతో చూడగానే భీతి గొల్పుతుంది. అక్కడ ఎవరూ నివసించటం లేదనిపిస్తుంది. కాని ఎవరికీ తెలియని విషయమేమిటంటే చట్టం కళ్ళు గప్పి సంచరించే అధర్మపరులు, నేరస్థులు కొందరు అప్పుడప్పుడు ఆ ఇంట్లో తలదాచుకుంటుంటారు. అందుకే పోలీసులు అప్పుడప్పుడు ఆ ఇంటిమీద నిఘా పెడుతుంటారు.

అలా చివరిగా ఆ ఇంట్లో ఉన్న శరణార్థి చుంచుమొహంతో పొట్టిగా పీలగా ఉండేవాడు. వాడు బ్యాంకుల్ని కొల్లగొట్టే ఆరుగురు దుష్ట రౌడీల ముఠాలో ఒకడు. గుమ్మడికాయలు దొంగిలించి భుజాలు తడుముకున్నాడు. పోలీసుల డేగకన్నుకి దొరికిపోయాడు. అంతే కాదు, తన సహచరుల గురించి చట్టానికి ఉప్పందించాడు. తస్కరించిన డబ్బు దస్కం ఎక్కడుందో ఎవరికీ తెలియదు. చుంచుగాడు తనకు మాత్రమే తెలిసిన ఒక రహస్య ప్రదేశంలో దాచాడని ముఠాలో మిగతా అయిదుగురు అనుమానించారు. ప్రాథమిక విచారణలో న్యాయమూర్తి నేరారోపణ రుజువు చేయవలసిందిగా గ్రాండ్‌ జ్యూరీని ఆదేశించాడు. అయితే చుంచుగాడికి భయం పట్టుకుంది. కోర్టులో తను పోలీసులకిచ్చిన వాంగ్మూలాన్ని తోసిపుచ్చాడు. గ్రాండ్‌ జ్యూరీలో పద్దెనిది మంది సభ్యులున్నారు. తొమ్మిదిమంది అతని మాటలనుబట్టి వీళ్ళు నేరస్థులనీ, మిగతా తొమ్మిదిమంది సరైన సాక్ష్యాధారాలు లేనందువల్ల కేసు కొట్టివేయాలని తేల్చారు. శిక్ష వేయడానికి కనీసం పన్నెండుమంది (ఆరు + ఆరు) ఆమోదం కావాలి కాబట్టి దొంగల ముఠాపై నేరారోపణ ఎత్తివేశారు. 

రౌడీలు విడుదలయ్యారు. కానీ ఇన్‌ఫార్మర్‌గా మారిన తమ ముఠాలో ఆరోవాడైన చుంచుగాడి మీద మిగతావారు పగబట్టారు. వాళ్ళు అజ్ఞాతంలోకి వెళ్ళారు గానీ కొన్నాళ్ళకే ఖాళీ ఇనప్పెట్టె వెక్కిరించింది. అది చాలు వారికి చెర్రీ లేన్‌లో ఆరవ నంబరు ఇంటి మీద ఓ కన్నేసి ఉంచడానికి. మురికి బట్టలేసుకున్న ఓ మనిషి అనేక సమయాల్లో ఆ ఇంటికి కాపలా కాస్తుండేవాడు. వాడి కాలి కింద నలిగిపోయిన సిగరెట్‌ పీకల వల్ల వాడు ఎంతసేపు అక్కడ ఉండి గమనిస్తున్నాడో తెలిసేది. వీధిలో వచ్చే పోయేవారు వాణ్ణి అసహ్యించుకునేవారు. వాడి ముఖం వెడల్పాటి నల్లని చలువ కళ్ళద్దాల వెనుక దాగుండేది. వాడి తల మీద ఉండే బైకర్స్‌ టోపీ ప్రమాదకారిగా అనిపించేది. దారిన పోయే ప్రమాదాన్ని నెత్తి మీద వేసుకోవటం ఎందుకని ఎవరూ వాడినేమీ అనలేక మనసులోనే తిట్టుకునేవారు. కానీ చెర్రీ లేన్‌లో ఒక భయస్థుడు కూడా ఉండేవాడు. కిటికీ తెరలను చాటు చేసుకొని అప్పుడప్పుడు కాపలావాడి వంక చూసేవాడు. ఆ సాక్షి ఈ రౌడీమనిషి గతంలో కొన్నిసార్లు ఆరో నంబరు ఇంటిని సోదా చేస్తూ కనిపించాడని పోలీసులకి చెప్పాడు కానీ తారీఖులు సరిగా చెప్పలేకపోయాడు. ఆ పాడుపడ్డ ఇంటి మీద ఉన్న ‘6’లో పాములాంటి ఒంపు తుప్పు పట్టిన మేకు కారణంగా ఊడి కిందకు వేలాడింది కొన్నాళ్ళు. చూసేవాళ్ళకి అది తొమ్మిదిలా కనిపించేది. చెర్రీ లేన్‌లో జరిగిన విషాద సంఘటనకు ముందురోజు తీవ్రమైన గాలి వీచడం వల్ల ఉన్న ఒక్క మేకూ ఊడొచ్చేసి వెండి రేకుతో చేసిన ‘6’ నేల మీద పడిపోయింది. యమదూతలు ముగ్గురు గూండాల రూపంలో వచ్చారు. శత్రుశేషాన్ని తుడిచి పారెయ్యడానికి వారికి డబ్బు ముట్టింది. స్వంత ఆలోచన లేని మొదటి రకం కిరాయి గూండాలు వారు. ఆ రోజు పొద్దున్నే ఇంకా చీకట్లు తొలగకముందే చెర్రీ లేన్‌లో ఇళ్ళ నంబర్లన్నీ చూసుకుంటూ తమ వాహనంలో జాగ్రత్తగా డ్రైవ్‌ చేస్తూ వచ్చారు. 

చుంచుగాడు దాగిన ఇంటి గురించి వాళ్ళ దగ్గర స్పష్టమైన సమాచారం ఉంది. అయితే తమ తెలివి తక్కువతనం వల్ల కాపలావాడు గుర్తులు చెప్పడంలో తప్పు చేశాడనుకున్నారు. ‘‘లూయి గాడికి సరిగా చెప్పటమే రాదు. ఫోన్లో ఇల్లు ఎడమ చేతివైపుందని చెప్పాడు. రాత్రి ఎనిమిది వరకూ పోలీసులు అటువైపు కన్నెత్తి చూడలేదన్నాడు. తొమ్మిదో నంబరు, ఎడమ వైపు ఇల్లు అన్నాడంతే.మనం వీధికి అటువైపు నుంచి వచ్చేటప్పుడు ఎడమ వైపేమో!’’వాళ్ళల్లో వాళ్ళు గొడవ పడ్డారు. శషభిషలు పడ్డారు. ‘‘ఎడమ వైపు అసలు తొమ్మిదో నంబరే లేదు కదా’’ అన్నాడొకడు. ‘‘....ఆ పాడుబడిన ఇల్లు తప్ప! దాని మీద అసలు నెంబరే లేదు’’వాళ్ళ కళ్ళు తొమ్మిది కోసం అటూ ఇటూ వెతికాయి. కుడి చేతివైపు తీర్చిదిద్దిన పెరడు ఉన్న ఇంటి మీద అందంగా తొమ్మిదో నంబరు వాళ్ళని మెరుస్తూ ఆకర్షించింది. ‘‘ఆ, అదుగో అదే. పోలీసుల్లేరులే.. పదండి! అబ్బో! మన బాసుల కష్టార్జితం పోసి పెద్ద ఇల్లే కొన్నాడే! ఇంత నోరేసుకొని ఊరంతా డప్పు కొట్టాడుగా బాసులు నేరస్థులని! అదే నోటితో మిగిలిన సొత్తు ఎక్కడ దాచాడో చెప్పిద్దాం’’నిస్సంకోచంగా బండిని ‘తొమ్మిది’ ఇంటి ముందు ఆపి అందులోంచి దిగారు. ‘తొమ్మిది’ బలిదానానికి గుర్తు చెర్రీ లేన్‌ తొమ్మిదిలో జరిగినట్టుగా. అది శూన్యానికి ఆరంభం అక్కడ జరిగిన హత్యల్లాగా. ఆ ఇల్లు ఇప్పటికీ తన రహస్యం దాచుకుంది. అధికారులు ఈ ఘోరకలికి పరిష్కారం చెప్పలేకపోయారు. ఆరో నంబరు ఇల్లు అగ్ని ప్రమాదంలో ఆహుతైంది. నేలమీద సగం కాలి వంకరపోయిన ‘ఆరు’లో దాని ఛాయలు ఇంకా కదలాడుతున్నాయి. అందులో నివసించిన చుంచుగాడి శవం కాకతాళీయంగా కొన్ని నెలల తరువాత రాళ్ళు నింపిన సంచీలో కుక్కబడి దగ్గర్లోని చెరువు అడుగున దొరికింది. చెర్రీ లేన్‌లో తొమ్మిదో నెంబరు ఇల్లు మూతపడింది. అప్పుడప్పుడూ ఔత్సాహికులు అక్కడకు వచ్చి ఏం జరిగి ఉంటుందో అని అనేక రకాలుగా ఊహాగానాలు చేస్తుంటారు. క్రమక్రమంగా వారి సంఖ్యా తగ్గిపోయింది. బంగారు భవిష్యత్తు ఉంటుందనుకున్న ఆ ఆనంద నిలయం విషాదంలో కూరుకుపోయింది. ఇప్పటికీ జాగ్రత్తగా వింటే ఆ ఇంట్లోంచి వీచే గాలుల్లో ఒక చిన్న పాప అందంగా అలంకరించిన తన పడగ్గదిలోంచి ‘మమ్మీ మమ్మీ’ అని దీనంగా పిలవడం వినిపిస్తుంది.  
ఆంగ్లమూలం : నార్మన్‌ ఎ. రూబిన్‌ 
(ఇజ్రాయిలీ రచయిత) 
 అనువాదం: మోహిత  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement