మా సిస్టర్ ప్రెగ్నెంట్. అయితే ఈమధ్య యూరిన్‌లో రక్తం పడుతుంది. ప్రెగ్నెన్సి సమయంలో ఇలాంటి యూరలాజికల్ ప్ల్రాబ్సమ్స్ సాధారణమేనని అంటున్నారు. దీని గురించి తెలియజేయగలరు.
– సి.అనిత, నెల్లిమర్ల
మూత్రంలో రక్తం పోవడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. అది గర్భిణులలో కావచ్చు లేదా మామూలు వారిలో కూడా. మూత్రంలో ఇన్‌ఫెక్షన్లు, కిడ్నీలలో, మూత్రాశయంలో రాళ్లు ఉండటం, అవి కిందకు జారినప్పుడు మూత్రాశయం దగ్గర దెబ్బలు తగలడం, కిడ్నీలలో, మూత్రాశయంలో కణితులు, గడ్డలు ఏర్పడటం, రక్తం గూడు కట్టడంలో సమస్యలు, కొన్ని రకాల మందులు వాడటం వంటి కారణాల వల్ల మూత్రంలో రక్తం పడవచ్చు. గర్భిణులలో హార్మోన్ల మార్పు వల్ల మూత్రాశయ గొట్టాల కదలిక మందగించడం, దానివల్ల మూత్రం గొట్టాలలో ఆగడం వల్ల ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. గర్భిణిలో పెరిగే గర్భాశయం బరువు, మూత్రాశయ గొట్టాల మీద పడి, దాని ఒత్తిడి వల్ల మూత్రం మెల్లమెల్లగా బయటకు రావడం, కిడ్నీల వైపు వెనక్కు వెళ్లడం వల్ల కిడ్నీలలో వాపు, దాని వల్ల మూత్రంలో ఇన్ఫెక్షన్లు, మూత్రంలో రక్తం పడటం జరగవచ్చు. మూత్రంలో రక్తం పడుతుంటే కంప్లీట్ యూరిన్ టెస్ట్, అవసరమైన ఇతర రక్త పరీక్షలు చేయించుకుని కారణాన్ని బట్టి అవసరమైతే యాంటీబయెటిక్స్ వంటి మందులతో చికిత్స చేయించుకోవచ్చు. మంచినీళ్లు బాగా తాగుతుండాలి. మూత్రం వచ్చినప్పుడు ఆపుకోకుండా వెళుతూ ఉండాలి.
రెండు సంవత్సరాల క్రితం వరకు నేను సన్నగా ఉండేదాన్ని. ఈ మధ్య లావయ్యాను. ‘అప్పటితో పోల్చితే ఇప్పుడే చక్కగా ఉన్నావు’ అని అందరూ అంటున్నారు. కాని ఒకరు మాత్రం ‘నీకు పీసీఓఎస్ వచ్చినట్లుంది ఒకసారి చెక్ చేయించుకో’ అంటున్నారు. ఇది నిజమేనా? ఒకవేళ నిజమైతే ఇది ప్రమాదకరమా? – డి.సారిక, ఆర్మూర్
సన్నగా ఉండి తర్వాత బరువు పెరిగినంత మాత్రాన పాలీ సిస్టిక్ ఓవరీస్ సిండ్రోమ్ (పీసీఓఎస్) వచ్చినట్లు కాదు. పౌష్టికాహారం తీసుకోవడం వల్ల బరువు పెరిగి ఉండవచ్చు. థైరాయిడ్ సమస్య, పీసీఓఎస్, కిడ్నీ సమస్యలు వంటి ఎన్నో కారణాల వల్ల బరువు పెరగవచ్చు. బరువు పెరిగిన తర్వాత పీరియడ్స్ సక్రమంగా వస్తున్నాయా లేదా, మొటిమలు వస్తున్నాయా, అవాంఛిత రోమాలు ఉన్నాయా వంటి అనేక అంశాల ఆధారంగా పీసీఓఎస్ ఉన్నదీ లేనిదీ తెలుస్తుంది. అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించడం వల్ల పీసీఓఎస్ నిర్ధారణ జరుగుతుంది. పీసీఓఎస్ అంటే అండాశయంలో చిన్న చిన్న నీటిబుడగలు ఉండటం. వీటివల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి మగవారిలో ఎక్కువగా ఉండే టెస్టోస్టిరాన్ అనే ఆండ్రోజెన్ హార్మోన్ ఆడవారిలో స్రవించడం వల్ల పీరియడ్స్ క్రమం తప్పడం, మొటిమలు, అవాంఛిత రోమాలు, అండం విడుదల సక్రమంగా కాకపోవడం వల్ల గర్భంరావడంలో ఆలస్యం కావడం, వచ్చినా అబార్షన్లు కావడం, ప్రెగ్నెన్సీలో షుగర్ పెరగడం వంటి సమస్యలు తలెత్తే అవకాశాలు ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి బరువు బట్టి ఉంటాయి. నువ్వు అనవసరంగా ఆందోళన పడకుండా గైనకాలజిస్టును సంప్రదించి స్కానింగ్, థైరాయిడ్ పరీక్షలు వంటి రక్తపరీక్షలు చేయించుకుని పీసీఓఎస్ ఉందా లేక ఇతర హార్మోన్ సమస్యలేవైనా ఉన్నాయా లేక మామూలుగానే బరువు పెరిగావా అనేది నిర్ధారించుకుని సమస్య ఉంటే చికిత్స తీసుకోవడం లేకుంటే నీ ఎత్తుకి తగిన బరువు ఉంటే అలాగే ఉండవచ్చు. మరీ ఎక్కువ బరువు ఉన్నట్లయితే తగ్గడానికి వ్యాయామాలు చేయవచ్చు.
గర్భిణి దశలో మరియు ప్రసవం తరువాత శిశువుకు ఏ ఏ నెలల మధ్య తప్పనిసరిగా వేయించాల్సిన టీకాల గురించి వివరంగా తెలియజేయగలరు. – జి.రాజ్యలక్ష్మీ, సామర్లకోట
గర్భిణి సమయంలో ఐదు నెలలో లోపు టెటనస్ ఇంజక్షన్ ఒకటి తీసుకోవాలి. ఆ తర్వాత నెల్లాళ్ల వ్యవధిలో ఏడో నెల లోపు రెండో ఇంజక్షన్ తీసుకోవాలి. టెటనస్‌తో పాటు డిఫ్తీరియా, కోరింత దగ్గు నివారణ కోసం టి–డాప్ అనే ఇంజక్షన్ తీసుకోవచ్చు. దీనివల్ల పుట్టిన బిడ్డకు మొదటి రెండు నెలల్లో టెటనస్, డిఫ్తీరియా రాకుండా కాపాడవచ్చు. ఇది తప్పనిసరి కాదు. కావాలనుకుంటే తీసుకోవచ్చు. కొద్దిగా ఖర్చుతో కూడుకున్నది. ఏడో నెలలో ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. దీనివల్ల ఫ్లూ ఎక్కువగా ఉండే సమయంలో ఫ్లూ బారిన పడకుండా ఉంటారు. పుట్టిన తర్వాత బిడ్డకి బీసీజీ, పోలియో చుక్కలు వేయాలి. పుట్టిన ఆరు వారాలకు, పది వారాలకు, పద్నాలుగు వారాలకు పోలియో చుక్కలు, డీపీటీ, హెపటైటిస్–బి, ఇన్‌ఫ్లుయెంజా వ్యాక్సిన్లు మూడుసార్లు ఇప్పించాలి. తొమ్మిది నెలలకు ఎంఎంఆర్ వ్యాక్సిన్, ఒకటిన్నర సంవత్సరానికి పోలియో చుక్కలు, డీపీటీ బూస్టర్ తీసుకోవాలి. చికెన్‌పాక్స్, రోటావైరస్, మెదడువాపు వ్యాక్సిన్లు డాక్టర్ల సలహాపై తీసుకోవాలి.
డా‘‘ వేనాటి శోభబర్త్‌రైట్ బై రెయిన్‌బో
హైదర్‌నగర్ హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment