మన ఇంట్లోకి చిన్ని బుజ్జాయి రాబోతోంది అంటే అటు కాబోయే తల్లిదండ్రులతోపాటు, ఇరు కుటుంబాల్లోనూ ఆనందోత్సాహాలు నెలకొంటాయి. అయితే తొమ్మిది నెలలు నిండి, పండంటి బిడ్డ పుట్టేదాకా కొంచెం ఆందోళన ఉంటుంది. ముఖ్యంగా గర్భం ధరించినమహిళల్లో ఎన్నో తెలియని సందేహాలు, భయాలు ఉంటాయి.
ముఖ్యంగా ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి ఆహారం జోలికి వెళ్లకూడదు లాంటి సందేహాలుంటాయి. ఒక విధంగా చెప్పాలంటే సౌష్టికాహారం, తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం, తాజాగా కూరగాయలు, పండ్లు తీసుకోవాలి. శిశువుకు అవసరమైన పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు లభించేలా జాగ్రత్త పడాలి. అలాగే వైద్యుల పర్యవేక్షణలో అవసరమైన సప్లిమెంట్లను వాడుతూ క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవడం, బిడ్డ ఎదుగుదల, కదలికలు ఎలా ఉన్నాయి అనేది పరిశీలించుకోవడమే పాపాయికి శ్రీరామ రక్ష. అయితే సురక్షితమైన, ఆరోగ్యకరమైన బిడ్డ కావాలంటే మాత్రం కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి. అంతేకాదు తల్లీ బిడ్డకోసం అంటూ మరీ ఎక్కువగా ఆహారాన్ని తీసుకోవాలి. మన ఆకలిని బట్టి మాత్రమే తినాలి. లేదంటే అజీర్తి,కడుపు ఉబ్బరం లాంటి సమస్యలొస్తాయి. అలాగే మసాలాలు, ఉప్పు,కారం, పులుపు ఎక్కువగా ఉండే పదార్థాలను కూడా తగ్గించాలి.
ఆహారం, జాగ్రత్తలు
కోలిఫాం బాక్టీరియా, టాక్సోప్లాస్మోసిస్ , సాల్మొనెల్లా లాంటి హానికరమైన బాక్టీరియా సోకే ప్రమాదం ఉన్నందున గర్భధారణ సమయంలో పచ్చి లేదా, ఉడికీ ఉడకని ఆహారం జోలికి వెళ్ల కూడదు. వీటికి కారణంగా ఒక్కోసారి గర్భస్రావం లేదా అకాల జననం లేదా పుట్టుకతో వచ్చే లోపాలు వంటి సమస్యలకు దారి తీస్తాయి.
పాశ్చరైజ్ చేయని పాల ఉత్పత్తులు మంచిది కాదు పాలు, గుడ్లు పౌష్టికాహారం. కానీ పచ్చి గుడ్లలో సాల్మొనెల్లా బ్యాక్టీరియా ఉండవచ్చు. అందుకే పూర్తిగా ఉడికిన గుడ్డు, మరిగించిన పాలను తీసుకోవాలి.
శుభ్రం చేయని పండ్లు, కూరగాయలు: తాజాగా కూరగాయలు, ఆకుకూరలు తీసుకోవాలి. వీటిని వండేటపుడు, వాటిని శుభ్రంగా కడగాలి. లేదంటే వాటిపై ఉండే పురుగుమందుల అవశేషాలు, రసాయనాలు బిడ్డకు హానికరంగా మారతాయి.
కొన్ని రకాలు చేపలు : మెర్క్యురీ ఎక్కువగా ఉండే చేపలకు దూరంగా ఉండాలి. ఇవి శిశువు నాడీ వ్యవస్థకు హాని చేస్తాయి. సొరచేప, కత్తి చేప, కింగ్ మాకేరెల్, టైల్ ఫిష్ వంటి కొన్ని రకాల చేపలలో మెర్క్యురీ ఎక్కువగా ఉంటుంది. సాల్మన్, ట్రౌట్, సార్డినెస్ వంటి తక్కువ మెర్క్యురీ చేపలను పరిమితంగా తినవచ్చు.
కూల్ డ్రింక్స్, ప్రాసెస్డ్ ఫుడ్ కూడా తగ్గించాలి. దీనివల్ల బిడ్డ ఎదుగుదలపైప్రభావాన్ని చూపిస్తాయి. ఇంకా మద్యం, ధూమపానాన్ని పూర్తిగా మానివేయాలి. ఓపిక ఉన్నంత వరకు, కనీసం అరగంట వ్యాయామం చేయవచ్చు. నిపుణుల పర్యవేక్షణలో కొన్ని ప్రత్యేకమైన యోగాసనాలు కూడా వేయవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment