vaccinated
-
చిన్నారికి తక్షణమే సర్జరీ!...ఆ రక్తం వద్దంటూ కోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులు
నాలుగు నెలల శిశువుకి గుండెకి సంబంధించిన శస్త్ర చికిత్స వెంటనే చేయాలి. ఐతే అందుకు దాతల నుంచి రక్తం తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి ససేమిరా అంటు తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ ఘటన న్యూజిలాండ్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..న్యూజిలాండ్‌లోని నాలుగు నెలల చిన్నారికి గుండెకి సంబంధించి లైఫ్ సేవింగ్ సర్జరీ వెంటనే చేయాల్సి ఉంది. ఐతే సర్జరీ కోసం దాతల నుంచి సేకరించిన రక్తాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. అందుకు ఆ శిశువు తల్లిదండ్రులు ఆ రక్తం ఉపయోగిస్తే ఏమవుతుందో అని ఆందోళనతో హైకోర్టుని ఆశ్రయించారు. వారికి కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారి నుంచి సేకరించి రక్తం తమ బిడ్డకు ఎక్కించడంపై విముఖత చూపుతున్నారు. ఈ మేరకు ఆ చిన్నారి తల్లిదండ్రులు మాట్లాడుతూ...తమ బిడ్డకు తీవ్రమైన పల్మనరీ వాల్వ్ స్టెనోసిస్ ఉందని, శస్త్ర చికిత్స వెంటనే చేయాల్సి ఉందని చెప్పారు. ఐతే అందుకు ఉపయోగించే రక్తం పట్ల ఆందోళన చెందుతున్నట్లు పేర్కొన్నారు. వ్యాక్సిన్లు తీసుకున్న కలుషిత రక్తం కాకుండా మరేదైనా ఐతే తమకు అభ్యంతరం లేదంటున్నారు. ఐతే న్యూజిల్యాండ్ బ్లడ్ సర్వీస్.. దాతాలు వ్యాక్సిన్ తీసుకునే దానినిబట్టి వారి నుంచి సేకరించిన రక్తాన్ని వేరుచేయడం జరగదని స్పష్టం చేసింది. అలాగే వ్యాక్సిన్ తీసుకున్న వారి రక్తాన్ని ఉపయోగించడం ద్వారా ఏదైనా ప్రమాదం ఉందనే దానిపై ఎటువంటి ఆధారాలు కూడా లేవని పేర్కొంది. ఈ క్రమంలో ఆక్లాండ్ టె వాటు ఓరా ఆస్పత్రి డైరెక్టర్ వైద్యుడు మైక్ షెపర్డ్ మాట్లాడుతూ..".అనారోగ్యంతో ఉన్న పిల్లలను కలిగి ఉన్న తల్లిదండ్రులకు వారి సంరక్షణ కోసం తీసుకునే నిర్ణయం విషయంలో ఎంత ఆందోళన చెందుతారో అర్థం చేసుకున్నాం. శిశువు ఆరోగ్యం దృష్ట్యా పిల్లల సంరక్షణ చట్టం కింద సదరు చిన్నారిని తల్లిదండ్రుల సంరక్షణ నుంచి తప్పించి కోర్టు కస్టడీకి తీసుకోవాలి. అలాగే దానం చేసిన రక్తాన్ని ఉపయోగించేలా శస్త్ర చికిత్సకు అనుమతి ఇవ్వాలంటూ పిటీషన్ దాఖలు చేశాం. చిన్నారి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ పిటీషన్ దాఖలు చేసినట్లు పేర్కొన్నారు." ఈ మేరకు హైకోర్టులో విచారణకు ఇరు పార్టీలు బుధవారం కోర్టులో హాజరయ్యారు. ఐతే కోర్టు వద్ద సుమారు వంద మందికి పైగా కరోనా వ్యాక్సిన్ వ్యతిరేక మద్దతుదారుల బృందం పెద్ద ఎత్తున గుమిగూడి ఉండటం గమనార్హం. న్యూజిల్యాండ్ ధర్మాసం ఏం చెబుతుందా అని అందరూ ఒకటే ఆతృతతో ఎదురుచూస్తున్నారు. (చదవండి: జలరాకాసి నోట చిక్కి.. తల్లిదండ్రుల కళ్ల ముందే తల తెగిపడింది! అంతలోనే..) -
నా కూతుళ్లకే వ్యాక్సిన్ వేస్తారా! అంటూ గొడవ చేసిన తండ్రి...
Girl vaccinated after her mother’s consent: హర్యానాలోని ఒక వ్యక్తి తన కూతుళ్లుకు వ్యాక్సిన్ వేసినందుకు పెద్ద హంగామ సృష్టించాడు. వ్యాక్సిన్ వేసిన ఆరోగ్యకర్తలను చంపేస్తానంటూ బెదిరింపులకు దిగాడు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...హర్యానాలోని నిహల్‌గర్ గ్రామంలో ఒక ఆరోగ్యం కేంద్రంలో అంగన్వాడి, ఆశా వర్కర్లు పిల్లలకు వ్యాక్సిన్లు వేస్తున్నారు. ఈ మేరకు ఓ ఇద్దరు బాలికలు తమ తల్లి అనుమతితో ఆరోగ్యం కేంద్రం వద్ద యాంటీ మీజిల్స్ వ్యాక్సిన్లు వేయించుకున్నారు. వాస్తవానికి ఆ వ్యాక్సిన్ తట్టు లేదా పొంగు వంటి వ్యాధుల రాకుండా వేసే వ్యాక్సిన్. ఐతే ఇంతలో ఆ బాలికల తండ్రి హరుణ్ ఆరోగ్య కేంద్రం వద్దకు వచ్చి తన కూతుళ్లకు వ్యాక్సిన్ ఎందుకు వేశారంటూ పెద్ద రగడ చేశాడు. అంతేకాదు వ్యాక్సిన్లు వేసే అంగన్వాడి, ఆశా వర్కరులను దుర్భాషలాడుతూ...చంపేస్తానంటూ బెదిరించాడు. దీంతో నిర్మలా యాదవ్ అనే ఆరోగ్య కార్యకర్త పోలీసులుకు ఫిర్యాదు చేశారని పోలీసులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు హరుణ్ని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశామని పేర్కొన్నారు. అతను విచారణలో తన నేరాన్ని ఒప్పుకున్నాడని, కోర్టు ముందు హాజరుపరచనున్నట్లు అధికారులు వెల్లడించారు. (చదవండి: అక్క వెంటే చిట్టితల్లి.. హృదయాన్ని కదిలించిన దృశ్యం) -
హెచ్‌పీవీ వ్యాక్సిన్‌తో సర్వైకల్ క్యాన్సర్ నివారణ
మీరు తరచూ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ టీకాల ప్రకటనలు చూసి కూడా పట్టించుకోలేదా? మీరు మరోసారి తప్పక ఆలోచించండి. భారతదేశంలో సర్వైకల్ క్యాన్సర్ బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మనదేశంలో ఏటా 1,34,240 సర్వైకల్ క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. ఇది 2025 నాటికి రెండు లక్షలకు పైగా చేరవచ్చని అంచనా. సర్వైకల్ క్యాన్సర్ అంటే...? గర్భాశయ ముఖద్వారం (సర్విక్స్) వద్ద వచ్చే క్యాన్సర్‌ను సర్వైకల్ క్యాన్సర్ అంటారు. ఈ భాగం గర్భాశయానికి కింది భాగంలో ఉండే సన్నటి ప్రదేశం. పేరుకు తగ్గట్టు ఇది గర్భాశయ ముఖద్వారంలా పనిచేస్తుంది. ఇది గర్భాశయాన్ని యోనితో కలిపి ఉంచుతుంది. మిగతా అన్ని క్యాన్సర్లతో పోలిస్తే గర్భాశయ ముఖద్వారపు క్యాన్సర్‌ను చాలా సులువుగా నివారించవచ్చు. క్రమం తప్పకుండా స్క్రీనింగ్ చేయించడం దీనికి ఉత్తమ పరిష్కారం. సర్వైకల్ క్యాన్సర్‌కు చికిత్స కూడా చాలా సులభం. దీన్ని ఎంత ముందుగా గుర్తిస్తే అంత తేలిగ్గా చికిత్స చేయవచ్చు. కారణాలేమిటి? సర్వైకల్ క్యాన్సర్‌కు ముఖ్యమైన కారణాల్లో హ్యూమన్ పాపిల్లోమా వైరస్ (హెచ్‌పీవీ) ప్రధానమైనది. ఈ వైరస్ సెక్స్ ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. దాదాపు సగం జనాభాలో జీవితంలో ఏదో ఒక సమయంలో హెచ్‌పీవీ వైరస్‌ను కలిగి ఉంటారు. అయితే అందరిలోనూ ఇది సర్వైకల్ క్యాన్సర్‌కు దారితీయదు. కేవలం కొంతమందిలోనే క్యాన్సర్‌ను కలగజేస్తుంది. సెక్స్‌లో పాల్గొన్న ప్రతివారికీ హెచ్‌పీవీ వైరస్ సోకే అవకాశాలు ఉంటాయి. అయితే తక్కువ వయసులోనే సెక్స్‌లో పాల్గొనడం మొదలుపెట్టిన మహిళల్లో మొదలుకొని, ఎక్కువమంది భాగస్వాములతో సెక్స్‌లో పాల్గొనే సందర్భాల్లో హెచ్‌పీవీ సోకే అవకాశం మరీ ఎక్కువ. ఈ వైరస్‌లోనూ అనేక రకాలు ఉంటాయి. సాధారణంగా హెచ్‌పీవీ వైరస్ దానంతట అదే నశించిపోతుంది. అలా ఒకవేళ నశించకపోతే అది కొంతకాలం తర్వాత క్యాన్సర్‌కు దారితీయవచ్చు. హెచ్‌పీవీ వైరస్‌తో పాటు పొగతాగడం, ఎయిడ్స్, ఐదేళ్ల కంటే ఎక్కువకాలం గర్భనిరోధక మాత్రలు వాడటం, ముగ్గురు అంతకంటే ఎక్కువ మంది పిల్లలను కనడం వంటివి కూడా సర్వైకల్ క్యాన్సర్‌కు దారితీసే రిస్క్‌ఫ్యాక్టర్లలో కొన్ని. నివారణ ఎలా? సర్వైకల్ క్యాన్సర్ నిర్ధారణలో పాప్‌స్మియర్ అనేది క్యాన్సర్ స్క్రీనింగ్‌కు ఉపయుక్తమైన పరీక్ష. 21 ఏళ్లు నిండిన మహిళలు మొదలుకొని, సెక్స్‌లో పాల్గొనడం ప్రారంభించి మూడేళ్లు దాటిన ప్రతి మహిళా తప్పనిసరిగా క్రమం తప్పకుండా పాప్‌స్మియర్ పరీక్ష చేయించుకోవాలి. అంటే మహిళలందరూ క్రమం తప్పకుండా స్క్రీనింగ్ చేయించుకోవడం అవసరం. హెచ్‌పీవీ వ్యాక్సిన్ అంటే..? శక్తిమంతమైన వైరస్, బ్యాక్టీరియాలను తట్టుకోవడానికి మన శరీరం ‘యాంటీబాడీస్’ను తయారుచేస్తుంది. అయితే హెచ్‌పీవీ వైరస్ విషయంలో మాత్రం మన శరీరం ఎలాంటి యాంటీబాడీస్లను తయారు చేయదు. అందువల్ల ఒకసారి ఇన్ఫెక్షన్ వస్తే అది జీవితాంతం ఉండిపోతుంది. అది సర్వైకల్ క్యాన్సర్‌కు దారితీయవచ్చు. హెచ్‌పీవీ వ్యాక్సిన్ (టీకా) ఇప్పించడం వల్ల అది శరీరంలో యాంటీబాడీస్‌ను తయారుచేసి హెచ్‌పీవీ వైరస్ నుంచి శరీరాన్ని కాపాడుతుంది. హెచ్‌పీవీ వ్యాక్సిన్ యోని క్యాన్సర్, గర్భాశయం ముఖద్వారం వద్ద వచ్చే క్యాన్సర్లను నివారిస్తుంది. అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వారి సిఫార్సు ప్రకారం 11 ఏళ్లు నిండిన ప్రతి ఆడపిల్లకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ ఇప్పించాలి. అయితే తొమ్మిదేళ్లు నిండినవారి నుంచి 18 ఏళ్ల వరకు ఉండే ఆడపిల్లలకు ఈ వ్యాక్సిన్ ఇప్పించవచ్చు. ఈ వ్యాక్సిన్‌ను ఆరు నెలల వ్యవధిలో మూడుసార్లు ఇప్పించాలి. దీనివల్ల సర్వైకల్ క్యాన్సర్‌ను నివారించవచ్చు. -
కరీంనగర్ జిల్లా దుర్శేడ్‌లో వందశాతం వ్యాక్సినేషన్
-
వ్యాక్సిన్ వేయించుకోండి, లేదంటే ఇకపై బస్సు ప్రయాణం కష్టమే
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కోవిడ్–19 భయంతో ప్రయాణాలు అంటేనే జంకుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆన్లైన్లో బస్ టికెట్లను విక్రయిస్తున్న రెడ్‌బస్ సరికొత్త ఆలోచనకు తెరతీసింది. ‘వ్యాక్సినేటెడ్ బస్’ సర్వీసులను ప్రకటించింది. దేశవ్యాప్తంగా 600 ప్రధాన మార్గాల్లో ఈ సేవలు ఉంటాయని కంపెనీ వెల్లడించింది. కోవిడ్–19 వ్యాక్సిన్ తీసుకున్న వారు మాత్రమే ఈ బస్‌లలో ప్రయాణిస్తారు. సిబ్బంది, ప్రయాణికులకు కనీసం ఒక డోస్ అయినా అందుకోవాల్సి ఉంటుంది. బస్ ఎక్కే సమయంలో తప్పనిసరిగా రుజువు చూపించాల్సిందే. కస్టమర్ల రేటింగ్ నాలుగు స్టార్స్ కంటే ఎక్కువగా పొందిన బస్ ఆపరేటర్ల సహకారంతో వ్యాక్సినేటెడ్ బస్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు కంపెనీ తెలిపింది. సిబ్బంది, తోటి ప్రయాణికులు కనీసం ఒక డోస్ అయినా తీసుకుంటే వారితో ప్రయాణించేందుకు తాము సిద్ధమని 89 శాతం మంది తమ సర్వేలో వెల్లడించారని రెడ్‌బస్ సీఈవో ప్రకాశ్ సంగం తెలిపారు. స్పందననుబట్టి ఇతర మార్గాల్లోనూ ఈ సేవలను పరిచయం చేస్తామన్నారు. -
వ్యాక్సిన్ తీసుకుంటే.. ఆస్పత్రి ఖర్చులు తగ్గుతున్నాయ్
న్యూఢిల్లీ: కోవిడ్–19 టీకా తీసుకున్న రోగుల్లో మరణాలు 81 శాతం, ఐసీయూలో చేరాల్సిన పరిస్థితులు 66 శాతం మేర తగ్గినట్లు ఆరోగ్య బీమా సంస్థ స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ ఒక అధ్యయన నివేదికలో వెల్లడించింది. దీనితో టీకా తీసుకున్న రోగుల ఆస్పత్రి వ్యయాలు 24 శాతం తగ్గినట్లు పేర్కొంది. టీకా తీసుకోని వారి ఆస్పత్రి వ్యయాలు సగటున రూ. 2.77 లక్షలుగా ఉండగా, తీసుకున్న వారి వ్యయాలు రూ. 2.1 లక్షలుగా ఉందని సంస్థ ఎండీ ఎస్ ప్రకాష్ తెలిపారు. కోవిడ్–19 టీకాల ప్రభావాన్ని అధ్యయనం చేసేందుకు .. దేశీయంగా వేక్సినేషన్ మొదలైన 42 రోజుల తర్వాత ఈ అధ్యయనం నిర్వహించారు. 45 ఏళ్లు పైబడి, ఆస్పత్రిలో చేరిన 3,820 మందిపై దీన్ని నిర్వహించారు. -
టీకా వేయించుకోకున్నా సర్టిఫికెట్ వచ్చింది!
భోపాల్: మధ్యప్రదేశ్‌కు చెందిన 13ఏళ్ల వేదాంత్‌కు కోవిడ్ టీకా వేసినట్లు ఆయన తండ్రికి మెసేజ్ వచ్చింది. పైగా వేదాంత్ వయసు 56గా మెసేజ్‌లో పేర్కొన్నారు. దీంతో షాకైన బాలుడి తండ్రి రజత్ డాంగ్రె అ విషయమై ఫిర్యాదు చేద్దామని ప్రయత్నించినా ఫలితం రాలేదని చెప్పారు. వేదాంత్ దివ్యాంగుడని, కొన్ని రోజుల క్రితమే తనకు పెన్షన్ కోసం వివరాలను మున్సిపాలిటీలో ఇచ్చానని తెలిపారు. ఇటీవలే మధ్యప్రదేశ్ రికార్డు స్థాయిలో టీకాలు వేసినట్లు వార్తలకెక్కింది. అయితే తమకు టీకా వేయించుకోకున్నా, బెనిఫిషియరీ సర్టిఫికెట్ వచ్చిందన్న ఫిర్యాదులు పెరుగుతున్నాయి. తనకు అసలు పరిచయం లేని ముగ్గురు పేర్లతో మెసేజులు వచ్చాయని సత్నాకు చెందిన చైనేంద్ర పాండ్య చెప్పారు. తానే ఇంతవరకు టీకా వేయించుకోలేదని, ఎవరికో టీకా వేసిన మెసేజ్‌లు తనకు ఎందుకు వచ్చాయో తెలియట్లేదని వాపోయారు. అయితే ఈ వార్తలను ప్రభుత్వం కొట్టిపారేసింది. ఇలాంటి ఫిర్యాదులేమైనా అధికారికంగా వస్తే విచారణ చేస్తామని వైద్యమంత్రి చెప్పారు. -
వ్యాక్సిన్ తీసుకున్న హీరో సూర్య దంపతులు
హీరో సూర్య ఆయన భార్య, నటి జ్యోతిక వ్యాక్సిన్ తీసుకున్నారు. మంగళవారం(జూన్ 22) వారిద్దరూ వ్యాక్సిన్ తీసుకున్నట్లు తాజాగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ‘వ్యాక్సినేటెడ్’ అంటూ భార్య జ్యోతిక, సూర్య వ్యాక్సిన్ తీసుకుంటున్న ఫొటోలను ట్విటర్లో షేర్ చేశాడు. కాగా సూర్య ఇటీవల నటించిన ఆకాశం నీహద్దురా సినిమాతో సూపర్ హిట్‌ను అందుకున్నాడు. కొంతకాలంగా సక్సెస్ లేని సూర్యకు ఈ మూవీ ఘనవిజయాన్ని అందించింది. ప్రస్తుతం సూర్య సన్ పిక్చర్స్ బ్యానర్‌పై పాండిరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. సూర్య 40వ చిత్రంగా ఇది తెరకెక్కనుంది. ఈ మూవీలో సూర్యకు జోడీగా నాని గ్యాంగ్ లీడర్ హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తున్నట్లు సమాచారం. #Vaccinated pic.twitter.com/3SJG9wYPFD — Suriya Sivakumar (@Suriya_offl) June 22, 2021 -
కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారా, ఆఫర్లు మాములుగా లేవుగా
హరియాణా : దేశంలో కరోనా వ్యాక్సిన్ డ్రైవ్ జరుగుతుంది. అయితే ఈ వ్యాక్సిన్ డ్రైవ్‌ను క్యాష్ చేసుకునేందుకు వ్యాపారస్తులు బంపర్ ఆఫర్లు ప్రకటిస్తున్నారు. దేశంలో 24 పట్టణాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ జరిగింది. అయితే 'టీకా మహోత్సవ్' పేరుతో కరోనా వ్యాక్సిన్ డ్రైవ్ చేయడంతో మిగిలిన పట్టణాల కంటే గురుగ్రామ్ తొలిస్థానంలో ఉందని జిల్లా సివిల్ సర్జన్ వీరేంద్ర యాదవ్ తెలిపారు. వ్యాక్సిన్ వేయడం, కరోనా నిబంధనలు పాటించడం వల్లే సాధ్యమైందని, అందుకు గురుగ్రామ్ ఆరోగ్యశాఖ అధికారులు కృషి చేశారని ప్రశంసల వర్షం కురిపించారు. ప్రస్తుతం గురుగ్రామ్ లో కరోనా డ్రైవ్ కొనసాగుతుండగా.. సోమవారం( జూన్ 21) గురుగ్రామ్ జిల్లాలో 30 వేల మందికి మాస్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా వ్యాక్సిన్ డ్రైవ్‌ను ఎంకరేజ్ చేసేందుకు పలు మాల్స్, పబ్‌లు, రెస్టారెంట్లు కష్టమర్లకు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను సపోర్ట్ చేస్తూనే.. క్యాష్ చేసుకునే పనిలో పడ్డారు. సింగిల్ టీకా వేయించుకున్న వారికి 25 శాతం డిస్కౌంట్, రెండు టీకాలు వేయించుకున్న వారికి 50 శాతం డిస్కౌంట్ ఇస్తున్నాయి. ఈ ఆఫర్ పై ఓ పబ్ డైరెక్టర్ 'వ్యాక్సిన్ డ్రైవ్ ను ప్రోత్సహించినట్లు ఉంటుంది. బిజినెస్ చేసుకోవచ్చని తెలిపారు. మరోవైపు ఫ్రంట్ లైన్ హెల్త్ వర్కర్ల కృషికి అభినందనలు తెలుపుతూ అంబిఎంచె మాల్ యాజమాన్యం స్పెషల్ డిస్కౌంట్స్ ప్రకటించింది. ఐడీ కార్డ్ ఉంటే ఫ్రీ కార్ పార్కింగ్ సర్వీస్ తో పాటు స్పెషల్ డిస్కౌంట్ అందిస్తున్నామని మాల్ ప్రతినిధి గీతా చెప్పారు. చదవండి: సైన్స్ ఫిక్షన్ సినిమా హీరోలేనా, మనము ఎగిరి పోదాం -
COVID Vaccine: వ్యాక్సిన్ వేసుకున్నా కరోనా సోకిందా?
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులూ వేసుకున్నాక కూడా ఇన్ఫెక్షన్ సోకితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు భరోసా ఇస్తున్నారు. ఇలా వస్తే టీకాల్లో లోపం వల్లనో.. వేసేటపుడు సరైన పద్ధతులు పాటించకపోవడం వల్లనో ఇలా జరుగుతోందని అనవసర అనుమానాలు, భయాలు పెట్టుకోవద్చని చెబుతున్నారు. ‘బ్రేక్ థ్రూ’ఇన్ఫెక్షన్ల కారణంగా చాలా తక్కువ సంఖ్యలో వైరస్ బారిన పడుతున్నారని, అయితే లక్షణాలు తీవ్రస్థాయికి చేరుకునే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. రాష్ట్ర పోలీసు శాఖలో దాదాపు 75 శాతం పోలీసులకు రెండో డోసు వ్యాక్సిన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత కూడా దాదాపు 6 వేల మంది కోవిడ్ బారినపడ్డారు. అందులో దాదాపు 30 మంది వరకు మరణించారు. ఈ విషయంలో అనుమానాలు, ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో పలువురు వైద్య నిపుణులు తమ అభిప్రాయాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. ముఖ్యాంశాలు వారి మాటల్లోనే.. టీకా వేసుకున్నా మాస్కు తప్పనిసరి వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కూడా మాస్కులు పెట్టుకోవాలి. ఇతర జాగ్రత్తలన్నీ తీసుకోవాలి. రోగ నిరోధక శక్తిని కాపాడుకోవాలి. అందుకోసం పోషక విలువలున్న సమతుల ఆహారం, మంచినిద్ర, తగిన వ్యాయామం మేలు చేస్తాయి. కొన్ని వైరస్లలో ఇమ్యూనిటీని చాకచక్యంతో తప్పించుకునే స్వభావంతో పాటు అదను చూసుకుని దాడిచేసే తత్వం ఉంటుంది. ఇమ్యూన్ ఎస్కేప్ లేదా వ్యాక్సిన్ ఎస్కేప్ వేరియెంట్ కూడా ప్రస్తుతం కోవిడ్ ఉన్నా లేదా గతంలో వచ్చి తగ్గినా ఈ వైరస్ శరీరంలోని రోగనిరోధకశక్తి నుంచి తప్పించుకుంటోంది. కరోనా వైరస్ కొత్త మ్యుటేషన్లు, స్ట్రెయిన్లు కొత్త మార్గాలు, పద్ధతులు వెతుక్కుని దాడి చేస్తున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. టీకా సమర్థత, సామర్థ్యంతో పాటు వైరస్ దాని కంటే పైచేయి సాధించే పరిస్థితుల్లో, రోగ నిరోధకశక్తి సరిగా లేని వారు, మాస్కులు ఇతర జాగ్రత్తలు పాటించకపోతే రెండు డోసులు వేసుకున్నా ఇన్ఫెక్షన్ సోకే అవకాశాలున్నాయి. వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల అవయవాలను తీవ్రస్థాయిలో ప్రభావితం చేసే అవకాశాలు తక్కువ. – డా.సతీశ్ ఘంటా, నియోనేటల్, పీడియాట్రిక్ క్రిటికల్ కేర్ నిపుణులు, లిటిల్ స్టార్స్ ఆస్పత్రి 30% మందికి ఇన్ఫెక్షన్ రావొచ్చు.. డబ్ల్యూహెచ్‌వో ప్రకారం రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న 14 రోజుల తర్వాత కూడా దాని సామర్థ్యం 70–80 శాతమే. టీకా తీసుకున్న వారిలో దాదాపు 30 శాతం మందికి ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. టీకా తీసుకున్నాక వైరస్ సోకినా 95 శాతం మందిలో సీరియస్‌గా మారదు. ప్రస్తుతం వచ్చిన టీకాలన్నీ మోనోవాలెంట్, స్పైక్ ప్రోటీన్ ఆధారితమైనవే. మోనోవాలెంట్ అంటే సింగిల్ వైరస్‌ను కేంద్రంగా చేసుకుని చేసినవి. నాలుగైదు వేరియెంట్లను కలిపి తయారు చేస్తారు. స్పైక్ ప్రోటీన్లు ఒక్కటే కాకుండా యాంటీబాడీస్ చాలా ఉంటాయి. వాటి లక్ష్యంగానూ టీకాలు వాడాల్సి ఉంది. అందుబాటులోకి వచ్చిన టీకాలన్నీ ‘మొదటి తరం’వ్యాక్సిన్లు. ఇవి అత్యవసర వినియోగానికి, మరణాలు తగ్గించే ఉద్దేశంతో తెచ్చినవి మాత్రమే. – డా. కిరణ్ మాదల, అసోసియేట్ ప్రొఫెసర్, నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి,మెడికల్ కాలేజి జాగ్రత్తగా లేకపోతే ఎవరికైనా సోకొచ్చు వ్యాక్సిన్ తీసుకున్నాక కోవిడ్ రాదని, వైరస్ సోకదని అనుకోవద్దు. తప్పనిసరిగా మాస్క్, భౌతికదూరం, ఇతర జాగ్రత్తలన్నీ కచ్చితంగా పాటించాల్సిందే. జాగ్రత్తలు తీసుకోకపోతే టీకా వేసుకున్నా ఇన్ఫెక్షన్ సోకుతుంది. కోవిడ్ వ్యాక్సిన్ కారణంగా మరణాలు సంఖ్య తగ్గుతుంది. ఇది వైరల్ ఇన్ఫెక్షన్ కాబట్టి మాస్కుల ధరించకపోతే ఎవరికైనా ఇది సోకవచ్చు. ఇప్పటికే టీకాలు తీసుకున్న వారిలో చాలా తక్కువ మందికే సోకుతోందని, ఒకవేళ సోకినా కూడా చాలా తక్కువ మందే ఆస్పత్రుల్లో చేరాల్సి వస్తోందోనని వివిధ అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. అలా కాలేదంటే వివిధ వైరస్ వేరియెంట్లు, మ్యుటేషన్లపైనా ఇది పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. అందువల్ల ఎలాంటి సందేహాలు లేకుండా అందరూ వ్యాక్సిన్లు వేసుకోవాలి. – డా.వీవీ రమణప్రసాద్, కన్సల్టింగ్ పల్మనాలజిస్ట్, కిమ్స్ ఆస్పత్రి ఇవి దృష్టిలో పెట్టుకోవాలి... ► రెండు డోసులు వేసుకున్నా ఆ వ్యక్తికి వ్యాక్సిన్ నుంచి తక్కువ రోగనిరోధక స్పందన శక్తి లభిస్తే ‘బ్రేక్ థ్రూ’ ఇన్ఫెక్షన్ సోకచ్చు. అన్నిరకాల టీకాల్లోనూ ఇలాంటివి ఉంటాయి. ఒకవేళ సోకినా లక్షణాలు స్వల్పంగా ఉంటాయి. ► ఏ వ్యాక్సిన్‌తో అయినా వందకు వంద శాతం రక్షణ ఇవ్వదన్న విషయాన్ని గ్రహించాలి. ► రెండోడోస్ తీసుకున్నాక 14 రోజుల తర్వాతే రక్షణ ఏర్పడుతుంది. ఆ లోగా ఇన్ఫెక్షన్ సోకొచ్చు. ► సెకండ్‌వేవ్‌లో డబుల్ మ్యుటేషన్ వైరస్ వ్యాప్తి తీవ్రత దీనికి కొంత కారణమై ఉండొచ్చు. ► మాస్కు, భౌతికదూరం పాటించడం, గుంపుల్లో చేరకపోవడం, తరచుగా చేతులు కడుక్కోవడం, ఇళ్లలో విస్తారంగా గాలి వీచేలా చూసుకోవడం కొనసాగించాలి. చదవండి: డెల్టా వేరియంట్ ఎంత డేంజరో తెలుసా? Covid-19: ‘‘అరే, యార్! ఎక్కడ నుంచి వచ్చిందిరా ఇది?’’ -
వ్యాక్సిన్ వేయించుకున్న హీరో కార్తి
చెన్నై: కరోనా వ్యాక్సిన్ వేసుకునేందుకు చాలామంది భయపడుతున్నారు. దీంతో పలువురు సెలబ్రటీలు వ్యాక్సిన్ వేయించుకుని ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ నటుడు కార్తీ శుక్రవారం వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఆ దశ్యాన్ని ఆయన తన ట్విట్టర్లో పోస్టు చేశారు. అందులో తాను మొదటి డోస్ వేసుకున్నానని పేర్కొన్నారు. ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
ప్రతి ఒక్కరికీ కరోనా టీకా : ప్రధాని మోదీ భరోసా
సాక్షి,న్యూఢిల్లీ : ప్రపంచమంతా ప్రాణాంతక కరోనా మహమ్మారి రెండవసారి విజృంభణతో ఆందోళన చెందుతున్న వేళ ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశ పౌరులకు ఊరటనందించారు. కోవిడ్-19 వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే ప్రజలందరికీ అందిస్తామంటూ కరోనా మహమ్మారి వ్యాప్తి తర్వాత తన మొదటి ఇంటర్వ్యూలో నరేంద్ర మోదీ వెల్లడించారు. మొదటి ప్రాధాన్యంగా బలహీనమైన వారికి, ఫ్రంట్‌లైన్ కార్మికులకు టీకా వేయడంపై దృష్టి పెట్టినప్పటికీ, దేశంలో ఏ ఒక్క పౌరుడిని విడిచిపెట్టకుండా కరోనా టీకా అందిస్తామని ప్రధాని మరోసారి స్పష్టం చేశారు. వ్యాక్సిన్ తయారీ పురోగతిలో ఉందనీ, ట్రయల్స్ కొనసాగుతున్నా యన్నారు. ఈ నేపథ్యంలో దేశంలో వ్యాక్సిన్ పంపిణీ వ్యవస్థను సిద్ధం చేస్తున్నామన్నారు. దీనికి సంబంధించి నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసామన్నారు. వ్యాక్సిన్ మోతాదు తదితర మార్గదర్శకాలను ఈ నిపుణుల బృందం నిర్ణయిస్తుందని ప్రధాని మోదీ చెప్పారు. కరోనా మహమ్మారి టీకా ప్రతి వ్యక్తికి చేరేలా 28వేలకు పైగా కోల్డ్ చైన్ పాయింట్లును సిద్ధం చేయనున్నామన్నారు. దీంతోపాటు రాష్ట్ర, జిల్లా, స్థానిక స్థాయిల్లో ఏర్పాటు చేసిన బృందాలు నిష్పక్షపాతంగా, పారదర్శకంగా టీకా పంపిణీని పర్యవేక్షిస్తాయన్నారు. అలాగే లబ్ధిదారుల నమోదు, టీకాలను వేసేందుకు ఒక డిజిటల్ వేదికను కూడా సిద్ధం చేస్తున్నట్లు ప్రధాని తెలియజేశారు. వైరస్ ఎపుడు ఎలా విస్తరిస్తుందో అర్థం కావడం లేదు. ఒకసారి గుజరాత్, మరోసారి కేరళ, కర్ణాటకలో కొన్ని ప్రాంతాలను హాట్ స్పాట్లుగా గుర్తిస్తున్నాం. అంతలోనే పరిస్థితి అదుపులో ఉన్నట్లు అనిపిస్తుంది.. మళ్లీ కొన్ని నెలల తరువాత అధ్వాన్నంగా మారుతోందని ప్రధాని వివరించారు. అందుకే అక్టోబర్ 20న దేశానికి తాను ఇచ్చిన సందేశంలో చెప్పినట్టుగానే ఫేస్ మాస్క్, చేతులు కడుక్కోవడం, సామాజిక దూరం వంటి జాగ్రత్తలు తీసుకోవడమే ఉత్తమమైందని పునరుద్ఘాటించారు. కాగా దేశంలో ఎన్నికలు, విపత్తు నిర్వహణ పనులు ఎలా జరుగుతాయో, వ్యాక్సిన్ డెలివరీ వ్యవస్థను కూడా అలాగే అభివృద్ధి చేయాలని గత వారం ప్రధాని మోదీ సూచించిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్ కేసులు 80 లక్షలను దాటేసింది. మరణించిన వారి సంఖ్య 1,20,527 కు చేరుకుంది. దేశంలో గత 24 గంటల వ్యవధిలో 517 మంది ప్రాణాలు కోల్పోయారు. -
పెద్దలకూ వ్యాక్సిన్లు
వరల్డ్ ఇమ్యునైజేషన్ వీక్ వ్యాక్సిన్ ఇవ్వడం ద్వారా చాలా తక్కువ ధరతో అంటే చాలా చవకగా, దాదాపు పూర్తి సురక్షితంగా చాలా రకాల వ్యాధులను నివారించవచ్చు. ప్రస్తుతం ఈ నెల చివరి తేదీ వరకు వరల్డ్ ఇమ్యూనైజేషన్ వీక్ అనే వారోత్సవాలు నిర్వహితమవుతున్నాయి. ప్రతీ ఏడాదీ ఏప్రిల్ చివరి వారం... అంటే ఏప్రిల్ 24 నుంచి 30 వరకు ఇలా జరుపుతారు. అనేక వ్యాధులను నివారించడం కోసం వ్యాక్సిన్ ప్రాధాన్యతపై ప్రజలందరిలో అవగాహన కల్పించడం కోసమే ఈ వారోత్సవాలను (వీక్‌ను) రూపొందించారు. సాధారణంగా వ్యాక్సిన్లు అంటే పిల్లలకు అనే అనుకుంటుంటారు. అయితే పెద్దవాళ్లకు కూడా వ్యాక్సిన్లు ఇవ్వాల్సి ఉంటుంది. చిన్నప్పుడు మనం తీసుకున్న వ్యాక్సిన్ల ప్రభావం క్రమంగా తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి వాటి శక్తియుక్తులను మళ్లీ బలోపేతం చేసేందుకు వాటిల్లో కొన్నింటిని 50 ఏళ్ల వయసు దాటిన దగ్గర్నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటి కొన్ని వ్యాక్సిన్ల వివరాలు, ప్రయోజనాల గురించి అవగాహన కోసం వాటి గురించి సంక్షిప్తంగా. పెద్ద వయసు వారు తీసుకోవాల్సిన రకరకాల వ్యాక్సిన్లు హెపటైటిస్ ఏ వ్యాక్సిన్ : హెపటైటిస్–ఏ అనే వైరస్ కాలేయంపై ప్రభావం చూపుతుంది. సాధారణంగా ఇది కలుషితమైన ఆహారం, నీటి ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. హెపటైటిస్–బి తో పోలిస్తే ఇది అంత ప్రమాదకరం కాదు. సాధారణంగా యువకులు, మధ్యవయస్కుల్లో ఎలాంటి చికిత్సా తీసుకోకపోయినా తగ్గిపోతుంది. కానీ వృద్ధుల్లో వ్యాధి నిరోధకత తక్కువగా ఉండే కారణాన దీనికి వ్యాక్సిన్ తీసుకోవడం అవసరం. మన దేశంలో ఈ వ్యాధి వ్యాప్తి ఒకింత ఎక్కువే కాబట్టి... దీన్ని నివారించడానికి ఒకసారి వ్యాక్సిన్ తీసుకొని, ఆర్నెల్ల తర్వాత మరో విడత కూడా తీసుకోవాలి. హెపటైటిస్–బి వ్యాక్సిన్ : హెపటైటిస్–బి వైరస్ కాలేయాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది చాలా ప్రమాదకరమైన వ్యాధి. హెచ్ఐవీ వ్యాపించే మార్గాల ద్వారానే ఇది కూడా వ్యాపిస్తుంది. కాలేయాన్ని పూర్తిగా దెబ్బతీసి ప్రాణాంతకంగా మారే అవకాశమూ ఉంది. అయితే అదృష్టవశాత్తూ దీనికి వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. ఈ వ్యాక్సిన్‌ను మూడు డోసుల్లో ఇవ్వాలి. మొదటిది ఇచ్చిన నెల తర్వాత రెండో డోసు, ఆ తర్వాత మొదటిది ఇచ్చిన ఆర్నెల్లకి మూడో డోసు ఇవ్వాలి. యుక్తవయస్కులంతా దీన్ని తీసుకోవడం మంచిది. వారిసెల్లా వ్యాక్సిన్ : వ్యారిసెల్లా జోస్టర్ (వీజడ్వీ) అనే ఈ వైరస్ మనం సాధారణంగా ‘చికెన్‌పాక్స్’ అని పిలిచే వ్యాధిని కలిగిస్తుంది. వారిసెల్లా వ్యాక్సిన్ పెద్దవారిలో చికెన్ పాక్స్నుంచి రక్షణ కల్పిస్తుంది. అయితే అప్పటికే ఏవైనా వ్యాధులతో ఉన్నవారికీ, గతంలో ఈ వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు తీవ్రమైన అలర్జీ వచ్చిన వారికీ, హెచ్ఐవీ వ్యాధి ఉండి, సీడీ4 సెల్స్ కౌంట్స్ 200 లోపు ఉన్నవారికీ, వ్యాధి నిరోధక శక్తి బాగా తగ్గిపోయిన ఇమ్యూనో కాంప్రమైజ్డ్ స్టేటస్ ఉన్నవారికి, స్టెరాయిడ్స్ మీద ఉన్నవారికి ఈ వ్యాక్సిన్‌ను డాక్టర్లు సిఫార్సు చేయరు. అలాగే క్యాన్సర్ కోసం కీమోథెరపీ తీసుకుంటున్నవారు, గత ఐదు నెలల వ్యవధిలో రక్తమార్పిడి / రక్తంలోని ఏదైనా అంశాన్ని స్వీకరించడం వంటి చికిత్స తీసుకున్న వారు సైతం ఈ వ్యాక్సిన్‌ను తీసుకోకూడదు. అలాగే గర్భవతులు కూడా తీసుకోకూడదు. హెర్పిస్ జోస్టర్ వ్యాధి : హెర్పిస్ జోస్టర్ అనే వైరస్‌తో మొదట చికెన్‌పాక్స్ వస్తుంది. ఆ తర్వాత అది హెర్పిస్ జోస్టర్ వ్యాధికి దారితీస్తుంది. దాన్నే షింగిల్స్ అంటారు. జోస్టర్ వైరస్ సోకిన వారిలో పోస్ట్ హెర్పెటిక్ న్యూరాల్జియా అనే నరాలకు సంబంధించిన కాంప్లికేషన్ ఎక్కువగా కనిపిస్తుంది. జోస్టర్ హెర్పిస్ వైరస్ సోకిన వారిలో 60 ఏళ్ల వయసు దాటాక ఈ పోస్ట్ హెర్పిటిక్ న్యూరాల్జియా వచ్చే అవకాశాలు ఎక్కువ.హెర్పిస్ జోస్టర్ వ్యాధికి మంచి నివారణ జోస్టర్ వ్యాక్సిన్. అయితే ఈ వ్యాక్సిన్ వల్ల పూర్తిగా (అంటే 100 శాతం) వ్యాధి రాకుండా ఉంటుందనే గ్యారంటీ అయితే లేదుగానీ... వ్యాక్సిన్ తీసుకున్న వారిలో వారి జీవన ప్రమాణం మెరుగవుతుందని చెప్పవచ్చు. ‘ద షింగిల్స్ ప్రివెన్షన్ స్టడీ’ అనే అధ్యయనం ప్రకారం వ్యాక్సిన్ తీసుకున్నవారిలో వ్యాధి వచ్చే అవకాశాలు 50 శాతం తగ్గుతాయి. అలాగే పోస్ట్ హెర్పటిక్ న్యూరాల్జియా 67శాతం తగ్గుతుంది. అందుకే 50 ఏళ్లు దాటాక జోస్టర్ వ్యాక్సిన్ తీసుకోవడం చాలా మంచిది. ఎసైక్లోవిర్, వాలాసైక్లోవిర్ వంటి యాంటీవైరల్ మందులు తీసుకునేవారు ఇది తీసుకునే ముందర 24 గంటల పాటు ఈ మందులను వాడకపోవడం మంచిది. ఈ వాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా 14 రోజుల పాటు వాటిని వాడకపోవడం మంచిది. నిమోకోకల్ వ్యాక్సిన్ : వయసు పైబడిన వారిలో స్ట్రెప్టోకాకల్ నిమోనియా అనే బ్యాక్టీరియా కారణంగా నిమోనియా, మెనింజైటిస్, బ్యాక్టీరిమియా అనేవి ఎక్కువగా వస్తుంటాయి. నిమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ (పీసీవీ 13) : 65 ఏళ్ల వయసు పైబడిన ప్రతివారూ ఈ వ్యాక్సిన్ ఒక డోస్ తీసుకోవాలి. ఇది తీసుకున్న ఏడాది తర్వాత నిమోకాకల్ పాలీసాకరైడ్ వ్యాక్సిన్ (పీపీఎస్వీ 23) తీసుకోవాలి. నిమోకాకల్ పాలీసాకరైడ్ వ్యాక్సిన్ (పీపీఎస్వీ 23) : ప్రస్తుతం వేర్వేరు నిమోకాకల్ బ్యాక్టీరియా స్ట్రెయిన్స్ కారణంగా వచ్చే అనేక రకాల వ్యాధులకు ‘నిమోకాకల్ పాలీసకరైడ్ వ్యాక్సిన్’తో ప్రయోజనం చేకూరుతుంది. కాబట్టి దీన్ని ఒక నిమోనియాకే నివారణగా అనుకోవడం కంటే... మెనింజైటిస్, బ్యాక్టిరిమియా (బ్లడ్ ఇన్ఫెక్షన్)లకు నివారణ ఔషధంగా పరిగణించవచ్చు. అయితే దీని వల్ల కూడా నూరు శాతం నివారితమవుతుందన్న గ్యారంటీ ఉండదు. అయితే దీనివల్ల చాలా వరకు రక్షణ లభించడంతో పాటు ఒకవేళ టీకా తీసుకుని ఉంటే పైన పేర్కొన్న వ్యాధులు చాలావరకు తగ్గుతాయి. కాంప్లికేషన్లను కూడా చాలా వరకు నివారించవచ్చు.అయితే నిమోకాకల్ పాలీసాకరైడ్ వ్యాక్సిన్ తీసుకున్న ఐదేళ్ల తర్వాత మళ్లీ మరో డోస్ తీసుకోవాలి. అలా ప్రతి ఐదేళ్లకోమారు ఈ వ్యాక్సిన్ తీసుకుంటూ ఉండాలి.అరవై ఐదేళ్లు దాటిన వారికి ఈ వ్యాక్సిన్ ఇవ్వడం మంచిదని అడ్వయిజరీ కమిటీ ఆన్ ఇమ్యునైజేషన్ ప్రాక్టీసెస్ (ఏసిఐపీ) సిఫార్సు చేస్తోంది. ఇది మాటిమాటికీ తీసుకోవాల్సిన అవసరం లేదనీ, ఒకసారి తీసుకున్న తర్వాత దీని వల్ల కలిగే వ్యాధి నిరోధక శక్తి ఐదేళ్ల పాటు ఉంటుందని ఏసిఐపీ పేర్కొంటోంది. మూత్రపిండాల వ్యాధి ఉన్నవారిలో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండే లుకేమియా, లింఫోమా వంటి క్యాన్సర్లు ఉన్నవారిలో, కార్టికో స్టెరాయిడ్స్ తీసుకునేవారిలో దీన్ని ఐదేళ్ల తర్వాత కూడా మరోసారి తీసుకోవాలి ఏసీఐపీ సిఫార్సు చేస్తోంది. ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ : ఇది ఇన్ఫ్లుయెంజా వైరస్ వల్ల కలిగే ఫ్లూ వ్యాధి. మనకు సాధారణంగా జలుబు చేసినప్పుడు కనిపించే లక్షణాలే ఇన్ఫ్లుయెంజా వైరస్ సోకినప్పుడూ కనిపిస్తాయి. అయితే ఇన్ఫ్లుయెంజా నేరుగా హాని చేయకపోవచ్చు. జలుబు తగ్గినట్లే అదీ తగ్గిపోతుంది. కానీ ఒక్కోసారి ఇన్ఫ్లుయెంజా వైరస్ కారణంగా వచ్చే తర్వాతి దశ దుష్పరిణామాలైన శ్వాసకోశ సమస్యల వంటివి రోగిని బాధిస్తాయి. పైగా ఇన్ఫ్లుయెంజా వైరస్ ఎప్పటికప్పుడు తన జన్యుస్వరూపాన్ని మార్చుకుంటూ ఉంటుంది. అందుకే జలుబు వైరస్‌కు ఒకే వ్యాక్సిన్ రూపొందించడం కష్టసాధ్యం. అందుకే అరవైౖయెదేళ్లు ఏళ్లు పైబడిన వారు, ఇమ్యూనోకాంప్రమైజ్ స్టాటస్‌లో ఉన్నవాళ్లు (వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉన్నవాళ్లు) ఈ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను ప్రతి ఏడాదీ తీసుకోవాలి. దీన్ని ప్రతి ఏడాదీ సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో తీసుకోవడం మంచిది. ఒక సూచన : గుడ్డు వల్ల అలర్జీ ఉన్నవారు రీకాంబినెంట్ వ్యాక్సిన్ తీసుకోవాలి.డిఫ్తీరియా అండ్ టెటనస్ వ్యాక్సిన్ : ప్రతి చిన్నారికీ చిన్నప్పుడు డీటీపీ వ్యాక్సిన్ ఇస్తారన్న విషయం తెలిసిందే. అయితే ఆ చిన్నారి 40 ఏళ్ల వయస్కుడయ్యే సమయానికి టెటనస్ వ్యాక్సిన్ ప్రభావం సగానికి తగ్గుతుంది. అదే 60 ఏళ్ల వయసుకు రాగానే టెటనస్ వ్యాక్సిన్ ప్రభావం కేవలం 10 శాతం మాత్రమే ఉంటుంది. కాబట్టి ఈ టెటనస్ డోస్‌ను 60 దాటిన వారికి మరోసారి ఇవ్వాలి. దాంతో అది బూస్టర్ డోస్‌లా పనిచేసి వ్యాక్సిన్ తీసుకున్నవారికి టెటనస్ (ధనుర్వాతం) నుంచి రక్షణ కల్పిస్తుంది. అలాగే డిఫ్తీరియా వ్యాక్సిన్ కూడా తీసుకోవాలి. చిన్నప్పుడు ఇచ్చే డీపీటీలలో పెర్టుసిస్ (కోరింత దగ్గు) అనే సమస్య పెద్ద వయసులో రాదు కాబట్టి ఈ పెర్టుసిస్ వ్యాక్సిన్ పెద్దలకు ఇవ్వాల్సిన అవసరం ఉండదు.నిజానికి ‘టీ–డ్యాప్’ అనే వ్యాక్సిన్ ప్రతి పదేళ్లకు ఒకసారి తీసుకోవడం మంచిది. మరికొన్ని వ్యాక్సిన్లు : ఇప్పుడు డెంగ్యూ వ్యాధికి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది, అయితే దాన్ని కొన్ని పరిమితులకు లోబడి ఇవ్వాల్సి ఉంటుంది. ఇవేగాక జపనిస్ ఎన్కెఫలైటిస్, మెనింగోకోకస్, రేబీస్, టైఫాయిడ్, పోలియో, ఎల్లో ఫీవర్ వంటి వ్యాధుల నివారణకూ వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఎల్లో ఫీవర్ అనే వ్యాధి మన దేశంలో లేదు. అది ఉన్నచోటికి ప్రయాణం చేసేవారు అక్కడికి వెళ్లే 15రోజుల ముందుగా ఈ వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉంటుంది. పెద్ద వయసులో వ్యాక్సిన్లు ఎందుకు? ప్రతి ఏడాదీ చాలా మంది కొన్ని వ్యాధుల బారిన పడుతుంటారు. అయితే వీటిలో చాలావరకు నివారించగలిగేవే. మన వయసు పెరుగుతున్నకొద్దీ, మన వృత్తిని బట్టీ, ఆరోగ్యపరిస్థితి, దేహతత్వాన్ని బట్టి కొన్ని జబ్బుల్లో రిస్క్ పెరుగుతుంది. ఆ రిస్క్ నివారించడం కోసం వ్యాక్సిన్లతో వ్యాధులను నిరోధించడం చాలా తేలిక. కొన్ని ప్రాంతాలకు, విదేశాలకు వెళ్లే చోట్ల కొన్ని రకాల వ్యాధులు ఉంటాయి. ఆ ప్రాంతాలకు వెళ్తున్నవారు అక్కడ వ్యాప్తిలో ఉండే వ్యాధికి వ్యాక్సిన్ తీసుకోవాలి. అలాగే లైఫ్‌స్టైల్ ఆధారంగా కూడా కొన్ని వ్యాక్సిన్లు అవసరం. దాదాపు 19 ఏళ్ల నుంచి 65 ఏళ్ల మధ్య వయసులో కొన్ని రకాల జబ్బులు ఉండి, కాస్త బలహీనమైన వ్యాధి నిరోధక శక్తి (ఇమ్యూనో కాంప్రమైజ్ కండిషన్) ఉన్నవారికి, 65 ఏళ్ల వయసు దాటాక మరికొన్ని జబ్బులు వచ్చే ముప్పు ఉంది. అలాంటి వారిలో ఈ వాక్సిన్లతో ఆ ముప్పును దాదాపుగా నివారించవచ్చు. యుక్తవయసు దాటాక, పెద్ద వయసులో ప్రవేశించే ప్రతివారూ ఈ వ్యాక్సిన్లు తీసుకోవడం వల్ల వ్యాధుల నుంచి వారికి రక్షణ కలగడంతో పాటు... ఆ వ్యాధులు ఇతరులకు వ్యాపించకుండా కూడా నివారించడానికి కూడా అవకాశం ఉంటుంది. నిజానికి ఒకసారి వ్యాధి బారిన పడితే హాస్పిటల్లో పెట్టాల్సిన ఖర్చుతో పోలిస్తే... వ్యాక్సిన్ తీసుకోవడానికి అయ్యే ఖర్చు చాలా చాలా తక్కువ. ఇంటిని పోషించే యజమాని జబ్బు పడితే ఆ ప్రభావం ఇంటి మొత్తం మీద ఉంటుంది. పైగా ఉత్పాదకత కోసం వెచ్చించాల్సిన ఎన్నో విలువైన పనిదినాలను కూడా రక్షించుకొని, వాటిని సమర్థంగా పనులకోసం, ఆరోగ్యంగా జీవించడం కోసం, జీవితాన్ని ఆస్వాదించడం, ఆనందించడం కోసం ఉపయోగించవచ్చు. హ్యూమన్ పాపిలోమా వ్యాక్సిన్ (హెచ్‌పీవీ వ్యాక్సిన్) ఇది మహిళల్లో సర్వైకల్ క్యాన్సర్‌నుంచి నివారణ కల్పిస్తుంది. మహిళలకు 26 ఏళ్ల వయసు వచ్చే వరకు ఈ వ్యాక్సిన్ ఇవ్వవచ్చు. 15 ఏళ్లు పైబడ్డ యువతులు మొదలుకొని మూడు విడతలుగా ఈ వ్యాక్సిన్ ఇస్తారు. మొదటి డోస్ ఇచ్చిన నెల తర్వాత రెండో డోసు, ఆర్నెల్ల తర్వాత మూడో డోస్ ఇస్తారు. ఇందులో రెండు రకాలు అందుబాటులో ఉన్నాయి. ఒకటి రెండు రకాల స్ట్రెయిన్స్ నుంచి, మరొకటి నాలుగు రకాల స్ట్రెయిన్స్ నుంచి రక్షణ ఇస్తుంది. డాక్టర్ సలహా మేరకే అవసరమైన వాటిని వాడాల్సి ఉంటుంది. డాక్టర్ టి.ఎన్.జె. రాజేశ్, సీనియర్ కన్సల్టెంట్ ఫిజీషియన్ఇంటర్నల్ మెడిసిన్ ఇన్ఫెక్షియస్డిసీజెస్,స్టార్ హాస్పిటల్స్,బంజారాహిల్స్, హైదరాబాద్ -
అది సాధారణమే అంటున్నారు!
మా సిస్టర్ ప్రెగ్నెంట్. అయితే ఈమధ్య యూరిన్‌లో రక్తం పడుతుంది. ప్రెగ్నెన్సి సమయంలో ఇలాంటి యూరలాజికల్ ప్ల్రాబ్సమ్స్ సాధారణమేనని అంటున్నారు. దీని గురించి తెలియజేయగలరు. – సి.అనిత, నెల్లిమర్ల మూత్రంలో రక్తం పోవడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. అది గర్భిణులలో కావచ్చు లేదా మామూలు వారిలో కూడా. మూత్రంలో ఇన్ఫెక్షన్లు, కిడ్నీలలో, మూత్రాశయంలో రాళ్లు ఉండటం, అవి కిందకు జారినప్పుడు మూత్రాశయం దగ్గర దెబ్బలు తగలడం, కిడ్నీలలో, మూత్రాశయంలో కణితులు, గడ్డలు ఏర్పడటం, రక్తం గూడు కట్టడంలో సమస్యలు, కొన్ని రకాల మందులు వాడటం వంటి కారణాల వల్ల మూత్రంలో రక్తం పడవచ్చు. గర్భిణులలో హార్మోన్ల మార్పు వల్ల మూత్రాశయ గొట్టాల కదలిక మందగించడం, దానివల్ల మూత్రం గొట్టాలలో ఆగడం వల్ల ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. గర్భిణిలో పెరిగే గర్భాశయం బరువు, మూత్రాశయ గొట్టాల మీద పడి, దాని ఒత్తిడి వల్ల మూత్రం మెల్లమెల్లగా బయటకు రావడం, కిడ్నీల వైపు వెనక్కు వెళ్లడం వల్ల కిడ్నీలలో వాపు, దాని వల్ల మూత్రంలో ఇన్ఫెక్షన్లు, మూత్రంలో రక్తం పడటం జరగవచ్చు. మూత్రంలో రక్తం పడుతుంటే కంప్లీట్ యూరిన్ టెస్ట్, అవసరమైన ఇతర రక్త పరీక్షలు చేయించుకుని కారణాన్ని బట్టి అవసరమైతే యాంటీబయెటిక్స్ వంటి మందులతో చికిత్స చేయించుకోవచ్చు. మంచినీళ్లు బాగా తాగుతుండాలి. మూత్రం వచ్చినప్పుడు ఆపుకోకుండా వెళుతూ ఉండాలి. రెండు సంవత్సరాల క్రితం వరకు నేను సన్నగా ఉండేదాన్ని. ఈ మధ్య లావయ్యాను. ‘అప్పటితో పోల్చితే ఇప్పుడే చక్కగా ఉన్నావు’ అని అందరూ అంటున్నారు. కాని ఒకరు మాత్రం ‘నీకు పీసీఓఎస్ వచ్చినట్లుంది ఒకసారి చెక్ చేయించుకో’ అంటున్నారు. ఇది నిజమేనా? ఒకవేళ నిజమైతే ఇది ప్రమాదకరమా? – డి.సారిక, ఆర్మూర్ సన్నగా ఉండి తర్వాత బరువు పెరిగినంత మాత్రాన పాలీ సిస్టిక్ ఓవరీస్ సిండ్రోమ్ (పీసీఓఎస్) వచ్చినట్లు కాదు. పౌష్టికాహారం తీసుకోవడం వల్ల బరువు పెరిగి ఉండవచ్చు. థైరాయిడ్ సమస్య, పీసీఓఎస్, కిడ్నీ సమస్యలు వంటి ఎన్నో కారణాల వల్ల బరువు పెరగవచ్చు. బరువు పెరిగిన తర్వాత పీరియడ్స్ సక్రమంగా వస్తున్నాయా లేదా, మొటిమలు వస్తున్నాయా, అవాంఛిత రోమాలు ఉన్నాయా వంటి అనేక అంశాల ఆధారంగా పీసీఓఎస్ ఉన్నదీ లేనిదీ తెలుస్తుంది. అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించడం వల్ల పీసీఓఎస్ నిర్ధారణ జరుగుతుంది. పీసీఓఎస్ అంటే అండాశయంలో చిన్న చిన్న నీటిబుడగలు ఉండటం. వీటివల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి మగవారిలో ఎక్కువగా ఉండే టెస్టోస్టిరాన్ అనే ఆండ్రోజెన్ హార్మోన్ ఆడవారిలో స్రవించడం వల్ల పీరియడ్స్ క్రమం తప్పడం, మొటిమలు, అవాంఛిత రోమాలు, అండం విడుదల సక్రమంగా కాకపోవడం వల్ల గర్భంరావడంలో ఆలస్యం కావడం, వచ్చినా అబార్షన్లు కావడం, ప్రెగ్నెన్సీలో షుగర్ పెరగడం వంటి సమస్యలు తలెత్తే అవకాశాలు ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి బరువు బట్టి ఉంటాయి. నువ్వు అనవసరంగా ఆందోళన పడకుండా గైనకాలజిస్టును సంప్రదించి స్కానింగ్, థైరాయిడ్ పరీక్షలు వంటి రక్తపరీక్షలు చేయించుకుని పీసీఓఎస్ ఉందా లేక ఇతర హార్మోన్ సమస్యలేవైనా ఉన్నాయా లేక మామూలుగానే బరువు పెరిగావా అనేది నిర్ధారించుకుని సమస్య ఉంటే చికిత్స తీసుకోవడం లేకుంటే నీ ఎత్తుకి తగిన బరువు ఉంటే అలాగే ఉండవచ్చు. మరీ ఎక్కువ బరువు ఉన్నట్లయితే తగ్గడానికి వ్యాయామాలు చేయవచ్చు. గర్భిణి దశలో మరియు ప్రసవం తరువాత శిశువుకు ఏ ఏ నెలల మధ్య తప్పనిసరిగా వేయించాల్సిన టీకాల గురించి వివరంగా తెలియజేయగలరు. – జి.రాజ్యలక్ష్మీ, సామర్లకోట గర్భిణి సమయంలో ఐదు నెలలో లోపు టెటనస్ ఇంజక్షన్ ఒకటి తీసుకోవాలి. ఆ తర్వాత నెల్లాళ్ల వ్యవధిలో ఏడో నెల లోపు రెండో ఇంజక్షన్ తీసుకోవాలి. టెటనస్‌తో పాటు డిఫ్తీరియా, కోరింత దగ్గు నివారణ కోసం టి–డాప్ అనే ఇంజక్షన్ తీసుకోవచ్చు. దీనివల్ల పుట్టిన బిడ్డకు మొదటి రెండు నెలల్లో టెటనస్, డిఫ్తీరియా రాకుండా కాపాడవచ్చు. ఇది తప్పనిసరి కాదు. కావాలనుకుంటే తీసుకోవచ్చు. కొద్దిగా ఖర్చుతో కూడుకున్నది. ఏడో నెలలో ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. దీనివల్ల ఫ్లూ ఎక్కువగా ఉండే సమయంలో ఫ్లూ బారిన పడకుండా ఉంటారు. పుట్టిన తర్వాత బిడ్డకి బీసీజీ, పోలియో చుక్కలు వేయాలి. పుట్టిన ఆరు వారాలకు, పది వారాలకు, పద్నాలుగు వారాలకు పోలియో చుక్కలు, డీపీటీ, హెపటైటిస్–బి, ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్లు మూడుసార్లు ఇప్పించాలి. తొమ్మిది నెలలకు ఎంఎంఆర్ వ్యాక్సిన్, ఒకటిన్నర సంవత్సరానికి పోలియో చుక్కలు, డీపీటీ బూస్టర్ తీసుకోవాలి. చికెన్‌పాక్స్, రోటావైరస్, మెదడువాపు వ్యాక్సిన్లు డాక్టర్ల సలహాపై తీసుకోవాలి. డా‘‘ వేనాటి శోభబర్త్‌రైట్ బై రెయిన్బో హైదర్‌నగర్ హైదరాబాద్ -
భారత్ బయోటెక్ చేతికి చిరోన్ బెహరింగ్ వ్యాక్సిన్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్‌కు చెందిన వ్యాక్సిన్ తయారీ కంపెనీ భారత్ బయోటెక్.. యూకేకు చెందిన గ్లాక్సోస్మిత్‌క్లిన్ (జీఎస్కే) ఏషియాకు చెందిన చిరోన్ బెహరింగ్ వ్యాక్సిన్స్‌ను కొనుగోలు చేయనుంది. పూర్తిగా నగదు రూపంలో 100 శాతం వాటాను దక్కించుకోనుంది. ఇందుకు సంబంధించిన ఒప్పందంపై శుక్రవారం ఇక్కడ ఒప్పందం జరిగింది. డీల్ విలువ ఎంతనేది మాత్రం స్పష్టం చేయలేదు. ఈ సందర్భంగా భారత్ బయోటెక్ సీఎండీ డాక్టర్ కృష్ణా ఎల్లా విలేకరులతో మాట్లాడుతూ... ‘‘చిరోన్ బెహరింగ్‌కు గుజరాత్‌లోని అంకళేశ్వర్‌లో రేబిస్ టీకా తయారీ కేంద్రం ఉంది. దీని వార్షిక సామర్థ్యం 1.5 కోట్ల మోతాదులు (డోస్‌లు). భారత్ బయోటెక్ రేబిస్ టీకా ప్లాంట్ సామర్థ్యం కోటి డోస్‌లు. తాజాగా చిరోన్ కొనుగోలుతో మా మొత్తం వార్షిక సామర్థ్యం 2.5 కోట్ల మోతాదులకు పెరిగింది. దీంతో రేబిస్ వ్యాక్సిన్ తయారీ, మార్కెట్లలో గ్లోబల్ లీడర్ అవుతాం’’ అని వివరించారు. ఏటా రేబిస్ వ్యాధితో 55 వేల మంది మరణిస్తున్నారని.. ఇందులో 36 శాతం ఇండియాలో ఉంటున్నాయని పేర్కొన్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్ఓ) ప్రీ–అప్రూవ్డ్ అనుమతి పొందిన భారత్ బయోటెక్ వ్యాక్సిన్స్‌ను 70 దేశాల్లో మార్కెట్ చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం 16 వ్యాధులకు సంబంధించిన వ్యాక్సిన్ ఉత్పత్తులను తయారు చేస్తున్నామని, వచ్చే 3–4 ఏళ్లలో మరో 6 వ్యాక్సిన్లను మార్కెట్లోకి తీసుకొస్తామని చెప్పారు. -
హెచ్ఐవీ వ్యాక్సిన్ వచ్చేస్తోంది...
హెచ్ఐవీ వ్యాధి నిరోధానికి శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తున్న సరికొత్త వ్యాక్సిన్ సత్ఫలితాలనిస్తోంది. మానవులతోపాటు కోతులపై జరిగిన ప్రయోగాల్లో ఈ వ్యాక్సిన్ రోగనిరోధక వ్యవస్థను చైతన్యవంతం చేయడం ద్వారా వ్యాధిని అడ్డుకుందని నేషనల్ కేన్సర్ సెంటర్ శాస్త్రవేత్తలు అంటున్నారు. దాదాపు 400 మంది పాల్గొన్న ఈ పరీక్షలు మంచి ఫలితాలిచ్చిన నేపథ్యంలో రెండో దశ పరీక్షలు దక్షిణాఫ్రికాలో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని, ఇందులో 2600 మంది మహిళలకు ఈ వ్యాక్సిన్‌ను అందించనున్నామని ప్రొఫెసర్ డాన్ బరూచ్ తెలిపారు. హెచ్ఐవీని అడ్డుకునేందుకు గత 35 ఏళ్లలో ఐదు వరకు వ్యాక్సిన్లను అభివృద్ధి చేయగా, ఈ స్థాయికి చేరుకున్న వ్యాక్సిన్ ఇదొక్కటే కావడం గమనార్హం. రకరకాల హెచ్ఐవి వైరస్ల ముక్కలు సేకరించి వాటిని కలపడం ద్వారా రోగనిరోధక శక్తిని ప్రేరేపించడం ఈ కొత్త వ్యాక్సిన్ ప్రత్యేకత. దీన్ని వాడినప్పుడు కోతులు హెచ్ఐవి లాంటి వైరస్‌ను 67 శాతం వరకు అడ్డుకోగలిగాయని బరూచ్ తెలిపారు. ప్రపంచం మొత్తం మీద దాదాపు 3.7 కోట్ల మంది హెచ్ఐవి బాధితులు ఉండగా.. ఏటా 18 లక్షల కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. ప్రాణాంతకమైన ఈ వ్యాధిని నిరోధించే వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే ఎన్నో విలువైన ప్రాణాలు నిలబడతాయి. -
అంతా మా ఇష్టం!
అవసరానికి మించి పోలియో వ్యాక్సిన్ కొనుగోలు ఈ నెల 25తో ముగియనున్న వ్యాక్సిన్ గడువు గ్రేటర్లో మూడో విడత పల్స్‌పోలియో? ఇప్పుడెలా సాధ్యమంటున్న వైద్య నిపుణులు సిటీబ్యూరో: డిమాండ్‌కు సరిపడా సరఫరా చేయడం వ్యాపారసూత్రం.. ఎంత అవసరమో అంత కొనడం ఓ పద్ధతి.. అయితే అధికారులు మాత్రం అందుకు విరుద్ధంగా ప్రవర్తించారు. అవసరం లేకపోయినా 27వేల డోసుల పోలియో వ్యాక్సిన్‌ను అధికారులు కొనుగోలు చేసి వృథా చేశారు. ఈ ఒక్క ఉదంతం చాలు అధికారులకు పాలనపై ఎంతశ్రద్ధ ఉందో. అవసరం లేకపోయినా వాక్సిన్ కొనుగోలు చేయడం, ఆ తర్వాత దాన్ని గుట్టుచప్పుడు కాకుండా వదిలించుకునేందుకు పథకం పన్నడం మామూలైపోయింది. ఒక్క హైదరాబాద్ జిల్లాలోనే 27 వేల డోసుల పోలియో వాక్సిన్ మిగిలిపోయింది. ఈ విషయం గమనిస్తే చుక్కల మందు వేసే కార ్యక్రమం ఎంత శ్రద్ధగా జరుగుతుందో ఇట్టే అర్థం చేసుకో వచ్చు. ఒక్కోడోసుకు రూ.110 ఖర్చవుతుంది. అంటే రూ. 29.70 లక్షల విలువైన వ్యాక్సిన్ మిగిలిపోతుందన్నమాట. ఈ నెల 25లోగా దీన్ని వినియోగించపోతే వ్యాక్సిన్ మొత్తం పనికిరాకుండా పోయే ప్రమాదం ఉంది. గ్రేటర్ హైదరాబాద్‌లో ఐదేళ్లలోపు చిన్నారులు 9.9 లక్షల మంది ఉండగా, వీరిలో హైదరాబాద్ జిల్లాలో 5.84 లక్షల మంది, రంగారెడ్డి అర్బన్‌లో 4.95 లక్షల మంది చిన్నారులు ఉన్నారు. జాతీయ పల్స్‌పోలియో కార్యక్రమంలో భాగంగా ఏటా రెండుసార్లు పిల్లలకు వాక్సిన్ వేస్తారు. తొలివిడత కార్యక్రమంలో భాగంగా జనవరి 17 నుంచి 20 వరకు, రెండో విడత కార్యక్రమంలో భాగంగా ఫిబ్రవరి 20-23 వరకు పోలియో చుక్కల మందు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. కానీ పిల్లల నిష్పత్తికి మించి వాక్సిన్ కొనుగోలు చేయడమే కాకుండా మిగిలిన దాన్ని వదిలించుకునేందుకు హైదరాబాద్ జిల్లాలో మూడోసారి పోలియో చుక్కలు కార్యక్రమం నిర్వహించాలని అధికారులు చూస్తుండటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. యూపీహెచ్సీల కేటాయింపులోనూ.. హైదరాబాద్ జిల్లాలో 85 యూపీహెచ్‌సీలు ఉండగా ఒక్కో ఆరోగ్య కేంద్రం పరిధిలో 40-55 పోలియో బూత్‌లు ఏర్పాటు చేశారు. నిబంధనల ప్రకారం ఒక్కో మెడికల్ ఆఫీసర్‌కు ఒక యూపీహెచ్సీ కేటాయించాలి. కానీ జిల్లాలో ఒక్కో అధికారికి రెండు మూడు కేంద్రాలు కేటాయించడం వివాదాస్పదమైంది. అంతేకాదు పోలియో కార్యక్రమ ప్రచారం కోసం ఒక్కో ఆరోగ్య కేంద్రం పరిధిలో మూడు నుంచి ఐదు ఆటోలు ఏర్పాటు చేసి వీటికి మైక్‌లు అమర్చి పోలియో చుక్కలు వేయించుకోవాల్సిన అవసరం ఏమిటి? ఏ రోజు వేస్తున్నారు? ఎక్కడ వేస్తున్నారో వివరించాలి. ఇందు కోసం ఒక్కో వాహనానికి రోజు కు రూ.1200 చొప్పున అద్దె చెల్లిస్తుంది. కొంత మంది మెడికల్ ఆఫీసర్లు ప్రచార వాహనాలు ఏర్పాటు చేయకుండానే బిల్లులు బొక్కేశారు. అంతేకాదు వ్యాక్సినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న నర్సింగ్ స్టూడెంట్స్‌కు నిర్దేశించిన దానికంటే అతితక్కువ ఇన్సెంటివ్స్ ఇచ్చి పంపినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడెలా సాధ్యం పిల్లల నిష్పత్తికి తగిన మోతాదులో వ్యాక్సిన్ కొనుగోలు చేయాల్సి ఉండగా, అధికారులు పిల్లల సంఖ్య కంటే ఎక్కువ వ్యాక్సిన్ కొనుగోలు చేశారు. దీంతో హైదరాబాద్ సహా రంగారెడ్డి జిల్లాలోనూ వ్యాక్సిన్ భారీగా మిగిలిపోయింది. మిగిలిన వాక్సిన్లతో పోలిస్తే పోలి యోవాక్సిన్ హీట్సెన్సీవ్ మెడిసిన్. మైనస్ 15-25 డిగ్రీల వ ద్ధ భద్రపరచాల్సి ఉంది. ప్రస్తుతం నగరంలో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటింది. మిగిలిన వాక్సిన్ను వదిలించుకునేందుకు ఇలాంటి పరిస్థితుల్లో మూడో విడత వాక్సినేషన్ చేపట్టాలనుకోవడం ఎంత వరకు సమంజసమని వైద్యులు ప్రశ్నిస్తున్నారు. జాతీయ పల్స్‌పోలియో కార్యక్రమ నిబంధనల ప్రకారం ఏటా రెండు సార్లు మాత్రమే వాక్సినేషన్ కార్యక్రమం చేపట్టాలి. కానీ హైదరాబాద్‌లో గతంలో ఎన్నడూ లేని విధంగా మూడోసారి వాక్సినేషన్ చేపట్టాలను కోవడమంటే మిగిలిన వాక్సిన్ను వదిలించుకునేందుకు చేస్తున్న ప్రయత్నమేనని పలువురు సీనియర్ వైద్యులు స్పష్టం చేస్తునా ్నరు. -
‘పొగ’ను అరికట్టే వ్యాక్సిన్!
పరిపరి శోధన ఒక్క వ్యాక్సిన్... ఒకే ఒక్క వ్యాక్సిన్... ‘పొగ’ను పూర్తిగా అరికట్టేస్తుందట! దమ్ముకొట్టకుండా ఉండలేని పొగరాయుళ్లు వ్యాక్సిన్ దెబ్బకు సిగరెట్ల జోలికి పొమ్మన్నా పోరట! తెలిసీ తెలియని వయసులో పొగతాగే అలవాటుకు బానిసై, ఆ తర్వాత దానివల్ల తలెత్తే అనర్థాలను గ్రహించినా మానుకోలేని పొగరాయుళ్లు ప్రపంచవ్యాప్తంగా కోకొల్లలుగా ఉన్నారు. మానసిక చికిత్సలు, మందులు కూడా వారి అలవాటును మాన్పించలేకపోతున్నాయి. అయితే, అలాంటి వారి చేత పొగతాగే అలవాటును తేలికగా మాన్పించేయగల వ్యాక్సిన్‌ను రూపొందించినట్లు కాలిఫోర్నియాలోని స్క్రిప్స్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ వ్యాక్సిన్ మెదడుపై నికోటిన్ ప్రభావాన్ని నిర్వీర్యం చేసేస్తుందని, దీంతో పొగరాయుళ్లు తమ అలవాటును ఎలాంటి ఇబ్బంది లేకుండా మానేస్తారని వారు చెబుతున్నారు. -
వ్యాక్సిన్ మాయ
వ్యాక్సిన్ పేరుతో రోగులను దోచుకుంటున్న వైనం దళారుల అవతారమెత్తుతున్న ఆస్పత్రి వైద్య సిబ్బంది ఒక్క ఫోన్ చేస్తే చాలు నేరుగా పేషంట్ వద్దకే.. రూ.లక్షల్లో దండుకుంటున్న ఏజెన్సీలు, వైద్య సిబ్బంది ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో వైద్య సిబ్బంది, మెడికల్ ఏజెన్సీ నిర్వాహకులు కలసి వ్యాక్సిన్ పేరుతో పేదలను దోచేస్తున్నారు. ప్రసవం కోసం వచ్చిన మహిళలను, ప్రసవానంతరం వారి అవసరాన్ని బట్టి వేసే వ్యాక్సిన్లను అధిక ధరలకు విక్రయించి సొమ్ముచేసుకుంటున్నారు. దళారుల అవతారమెత్తిన కొందరు వైద్య సిబ్బంది కనుసన్నల్లో ఈ వ్యవహారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. ‘సాక్షి’ నిఘాలో ఈ దందా వెలుగులోకి వచ్చింది. - తిరుపతి కార్పొరేషన్ రాయలసీమకే తలమానికంగా ఉన్న తిరుపతిలోని ప్రసూతి ఆస్పత్రికి రోజుకు వందల సంఖ్యలో గర్భవతులు వైద్యసేవలకోసం వస్తూంటారు. నెల లు నిండిన గర్భవతులకు ఇక్కడే కాన్పు లు చేస్తుంటారు. ఈనేపథ్యంలో సహజంగా అధికశాతం ప్రసవం అనంతరం పురిటి బిడ్డలకు కామెర్లు వస్తుంటాయి. దీని నివారణకు హెపటైటిస్ బి వ్యా క్సిన్ వేయాల్సి ఉంది. అయితే కొంత కాలంగా ప్రభుత్వం వ్యాక్సిన్‌ను సరఫరా చేయకపోవడంతో దీన్ని కొంతమంది వైద్యులు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. ఆస్పత్రిలోని సిబ్బంది ద్వారా ఏజెన్సీలతో నేరుగా సంబంధాలు పెట్టుకుని దళారుల అవతారమెత్తుతున్నారు. డీపీసీఏ యాక్టు ప్రకారం వ్యాక్సిన్లు, ఇతర మందులను నేరుగా ఆస్పత్రి ఆవరణలో రోగులకు విక్రయించకూడదు. డీపీసీఏ (డ్రగ్ప్రైజ్ కంట్రోల్ యాక్టు) నిబంధనలకు తూట్లు పొడుస్తూ రెట్టింపు ధరకు యథేచ్ఛగా విక్రయిస్తూ లక్షలాది రూపాయలను దండుకుంటున్నారు. రోగులకు కుచ్చు టోపీ ప్రసవానంతరం పురిటి బిడ్డకు 24 గంటల్లోపు కామెర్ల నివారణకు హెపటైటిస్-బి వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉంది. సాధారణంగా వైద్యుల సిఫార్సు చేస్తే మెడికల్ షాపు నుంచి వ్యాక్సిన్ తెప్పించుకుంటారు. కానీ ఇక్కడి వైద్యులు మాత్రం నగరంలోని ఓ ఏజెన్సీతో నేరుగా సంబంధాలు పెట్టుకుంటున్నారు. రోగి అవసరం, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని వ్యాక్సిన్ కోసం ఫలానా ఏజెన్సీకి వెళ్లండి, లేకుంటే ఫలానా ఫోన్ నెంబ రుకు కాల్ చేయండి వాళ్లే మీ వద్దకు తెచ్చిస్తారు’ అని నమ్మిస్తున్నారు. పైగా ఆసుపత్రుల్లోని గోడలపై ఆ సెల్ నెంబర్లు రాస్తున్నారు. వైద్యులు, సిబ్బంది మాటల ఉచ్చులో పడి ఫోన్ నెంబర్ కాల్ చేయడంతో దళారులు నిమిషాల్లో ఆస్పత్రిలోని రోగి ముందు ప్రత్యక్షమై వ్యాక్సిన్ విక్రయించి అందిన కాడికి దోచుకొంటున్నారు. సాధారణంగా రూ.1000 నుంచి రూ.3500 వరకు హెపటైటిస్-బి వ్యాక్సిన్లు లభిస్తుంటాయి. తాజాగా సాక్షి నిఘాలో భాగంగా ఏజెన్సీ సెల్‌కు కాల్చేస్తే ఓ వ్యక్తి ఎంఆర్పి ధర రూ.7వేలు అని ముద్రించి ఉన్న వ్యాక్సిన్‌ను తెచ్చి విక్రయించాడు. ఇదే వ్యాక్సిన్‌ను మెడికల్ షాపులో చూపించి ధరను విచారించగా రూ.3,500 విక్రయిస్తున్నట్టు తెలి పారు. అంటే ఏజెన్సీ వారు రోగికి రూ.7వేలుకు విక్రయించి ఆపై వచ్చిన ఆదాయం (రూ.3,500) వైద్యులు, సిబ్బందికి ముట్టజెప్పుతున్నారని తె లుస్తోంది. ఇదేమని ప్రశ్నిస్తే ఏజెన్సీ వారు ఇస్తే తాను విక్రయించానని, ఇం దులో ఆసుపత్రిలోని వైద్యాధికారుల కు కమీషన్ ఇస్తున్నామని తెలిపారు. విచారణ జరిపిస్తాం ఆసుపత్రుల్లో హెపటైటిస్-బీ వ్యాక్సిన్ సరఫరా లేదు. దీంతో స్లిప్‌ల్లో రాసి మెడికల్ షాపుల్లో తెమ్మని చెబుతున్నాం. కొనుగోలులో కొందరు వైద్యులు, సిబ్బంది హస్తం ఉన్న విషయం నా దృష్టికి రాలేదు. ఎవరైనా బాధితులు నా దృష్టికి తెస్తే సిబ్బందిపై చర్యలు తీసుకుంటాం. ఆస్పత్రుల్లో జరుగుతున్న వ్యాక్సిన్ విక్రయాలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తాను. -యశోదాబాయి, ఆర్ఎంవో, మెటర్నటీ ఆసుపత్రి -
పీహెచ్‌సీలకు సోలార్ విద్యుత్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్సీ)కు సోలార్ విద్యు త్ సౌకర్యం కల్పించాలని వైద్య, ఆరోగ్యశాఖ యోచిస్తోంది. ఒక్కో పీహెచ్‌సీకి రూ. 5 లక్షల చొప్పున 705 పీహెచ్‌సీలకు రూ. 35.25 కోట్లు అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపింది. అనుమతి లభించిన వెంటనే వేసవిలోగా పనుల పూర్తికి అధికారులు సిద్ధమవుతున్నారు. 13వ ఆర్థిక సంఘం నిధులతో ఏర్పాటైన 55 పీహెచ్‌సీల్లో ఇప్పటికే సోలార్ విద్యుత్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. కరెంటు కోతలతో సమస్యలు... గ్రామాల్లో కరెంటు కోతలతో రోగులు తీవ్ర ఇబ్బందులు పాలవుతోన్నారు. జనరేటర్లు ఉన్నా పనిచేయడంలేదు. ఆపరేషన్ల సమ యంలో విద్యుత్ తప్పనిసరి. కరెంటు కోతతో రోగులను పెద్దాసుపత్రులకు పంపిస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లోనైతే పరిస్థితి మరీ ఘోరం. పెద్ద ఆసుపత్రులకు వెళ్లేందుకు కొండలు గుట్టలగుండా సుదూర ప్రయాణం చేయాల్సి వస్తోంది. ఒక్కో పీహెచ్సీ కింద ఉండే 7 నుంచి 10 సబ్ సెంటర్లకు 4 వేల డోసుల వరకు వ్యాక్సిన్లను పీహెచ్‌సీల ఫ్రిజ్‌ల్లోనే నిల్వ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా నిరంతరం ఫ్రిజ్‌లో నిల్వ చేయాల్సిన వ్యాక్సిన్లకు విద్యుత్ కోతలతో తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. ఈ పరిస్థితి నుంచి పీహెచ్‌సీలను గట్టెక్కించాలంటే సోలార్ విద్యుత్తే ప్రత్యామ్నాయమని అధికారులు నిర్దారణకు వచ్చారు. -
అటెన్షన్...
వైద్యులు...సిబ్బందికి వ్యాపించిన వైరస్ అంతటా అప్రమత్తం గాంధీలో మాస్కులతో మార్చ్‌పాస్ట్ ఉస్మానియాలో జూడాల ఆందోళన స్వైన్ ఫ్లూ... మహా నగరం వెన్నులో వణుకు పుట్టిస్తోంది. జనం ప్రాణాలను హరిస్తోంది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికే భయపడేలా చేస్తోంది. మాస్క్ లేకుండా కదల్లేని పరిస్థితి ఎదురవుతోంది. ఈ వ్యాధితో ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండడం మరింత ఆందోళన కలిగిస్తోంది. వైద్యులు... ఆస్పత్రి సిబ్బంది సైతం దీని బారిన పడుతుండడంతో రోగులకు సేవలు అందించేందుకు వెనుకంజ వేస్తున్నారు. మరోవైపు ఇతర వ్యాధులతో ఆస్పత్రుల్లో చేరుతున్న వారు సైతం స్వైన్ ఫ్లూ భయంతో ఇంటి ముఖం పడుతున్నారు. స్వైన్ ఫ్లూ దాటికి వైద్యులు.. పారిశుద్ధ్య సిబ్బంది.. పారా మెడికల్ స్టాఫ్.. పోలీసులు.. సెక్యూరిటీ సిబ్బంది సైతం భయంతో గజగజలాడుతున్నారు. అన్ని వర్గాల వారూ అప్రమత్తమవుతున్నారు. వ్యాక్సిన్ కోసం కార్పొరేట్ ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. హోమియో మందుల షాపుల ముందు జనం క్యూ కడుతున్నారు. మాస్క్‌లకు డిమాండ్‌తో పాటు ధరలూ పెరిగిపోయాయి. మొత్తం మీద నగరంలో పరిస్థితి హెల్త్ ఎమర్జెన్సీని తలపిస్తోంది. మాస్కుల కోసం జూడాల ఆందోళన హైదరాబాద్ శివారు ప్రాంతాల నుంచే కాకుండా తెలంగాణ జిల్లాల నుంచి స్వైన్‌ఫ్లూ బాధితులు చికిత్స కోసం ఉస్మానియా ఆస్పత్రికి వస్తున్నారు. వారికి చికిత్స చేస్తున్న జూడాలకు, నర్సింగ్ సిబ్బందికి వైరస్ వ్యాపిస్తోంది. ఇలా ఇప్పటికే ఇద్దరు హౌస్ సర్జన్లు ఫ్లూ బారిన పడగా, తాజాగా గురువారం మరో నలుగురు జూనియర్ డాక్టర్లు, ఓ నర్సుకు ఫ్లూ లక్షణాలు కనిపించాయి. దీంతోఈ వైరస్ తమకు ఎక్కడ సోకుతుందోనని జూడాలు భయపడుతున్నారు. ఆస్పత్రిలోని వైద్యులు, ఇతర సిబ్బందికి ఎన్ 95 మాస్కులు సరఫరా చేయాలని ఆందోళనకు దిగారు. గాంధీలో మాస్కులతో మార్చ్ఫాస్ట్ గాంధీ ఆస్పత్రి నర్సింగ్ స్కూలు విద్యార్థులు ఈ నెల 26న పెద్ద ఎత్తున గణతంత్ర వేడుకలు నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. ఈ ఆస్పత్రిలో స్వైన్ ఫ్లూ వార్డు ఉన్న నేపథ్యంలో స్కార్ఫ్‌లు కట్టుకుని ఆస్పత్రి ప్రాంగణంలో గురువారం మార్చ్ఫాస్ట్ రిహార్సల్స్ నిర్వహించారు. నర్సింగ్ స్కూలు, కళాశాల, వసతి గృహాల ఎదురుగానే స్వైన్‌ఫ్లూ ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేయడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. మాస్కులపై అభ్యంతరం ఇదిలా ఉంటే సిబ్బంది మాస్కులు ధరించడంపై నగరంలోని వివిధ కార్పొరేట్ ఆస్పత్రులు అభ్యంతరం చెబుతున్నాయి. వైద్య సి బ్బందే భయంతో మాస్కులు ధరిస్తే ఆస్పత్రికి వచ్చే రోగులు మరింత భయాందోళనకు గురయ్యే ప్రమాదం ఉందని వారి వాదన. కొన్ని ఆస్పత్రులు క్రిటికల్ విభాగాల్లో పని చేస్తున్న సిబ్బంది స్వైన్‌ఫ్లూ భారిన పడకుండా ముందస్తుగా వాక్సిన్ ఇస్తుండటం గమనార్హం. -
మార్చికల్లా రూ. 2,282 కోట్ల ఖర్చు
70 శాతం వైద్య పరికరాల కొనుగోలుకే.. ఫిబ్రవరి నుంచి పెంటావాలెంట్ వ్యాక్సిన్ డిప్యూటీ సీఎం టి. రాజయ్య గోదావరిఖని: ప్రభుత్వ ఆస్పత్రుల్లో సామాన్య ప్రజలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని, ఇందులో భాగంగానే వచ్చే మార్చి నాటికల్లా వైద్యానికి కేటాయించిన రూ. 2,282 కోట్లను ఖర్చు చేయనున్నట్లు డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తాటికొండ రాజయ్య తెలిపారు. ఆదివారం రాత్రి కరీంనగర్ జిల్లా గోదావరిఖని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో బస చేసిన ఆయన సోమవారం ఉదయం విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్ పరిధిలోని ఆస్పత్రులకు రూ.552 కోట్లు ఖర్చు చేస్తున్నామని, మొత్తం బడ్జెట్లో 70 శాతం ఆయా ఆస్పత్రులో వైద్య పరికరాల కొనుగోలు కోసమే వినియోగించనున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందుల కొరత లేదని, దీర్ఘకాలిక వ్యాధులకు గతంలో ఇచ్చిన విధంగా కాకుండా 10-15 రోజులకు మందులను అందజేస్తున్నామన్నారు. కుక్కకాటు, పాముకాటుకు మందులు అందుబాటులో ఉన్నాయని, వచ్చే ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఐదు రకాల జబ్బులకు ఉపయోగపడే పెంటావాలెంట్ అనే వ్యాక్సిన్‌ను ప్రారంభించనున్నామని ప్రకటించారు. ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది కొరతను త్వరలోనే టీపీఎస్స్సీ ద్వారా నోటిఫికేషన్ జారీ చేసి ఉద్యోగాలను భర్తీ చేయనున్నామని తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రుల్లో 25 శాతంగా ఉన్న వైద్యసేవలను 60 శాతానికి పెంపుదల చేసేందుకు కృషి చేస్తున్నామని, ఇందుకు ప్రజలు సహకారం అందించాలని కోరారు. డిప్యూటీ సీఎం వెంట రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ ఉన్నారు. -
కుక్క కరిస్తే.. దేవుడే దిక్కు!
అర్బన్ హెల్త్ సెంటర్లలో ఏడు నెలలుగా ఏఆర్వీ లేదు నగరంలో శునకాల స్వైర విహారం రోజుకు 20 నుంచి 30 మందిపై దాడి.. ఏ ఏరియాలో కుక్క కరిచినా ప్రభుత్వాస్పత్రికే పరుగు ఏఆర్వీ అందుబాటులో ఉంది కుక్కకాటుకు గురైనవారికి వేసే ఏఆర్వీ నగరపాలక సంస్థ కార్యాలయంలో ఉంది. అయితే అర్బన్ హెల్త్ సెంటర్లలో వ్యాక్సిన్ నిల్వ చేసే సౌకర్యం లేకపోవడంతో నగరపాలక సంస్థలోనే స్టోరేజీ చేస్తున్నాం. ఏదైనా సెంటర్‌కు అవసరమైనప్పుడు సిబ్బంది వచ్చి తీసుకెళ్లవచ్చు. - డాక్టర్ ఇక్బాల్ హుస్సేన్, కార్పొరేషన్ మెడికల్ ఆఫీసర్ లబ్బీపేట : నగర జనాభా 10.22 లక్షలు. వారికి ప్రాథమిక వైద్యం చేసేందుకు 12 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, రెండు సామాజిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. ఏడు నెలుగా ఈ ఆస్పత్రుల్లో కుక్క కరిచిన వారికి వేసేం దుకు యాంటీ రేబిస్ వ్యాక్సిన్(ఏఆర్వీ) అందుబాటులేదు. దీంతో నగరంలోని ఏ ప్రాంతం వారు కుక్కకాటుకు గురైనా గుణదలలోని ప్రభుత్వాస్పత్రికి పరుగులు పెట్టాల్సిన దుస్థితి నెలకొంది.రోజూ సగటున 20 నుంచి 30 మంది, నెలకు 700 మందికి పైగా కుక్కకాటుకు గురైనవారు ప్రభుత్వాస్పత్రికి వస్తున్నారు. ఇక్కడ కూడా ఇమ్యూనో గ్లోబలిన్ వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడం, బయట కొనుగోలు చేసేందుకు ప్రయత్నించినా లభించకపోవడంతో బాధితులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పరిస్థితి ఇంత తీవ్రంగా ఉన్నప్పటికీ పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో ఏఆర్వీ అందుబాటులోకి తీసుకురాకపోవడంపై నగరవాసులు మండిపడుతున్నారు. గుంపులు గుంపులుగా కుక్కలు.. నగరంలోని అన్ని ప్రాంతాల్లోనూ కుక్కలు గుంపులు గుంపులుగా సంచరిస్తూ ప్రజలపై దాడిచేస్తున్నాయి. గట్టువెన ప్రాంతంలో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. ఉదయం నుంచే వీధుల్లో కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఆదివారం విద్యాధరపురం ప్రాంతానికి చెందిన ఐదేళ్ల బాలుడు శ్యామ్‌పై కుక్కలు దాడిచేసి తీవ్రంగా గాయపరిచాయి. సోమవారం కూడా భవానీపురంలో నివసించే ఓ మహిళ, చిట్టినగర్ ప్రాంతానికి చెందిన ఒక యువకుడు కుక్క కాటుకు గురయ్యారు. వీరిద్దరూ ప్రభుత్వాస్పత్రికి వచ్చి ఏఆర్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. అన్నీ తెలిసినా... వైద్య శాఖ నిబంధనల ప్రకారం ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పట్టణ ఆరోగ్య కేంద్రంలో వ్యాధి నిరోధక టీకాలతోపాటు కుక్కకాటు, పాముకాటుకు సంబంధించిన వ్యాక్సిన్లు తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలి. నగరంలోని పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఏడు నెలలుగా ఏ ఒక్క ఆస్పత్రిలోనూ ఏఆర్వీ అందుబాటులో లేదు. నగరంలోని అన్ని ప్రాంతాల్లోనూ వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తున్న సంగతి నగరపాలక సంస్థల అధికారులు చూస్తూనే ఉన్నారు. వాటిని నియంత్రించేందుకు జీవకారుణ్య సంస్థలు అడ్డుగా మారాయని అధికారులు చెబుతున్నారు. అయితే, కుక్క కరిస్తే బాధితులకు వేసేందుకు ఏఆర్వీ కూడా అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకోవడం లేదు. కుక్కకాటుకు గురైన వారు సమీపంలోని అర్బన్ హెల్త్ సెంటర్లకు వెళితే తమ వద్ద మందు లేదని వైద్యులు చేతులెత్తేస్తున్నారు. దీంతో విద్యాధరపురం, భవానీపురం, కబేళా, కండ్రిక, సింగ్‌నగర్ వంటి దూరప్రాంతాల నుంచి సైతం వ్యాక్సిన్ కోసం ప్రభుత్వాస్పత్రికి రావాల్సి వస్తోంది. కుక్కకాటుకు గురైన వారు ఆరుసార్లు వాక్సిన్ వేయించుకోవాల్సి ఉండటంతో దూరప్రాంతాల వారు ఇబ్బందులు పడుతున్నారు. ఇమ్యూనో గ్లోబలిన్ ఇంజక్షన్ల కొరత.. కుక్కకాటుకు గురైన వారి పరిస్థితిని బట్టి ఏఆర్వీతోపాటు ఇమ్యూనో గ్లోబలిన్ ఇంజక్షన్ కూడా చేస్తారు. గాయం తీవ్రత ఎక్కువగా ఉన్నా, పిచ్చి కుక్క కరిచినా, మెడ, తలపై భాగాల్లో గాయాలైనా ఈ ఇంజక్షన్ చేస్తారు. ఇంతటి విలువైన ఇమ్యూనో గ్లోబలిన్ ఇంజక్షన్ ప్రభుత్వాస్పత్రిలో 20 రోజులుగా అందుబాటులో లేదు. ఈ ఇంజక్షన్ సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ కూడా లేకపోవడం వల్లే ఆదివారం ప్రభుత్వాస్పత్రికి వచ్చిన బాలుడు శ్యామ్‌ను గుంటూరు రెఫర్ చేశామని వైద్యులు చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాస్పత్రిలో ఇమ్యూనో గ్లోబలిన్ ఇంజక్షన్లతోపాటు అర్బన్ హెల్త్ సెంటర్లలో ఏఆర్వీలు అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. -
డెత్తీరియా
డిఫ్తీరియాతో చిన్నారి మృతి 500లకు పైగా కేసులు నమోదు వ్యాక్సిన్ లోపం వల్లే విజృంభణ గ్రేటర్ వాసులను కంఠసర్పి(డిఫ్తీరియా) కాటేస్తోంది. ఆ వ్యాధి బారిన పడి ఫీవర్ ఆస్పత్రిలో శనివారం ఓ చిన్నారి మృతి చెందింది. ఇప్పటి వరకూ 500లకు పైగా కేసులు నమోదయ్యా యి. ఒక్క ఫీవర్ ఆస్పత్రిలో వందకు పైగా బాధితులు చికిత్స పొందుతున్నారు. గొంతు నొప్పితో బాధపడుతూ ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతుండడంతో నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. డీపీటీ వ్యాక్సిన్ తీసుకున్నవారు సైతం ఆస్పత్రుల పాలుకావడం గమనార్హం. నగరంలో డిఫ్తీరియా వ్యాధి ప్రబలుతోంది. ఈ వ్యాధి బారిన పడి ఓ చిన్నారి ఈ నెల 6న ఫీవర్ ఆస్పత్రిలో చేరింది. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. వందలాది మంది ఆస్పత్రి పాలవుతున్నారు. ఈ వ్యాధి ఎక్కువగా చిన్నారులకు వస్తుంది. ప్రస్తుతం పెద్దవారికి సైతం సోకుతుండటంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. నాలుగేళ్లుగా ఈ వ్యాధి నగరంలో విజృంభిస్తోంది. 2011 సంవత్సరంలో 1036 కేసులు, 2012లో 925, 2013లో 1083 కేసులు న మోదయ్యాయి. ఈ ఏడాది ఇప్పటివరకు దాదాపు 500 కేసులు నమోదయ్యాయి. ప్రైవేటు ఆస్పత్రుల్లో సైతం పెద్ద సంఖ్యలో బాధితులు చికిత్స పొందుతున్నట్టు సమాచారం. నగరంలోని పలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఈఎన్టీ డాక్టర్లు లేకపోవడం ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. వాక్సినేషన్ లోపం వల్లే.. జాతీయ ఇమ్యూనైజేషన్ పోగ్రామ్‌లో భాగంగా చిన్నారులకు వ్యాధి నిరోధక టీకాలను ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తోంది. పోలియో, డిఫ్తీరియా వ్యాధుల నివారణకు ఉపయోగించే వ్యాక్సిన్‌ను నిల్వచేసే విషయంలో సరైన ప్రమాణాలు పాటించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఫలితంగా టీకాలు వేసుకున్న వారు ఆస్పత్రుల పాలవుతున్నారు. నగరంలోని పలు పీహెచ్‌సీల్లో డీపీటీ వ్యాక్సిన్‌ను బుధవారం వేస్తున్నారు. ప్రతి శనివారం ఆరోగ్య కేంద్రాల పరిధిలోని ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు ఆయా బస్తీల్లో పర్యటించి వాక్సినేషన్‌పై అవగాహన కల్పించాల్సి ఉండగా, ఒక్క పోలియో దినోత్సవం రోజు మినహా ఇతర సందర్భాల్లో కన్పించడం లేదు. పాత బస్తీలోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. వ్యాధి నివారణకు ఉపయోగించే వ్యాక్సిన్‌పై ప్రజలకు అవగాహన కల్పించడంలో అధికారులు విఫలమయ్యారు. 18 నెలలకు ఒక డోసు, ఐదేళ్లకు మరో డోసు చొప్పన డీపీటీ వాక్సిన్ ఇవ్వాలి. దీనిపై అవగాహన లేకపోవడంతో సకాలంలో వ్యాక్సిన్ వేయించలేక పోతున్నారు. ఇప్పటి వరకు న మోదైన కేసులన్నీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో గుర్తించినవే. ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా బాధితులు పెద్ద సంఖ్యలో ఉన్నట్టు సమాచారం. లక్షణాలు గుర్తించండిలా... గొంతువాపుతో పాటు ట్రాన్సిల్స్పై పింక్ కలర్ ప్యాచ్ ఏర్పడి రక్తస్రావం అవుతుంది బాధితుడు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు బ్యాక్టీరియా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది ముక్కు నుంచి నీరు కారుతుంది. తలనొప్పి వస్తుంది. దగ్గు, జలుబు ఉంటుంది శ్వాస సరిగా తీసుకోలేక పోవడం, హై టెంపరేచర్‌తో కూడిన జ్వరంతో బాధపడతారు ఏ మాత్రం అనుమానం వచ్చినా వెంటనే వైద్యులను సంప్రదించాలి నిర్లక్ష్యం చేస్తేనాడీ వ్యవస్థ, గుండె పని తీరు దెబ్బతిని మరణించే ప్రమాదం ఉంది - డాక్టర్ శంకర్, సూపరింటెండెంట్, ఫీవర్ ఆస్పత్రి -
వ్యాక్సినేషన్‌కు సుస్తీ!
సాక్షి, సిటీబ్యూరో: వైద్యుల నిర్లక్ష్యం.. పేదల నిరక్షరాస్యత.. వెరసి చిన్నారుల ప్రాణాలకు ముప్పు తెస్తున్నాయి. వైద్యారోగ్య రాజధానిగా పేరొందిన గ్రేటర్ హైదరాబాద్‌లో 1520 మురికివాడలు ఉన్నాయి. ఇక్కడ జాతీయ ఉచిత వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం తగిన విధంగా జరగడం లేదు. ప్రతి శనివారం ఆరోగ్య కేంద్రాల్లోని ఏఎన్ఎంలు, హెల్త్ అసిస్టెంట్లు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశావర్కర్లు ఆయా బస్తీల్లో పర్యటించి పిల్లలకు వ్యాధినిరోధక టీకాలు వేస్తున్నట్లు రికార్డుల్లో చూపుతున్నారు. నిజానికి పల్స్‌పోలియో అప్పుడు తప్ప మిగతా సమయాల్లో అటు వైపు కూడా కన్నెత్తి చూడట్లేదు. తల్లి గర్భం దాల్చిననాటి నుంచి ప్రసవం వరకు, ఆ తర్వాత బిడ్డ పుట్టినప్పటి నుంచి ఐదేళ్ల వరకు వేయించాల్సిన టీకాల జాబితా, తదితర వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాల్సి ఉండగా, అదేమీ సవ్యంగా జరగడం లేదు. ఇంటింటికీ తిరగకపోవడం వల్లే.. జీవనోపాధికి నిత్యం అనేకమంది పిల్లపాపలతో కలిసి నగరానికి వలస వస్తున్నారు. వీరంతా బస్తీల్లో తలదాచుకుంటున్నారు. ఊర్లో ఆరోగ్య కార్యకర్తలు ఇంటిముందుకే వచ్చి పిల్లలకు టీకాలు వేస్తే.. నగరంలోని బస్తీలలో మాత్రం ఆరోగ్యకేంద్రాలను, కమ్యూనిటీ హాల్స్‌ను వెతుక్కోవాల్సి వస్తోంది. వాక్సిన్ ఏ రోజు వేస్తారు? ఎక్కడ వేస్తారో ప్రచారం ఉండటం లేదు. దీంతో గతంలో ఒకటి రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకున్న వారు, వలసల వల్ల ఆ తర్వాతి డోసులను మర్చిపోతున్నారు. టీకాలు వేయించుకోని వారే కాదు, ప్రైవేటు ఆస్పత్రుల్లో టీకాలు వేయించుకున్న వారు సైతం డిఫ్తీరియా, కామెర్లు, టీబీ, కోరింత దగ్గు, ధనుర్వాతం, మెదడువాపు రోగాల బారినపడుతుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఔషధ నిల్వల్లో తలెత్తుతున్న లోపాలతోనే వ్యాక్సిన్ వికటిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. కాగా, మిగతా ప్రాంతాలతో పోలిస్తే పాతబస్తీ, సమీప కాలనీల్లో ఢిప్తీరియా, మమ్స్, మీజిల్స్ కేసులు ఎక్కువ నమోదవుతున్నట్లు స్పష్టమవుతోంది. అటకెక్కిన మొబైల్ ట్రాకింగ్ విధానం జిల్లా కలెక్టర్‌గా గుల్జార్ ఉన్నప్పుడు బస్తీల్లోని గర్భిణిలు, ఐదేళ్లలోపు పిల్లలు, వారికిచ్చే వాక్సిన్లు, ఇతర వివరాల నమోదుకు ఆన్లైన్ మొబైల్ ట్రాకింగ్ విధానాన్ని ప్రవేశపెట్టారు. రూ.లక్షలు వెచ్చించి మొబైల్ ఫోన్లు కొన్నారు. దీని పర్యవేక్షణకు ఫిలింనగర్లో తొలిసారిగా ఐవీఆర్ఎస్ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేశారు. మరో 18 కేంద్రాలకు సేవల్ని విస్తరించినా.. నిర్వహణ లోపంతో ఈ విధానం అటకెక్కింది.