అటెన్షన్...
వైద్యులు...సిబ్బందికి వ్యాపించిన వైరస్
అంతటా అప్రమత్తం
గాంధీలో మాస్కులతో మార్చ్‌పాస్ట్
ఉస్మానియాలో జూడాల ఆందోళన
స్వైన్ ఫ్లూ... మహా నగరం వెన్నులో వణుకు పుట్టిస్తోంది. జనం ప్రాణాలను హరిస్తోంది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికే భయపడేలా చేస్తోంది. మాస్క్ లేకుండా కదల్లేని పరిస్థితి ఎదురవుతోంది. ఈ వ్యాధితో ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండడం మరింత ఆందోళన కలిగిస్తోంది. వైద్యులు... ఆస్పత్రి సిబ్బంది సైతం దీని బారిన పడుతుండడంతో రోగులకు సేవలు అందించేందుకు వెనుకంజ వేస్తున్నారు. మరోవైపు ఇతర
వ్యాధులతో ఆస్పత్రుల్లో చేరుతున్న వారు సైతం స్వైన్ ఫ్లూ భయంతో ఇంటి ముఖం పడుతున్నారు.
స్వైన్ ఫ్లూ దాటికి వైద్యులు.. పారిశుద్ధ్య సిబ్బంది.. పారా మెడికల్ స్టాఫ్.. పోలీసులు.. సెక్యూరిటీ సిబ్బంది సైతం భయంతో గజగజలాడుతున్నారు. అన్ని వర్గాల వారూ అప్రమత్తమవుతున్నారు. వ్యాక్సిన్ కోసం కార్పొరేట్ ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. హోమియో మందుల షాపుల ముందు జనం క్యూ కడుతున్నారు. మాస్క్‌లకు డిమాండ్‌తో పాటు ధరలూ పెరిగిపోయాయి. మొత్తం మీద నగరంలో పరిస్థితి హెల్త్ ఎమర్జెన్సీని తలపిస్తోంది.
మాస్కుల కోసం జూడాల ఆందోళన
హైదరాబాద్ శివారు ప్రాంతాల నుంచే కాకుండా తెలంగాణ జిల్లాల నుంచి స్వైన్‌ఫ్లూ బాధితులు చికిత్స కోసం ఉస్మానియా ఆస్పత్రికి వస్తున్నారు. వారికి చికిత్స చేస్తున్న జూడాలకు, నర్సింగ్ సిబ్బందికి వైరస్ వ్యాపిస్తోంది. ఇలా ఇప్పటికే ఇద్దరు హౌస్ సర్జన్లు ఫ్లూ బారిన పడగా, తాజాగా గురువారం మరో నలుగురు జూనియర్ డాక్టర్లు, ఓ నర్సుకు ఫ్లూ లక్షణాలు కనిపించాయి. దీంతోఈ వైరస్ తమకు ఎక్కడ సోకుతుందోనని జూడాలు భయపడుతున్నారు. ఆస్పత్రిలోని వైద్యులు, ఇతర సిబ్బందికి ఎన్ 95 మాస్కులు సరఫరా చేయాలని ఆందోళనకు దిగారు.
గాంధీలో మాస్కులతో మార్చ్‌ఫాస్ట్
గాంధీ ఆస్పత్రి నర్సింగ్ స్కూలు విద్యార్థులు ఈ నెల 26న పెద్ద ఎత్తున గణతంత్ర వేడుకలు నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. ఈ ఆస్పత్రిలో స్వైన్ ఫ్లూ వార్డు ఉన్న నేపథ్యంలో స్కార్ఫ్‌లు కట్టుకుని ఆస్పత్రి ప్రాంగణంలో గురువారం మార్చ్‌ఫాస్ట్ రిహార్సల్స్ నిర్వహించారు. నర్సింగ్ స్కూలు, కళాశాల, వసతి గృహాల ఎదురుగానే స్వైన్‌ఫ్లూ ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేయడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.
మాస్కులపై అభ్యంతరం
ఇదిలా ఉంటే సిబ్బంది మాస్కులు ధరించడంపై నగరంలోని వివిధ కార్పొరేట్ ఆస్పత్రులు అభ్యంతరం చెబుతున్నాయి. వైద్య సి బ్బందే భయంతో మాస్కులు ధరిస్తే ఆస్పత్రికి వచ్చే రోగులు మరింత భయాందోళనకు గురయ్యే ప్రమాదం ఉందని వారి వాదన. కొన్ని ఆస్పత్రులు క్రిటికల్ విభాగాల్లో పని చేస్తున్న సిబ్బంది స్వైన్‌ఫ్లూ భారిన పడకుండా ముందస్తుగా వాక్సిన్ ఇస్తుండటం గమనార్హం.