{పభుత్వాస్పత్రుల్లో నలుగురికి చికిత్స
మాస్కులు అధిక ధరకు విక్రయిస్తే కఠిన చర్యలు
మందుల షాపులకు కలెక్టర్ హెచ్చరిక
విశాఖ మెడికల్: జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో స్వైన్‌ఫ్లూ రోగుల చికిత్సకు అవసరమైన మందులు, మాస్క్‌లకు కొరత లేదని కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్ చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 11 ైస్వైన్‌ఫ్లూ స్క్రీనింగ్ కేంద్రాల్లో వీటిని అందుబాటులో ఉంచామన్నారు. వ్యాధి నివారణ నియంత్రణకు చేపడుతున్న చర్యలకు సంబంధించి గురువారం సాయంత్రం కలెక్టరేట్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇంతవరకు 24మంది స్వైన్‌ఫ్లూ అనుమానితులకు చికిత్సను అందిస్తున్నామని చెప్పారు. వీరిలో ఆరుగురికి మాత్రమే స్వైన్‌ఫ్లూ వ్యాధి సోకినట్టు నిర్ధారణ అయ్యిందని, 9 మందిలో వ్యాధి లే నట్లు తేలిందని, మరో 9మందికి పరీక్ష నివేదికలు రావాల్సి ఉందన్నారు. జిల్లాలో ఇప్పటివరకు స్వైన్‌ఫ్లూ అనుమానిత లక్షణాలతో ఇద్దరు మృతి చెందినప్పటికి, దీనికి ఈ వ్యాధి కారణం కాదన్నారు. ప్రస్తుతం ఈ వ్యాధి అనుమానిత లక్షణాలతో బాధపడుతూ కేజీహెచ్‌లోని ఐసోలేషన్ వార్డులో ఇద్దరు, ఛాతీ ఆస్పత్రులోని స్వైన్‌ఫ్లూ ప్రత్యేక వార్డులో ఇద్దరికి చికిత్సను కొనసాగిస్తున్నామని, మిగిలిన వారు ప్రయివేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని ఆయన వివరించారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఈ వ్యాధి చికిత్సకు అవసరమైన 4300 టామీఫ్లూ మాత్రలు జిల్లాకు వచ్చాయని, వాటిలో ఇప్పటివరకు 1725మాత్రలు మాత్రమే వినియోగించగా, 2575మాత్రలు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, స్క్రీనింగ్ ఆస్పత్రుల్లో సిద్ధంగా ఉంచామన్నారు. ఇవి కాకుండా 60 లక్షల మందికి సరిపడిన హోమియో మందులు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయన్నారు. ప్రయివేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులకు మందుకావాలంటే సోమ్‌నాథ్ మెడికల్ స్టోర్‌లో లభ్యమవుతాయని చెప్పారు. సాధారణ మాస్కులు లక్ష వరకు వైద్య ఆరోగ్యశాఖ వద్ద సిద్ధంగా ఉన్నాయన్నారు. మెడికల్ షాప్‌ల్లో మాస్కులను అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. వ్యాధి సోకిన వ్యక్తులు నివసించే ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి వ్యాధి లక్షణాలను గుర్తించే కార్యక్రమాన్ని వైద్య సిబ్బంది నిర్వహిస్తున్నారని, ఇందుకోసం జిల్లా పరిధిలో 72 బృందాలు పని చేస్తున్నాయన్నారు.
వీరు 14700 గృహాలలు సర్వే చేసి నివేదిక అందించారన్నారు. విశాఖలో స్వైన్‌ఫ్లూ నిర్ధారణ కేంద్రం ఏర్పాటుకు అవసరమైన చర్యలు ప్రభుత్వం తీసుకుందని, దీనికి సుమారు రూ.కోటి ఖర్చు అవుతుందన్నారు. కేంద్రప్రభుత్వ అనుమతితోపాటు సిబ్బందికి తగిన శిక్షణనిచ్చే కార్యక్రమం అమలుకు చర్యలు చేపట్టామన్నారు. ఈ సమావేశలో డీఎంహెచ్‌ఓ డాక్టర్ సరోజిని, జీవీఎంసి చీఫ్ మెడికల్ ఆఫీసరు డాక్టర్ సత్యనారాయణరాజు, జిల్లా స్వైన్‌ఫ్లూ నోడల్‌ఆఫీసర్ డాక్టర్ ఎల్.బిహెచ్.దేవి, కేజీ హెచ్ నోడల్ ఆఫీసర్ ఉమాదేవి, మైక్రోబయాలజి అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ శివకళ్యాణి పాల్గొన్నారు.
స్వైన్‌ఫ్లూ మందుల కొరత లేదు
Published Fri, Feb 6 2015 12:07 AM | Last Updated on Thu, Mar 21 2019 8:23 PM
Advertisement