- వ్యాధి బారిన మరో యువతి
- జిల్లాలో కలకలం
- బెంబేలెత్తుతున్న ప్రజలు
నిర్మల్ అర్బన్/బెల్లంపల్లి: ఆదిలాబాద్ జిల్లాలో స్వైన్‌ఫ్లూ వ్యాధి విజృంభిస్తోంది. కాసిపేట మండలం రొట్టపల్లి గ్రామానికి చెందిన పోగుల సరోజ వ్యాధి బారిన పడి మంచిర్యాల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. తాజాగా లక్ష్మణచాంద మండలం బొప్పారం గ్రామానికి చెందిన యువతి(26) స్వైన్‌ఫ్లూ బారిన పడింది. మంగళవారం ఆమెకు జ్వరం రావడంతో కుటుంబ సభ్యులు నిర్మల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అనుమానం వచ్చిన వైద్యులు పలు పరీక్షలు నిర్వహించగా.. స్వైన్‌ఫ్లూ లక్షణాలు కనిపించినట్లు ఏరియా ఆస్పత్రి వైద్యుడు ధూంసింగ్ తెలిపారు. స్వైన్‌ఫ్లూగా నిర్ధారించి యువతికి వైద్యం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇలా ఒక్కొక్కరిగా జిల్లాలో స్వైన్‌ఫ్లూ లక్షణాలు బయటపడుతుండడం ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. ప్రభుత్వం, ప్రజలు ఎన్ని జాగ్రత్త లు తీసుకున్నా స్వైన్‌ఫ్లూ వ్యాధి చాపకింది నీరులా విస్తరిస్తోంది. వాతావరణంలో వచ్చిన మార్పుల ప్రభావం వల్ల చల్లటి గాలికి స్వైన్‌ఫ్లూ వ్యాధి వేగంగా విస్తరిస్తోం ది. గ్రామీణ ప్రాంతాల్లోనూ ప్రభావం చూపిస్తోంది.
తుమ్మినా.. దగ్గినా..
స్వైన్‌ఫ్లూ వ్యాధి ప్రభావం ప్రజలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. ఎవరైనా ఆకస్మికంగా తుమ్మినా.. దగ్గినా.. జలుబుతో కనిపించిన భయంతో వణుకుతున్నారు. గాలి ద్వారా వ్యాపించే వ్యాధి కావడంతో ప్రజ లు అభద్రతాభావానికి గురవుతున్నారు. హెచ్1ఎన్1(స్వైన్‌ఫ్లూ) అనే అంటువ్యాధి ఇన్‌ప్లూయంజా ‘ఎ’ వైరస్ వల్ల వ్యాపిస్తోంది. ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి గాలి ద్వారా సోకుతుంది. దగ్గినప్పుడు, తుమ్మినప్పు డు, సాధారణంగా మాట్లాడుతున్న క్రమంలో నోటి నుంచి వెలువడే తుంపర్ల వల్ల వైరస్ వ్యాపిస్తుంది. ఫ్లూ వ్యాధి మాదిరిగా ఉండి ఊపిరితిత్తుల అంతర్భాగాలలో సోకి ప్రమాదకారిగా మారుతుంది. త్వరితగతిన వ్యాధి ముదిరి ప్రాణాపాయం జరిగే అవకాశాలు మెండుగా ఉంటాయి. అందువల్ల అప్రమత్తతంగా ఉండి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం తప్పా మరో మార్గం లేదు. సకాలంలో చికిత్స చేయించుకుంటే ప్రాణాపాయం నుంచి బయటపడడానికి వీలుంది.
జాగ్రత్తలు..
ఇంట్లో నుంచి బయటకు వెళ్లినప్పుడు ఇతరులను కలిసే క్రమంలో చేతులు కలపడం(కరచాలనం) చేయవద్దు. కౌగిలించుకోవద్దు. చేతులను ఎప్పటికప్పుడు శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి. ఎవరైనా తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు తప్పనిసరిగా ముక్కును, నోటిని శుభ్రమైన గుడ్డతో చేతిని అడ్డం పెట్టుకోవాలి. ఇంట్లో నుంచి బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు తప్పనిసరిగా నోటికి మాస్కులు ధరించాలి. గాలి ద్వారా వ్యాపించే వ్యాధి కాబట్టి సాధ్యమైనంత వరకు చల్లటి గాలిలో బయటకు వెళ్లకపోవడం మంచిది.
ఇలా చేస్తే సరి..
జలుబు, దగ్గు, జ్వరం, గొంతు నొప్పి, తలనొప్పి, విరేచనాలు, శ్వాసతీసుకోవడం కష్టంగా ఉండడం వంటి లక్షణాలు ఎవరిలోనైనా కనిపించినట్లయితే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆస్పత్రికి వెళ్లాలి. వైద్య పరీక్షలు చేయించుకుని వైద్యుడి సలహాను పాటించాలి. ముఖ్యంగా బయట తిరగవద్దు, ఎక్కువగా నీళ్లు తాగాలి. పౌష్టికాహారాన్ని భుజించాలి. సంపూర్ణ విశ్రాంతి తీసుకోవాలి.
స్వైన్‌ఫ్లూ బాధితురాలికి కలెక్టర్ పరామర్శ
మంచిర్యాల టౌన్ : మంచిర్యాల ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న స్వైన్‌ఫ్లూ బాధితురాలు పోగుల సరోజను కలెక్టర్ జగన్మోహన్ మంగళవారం పరామర్శించారు. స్థానిక టీఎన్జీఓస్ భవనంలో స్వైన్‌ఫ్లూపై అవగాహన సదస్సు ముగిసిన అనంతరం ఆయన నేరుగా ప్రభుత్వాస్పత్రికి వచ్చారు. కాసిపేట మండలం రొట్టపల్లి గ్రామానికి చెందిన పోగుల సరోజ జనవరి 31న స్వైన్‌ఫ్లూ వ్యాధి బారిన పడగా సోమవారం నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. స్వైన్‌ఫ్లూ వార్డులో చికిత్స పొందుతున్న సరోజను పరామర్శించారు.
ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఇంటికి వెళ్తానని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేయడంతో.. చికిత్స పొందిన అనంతరం ఇంటికి వెళ్లాలని సూచించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నీలకంఠేశ్వర్‌రావుతో మాట్లాడి బాధితురాలికి అందిస్తున్న వైద్య సేవలు తెలుసుకున్నారు. మందులు ఏ మేరకు అందుబాటులో ఉన్నాయని ఆరా తీశారు. మెరుగైన వైద్యం అందిస్తూ ఎప్పటికప్పుడు ఆరోగ్య పరిస్థితిని సమీక్షించాలని వైద్యులను ఆదేశించారు. కలెక్టర్ వెంట జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి రుక్మిణమ్మ ఉన్నారు.
విజృంభిస్తున్న స్వైన్‌ఫ్లూ
Published Wed, Feb 4 2015 8:44 AM | Last Updated on Thu, Mar 21 2019 8:30 PM
Advertisement