పాలమూరు :
స్వైన్‌ఫ్లూను నియంత్రించేం దుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సమరం ప్రకటించారని.. అందులో భాగంగానే రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశం చేపట్టి ఒక్కో జిల్లాకు పర్యవేక్షణాధికారులుగా బాధ్యతలు అప్పగించినట్లు ప్రిన్సిపల్ సెక్రటరీ రేమండ్ పీటర్ పేర్కొన్నారు. స్వైన్ ఫ్లూ బాధితుల సంఖ్య అధికంగా ఉన్న మహబూబ్‌నగర్ జిల్లాపై సీఎం ప్రత్యేకంగా మాట్లాడారని, ప్రజలు ఈ జిల్లాలో ఆ వ్యాధి బారిన పడకుండా ఉండేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టేందుకు సమీక్షా సమావేశం చేపట్టినట్లు రేమండ్ పీటర్ వెల్లడించారు. గురువారం జిల్లా పరిషత్ మీటింగ్ హాల్‌లో కలెక్టర్ టీకే శ్రీదేవి, జిల్లాలోని పలు విభాగాల అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు స్వైన్‌ఫ్లూ నియంత్రణపై ప్రత్యేక దృష్టి నిలిపినట్లు తెలిపారు. జిల్లా ఆసుపత్రిలో స్వైన్‌ఫ్లూ బాధితుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక చర్యలు, వార్డుల విభజన, మందుల స్టాక్, వైద్య సిబ్బంది వంటి వివరాలను తెలుసుకున్న ప్రిన్సిపల్ సెక్రటరీ జిల్లా ఆసుపత్రికి అవసరమైన మందులు, ఇతర సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. సాంఘీక సంక్షేమ పాఠశాలలు, వసతిగృహాల అధికారులు, వైద్య సిబ్బంది, అధికారులు, పాఠశాలల్లోని ఉపాధ్యాయులు, ఇతర విభాగాలకు చెందిన అధికారులు సెలవులు తీసుకోవద్దని సీఎం పేర్కొన్నారని తెలిపారు. అన్ని పాఠశాలలు, అంగన్ వాడీ కేంద్రాలు, హాస్టళ్లలోని చిన్నారులను అక్కడి సిబ్బంది అప్రమత్తంగా చూసుకోవాలని జలుబు, దగ్గు, తీవ్ర జ్వరం వంటివి వస్తే తక్షణమే ఆసుపత్రికి పంపాలన్నారు. వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని సూచించారు. అంతకు ముందు కలెక్టర్ టీకే శ్రీదేవి మాట్లాడుతూ స్వైన్‌ఫ్లూ బారిన పడకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రత పాటించాలని.. నీళ్లు ఎక్కువగా తాగాలని, అనారోగ్యంగా ఉన్నవారికి దూరంగా ఉండి మాట్లాడాలన్నారు.
దగ్గడం, తుమ్మడం వంటివి చేసే సమయంలో చేతిని గానీ, దస్తీని గానీ అడ్డుపెట్టుకోవాలన్నారు. జిల్లాలో గడచిన రెండు నెలల్లో 14 మందికి స్వైన్ ఫ్లూ పాజిటివ్‌గా తేలిందని అందులో ఓ వ్యక్తి ఇతర అనారోగ్యం కారణంగా చనిపోగా మిగిలిన 13మందికి వైద్య చికిత్సల ద్వారా బాగు చేసినట్లు తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆసుపత్రిలో వైద్యులు అందుబాటులో ఉన్నారని, మందులు కూడా ఉన్నాయన్నారు. అన్ని మున్సిపాలిటీల పరిధిలో ఆయా కాలనీలో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని కమిషనర్‌లను ఆదేశించామన్నారు. అన్ని ప్రభుత్వ విభాగాల ద్వారా స్వైన్ ఫ్లూపై అప్రమత్తం అయ్యేందుకు విస్తృత ప్రచారం చేయనున్నట్లు వెల్లడించారు. జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శామ్యూల్ మాట్లాడుతూ
స్వైన్‌ఫ్లూ బారినపడి ఆసుపత్రిలో చేరిన అయిదుగురికి అంత తీవ్రత లేదని, వారంతా స్టేజ్-1 దశలోనే ఉండడంతో 5 రోజుల పాటు స్వైన్‌ఫ్లూ వ్యాధినివారణ మందులు, చికిత్స చేపడితే కోలుకునే వీలుందన్నారు. స్వైన్‌ఫ్లూ బాధితుల కోసం ఆస్పత్రిలో రెండు వార్డులు ప్రత్యేకంగా ఉన్నాయని.. ఇప్పుడు మరో నాలుగు వార్డులను అదనంగా ఏర్పాటు చేశామని చెప్పారు. గర్భిణులు, షుగర్, టీబీ, క్యాన్సర్, హెచ్‌ఐవీ ఉన్నవారికి ఇదిత్వరగా వ్యాపిస్తుందని, ప్రజలు దీనిపట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ నాగమ్మ, డీసీహెచ్‌ఎస్ పద్మజ, జిల్లా ఆసుపత్రి ఆర్‌ఎంఓ రాంబాబు, ఐడీఎస్‌పీ ఇన్‌చార్జ్ శశికాంత్,ఎంపీడీఓలు, ఎమ్మార్వోలు, హాస్టల్ వార్డెన్లు, హెచ్‌ఎంలు, అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.
జిల్లాపై ప్రత్యేక దృష్టి..
Published Fri, Jan 23 2015 9:59 AM | Last Updated on Thu, Mar 21 2019 8:29 PM
Advertisement
Advertisement