స్వైన్ ఫ్లూ మాస్కులో మాయాజాలం! | Swine flu magic | Sakshi
Sakshi News home page

స్వైన్ ఫ్లూ మాస్కులో మాయాజాలం!

Published Thu, Feb 5 2015 2:41 AM | Last Updated on Fri, May 25 2018 2:29 PM

స్వైన్ ఫ్లూ మాస్కులో మాయాజాలం! - Sakshi

స్వైన్ ఫ్లూ మాస్కులో మాయాజాలం!

వైద్యులతో కార్పొరేట్ విద్యా సంస్థల కుమ్మక్కు
ఫలానా చోట ఇంజక్షన్లు
వేయించుకోవాలని ఎస్సెమ్మెస్‌లు
ఇంజక్షన్లు, మాస్క్‌లకు పెరిగిన గిరాకీ
ఫ్లూ ఇంజక్షన్లనే స్వైన్ ఫ్లూ ఇంజక్షన్‌గా విక్రయాలు
అందుబాట్లో లేని ప్రభుత్వ మందు
లు
 
‘స్వైన్‌ఫ్లూ తీవ్రంగా ఉంది. ప్రభుత్వం మందులు సరఫరా చేయడం లేదు. ఫలానా క్లినిక్‌లో ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయి. మీరు, మీ పిల్లలు అక్కడికి వెళ్లి వేయించుకోండి’.. శ్రీకాకుళంలో ఓ విద్యార్థి చదువుతున్న పాఠశాల నుంచి అతని తండ్రికి వచ్చిన ఎస్సెమ్మెస్ సారాంశమిది.
 
దీనిపై జిల్లా వైద్యాధికారి ఏం చెబుతున్నారంటే..

స్వైన్‌ఫ్లూ నివారణకు ప్రభుత్వం ఇప్పటి వరకూ ఎలాంటి ఇంగ్లిష్ మందులు పంపిణీ చేయలేదు. మార్కెట్లో దొరుకుతున్నవ న్నీ ప్రైవేట్ కంపెనీలవే. అవి కేవలం కొన్ని రకాల నొప్పులకే పనికొస్తాయి. వైద్యులు తమ వద్దకు వచ్చే రోగులకు ఎలాంటి మందులిస్తున్నారో పరిశీలించాల్సి ఉంది. సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నట్టు తేలితే చర్యలు తీసుకుంటాం.         -ఆర్. శ్యామల, డీఎంహెచ్‌వో, శ్రీకాకుళం
 
స్వైన్‌ఫ్లూ.. ప్రస్తుతం ప్రజలను వణికిస్తున్న ఈ మహమ్మారి పేరు చెప్పి దోపిడీకి పాల్పడుతున్నారనడానికి ఈ రెండు వ్యాఖ్యలు చాలు. జిల్లాలో ఈ వ్యాధి అంతగా లేకపోయినా దీనిపై ప్రజల్లో ఏర్పడిన భయాందోళనలను కొన్ని ప్రైవేట్ విద్యాసంస్థలు, మందుల షాపులు, డాక్టర్లు కుమ్మక్కై సొమ్ము చేసుకుంటున్నాయి.
 
శ్రీకాకుళం: సర్వత్రా స్వైన్‌ఫ్లూ భయం ఆవరించిన నేపథ్యంలో మందులు, ఇంజక్షన్లు, ఫేస్ మాస్క్‌లకు గిరాకీ ఏర్పడింది. వాస్తవానికి శ్రీకాకుళం జిల్లాలో ఈ వ్యాధి ప్రభావం పెద్దగా లేదు. పలాస, నరసన్నపేట వంటి ప్రాంతాల్లో ఇద్దరుముగ్గురిలో ఈ లక్షణాలు కనిపించడంతో పరీక్షల నిమిత్తం విశాఖకు తరలించారు. ఈ నేపథ్యంలో జనాన్ని అప్రమత్తం చేసేందుకు అన్ని వర్గాలూ ముందుకు వచ్చాయి. రెడ్‌క్రాస్, జేసీస్ వంటి స్వచ్ఛంద సంస్థలు వ్యాధి నివారణకు హోమియో మందులను ఉచితంగా పంపిణీ చేస్తున్నాయి. మరోవైపు రిమ్స్‌లో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసినా ప్రభుత్వం నుంచి మందుల సరఫరా లేదు. జిల్లాలో స్వైన్ ఫ్లూ ప్రభావం లేనందున మందుల సరఫరాపై ఆందోళన చెందనక్కర్లేదని వైద్య వర్గాలు చెబుతున్నాయి. మాస్క్‌లను కూడా వ్యాధి లక్షణాలు కనిపించే కుటుంబసభ్యులకే వైద్యాధికారులు సరఫరా చేస్తున్నారు. అయినప్పటికీ భయంతో ప్రజలు ఎవరికి వారుగా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఫేస్ మాస్క్‌లు వాడడం, శుభ్రత పాటించడం వంటివి చేస్తున్నారు. సరిగ్గా ఇక్కడే మార్కెట్ మాయాజాలం ప్రజలను కమ్మేస్తోంది. అక్రమార్జనకు బాటలు వేసుకుంటోంది.
 
మాయదారి ఇంజక్షన్లు!

 
స్వైన్ ఫ్లూ వ్యాధికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి మందులూ సరఫరా చేయడం లేదు. మార్కెట్లో కూడా ఇవి ఎక్కడా లేవు. కానీ ఇనాక్టివేటెడ్ ఇన్‌ఫ్లూయంజా వాక్సిన్(సర్ఫేజ్ యాంటీజన్) పేరిట మందుల దుకాణాల్లో కొన్ని ఫ్లూ ఇంజక్షన్లు లభ్యమవుతున్నాయి. అవి కేవలం జ్వరం, తలనొప్పి, జలుబు నివారణకే పనిచేస్తాయి. వాటి వల్ల స్వైన్ ఫ్లూ తగ్గదని వైద్యాధికారులే స్పష్టం చేస్తున్నారు. అయితే కొన్ని కార్పొరేట్ విద్యా సంస్థల నిర్వహకులు మాత్రం ప్రైవేట్ వైద్యులతో కుమ్మక్కై పరిస్థితిని క్యాష్ చేసుకునేందుకు పన్నాగం పన్నాయి. ఫలానా ఆస్పత్రి, క్లినిక్, వైద్యుడి వద్ద స్వైన్ ఫ్లూ నివారణ ఇంజక్షన్ వేయించుకోవాలని సూచిస్తున్నాయి. పిల్లల తల్లిదండ్రులకు ఈ మేరకు ఎస్సెమ్మెస్‌లు పంపిస్తున్నాయి. అసలే భయంతో ఉన్న జనం వీటిని చూసి మరింత ఆందోళనతో ఇంజక్షన్ల కోసం క్యూ కడుతున్నారు. కాగా టోకు వ్యాపారులు  ఒక్కో ఇంజక్షన్‌కు సుమారు రూ.450తోపాటు 5శాతం పన్ను కలిపి విక్రయిస్తుండగా వైద్యులు దీన్ని రూ.750 నుంచి రూ.800కు విక్రయిస్తున్నారు. మరోవైపు దుకాణాల వద్దా ఈ ఇంజక్షన్ల కోసం జనం క్యూ కడుతున్నారు. ఎమ్మార్పీ ధరను గానీ, డోస్ ఎక్కువైతే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయన్న విషయాన్ని గానీ పట్టించుకునే పరిస్థితిలో వారు లేకపోవడం స్వార్థపరులకు మరింత కలిసివస్తోంది.

మాస్క్‌ల అమ్మకాలదీ అదే తీరు

ముందుజాగ్రత్తగా ధరిస్తున్న ఫేస్‌మాస్కుల అమ్మకాలూ ఈ రీతిలోనే సాగుతున్నాయి. త్రీలేయర్ డిస్పోజబుల్ ఫేస్ మాస్క్‌లను హోల్‌సేల్ డీలర్లు రూ.4 రేటుకు ఔషధ దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. వాటిపై ఎమ్మార్పీ ధర రూ.7.50గా ఉంది. కానీ దుకాణదారులు ఒక్కో మాస్కును రూ.10 నుంచి రూ.12కు విక్రయిస్తున్నారు. వాస్తవానికి ఇవి ప్యూరిఫైడ్ కాదని, సింగిల్ లేయర్‌వేనని వ్యాపారులే చెబుతున్నారు. మరో విషయం ఏంటంటే తమ వద్ద మాస్క్‌లు లభిస్తున్నట్టు దుకాణ దారులు పోస్టర్లు, బ్యానర్లు ప్రదర్శిస్తున్నారు. హోల్‌సేల్ ధరలకే (డీలర్ ప్రైస్) వాటిని విక్రయించాలన్న అధికారుల సూచనలనూ పట్టించుకోవడం లేదు.
 డిస్పోజబుల్ మాస్క్‌లు కూడా ఒక్కసారి వాడి పారేయాలని నిబంధనలు చెబుతున్నా అవగాహన లేక చాలామంది వాటిని రోజుల తరబడి వాడుతున్నారు. డిమాండ్ ఎక్కువగా ఉన్న తగినంత సరఫరా లేకపోవడంతో వ్యాపారులు చెప్పిన ధరకే కొనుక్కుపోతున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం పెద్దగా పట్టించుకోవడంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
 
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు

మాస్క్‌లు, ఇంజెక్షన్లకు డిమాండ్ ఉండడం వాస్తవమే. అయితే నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్టు ఫిర్యాదిస్తే వైద్యులు, దుకాణాలపైనా చర్యలు తీసుకునేందుకు సిఫారుసు చేస్తాం. ప్రైవేట్ సంస్థలు చొరవ చూపిస్తున్నట్లు స్వైన్ ఫ్లూ నివారణ మందుల్ని ప్రభుత్వమే సరఫరా చేసే విధంగా లేఖ రాస్తాం.
 -వైవీవీ సత్యనారాయణ, ఔషధ నియంత్రణ శాఖ ఏడీ, శ్రీకాకుళం
 
 డిమాండ్‌కు తగ్గ సరఫరా లేదు

 మాస్క్‌లకు గిరాకీ ఉన్నా స్టాకిస్టులు పూర్తిస్థాయిలో సరఫరా చేయడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉన్నట్టు మా దృష్టికి వచ్చింది. మాస్క్‌లు తయారు చేసే కంపెనీలతో ప్రభుత్వం చర్చించి విరివిగా లభించేలా చొరవ చూపాలి.
 -కె.కరణకుమార్‌గుప్త, అధ్యక్షుడు, జిల్లా డ్రగ్ ట్రేడ్ అసోసియేషన్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement