ఆగని ‘స్వైన్’ ఘంటికలు
ఉస్మానియాలో వెంటిలేటర్లు కరువు
గాంధీ ఐసోలేషన్ వార్డులో ఆర్తనాదాలు
ఫీవర్ ఓపీకి పొటెత్తుతున్న సాధారణ రోగులు
సిటీబ్యూరో: స్వైన్ ఫ్లూపై యుద్ధం ప్రకటించినట్లు ప్రభుత్వం చెబుతున్నా...ఫ్లూ తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. మరోవైపు స్వైన్‌ఫ్లూ రోగులకు చికిత్స అందించేందుకు ఆస్పత్రుల్లో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డుల్లో కనీస వసతుల్లేక రోగులు మృత్యువాతపడుతున్నారు. అవసరమైన మందులు, మాస్కులు, వెంటి లేటర్లను ఐసోలేషన్ వార్డుల్లో సమకూర్చినట్లు అధికారులు చెప్పుతున్నా.. అవి రోగుల అవసరాలు ఏమాత్రం తీర్చలేకపోతున్నాయి. గాంధీలో తగినన్ని పడకలు లేకపోవడంతో ఫీవర్ ఆస్పత్రికి తరలిస్తుండగా, ఉస్మానియాలో అనుమానిత రోగులను జనరల్ వార్డుల్లోని ఇతర రోగుల మధ్య ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఇక ఫీవర్ ఆస్పత్రిలో పాజిటివ్ బాధితులను, అనుమానితులను ఒకే వార్డులో ఉంచుతున్నారు.
ఉస్మానియా జనరల్ వార్డుల్లో ఫ్లూ అనుమానితులు
ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో 15 రోజుల క్రితం పది పడకలతో స్వైన్‌ఫ్లూ రోగుల కోసం ఓపీ బిల్డింగ్ రెండో అంతస్థులో ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేశారు. నోడల్ ఆఫీసర్‌తో పాటు ఒక నర్సును నియమించారు. ఈ వార్డులో రోగుల నిష్పత్తికి తగినన్ని పడకలు లేకపోవడంతో స్వైన్‌ఫ్లూ లక్షణాలతో బాధపడుతున్న రోగులను సైతం జనరల్ వార్డులోని ఇతర రోగుల పక్కనే ఉంచి చికిత్స అందిస్తున్నారు. అనుమానితుల నుంచి నమూనాలు సేకరించి ఐపీఎంకు పంపుతున్నారు. తీరా రిపోర్టులో ఫ్లూ పాజిటివ్‌గా నిర్ధారణ అయిన త ర్వాత సదరు రోగిని ఐసోలేషన్ వార్డుకు తరలిస్తున్నారు. స్వైన్ ఫ్లూ వార్డులో ఇప్పటి వరకు ఒక్క వెంటిలేటర్ కూడా ఏర్పాటు చేయలేదు. రెస్పిరేటరీ సమస్య తలెత్తిన రోగులను ఏఎంసీకి తరలించి వెంటిలేటర్ అమర్చుతున్నారు. దీంతో వైరస్ ఇతర రోగులకే కాదు, వారికి చికిత్సలు అందిస్తున్న జూనియర్ వైద్యులకు, నర్సింగ్ స్టాఫ్‌కు విస్తరిస్తోంది. ఇలా ఇప్పటికే 10 మంది హౌస్‌సర్జన్లు, ఇద్దరు స్టాఫ్ నర్సులు స్వైన్‌ఫ్లూ బారిన పడ్డారు.
ఫీవర్‌లో బాధితులంతా ఒకే వార్డులో..
ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల కు ప్రతి రోజూ పెద్ద ఎత్తున స్వైన్‌ఫ్లూ రోగులు వస్తుండటంతో సాధారణ రోగులు ఆయా ఆస్పత్రు లకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. గత రెండు రోజుల నుంచి సాధారణ రోగులు చికిత్స కోసం న ల్లకుంటలోని ఫీవర్ ఆస్పత్రికి క్యూ కడుతున్నారు. ఇక గాంధీలోని ఐసోలేషన్ వార్డులో సరిపడా పడకలు లేకపోవడంతో కొందర్ని నల్లకుంట ఫీవర్ ఆస్పత్రికి తరలిస్తున్నారు. ఇక్కడా ఫ్లూ బాధితుల్ని, అనుమానిత రోగులనూ ఒకే వార్డులో ఉంచి చికిత్సలు అందిస్తున్నారు.
గాంధీలో పడకల సమస్య...
గాంధీ ఆస్పత్రిలోనూ స్వైన్ ఫ్లూ రోగులకు పడకల సమస్య ఎదురవుతోంది. వాస్తవంగా ప్రభుత్వం ఇక్కడ స్వైన్‌ఫ్లూ నోడల్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినప్పటికీ...ఫ్లూ తీవ్రత ఎక్కువగా ఉండడంతో రోగుల సంఖ్య పెరిగి పడకలు సరిపోవడం లేదు. ఆస్పత్రి పరిపాలనా భవనం ఎనిమిదో అంతస్తులో తొలుత 10 పడకలతో ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేవారు. ఫ్లూ అనుమానితుల కోసం ఓపీ భవనంపై డిజాస్టర్‌వార్డు, ఏఎంసీ సిద్ధం చేశారు. ఇటీవల రోగుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండటంతో వీటి సంఖ్య 50 పడకలకు పెంచారు. ప్రస్తుతం ఆస్పత్రిలో 48 మంది పాజిటివ్ కేసులు ఉండగా, మరో 27 సస్పెక్టెడ్ కేసులకు చికిత్స అందిస్తున్నారు. ఫ్లూ తీవ్రత ఎక్కువగా ఉండి, శ్వాస సరిగా తీసుకోలేకపోతున్న వారి కోసం ఐసోలేషన్ వార్డులో ఐదు, ఏఎంసీలో రెండు, డిజాస్టర్ వార్డులో ఒక వెంటిలేటర్ ఏర్పాటు చేశారు.