
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కోవిడ్–19 భయంతో ప్రయాణాలు అంటేనే జంకుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆన్‌లైన్‌లో బస్ టికెట్లను విక్రయిస్తున్న రెడ్‌బస్ సరికొత్త ఆలోచనకు తెరతీసింది. ‘వ్యాక్సినేటెడ్ బస్’ సర్వీసులను ప్రకటించింది. దేశవ్యాప్తంగా 600 ప్రధాన మార్గాల్లో ఈ సేవలు ఉంటాయని కంపెనీ వెల్లడించింది. కోవిడ్–19 వ్యాక్సిన్ తీసుకున్న వారు మాత్రమే ఈ బస్‌లలో ప్రయాణిస్తారు. సిబ్బంది, ప్రయాణికులకు కనీసం ఒక డోస్ అయినా అందుకోవాల్సి ఉంటుంది.
బస్ ఎక్కే సమయంలో తప్పనిసరిగా రుజువు చూపించాల్సిందే. కస్టమర్ల రేటింగ్ నాలుగు స్టార్స్ కంటే ఎక్కువగా పొందిన బస్ ఆపరేటర్ల సహకారంతో వ్యాక్సినేటెడ్ బస్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు కంపెనీ తెలిపింది. సిబ్బంది, తోటి ప్రయాణికులు కనీసం ఒక డోస్ అయినా తీసుకుంటే వారితో ప్రయాణించేందుకు తాము సిద్ధమని 89 శాతం మంది తమ సర్వేలో వెల్లడించారని రెడ్‌బస్ సీఈవో ప్రకాశ్ సంగం తెలిపారు. స్పందననుబట్టి ఇతర మార్గాల్లోనూ ఈ సేవలను పరిచయం చేస్తామన్నారు.