Red Bus
-
పండగ సీజన్లో భారీగా సీట్ల బుకింగ్
పండగ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో బస్ ప్రయాణికుల సంఖ్య 62 శాతం పెరుగుతుందని ఆన్లైన్ బస్ టికెటింగ్ ప్లాట్‌ఫామ్ రెడ్‌బస్ అంచనా వేసింది. సెప్టెంబర్ 26-30తో పోలిస్తే(పండగలు లేనికాలం) అక్టోబర్ 10-14(దసరా పండగ)కాలంలో ఆన్లైన్లో బస్ సీట్ల బుకింగ్ పెరుగనుందని సంస్థ తెలిపింది.ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు దసరా ఉత్సవాలకు సిద్ధమవుతున్నాయి. హైదరాబాద్, బెంగళూరు వంటి వివిధ నగరాల్లో నివసిస్తున్న తెలుగు రాష్ట్రాలకు చెందినవారు పండగకు సొంత ఊళ్లకు వెళ్లనున్నారు. దసరా శనివారం వస్తుండడం, తర్వాత ఆదివారం సెలవు ఉండడంతో ప్రయాణాలు పెరిగే అవకాశం ఉంది. ఈ తరుణంలో రెడ్‌బస్ ఆన్లైన్లో బస్ సీట్ల బుకింగ్‌లలో 62 శాతం పెరుగుదలను అంచనా వేస్తున్నట్లు పేర్కొంది.ఇదీ చదవండి: అతిపెద్ద షాపింగ్ ఈవెంట్‌కు తేదీ ఖరారుఇతర రాష్ట్రాల నుంచి తెలుగు రాష్ట్రాలకు వచ్చేవారిలో దాదాపు 84 శాతం బుకింగ్‌లు హైదరాబాద్-బెంగళూరు, విజయవాడ-బెంగళూరు, నెల్లూరు-బెంగళూరు రూట్లలో నమోదవతున్నాయని సంస్థ తెలిపింది. ఏపీ, తెలంగాణలోని వివిధ పట్టణాలకు ప్రయాణించే వారి బుకింగ్ల్లో 16 శాతం హైదరాబాద్-విజయవాడ-హైదరాబాద్, విశాఖపట్నం-విజయవాడ, విజయవాడ-విశాఖపట్నం, ఖమ్మం-హైదరాబాద్, హైదరాబాద్-ఖమ్మం రూట్లు ఉన్నాయని పేర్కొంది. -
ఏపీఎస్ ఆర్టీసీకి జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు
సాక్షి, అమరావతి: ఏపీఎస్ ఆర్టీసీకి జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు లభించింది. బస్ అండ్ కార్ ఆపరేటర్స్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో జరిగిన ‘ప్రవాస్ ఎక్సలెన్స్’ వేడుకల్లో భాగంగా ఏపీఎస్ ఆర్టీసీకి ‘రెడ్ బస్ పీపుల్స్ చాయిస్’ అవార్డు దక్కింది. చదవండి: టీచర్లకు గుడ్‌న్యూస్.. ప్రమోషన్లకు విద్యాశాఖ గ్రీన్‌సిగ్నల్! శుక్రవారం ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు అవార్డును అందుకున్నారు. సురక్షితమైన, స్మార్ట్, స్థిరమైన ప్యాసింజర్ మొబిలిటీ అనే కేంద్ర ప్రభుత్వ ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ అవార్డుల ప్రదానోత్సవానికి దేశవ్యాప్తంగా 4వేల మంది పబ్లిక్, ప్రైవేటు రవాణా వాహనాల ఆపరేటర్లు, వ్యాపారులు, సందర్శకులు హాజరయ్యారు. -
రెడ్‌బస్ నుంచి రెడ్‌రైల్ యాప్
ముంబై: ఆన్లైన్ బస్ టికెటింగ్ ప్లాట్‌ఫాం రెడ్‌బస్ తాజాగా రైలు టికెట్ల బుకింగ్ కోసం ’రెడ్‌రైల్’ యాప్‌ను ఆవిష్కరించింది. వచ్చే 3–4 సంవత్సరాల్లో కంపెనీ స్థూల టికెటింగ్ ఆదాయాల్లో దీని వాటా 10–15 శాతంగా ఉం టుందని ఆశిస్తున్నట్లు రెడ్‌బస్ సీఈవో ప్రకాష్ సంగం తెలిపారు. రాబోయే రోజుల్లో 5–6 ప్రాంతీయ భాషల్లో కూడా యాప్‌ను అందుబాటులోకి తెచ్చే యోచన ఉన్నట్లు ఆయన వివరించారు. గత రెండేళ్లుగా ఇటు బస్సు, అటు రైలు టికెట్ల విభాగంలో డిజిటల్ మాధ్యమం వినియోగం గణనీయంగా పెరిగిన నేపథ్యంలో రెడ్‌రైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకురావడం సరైన నిర్ణయంగా భావిస్తున్నట్లు ప్రకాష్ పేర్కొన్నారు. రోజూ దాదాపు పది లక్షలకు పైగా లావాదేవీలు జరిగే ఆన్లైన్ ట్రెయిన్ టికెట్ బుకింగ్ మార్కెట్లో భారీగా వ్యాపార అవకాశాలు ఉన్నాయని ఆయన తెలిపారు. మేక్మైట్రిప్ గ్రూప్‌లో రెడ్‌బస్ భాగంగా ఉంది. -
RED RAIL: టిక్కెట్ల బుకింగ్ ఇప్పుడు ఇంకా ఈజీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆన్లైన్లో బస్ టికెట్లను విక్రయిస్తున్న రెడ్‌బస్ తాజాగా రెడ్రైల్పేరుతో రైల్వే టికెట్ల బుకింగ్ విభాగంలోకి ప్రవేశించింది. ఇండియన్ రైల్వే క్యాటరింగ్, టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) భాగస్వామ్యంతో ఈ సేవల్లోకి అడుగుపెట్టింది. ప్రతిరోజూ 90 లక్షల పైచిలుకు రైల్వే సీట్లు రెడ్‌బస్ యాప్‌లోనూ బుకింగ్‌కు అందుబాటులో ఉంటాయని కంపెనీ ప్రకటించింది. -
వ్యాక్సిన్ వేయించుకోండి, లేదంటే ఇకపై బస్సు ప్రయాణం కష్టమే
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కోవిడ్–19 భయంతో ప్రయాణాలు అంటేనే జంకుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆన్లైన్లో బస్ టికెట్లను విక్రయిస్తున్న రెడ్‌బస్ సరికొత్త ఆలోచనకు తెరతీసింది. ‘వ్యాక్సినేటెడ్ బస్’ సర్వీసులను ప్రకటించింది. దేశవ్యాప్తంగా 600 ప్రధాన మార్గాల్లో ఈ సేవలు ఉంటాయని కంపెనీ వెల్లడించింది. కోవిడ్–19 వ్యాక్సిన్ తీసుకున్న వారు మాత్రమే ఈ బస్‌లలో ప్రయాణిస్తారు. సిబ్బంది, ప్రయాణికులకు కనీసం ఒక డోస్ అయినా అందుకోవాల్సి ఉంటుంది. బస్ ఎక్కే సమయంలో తప్పనిసరిగా రుజువు చూపించాల్సిందే. కస్టమర్ల రేటింగ్ నాలుగు స్టార్స్ కంటే ఎక్కువగా పొందిన బస్ ఆపరేటర్ల సహకారంతో వ్యాక్సినేటెడ్ బస్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు కంపెనీ తెలిపింది. సిబ్బంది, తోటి ప్రయాణికులు కనీసం ఒక డోస్ అయినా తీసుకుంటే వారితో ప్రయాణించేందుకు తాము సిద్ధమని 89 శాతం మంది తమ సర్వేలో వెల్లడించారని రెడ్‌బస్ సీఈవో ప్రకాశ్ సంగం తెలిపారు. స్పందననుబట్టి ఇతర మార్గాల్లోనూ ఈ సేవలను పరిచయం చేస్తామన్నారు. -
మళ్లీ ఎర్ర బస్సులు!
సాక్షి, హైదరాబాద్: జనవరి ఒకటి నుంచి ఎరుపు రంగులో ఆర్టీసీ సరుకు రవాణా వాహనాలు రోడ్డెక్కబోతున్నాయి. ముఖ్యమంత్రి ఆదేశం మేరకు ఆర్టీసీలోని పాత బస్సులను సరుకు రవాణా వాహనాలుగా మార్చి, గోదాములతో ప్రమేయం ఉన్న ప్రభుత్వ కార్పొరేషన్లతో అనుసంధానించుకుని ఇవి సరుకును తరలిస్తాయి. దీనికి సంబంధించి ఇప్పటికే పాత బస్సులను సరుకు రవాణా వాహనాలుగా మార్చే కసరత్తు మొదలైంది. ఈనెల 23న తొలి వాహనం సిద్ధం కానుంది. దాన్ని రవాణా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పరిశీలించి సమ్మతి తెలపగానే అదే తరహాలో అన్ని బస్సులను సిద్ధం చేయనున్నారు. తొలి విడతలో కనీసం వంద బస్సులను రూపొందించనున్నారు. ఈ విషయంలో జాప్యం చేయకుండా, జనవరి ఒకటి నాటికి ఎన్ని వాహనాలు సిద్ధమైతే అన్నింటితో సరుకు రవాణాను ప్రారంభించాలని అజయ్‌కుమార్ ఆదేశించారు. గురువారం ఆయన తన చాంబర్లో ఆర్టీసీ ఈడీలు, ఇతర ఉన్నతాధికారులతో భేటీ అయి దీనిపై చర్చించారు. ఈ వాహనాలు పూర్తి ఎరుపు రంగులో ఉండాలని పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా సరుకు రవాణా వాహనాలకు అదే రంగును వాడుతున్నందున, వీటికి కూడా అదే రంగును వాడాలని ఆయన ఆదేశించారు. వాహనం వెనకవైపు కొంతమేర క్రీమ్ కలర్ ఉంటుంది. ఒక్కోబస్సు ఇంచుమించు 7 టన్నుల సరుకును మోసే సామర్థ్యంతో సిద్ధం చేస్తున్నారు. ఇక ప్రస్తుతానికి వాటికి తెలంగాణ ఆర్టీసీ కార్గో సర్వీసు అన్న పేరును వినియోగించాలని, తర్వాత మంచి పేరు పరిశీలనకు వస్తే మారుద్దామని పేర్కొన్నారు. త్వరలో ‘యాదగిరి’ నివేదిక డ్రైవర్, కండక్టర్ ఉద్యోగ భద్రతకు సంబంధించి నాలుగైదు రోజుల్లో స్పష్టత రానుంది. రోజువారి విధుల్లో జరుగుతున్న తప్పిదాలకు సంబంధించి డ్రైవర్, కండక్టర్లపై తీవ్ర చర్యలు తీసుకుంటున్నారన్నది ఉద్యోగుల ఆవేదన. వాటి ల్లో మార్పుచేర్పులకు సంబంధించి ఈడీ యాదగిరి ఆధ్వర్యంలో ఏర్పాటైన కమిటీని రెండు మూడు రోజుల్లో నివేదిక ఇవ్వాల్సిందిగా మంత్రి ఆదేశించారు. ప్రయాణికులు టికెట్ తీసుకోకుంటే కండక్టర్లను బాధ్యులను చేసే విధా నం తెరమరుగుకానుంది. దీనికి ప్రయాణికులనే బాధ్యులను చేస్తూ వారికి విధించే పెనాల్టీలను పెంచే అవకాశం ఉంది. సీఎం ప్రకటించిన హామీల అమలు తీరుపై కూడా మంత్రి సమీక్షించారు. ఇప్పటికే చాలా అంశాలను అమలు చేసినందున మిగతా వాటిని త్వరలో పూర్తి చేయాలని ఎండీ సునీల్‌శర్మను ఆదేశించారు. ఉద్యోగుల్లో సుహృద్భావ వాతావరణాన్ని తీసుకురావడానికి వన భోజనాల కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని, గ్రేటర్ హైదరాబాద్ రీజియన్‌లో ఈ నెల 24న నిర్వహించనున్నట్లు అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు. ఈ సమావేశంలో ఈడీలు పురుషోత్తం, వినోద్, యాదగిరి, టి.వి.రావు, ఓఎస్డీ కృష్ణకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
ఎర్రబస్సు ఎక్కడ?
సాక్షి, అమరావతిః గ్రామీణ ప్రాంత జనాభా అత్యధిక శాతం ఉన్న ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రానికి ప్రజా రవాణా వ్యవస్థ అత్యంత కీలకం. అయితే మన రాష్ట్రంలో ఇంకా 3,669 గ్రామాలకు బస్సు సౌకర్యం లేకపోవడం రాష్ట్ర సర్కారు నిర్లిప్తతకు అద్దంపడుతోంది. బస్సు ముఖం చూడని గ్రామాలకు రవాణా సౌకర్యం కల్పించడం పూర్తిగా మానేసిన ప్రభుత్వం, చాలా రూట్లలో నడుస్తున్న బస్సుల్ని కూడా అర్థాంతరంగా నిలిపేయడంతో లక్షలాది మంది ఆటోలు, ఇతర వాహనాల్ని ఆశ్రయిస్తూ ప్రమాదాల బారిన పడడంతో పాటు వారి జేబులకు చిల్లుపడుతోంది. సీఎం చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులోని చాలా గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు. బంగారుపాళ్యం, అరగొండ, తవణంపల్లెలకు ఆర్టీసీ బస్సులు లేక ఆటోల్ని ఆశ్రయిస్తూ ప్రమాదాల బారిన పడుతున్నామని ఆ గ్రామాల ప్రజలు గతేడాది సీఎం చంద్రబాబుకు ఏకరువు పెట్టినా బస్సు భాగ్యం దక్కలేదు. రవాణా మంత్రి సొంత జిల్లా శ్రీకాకుళంలో కవిటి, కంచిలి మండలాల్లో శ్రీరాంపురం, కత్తివరం, మకరాపురం, సాలినపుట్టగ గ్రామాలకు చెందిన పలువురు డయాలసిస్ కోసం తరచూ శ్రీకాకుళం వెళ్లాల్సిఉంటుంది. అయితే ఆ గ్రామాలకు బస్సు సౌకర్యం లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఆ గ్రామాల నుంచి ఎన్‌హెచ్–16కు చేరాలంటే 5 కి.మీ నడిచివెళ్లాల్సిందే. ఇక తమ గ్రామాలకు బస్సులు రావడం లేదని రోజూ విద్యార్థులు, విద్యార్థి సంఘాలు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నా సర్కారుకు చీమకుట్టినట్లైనా లేదు. రాష్ట్రంలో ఆర్టీసీ రోజూ 3,771 రూట్లలో బస్సుల్ని తిప్పుతూ 74 లక్షల మందిని గమ్యస్థానాలకు చేర్చుతోంది. అయితే ఇంకా 3,669 గ్రామాలకు ఆ అదృష్టం లేదు. ఆ గ్రామాల ప్రజలు ఎక్కడికెళ్లాలన్నా ప్రైవేటు వాహనాలే దిక్కు. 14,123 గ్రామాలకు మాత్రమే బస్సుల్ని తిప్పుతున్నట్లు ఆర్టీసీ అధికారికంగా పేర్కొంది. అన్ని గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించి ఆక్యుపెన్సీ రేషియో పెంచుకోవాలని పలు సలహా సంస్థలు సూచిస్తున్నా.. ఆర్టీసీకి మాత్రం పట్టడం లేదు. ప్రస్తుతం ఆర్టీసీ ఆక్యుపెన్సీ శాతం 78.1గా ఉండగా.. దీనిని 85 శాతంకు పెంచితేనే నష్టాల నుంచి గట్టెక్కవచ్చని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (బెంగుళూరు) ప్రతినిధుల బృందం సూచించిన సంగతి తెలిసిందే. ఆదాయం లేదని సర్వీసులకు బ్రేక్ మారుమూల గ్రామాలకు బస్సు సౌకర్యం కోసం పల్లె వెలుగు స్థానంలో తెలుగు వెలుగు బస్సులు ప్రవేశపెట్టారు. ఆదాయం ముఖ్యం కాదని, ప్రజా రవాణా ముఖ్యమని చెప్పిన ఆర్టీసీ ఇప్పుడు గ్రామాలకు బస్సు సర్వీసులు నిలిపేస్తోంది. దీంతో పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పరీక్షల సమయంలో ఆర్టీసీ బస్సులు ఎంతో అవసరం కాగా.. చెప్పాపెట్టకుండా చాలా గ్రామాలకు సర్వీసులు ఆపేస్తున్నారు. మారుమూల గ్రామాలకు బస్సులు నడిపేందుకు ఏటా గ్రాంట్ల రూపంలో నిధులు విడుదలవుతున్నా.. ఆర్టీసీ మాత్రం బస్సుల్ని తిప్పేందుకు సుముఖత చూపడం లేదు. డిసెంబరు 2016 నాటికి 126 కోట్ల కిలోమీటర్లు తిప్పిన ఆర్టీసీ, 2017 డిసెంబరు నాటికి 117 కోట్ల కిలోమీటర్లు మాత్రమే తిప్పడం గమనార్హం. ఎక్కడా కానరాని రెస్ట్‌రూంలు ప్యాసింజర్ సెస్సుగా ప్రతి టిక్కెట్‌పై ఆర్టీసీ రూపాయి వసూలు చేస్తోంది. సెస్సు రూపంలో ఏడాదికి సగటున రూ.60 కోట్లు వస్తున్నా.. ప్రయాణికులకు మాత్రం తగిన మౌలిక సదుపాయాలు కల్పించడం లేదు. ప్రధానంగా మరుగుదొడ్ల సమస్య ప్రయాణికుల్ని వేధిస్తోంది. మరుగుదొడ్లు అందుబాటులో లేక మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. హైవేలపై రెస్ట్ రూంలు ఏర్పాటుకు ఇటు ప్రభుత్వం కానీ, అటు ప్రైవేటు ఆపరేటర్లు కానీ ఎలాంటి ఏర్పాట్లు చేయడం లేదు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర నుంచి వచ్చే ప్రయాణికులు మరుగుదొడ్లు లేక నానా యాతనలు పడుతున్నారు. బస్ కాంప్లెక్స్‌ల్లో మరుగుదొడ్లు వాడితే రూ.5 చెల్లించాల్సి వస్తోంది. దూర ప్రాంతాలకు వెళ్లే వారు మార్గ మధ్యంలో మరుగుదొడ్ల కోసం ఖర్చుచేయాల్సి వస్తోంది. బస్టాండ్లలోను అవస్థలే.. రాష్ట్రంలో 427 బస్టాండ్లుంటే, సగానికి పైగా బస్టాండ్లలో కనీస సౌకర్యాలు లేవు. జిల్లా కేంద్రాల్లోని బస్టాండ్లు అధ్వాన్నంగా మారాయి. వర్షం పడితే శ్రీకాకుళం బస్టాండ్ మొత్తం నీట మునిగిపోతోంది. రెండేళ్ల క్రితం జిల్లా కేంద్రాలు, ప్రధాన బస్టాండ్లలో చేపట్టిన పనులు నామినేషన్‌కు అప్పగించి ఉన్నతాధికారులు కమిషన్లు కొట్టేశారు. నాసిరకంగా పనులు చేయడంతో అవి అధ్వాన్నంగా మారాయి. పలు జిల్లాలో టీవీలు పాడయ్యాయి. ప్రయాణికులు కూర్చునేందుకు ఏర్పాటు చేసిన ఇనుప కుర్చీలు తుప్పు పట్టాయి. ఆర్టీసీ బస్సుల్లో కనీసం ప్రథమ చికిత్స పెట్టెలు కూడా లేకపోవడం గమనార్హం. -
హ్యాపీ సవారీ.. ట్రావెల్ యారీ!
• ఆన్లైన్లో బస్ టికెట్ల బుకింగ్, బస్ ఆపరేట్లకు టెక్నాలజీ సేవలు • దేశంలోని 55 శాతం బస్ ఆపరేటర్లు ట్రావెల్ యారీ కస్టమర్లే • 8 వేల మంది ఆపరేటర్ల నమోదు; రోజుకు 1.5 లక్షల టికెట్ల బుకింగ్స • ప్రభుత్వ రవాణా సంస్థలకు టెక్నాలజీ సేవలు • గతేడాది రూ.450 కోట్ల జీఎంవీ; రూ.30 కోట్ల ఆదాయం • ‘స్టార్టప్ డైరీ’తో ట్రావెల్ యారీ కో-ఫౌండర్ అరవింద్ లామా... హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : బస్ ప్రయాణమంటే ముందుగా ఆలోచించేది సీటు దొరుకుతుందో లేదో అని! అందుకే మనలో చాలా మంది ఆన్లైన్లో టికెట్లను బుక్ చేసుకొని ప్రయాణిస్తుంటారు. ఇందుకోసం దేశంలో మేక్ మై ట్రిప్, రెడ్ బస్, అభి బస్ వంటి ఎన్నో సంస్థలున్నారుు. ట్రావెల్ యారీ కూడా అలాంటి సంస్థే. అరుుతే దీని ప్రత్యేకత ఏమిటంటే... పైన చెప్పిన ఇతర సంస్థలు టికెట్లను బుక్ చేసేది ట్రావెల్ యారీ టెక్నాలజీ ద్వారానే! అంటే సంస్థ అభివృద్ధి చేసిన మన్‌టిస్ టెక్నాలజీ ఆధారంగా!! పంజాబ్, యూపీ, హిమాచల్ రాష్ట్రాల్లో ప్రభుత్వ రవాణా సంస్థలు కూడా టికెట్ల బుకింగ్ కోసం మన్టిస్నే వినియోగిస్తున్నాయండోయ్. ఒక్క ముక్కలో చెప్పాలంటే దేశంలో జరిగే 55 శాతం బస్ టికెట్ల బుకింగ్ మన్‌టిస్ నుంచి జరుగుతున్నదే. టెక్నాలజీ వివరాలు, సంస్థ సేవల గురించి ట్రావెల్ యారీ.కామ్ కో-ఫౌండర్, సీఈఓ అరవింద్ లామా ‘స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారు. టెక్నాలజీ ద్వారా సామాన్యుల కష్టాలకు పరిష్కారం చూపించాలనేది నా లక్ష్యం. అందుకే పేరు మోసిన టెకీ కంపెనీలో పనిచేశా.. నా ఆలోచనెప్పుడూ ప్రజల వైపే సాగేది. ఆ సమయంలో దేశంలో ఆన్లైన్లో బస్ టికెట్ల బుకింగ్ విధానం అసంఘటితంగా ఉందని తెలిసి.. రెండున్నర లక్షల పెట్టుబడితో మరో మిత్రుడు ప్రతీక్ నిగంతో కలిసి 2007లో ట్రావెల్ యారీ.కామ్‌ను ప్రారంభించా. టెక్నాలజీ సేవలు.. ట్రావెల్ యారీ టికెట్ల బుకింగ్ పాటూ ఇతర బస్ ఆపరేటర్లకు, ఆన్లైన్ సంస్థలకు, ప్రభుత్వ రవాణా సంస్థలకు టికెట్ల బుకింగ్ కోసం టెక్నాలజీ సేవలను కూడా అందిస్తుంది. దేశంలో ఆన్లైన్ ద్వారా 55 శాతం బస్ టికెట్ల బుకింగ్ మా టెక్నాలజీ అరుున మన్‌టిస్ ఆధారంగానే బుక్ అవుతున్నవే. ఆన్లైన్లో మేక్ మై ట్రిప్, రెడ్ బస్ వంటి కంపెనీలతో పాటూ పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వ రవాణా సంస్థలు కూడా మన్‌టిస్ టెక్నాలజీని ద్వారానే టికెట్లను జారీ చేస్తున్నారుు. తమిళనాడు, కర్ణాటక, కేరళ రవాణా సంస్థలతోనూ చర్చిస్తున్నాం. రోజుకు 1.5 లక్షల టికెట్లు.. ప్రస్తుతం ట్రావెల్ యారీలో 8 వేల మంది బస్ ఆపరేటర్లు, ఏజెంట్లు నమోదయ్యారు. అన్ని చానల్ పార్టనర్స్ నుంచి కలిపి రోజుకు 1.5 లక్షల టికెట్లు బుక్ అవుతున్నారుు. బస్ టికెట్ల బుకింగ్‌తో పాటూ హోటల్ గదులను బుకింగ్ చేసుకోవచ్చు. ఇందుకోసం ఓయో, రూమ్ టు నైట్ సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. ఇటీవలే కస్టమర్ల సౌలభ్యం కోసం మొబైల్ వ్యాలెట్, క్యాష్‌బ్యాక్ రారుుతీలను ఉపయోగించుకునేందుకు వీలుగా పేటీఎం, రిలయెన్‌స జియోతో ఒప్పందం కుదుర్చుకున్నాం. హైదరాబాద్ వాటా 5 శాతం.. మా భాగస్వామ్య సంస్థలకు సంబంధించి గతేడాది రూ.450 కోట్ల గ్రాస్ మర్చంటైజ్ వాల్యూ (జీఎంవీ) వ్యాపారం జరిగింది. ఇందులో రూ.30 కోట్లు మా ఆదాయం. ఇదే మా టర్నోవర్. ఇందులో దక్షిణాది వాటా 60 శాతం. హైదరాబాద్ వాటా 5 శాతం వరకు వుంటుంది. ఈ ఏడాది రూ.600 కోట్ల జీఎంవీ లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పటికే 80 శాతం చేరుకున్నాం కూడా. రూ.60 కోట్ల నిధుల సమీకరణ.. ప్రస్తుతం ట్రావెల్ యారీలో 200 మంది ఉద్యోగులున్నారు. ఇటీవలే సిరీస్-బీ రౌండ్లో 7 మిలియన్ డాలర్ల నిధులు సమీకరించాం. గుజరాత్ వెంచర్ ఫైనాన్స లిమిటెడ్ (జీవీఎఫ్ఎల్), బెన్నెట్ కోల్మెన్ అండ్ కో లి. (బీసీసీఎల్) మరియు ఇతరులు ఈ పెట్టుబడులు పెట్టారు. వీటితో కలిపి ఇప్పటివరకు రూ.60 కోట్లు నిధులను సమీకరించాం. అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్ చేయండి... -
ఎర్రబస్సు... ఎయిర్‌బస్సు కూడా!
సెప్టెంబర్ నుంచి యాత్రాజీనీ విమాన టికెట్లు * నెల రోజుల్లో హోటల్ గదుల బుకింగ్ సేవలు కూడా * ఆ తర్వాత లాజిస్టిక్స్ విభాగంలోకి.. * 150 కోట్ల పెట్టుబడులు పెట్టనున్న అమెరికా సంస్థ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ‘ఎర్రబస్సు నుంచి ఎయిర్‌బస్ వరకూ..’ ఇదేదో ప్రాస కోసం వాడింది కాదు. బెంగళూరుకు చెందిన ఓ స్టార్టప్ కంపెనీ అక్షరాలా దీన్ని నిజం చేస్తోంది. 2013 నవంబర్‌లో బస్సు టికెట్ల బుకింగ్ సేవలను ప్రారంభించిన యాత్రాజీనీ డాట్‌కామ్... ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి విమాన టికెట్ల విక్రయం కూడా ప్రారంభిస్తోంది. ‘‘ఇప్పటికే ఎయిర్కోస్టా, ఎయిర్ ఇండియా, జెట్ విమాన సంస్థలతో సంప్రతింపులు జరిపాం. మిగతా అన్ని సంస్థలతో చర్చలు జరిపి... అన్ని విమానయాన టికెట్లను యాత్రాజినీలో బుక్ చేసుకునేలా టెక్నాలజీని రూపొందిస్తున్నాం’’ అని యాత్రాజీనీ సీఈఓ రెనిల్ కోమిట్ల చెప్పారు. ‘సాక్షి స్టార్టప్’ ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలు వెల్లడించారు. ఆ వివరాలివీ... బెంగళూరు కేంద్రంగా ఏర్పడిన పాక్స్టెర్రా సాఫ్ట్వేర్ సొల్యూషన్స్... ఈ-కామర్స్ సంస్థలకు సాఫ్ట్‌వేర్‌ను డెవలప్ చేసి ఇచ్చేది. ట్రావెల్స్ రంగంలో ఉన్న డిమాండ్‌ను గుర్తించిన ఆ సంస్థ చైర్మన్, సీఈఓ రెనిల్ కోమిట్ల.. యాత్రాజీనీ.కామ్(డ్చ్టట్చజ్ఛజ్ఛీ) పేరుతో బస్ టికెట్, క్యాబ్ బుకింగ్ సేవలను ప్రారంభించారు. ‘‘టికెట్లను విక్రయించడం ఒక్కటే మా పనికాదు. కస్టమర్ ఇంట్లోంచి బయటికి కాలు పెట్టింది మొదలు తిరిగి ఇంట్లోకి వెళ్లే వరకు అవసరమయ్యే అన్ని సేవలూ అందించడమే లక్ష్యంగా సంస్థను ప్రారంభించాం. అంటే కస్టమర్ ప్రయాణం చేసేందుకు అవసరమైన బస్సు టికెట్టు, బస చేసేందుకు బడ్జెట్ హోటల్, చేరుకున్న నగరంలో తిరిగేందుకు క్యాబ్.. ఇలా అన్ని రకాల సేవల్నీ అందించటమే యాత్రాజీనీ నినాదం’’ అంటారు రెనిల్. నెల రోజుల్లో హోటల్స్ బుకింగ్స్.. నెల రోజుల్లో ఏపీ, తెలంగాణ, కర్ణాటకరాష్ట్రాల్లో హోటల్ గదుల బుకింగ్ సేవల్ని యాత్రాజీనీ ప్రారంభిస్తోంది. ఇప్పటివరకు 2,000 హోటళ్లు రిజిస్టరు కాగా... దీన్లో తెలుగు రాష్ట్రాల వాటా 10 నుంచి 12 శాతం. ప్రత్యేకించి హైదరాబాద్ నుంచి 20 హోటల్స్ వరకూ ఉన్నాయి. ఈ ఏడాది ముగింపు నాటికి లాజిస్టిక్ విభాగంలోకి కూడా కంపెనీ అడుగిడబోతోంది. విజయవాడ, విశాఖపట్నం ప్రధాన కేంద్రాలుగా సేవలందించడానికి పెద్ద మొత్తంలో ట్రక్కుల్ని కొనుగోలు చేస్తోంది సంస్థ. యాత్రాజీనీకి చెందిన క్యాబ్ డ్రైవరే లాజిస్టిక్ కేంద్రాల్లోని ఉత్పత్తులను ట్రక్కుల్లో లోడ్ చేసుకొని.. చెప్పిన చిరునామాలో అన్లోడ్ చేస్తాడు. తెలంగాణలో క్యాబ్స్ సేవలు.. ‘‘ఇటీవలే ఏపీలోని 13 జిల్లాల్లో క్యాబ్స్ సేవలు ప్రారంభించాం. నెల రోజుల్లో తెలంగాణలోని పది జిల్లాల్లో కూడా క్యాబ్స్ ప్రారంభిస్తాం. దశలవారీగా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకూ విస్తరిస్తాం. ఈ ఏడాది ముగింపు నాటికి అన్ని దక్షిణాది రాష్ట్రాల్లో విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. సెప్టెంబర్ నుంచి కర్ణాటకలో 30 జిల్లాల్లో సేవలు ఆరంభిస్తాం. తర్వాత తమిళనాడు, కేరళ మార్కెట్లలోకి వెళతాం. 2016-17 ముగింపు నాటికి ముంబై, ఢిల్లీ నగరాలకూ.. మొత్తం మీద మూడేళ్లలో దేశంలోని వంద నగరాలకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. మేం బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్నా అత్యధిక మార్కెట్ వాటా ఉన్నది మాత్రం ఆంధ్రప్రదేశ్ నుంచే. బెంగళూరు నుంచి ఏపీకి క్యాబ్స్, బస్ టికెట్ల బుకింగ్ డిమాండ్ బాగా ఉంది. అందుకే ఏపీలో క్యాబ్స్ సర్వీసులను ప్రారంభించిన మూడు నెలల్లో 30,000 బుకింగ్స్ జరిగాయి. ప్రస్తుతం యాత్రాజినీలో లక్ష నుంచి లక్షాపాతిక వేల మంది కస్టమర్లున్నారు. రోజుకు 3,000-3,500 బస్ టికెట్లు, 1,000-1,500 వరకు క్యాబ్స్ బుక్ అవుతున్నాయి. ఇందులో 90 శాతం బుకింగ్స్ ఆంధ్రప్రదేశ్ నుంచి అవుతున్నవే. మిగతావి కర్ణాటక నుంచి. యాత్రాజినీకి క్యాబ్‌లు అద్దెకివ్వాలనుకుంటే.. 15:85 ఓనర్ మేనేజ్మెంట్ రూపంలో తీసుకుంటున్నాం’’ అని రెనిల్ వివరించారు. రూ.150 కోట్ల పెట్టుబడులు.. యాత్రాజీనీపై రెండేళ్లలో రూ.30 కోట్ల పెట్టుబడులు పెట్టగా గతేడాది రూ.60 కోట్ల టర్నోవర్ నమోదయింది. ఈ ఏడాది రూ.150 కోట్ల టర్నోవర్‌ను సంస్థ ఆశిస్తోంది. అమెరికాకు చెందిన ఓ వెంచర్ కేపిటలిస్ట్ రూ.150 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి సంప్రతింపులు జరుపుతున్నట్లు రెనిల్ వెల్లడించారు. ఈ డీల్‌కు సంబంధించి పూర్తి వివరాలను నెల రోజుల్లో వెల్లడిస్తామన్నారు. యాత్రాజీనీ క్యాబ్స్ జీపీఎస్ టెక్నాలజీతో పనిచేస్తాయని, కస్టమర్లు ఏదైనా ప్రమాదంలో చిక్కుకుంటే వెంటనే నొక్కటానికి ప్యానిక్ బటన్ ఉంటుందని ఆయన తెలియజేశారు. అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్ చేయండి... -
రోజుకు 50 వేల బస్ టికెట్లు
అభిబస్ ఫౌండర్ సీఈవో సుధాకర్ రెడ్డి చిర్రా హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కేవలం రూ.10 లక్షల పెట్టుబడితో 2007లో ప్రారంభమై రూ.200 కోట్ల కంపెనీగా ఎదగడమే కాకండా దేశీయ ఆన్లైన్ బస్‌టికెట్ వ్యాపారంలో రెడ్‌బస్ తర్వాత రెండో అతిపెద్ద సంస్థగా అభిబస్ ఎదిగింది. ఏటా 50 శాతం వృద్ధితో వేగంగా విస్తరిస్తున్న ఆన్లైన్ టికెట్ల వ్యాపారంపై ప్రైవేటు ఈక్విటీ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. రెండేళ్లలో రోజుకు 50,000 టికెట్లు విక్రయిస్తామంటున్న అభిబస్ ఫౌండర్ సీఈవో సుధాకర్ రెడ్డి చిర్రాతో ‘సాక్షి’ ఇంటర్వ్యూ.. ఏపీఎస్ఆర్టీసీ టికెట్లను విక్రయించే విధంగా ఈ మధ్యనే కుదుర్చుకున్న ఒప్పందం మీ ఆదాయంపై ఏ విధంగా ప్రభావం చూపనుంది? ఆన్లైన్లో టికెట్ల రిజర్వేషన్లకు సంబంధించి ఏపీఎస్ఆర్టీసీ తొలిసారిగా బయట సంస్థకు అవకాశం ఇచ్చింది. రోజుకు ఏడువేలకు పైగా సర్వీసులు, రోజుకు 2.5 లక్షల టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ఈ ఏడాది నుంచి వ్యాపారం బాగా పెరుగుతుందని ఆశిస్తున్నాం. ప్రస్తుతం రోజుకు 10,000 టికెట్లను విక్రయిస్తుండగా ఈ ఒప్పందం వలన వచ్చే రెండేళ్లలో ఈ సంఖ్య 50,000 దాటుతుందని అంచనా వేస్తున్నాం. ఏపీఎస్ఆర్టీసీ ఆన్లైన్ టికెట్లకు సంబంధించి సాఫ్ట్‌వేర్‌ను నిర్వహిస్తున్న మీకు రాష్ట్ర విభజన తర్వాత రెండు రాష్ట్రాల ఆర్టీసీని మీరే నిర్వహిస్తారా? నిర్వహణా వ్యయం ఏమైనా పెరిగే అవకాశం ఉందా? ఇంకా కార్పొరేషన్‌ను చట్ట ప్రకారం విడదీయాల్సి ఉంది. విడిపోయిన తర్వాత కూడా రెండు రాష్ట్రాల రోడ్డు రవాణా సంస్థలకు ఆన్లైన్ టికెటింగ్ సాఫ్ట్‌వేర్‌ను అభిబసే అందిస్తుంది. పదేళ్ల పాటు సర్వీసు అందించే విధంగా ఒప్పందం కుదిరింది. కాని ఇలా రెండు రాష్ట్రాలకు ప్రత్యేక వైబ్సైట్లను నిర్వహించడం వల్ల 40 శాతం వ్యయం పెరుగుతుంది. ఈ ఖర్చును కూడా కార్పొరేషనే భరిస్తుంది. ఏపీఎస్ఆర్టీసీ, తమిళనాడు ఆర్టీసీలతో పాటు 150కిపైగా ప్రైవేటు ఆపరేటర్లకు అభిబస్ సాఫ్ట్‌వేర్‌ను అందిస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత పట్టణాల మధ్య తిరిగే ప్రయాణికుల్లో ఏమైనా హెచ్చు తగ్గులను గమనించారా? ఒక్క విజయవాడ, గుంటూరు తప్ప మిగిలిన పట్టణాల మధ్య రోజువారి ప్రయాణికుల సంఖ్యలో చెప్పుకోదగ్గ సంఖ్యలో మార్పులు లేవు. కాని హైదరాబాద్ నుంచి ఈ రెండు పట్టణాలకు ప్రయాణించే రోజు వారి సంఖ్యలో మాత్రం గణనీయమైన వృద్ధి కనిపిస్తోంది. ఈ డిమాండ్ మరో మూడు నాలుగేళ్లు ఉంటుందని అంచనా వేస్తున్నాం. దీనికి తోడు రైల్వే టిక్కెట్ల ధరలు పెరగడం కూడా బస్సు ప్రయాణికుల సంఖ్యను పెంచుతుందని భావిస్తున్నాం. పాలెం బస్సు దుర్ఘటన తర్వాత ప్రయాణికుల ఆలోచనల్లో ఏమైనా మార్పులు కనిపించాయా? ప్రైవేటు ఆపరేటర్ల ఆన్లైన్ రిజర్వేషన్ల మార్గదర్శకాలకు సంబంధించి ఎటువంటి ప్రయత్నం చేస్తున్నారు? ఆ సంఘటన జరిగిన తర్వాత ప్రైవేటు ఆపరేటర్లపై ప్రభావం బాగా కనిపించినప్పటికీ, ఇప్పుడు పరిస్థితులు సద్దుమణిగాయి. దీని తర్వాత ప్రయాణికులు బాగా పేరొందిన ప్రైవేటు ఆపరేటర్ల బస్సుల్లో ప్రయాణించడానికే ఇష్టపడుతున్నారు. ప్రైవేటు ఆపరేటర్ల ఆన్లైన్ రిజర్వేషన్లకు సంబంధించి చట్టంలో సరైన నిబంధనలు లేవు. దీనిపై ఇప్పటికే గత ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాం. త్వరలోనే కొత్త ప్రభుత్వం దృష్టికి సమస్యలను తీసుకెళ్లే ప్రయత్నంలో ఆపరేటర్లను ఉన్నారు. దేశీయంగా బస్సు టిక్కెట్ల వ్యాపార పరిమాణం, వృద్ధి ఏ విధంగా ఉంది? దేశ వ్యాప్తంగా ఏటా రూ.40,000 కోట్ల టికెట్లు అమ్ముడవుతున్నాయి. ఇందులో ప్రైవేటు బస్సుల వ్యాపార పరిమాణం రూ.15,000 కోట్లుగా ఉంటే, ఆర్టీసీల వాటా రూ.25,000 కోట్లుగా ఉంది. గత కొంతకాలంగా ప్రైవేటు బస్సు టికెట్ల వ్యాపారం స్థిరంగా ఉంది. కాని ఇదే సమయంలో ఆన్లైన్ ద్వారా టికెట్ల బుకింగ్‌లో మాత్రం ఏటా 50 శాతం వృద్ధి నమోదవుతోంది. మొత్తం టికెట్ల విక్రయాల్లో ప్రస్తుతం 15 శాతంగా ఉన్న ఆన్లైన్ టికెట్ల వ్యాపారం ఈ ఏడాది 25 శాతానికి చేరుతుందని అంచనా వేస్తున్నాం. ప్రస్తుతం అభిబస్ వ్యాపార పరిమాణం, వృద్ధి గురించి వివరిస్తారా? గతేడాది వరకు ప్రధానంగా ఆన్లైన్ టికెటింగ్ సాఫ్ట్వేర్ వ్యాపారంపైనే దృష్టిపెట్టాం. ఇప్పుడు నేరుగా ఆన్లైన్ టికెట్లను కూడా విక్రయిస్తున్నాం. గతేడాది రూ.165 కోట్ల వ్యాపారం నమోదు చేశాం. ఈ ఏడాది రూ.280 కోట్లకు వచ్చే ఐదేళ్లలో రూ.2,000 కోట్లకు చేర్చాలన్నది లక్ష్యం. అభిబస్ అనగానే ఇప్పటికే చౌక టికెట్లను ఇచ్చే డీల్స్ సైట్‌గా పేరొచ్చింది. ఏటా 150 రోజులు తక్కువ కాకుండా చౌక రేట్లను ఆఫర్లు చేసే విధంగా రూపొందించుకుంటున్నాం. ఆన్లైన్ పోర్టల్స్, ఈ-కామర్స్ రంగాల్లో పెట్టుబడులు చేయడానికి పీఈ, వీసీ ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నట్లే అభిబస్‌లో కూడా ఇన్వెస్ట్ చేయడానికి ఎవరైనా ముందుకొస్తున్నారా? వచ్చే రెండేళ్ల వ్యాపార విస్తరణకు రూ.50 కోట్ల నిధులను సమీకరిస్తున్నాము. ఇందుకోసం కొటక్ బ్యాంక్‌ను ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్‌గా నియమించుకున్నాం. నాలుగు ప్రైవేటు ఈక్విటీ సంస్థలతో చర్చలు జరుపుతున్నాం. ఏ సంస్థ నుంచి పెట్టుబడి వస్తుందన్నది ఆగస్టు నెలాఖరుకు స్పష్టత వస్తుంది. ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ కంపెనీ విలువను రూ200 కోట్లుగా మదింపు చేసింది.