ఎర్రబస్సు ఎక్కడ? | Where is Red Bus, No RTC Busses To Villages | Sakshi
Sakshi News home page

ఎర్రబస్సు ఎక్కడ?

Published Fri, Feb 1 2019 8:57 AM | Last Updated on Fri, Feb 1 2019 11:40 AM

Where is Red Bus, No RTC Busses To Villages - Sakshi

సాక్షి, అమరావతిః గ్రామీణ ప్రాంత జనాభా అత్యధిక శాతం ఉన్న ఆంధ్రప్రదేశ్‌ వంటి రాష్ట్రానికి ప్రజా రవాణా వ్యవస్థ అత్యంత కీలకం. అయితే మన రాష్ట్రంలో ఇంకా 3,669 గ్రామాలకు బస్సు సౌకర్యం లేకపోవడం రాష్ట్ర సర్కారు నిర్లిప్తతకు అద్దంపడుతోంది. బస్సు ముఖం చూడని గ్రామాలకు రవాణా సౌకర్యం కల్పించడం పూర్తిగా మానేసిన ప్రభుత్వం, చాలా రూట్లలో నడుస్తున్న బస్సుల్ని కూడా అర్థాంతరంగా నిలిపేయడంతో లక్షలాది మంది ఆటోలు, ఇతర వాహనాల్ని ఆశ్రయిస్తూ ప్రమాదాల బారిన పడడంతో పాటు వారి జేబులకు చిల్లుపడుతోంది.

  • సీఎం చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులోని చాలా గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు. బంగారుపాళ్యం, అరగొండ, తవణంపల్లెలకు ఆర్టీసీ బస్సులు లేక ఆటోల్ని ఆశ్రయిస్తూ ప్రమాదాల బారిన పడుతున్నామని ఆ గ్రామాల ప్రజలు గతేడాది సీఎం చంద్రబాబుకు ఏకరువు పెట్టినా బస్సు భాగ్యం దక్కలేదు.
  • రవాణా మంత్రి సొంత జిల్లా శ్రీకాకుళంలో కవిటి, కంచిలి మండలాల్లో శ్రీరాంపురం, కత్తివరం, మకరాపురం, సాలినపుట్టగ గ్రామాలకు చెందిన పలువురు డయాలసిస్‌ కోసం తరచూ శ్రీకాకుళం వెళ్లాల్సిఉంటుంది. అయితే ఆ గ్రామాలకు బస్సు సౌకర్యం లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఆ గ్రామాల నుంచి ఎన్‌హెచ్‌–16కు చేరాలంటే 5 కి.మీ నడిచివెళ్లాల్సిందే.
  • ఇక తమ గ్రామాలకు బస్సులు రావడం లేదని రోజూ విద్యార్థులు, విద్యార్థి సంఘాలు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నా సర్కారుకు చీమకుట్టినట్లైనా లేదు.

రాష్ట్రంలో ఆర్టీసీ రోజూ 3,771 రూట్లలో బస్సుల్ని తిప్పుతూ 74 లక్షల మందిని గమ్యస్థానాలకు చేర్చుతోంది. అయితే ఇంకా 3,669 గ్రామాలకు ఆ అదృష్టం లేదు. ఆ గ్రామాల ప్రజలు ఎక్కడికెళ్లాలన్నా ప్రైవేటు వాహనాలే దిక్కు. 14,123 గ్రామాలకు మాత్రమే బస్సుల్ని తిప్పుతున్నట్లు ఆర్టీసీ అధికారికంగా పేర్కొంది. అన్ని గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించి ఆక్యుపెన్సీ రేషియో పెంచుకోవాలని పలు సలహా సంస్థలు సూచిస్తున్నా.. ఆర్టీసీకి మాత్రం పట్టడం లేదు. ప్రస్తుతం ఆర్టీసీ ఆక్యుపెన్సీ శాతం 78.1గా ఉండగా.. దీనిని 85 శాతంకు పెంచితేనే నష్టాల నుంచి గట్టెక్కవచ్చని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (బెంగుళూరు) ప్రతినిధుల బృందం సూచించిన సంగతి తెలిసిందే.

ఆదాయం లేదని సర్వీసులకు బ్రేక్‌
మారుమూల గ్రామాలకు బస్సు సౌకర్యం కోసం పల్లె వెలుగు స్థానంలో తెలుగు వెలుగు బస్సులు ప్రవేశపెట్టారు. ఆదాయం ముఖ్యం కాదని, ప్రజా రవాణా ముఖ్యమని చెప్పిన ఆర్టీసీ ఇప్పుడు గ్రామాలకు బస్సు సర్వీసులు నిలిపేస్తోంది. దీంతో పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పరీక్షల సమయంలో ఆర్టీసీ బస్సులు ఎంతో అవసరం కాగా.. చెప్పాపెట్టకుండా చాలా గ్రామాలకు సర్వీసులు ఆపేస్తున్నారు. మారుమూల గ్రామాలకు బస్సులు నడిపేందుకు ఏటా గ్రాంట్ల రూపంలో నిధులు విడుదలవుతున్నా.. ఆర్టీసీ మాత్రం బస్సుల్ని తిప్పేందుకు సుముఖత చూపడం లేదు. డిసెంబరు 2016 నాటికి 126 కోట్ల కిలోమీటర్లు తిప్పిన ఆర్టీసీ, 2017 డిసెంబరు నాటికి 117 కోట్ల కిలోమీటర్లు మాత్రమే తిప్పడం గమనార్హం.

ఎక్కడా కానరాని రెస్ట్‌రూంలు
ప్యాసింజర్‌ సెస్సుగా ప్రతి టిక్కెట్‌పై ఆర్టీసీ రూపాయి వసూలు చేస్తోంది. సెస్సు రూపంలో ఏడాదికి సగటున రూ.60 కోట్లు వస్తున్నా.. ప్రయాణికులకు మాత్రం తగిన మౌలిక సదుపాయాలు కల్పించడం లేదు. ప్రధానంగా మరుగుదొడ్ల సమస్య ప్రయాణికుల్ని వేధిస్తోంది. మరుగుదొడ్లు అందుబాటులో లేక మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. హైవేలపై రెస్ట్‌ రూంలు ఏర్పాటుకు ఇటు ప్రభుత్వం కానీ, అటు ప్రైవేటు ఆపరేటర్లు కానీ ఎలాంటి ఏర్పాట్లు చేయడం లేదు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర నుంచి వచ్చే ప్రయాణికులు మరుగుదొడ్లు లేక నానా యాతనలు పడుతున్నారు. బస్‌ కాంప్లెక్స్‌ల్లో మరుగుదొడ్లు వాడితే రూ.5 చెల్లించాల్సి వస్తోంది. దూర ప్రాంతాలకు వెళ్లే వారు మార్గ మధ్యంలో మరుగుదొడ్ల కోసం ఖర్చుచేయాల్సి వస్తోంది.

బస్టాండ్లలోను అవస్థలే..
రాష్ట్రంలో 427 బస్టాండ్లుంటే, సగానికి పైగా బస్టాండ్లలో కనీస సౌకర్యాలు లేవు. జిల్లా కేంద్రాల్లోని బస్టాండ్లు అధ్వాన్నంగా మారాయి. వర్షం పడితే శ్రీకాకుళం బస్టాండ్‌ మొత్తం నీట మునిగిపోతోంది. రెండేళ్ల క్రితం జిల్లా కేంద్రాలు, ప్రధాన బస్టాండ్లలో చేపట్టిన పనులు నామినేషన్‌కు అప్పగించి ఉన్నతాధికారులు కమిషన్లు కొట్టేశారు. నాసిరకంగా పనులు చేయడంతో అవి అధ్వాన్నంగా మారాయి. పలు జిల్లాలో టీవీలు పాడయ్యాయి. ప్రయాణికులు కూర్చునేందుకు ఏర్పాటు చేసిన ఇనుప కుర్చీలు తుప్పు పట్టాయి. ఆర్టీసీ బస్సుల్లో కనీసం ప్రథమ చికిత్స పెట్టెలు కూడా లేకపోవడం గమనార్హం.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement