రోజుకు 50 వేల బస్ టికెట్లు
అభిబస్ ఫౌండర్ సీఈవో సుధాకర్ రెడ్డి చిర్రా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కేవలం రూ.10 లక్షల పెట్టుబడితో 2007లో ప్రారంభమై రూ.200 కోట్ల కంపెనీగా ఎదగడమే కాకండా దేశీయ ఆన్‌లైన్ బస్‌టికెట్ వ్యాపారంలో రెడ్‌బస్ తర్వాత రెండో అతిపెద్ద సంస్థగా అభిబస్ ఎదిగింది. ఏటా 50 శాతం వృద్ధితో వేగంగా విస్తరిస్తున్న ఆన్‌లైన్ టికెట్ల వ్యాపారంపై ప్రైవేటు ఈక్విటీ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. రెండేళ్లలో రోజుకు 50,000 టికెట్లు విక్రయిస్తామంటున్న అభిబస్ ఫౌండర్ సీఈవో సుధాకర్ రెడ్డి చిర్రాతో ‘సాక్షి’ ఇంటర్వ్యూ..
ఏపీఎస్‌ఆర్‌టీసీ టికెట్లను విక్రయించే విధంగా ఈ మధ్యనే కుదుర్చుకున్న ఒప్పందం మీ ఆదాయంపై ఏ విధంగా ప్రభావం చూపనుంది?
ఆన్‌లైన్‌లో టికెట్ల రిజర్వేషన్లకు సంబంధించి ఏపీఎస్‌ఆర్‌టీసీ తొలిసారిగా బయట సంస్థకు అవకాశం ఇచ్చింది. రోజుకు ఏడువేలకు పైగా సర్వీసులు, రోజుకు 2.5 లక్షల టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ఈ ఏడాది నుంచి వ్యాపారం బాగా పెరుగుతుందని ఆశిస్తున్నాం. ప్రస్తుతం రోజుకు 10,000 టికెట్లను విక్రయిస్తుండగా ఈ ఒప్పందం వలన వచ్చే రెండేళ్లలో ఈ సంఖ్య 50,000 దాటుతుందని అంచనా వేస్తున్నాం.
ఏపీఎస్‌ఆర్‌టీసీ ఆన్‌లైన్ టికెట్లకు సంబంధించి సాఫ్ట్‌వేర్‌ను నిర్వహిస్తున్న మీకు రాష్ట్ర విభజన తర్వాత రెండు రాష్ట్రాల ఆర్‌టీసీని మీరే నిర్వహిస్తారా? నిర్వహణా వ్యయం ఏమైనా పెరిగే అవకాశం ఉందా?
ఇంకా కార్పొరేషన్‌ను చట్ట ప్రకారం విడదీయాల్సి ఉంది. విడిపోయిన తర్వాత కూడా రెండు రాష్ట్రాల రోడ్డు రవాణా సంస్థలకు ఆన్‌లైన్ టికెటింగ్ సాఫ్ట్‌వేర్‌ను అభిబసే అందిస్తుంది. పదేళ్ల పాటు సర్వీసు అందించే విధంగా ఒప్పందం కుదిరింది. కాని ఇలా రెండు రాష్ట్రాలకు ప్రత్యేక వైబ్‌సైట్లను నిర్వహించడం వల్ల 40 శాతం వ్యయం పెరుగుతుంది. ఈ ఖర్చును కూడా కార్పొరేషనే భరిస్తుంది. ఏపీఎస్‌ఆర్‌టీసీ, తమిళనాడు ఆర్‌టీసీలతో పాటు 150కిపైగా ప్రైవేటు ఆపరేటర్లకు అభిబస్ సాఫ్ట్‌వేర్‌ను అందిస్తోంది.
రాష్ట్ర విభజన తర్వాత పట్టణాల మధ్య తిరిగే ప్రయాణికుల్లో ఏమైనా హెచ్చు తగ్గులను గమనించారా?
ఒక్క విజయవాడ, గుంటూరు తప్ప మిగిలిన పట్టణాల మధ్య రోజువారి ప్రయాణికుల సంఖ్యలో చెప్పుకోదగ్గ సంఖ్యలో మార్పులు లేవు. కాని హైదరాబాద్ నుంచి ఈ రెండు పట్టణాలకు ప్రయాణించే రోజు వారి సంఖ్యలో మాత్రం గణనీయమైన వృద్ధి కనిపిస్తోంది. ఈ డిమాండ్ మరో మూడు నాలుగేళ్లు ఉంటుందని అంచనా వేస్తున్నాం. దీనికి తోడు రైల్వే టిక్కెట్ల ధరలు పెరగడం కూడా బస్సు ప్రయాణికుల సంఖ్యను పెంచుతుందని భావిస్తున్నాం.
పాలెం బస్సు దుర్ఘటన తర్వాత ప్రయాణికుల ఆలోచనల్లో ఏమైనా మార్పులు కనిపించాయా? ప్రైవేటు ఆపరేటర్ల ఆన్‌లైన్ రిజర్వేషన్ల మార్గదర్శకాలకు సంబంధించి ఎటువంటి ప్రయత్నం చేస్తున్నారు?
ఆ సంఘటన జరిగిన తర్వాత ప్రైవేటు ఆపరేటర్లపై ప్రభావం బాగా కనిపించినప్పటికీ, ఇప్పుడు పరిస్థితులు సద్దుమణిగాయి. దీని తర్వాత ప్రయాణికులు బాగా పేరొందిన ప్రైవేటు ఆపరేటర్ల బస్సుల్లో ప్రయాణించడానికే ఇష్టపడుతున్నారు. ప్రైవేటు ఆపరేటర్ల ఆన్‌లైన్ రిజర్వేషన్లకు సంబంధించి చట్టంలో సరైన నిబంధనలు లేవు. దీనిపై ఇప్పటికే గత ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాం. త్వరలోనే కొత్త ప్రభుత్వం దృష్టికి సమస్యలను తీసుకెళ్లే ప్రయత్నంలో ఆపరేటర్లను ఉన్నారు.
దేశీయంగా బస్సు టిక్కెట్ల వ్యాపార పరిమాణం, వృద్ధి ఏ విధంగా ఉంది?
దేశ వ్యాప్తంగా ఏటా రూ.40,000 కోట్ల టికెట్లు అమ్ముడవుతున్నాయి. ఇందులో ప్రైవేటు బస్సుల వ్యాపార పరిమాణం రూ.15,000 కోట్లుగా ఉంటే, ఆర్‌టీసీల వాటా రూ.25,000 కోట్లుగా ఉంది. గత కొంతకాలంగా ప్రైవేటు బస్సు టికెట్ల వ్యాపారం స్థిరంగా ఉంది. కాని ఇదే సమయంలో ఆన్‌లైన్ ద్వారా టికెట్ల బుకింగ్‌లో మాత్రం ఏటా 50 శాతం వృద్ధి నమోదవుతోంది. మొత్తం టికెట్ల విక్రయాల్లో ప్రస్తుతం 15 శాతంగా ఉన్న ఆన్‌లైన్ టికెట్ల వ్యాపారం ఈ ఏడాది 25 శాతానికి చేరుతుందని అంచనా వేస్తున్నాం.
ప్రస్తుతం అభిబస్ వ్యాపార పరిమాణం, వృద్ధి గురించి వివరిస్తారా?
గతేడాది వరకు ప్రధానంగా ఆన్‌లైన్ టికెటింగ్ సాఫ్ట్‌వేర్ వ్యాపారంపైనే దృష్టిపెట్టాం. ఇప్పుడు నేరుగా ఆన్‌లైన్ టికెట్లను కూడా విక్రయిస్తున్నాం. గతేడాది రూ.165 కోట్ల వ్యాపారం నమోదు చేశాం. ఈ ఏడాది రూ.280 కోట్లకు వచ్చే ఐదేళ్లలో రూ.2,000 కోట్లకు చేర్చాలన్నది లక్ష్యం. అభిబస్ అనగానే ఇప్పటికే చౌక టికెట్లను ఇచ్చే డీల్స్ సైట్‌గా పేరొచ్చింది. ఏటా 150 రోజులు తక్కువ కాకుండా చౌక రేట్లను ఆఫర్లు చేసే విధంగా రూపొందించుకుంటున్నాం.
ఆన్‌లైన్ పోర్టల్స్, ఈ-కామర్స్ రంగాల్లో పెట్టుబడులు చేయడానికి పీఈ, వీసీ ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నట్లే అభిబస్‌లో కూడా ఇన్వెస్ట్ చేయడానికి ఎవరైనా ముందుకొస్తున్నారా?
వచ్చే రెండేళ్ల వ్యాపార విస్తరణకు రూ.50 కోట్ల నిధులను సమీకరిస్తున్నాము. ఇందుకోసం కొటక్ బ్యాంక్‌ను ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్‌గా నియమించుకున్నాం. నాలుగు ప్రైవేటు ఈక్విటీ సంస్థలతో చర్చలు జరుపుతున్నాం. ఏ సంస్థ నుంచి పెట్టుబడి వస్తుందన్నది ఆగస్టు నెలాఖరుకు స్పష్టత వస్తుంది. ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ కంపెనీ విలువను రూ200 కోట్లుగా మదింపు చేసింది.