‘‘బిట్స్ పిలానీలో నువ్వు తప్పకుండా సీట్ తెచ్చుకుంటావనుకున్నా’’.. తండ్రి నిరాశ. తనూ నమ్మాడు ఎలాగైనా పిలానీలో సీట్ కొడ్తానని. ఓన్లీ టూ పర్సెంట్ మార్క్స్‌తో మిస్ అయింది. బాధపడ్డాడు. ఏడ్చాడు. తర్వాత నిర్ణయించుకున్నాడు.. టీ సెట్ రాసి చెన్నైలో ఇంజనీరింగ్ చదవాలని. టెస్ట్ రాశాడు. ర్యాంక్ కొట్టాడు. మంచి మంచి కాలేజ్‌లలో సీట్ వచ్చింది. అలాంటి వాటిల్లో ఒకటే ఆర్.ఎం.కె. ఇంజనీరింగ్ కాలేజ్. అత్యంత క్రమశిక్షణ గల కళాశాల. అబ్బాయి అందులో చేరాడు. తండ్రీ సంతోషించాడు.
కాలేజ్ వార్నింగ్ ఇచ్చింది.. జీఈ ఉద్యోగం ఇచ్చింది!
రోజూ కాలేజ్‌కి నీట్‌గా షేవ్ చేసుకొని వెళ్లాలి. ఫార్మల్స్ మాత్రమే ధరించాలి. కోఎడ్యుకేషన్ కాలేజ్ అయినా అబ్బాయిలు అమ్మాయిలతో అమ్మాయిలు అబ్బాయిలతో మాట్లాడకూడదు! ఇన్ని నియమాలా? బాబోయ్.. అనుకున్నాడు. మూడు నియమాలనూ తప్పాడు. మూడుసార్లు వాళ్ల నాన్నను పిలిపించింది మేనేజ్‌మెంట్! ‘‘మీ అబ్బాయి చదువులో జెమ్. డిసిప్లినే కొంచెం తక్కువ.. ’’ అంటూ లెక్చరర్స్ సముదాయించారు.
ఈసారి చదువు గురించీ కంప్లయింట్ వెళ్లింది. ఇంటర్నల్స్ రాయలేదని. కొన్నాళ్లకు.. క్యాంపస్ సెలెక్షన్స్ జరిగాయి.. ఆ కాలేజ్‌లో ఫస్ట్ ప్లేస్‌మెంట్ వచ్చింది ఆ అబ్బాయికే! జీఈ (జనరల్ ఎలక్ట్రానిక్స్) సంస్థలో ఉద్యోగం. గుంటూరు దగ్గర్లోని అంకిరెడ్డిపాలెంలో ఆ తండ్రి ఓ రైతు. తన తోబుట్టువుల పిల్లల్లాగే తన కొడుకులూ ఇంజనీరింగ్ చదివి పెద్ద పెద్ద కంపెనీల్లో ఉద్యోగాలు చేయాలని కోరుకున్నాడు. ఆశ.. నిరాశ.. తర్వాత కొడుకు సాధించిన ఉద్యోగమనే విజయం ఆ తండ్రి ఉప్పొంగిపోయేలా చేసింది. ఆ అబ్బాయి పేరు సుధాకర్ రెడ్డి. తండ్రి పేరు చిర్రా రామలింగారెడ్డి.
ఇష్టం లేని ఉద్యోగం... ఇష్టపడ్డ అమ్మాయి!
అయితే అప్పుడే ఉద్యోగంలో చేరకూడదనుకున్నాడు సుధాకర్. నలుగురితోపాటు కాకుండా ప్రత్యేకంగా ఉండాలనైతే అనుకున్నాడు. నైన్ టు ఫైవ్ జాబ్స్ కాదు. సమ్‌థింగ్ డిఫరెంట్. క్రియేటివ్‌గా. ఏదో చేయాలనే తపన. అయితే తన కుటుంబ ఆర్థిక పరిస్థితి సుధాకర్‌పై ఉద్యోగం చేయాల్సిన ఒత్తిడిని పెట్టింది. తప్పలేదు. జాబ్‌లో చేరాడు. ఇంకోవైపు అమెరికాలో జాబ్స్ వేట ప్రారంభించాడు. హెచ్1బీ కోసం ప్రయత్నించాడు. వచ్చింది. వెళ్లలేదు. కారణం.. డిఫరెంట్‌గా ఉండాలనే తపనే.
అదీగాక కాలేజ్‌లో సస్య అనే క్లాస్‌మేట్‌తో ఉన్న స్నేహం ఫైనలియర్‌లో ప్రేమగా మారింది. యేడాది గడిచే సరికి ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి సంబంధాలు చూడ్డం మొదలుపెట్టారు. అప్పుడు తమ విషయం ఇరువైపు పెద్దలకు చెప్పక తప్పలేదు. సహజంగానే ‘నో’ అన్నారు. పిల్లలు ఒప్పించారు. కన్విన్స్ అయిన పెద్దలు వెంటనే వెడ్డింగ్ బెల్స్ మోగించారు. అతను జాబ్... ఆమె ఏంబీఏ చదువు కంటిన్యూ అవుతోంది.
భార్య థమ్సప్!! ... నాన్న హ్యాండ్సప్
సుధాకర్ జాబ్ చేస్తున్నాడు కాని.. నచ్చట్లేదు. ఇంకేదో చేయాలి. ఈ క్రమంలో అతను తరచుగా చెన్నై టు గుంటూరు.. తిరుపతి వెళ్లాల్సి వచ్చింది. ట్రైన్‌లో వెళ్లాలంటే కనీసం పదిహేను రోజుల ముందు టికెట్ రిజర్వ్ చేయించుకుంటే కానీ ప్రయాణం సాఫీగా సాగేది కాదు. ప్రైవేట్ ట్రావెల్స్‌లో ఎప్పుడంటే అప్పుడు టికెట్స్ దొరికేవే కానీ ధరకు డిమాండ్ ఉండేది. ఒక్కోసారి అసలు టికెట్ ధరకన్నా డబుల్ వసూలు చేసేవారు. వీటితో విసిగి పోయాడు సుధాకర్.
ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ పోర్టల్ పెడితే జనాలకు టైమ్ సేవవడమే కాక.. సౌకర్యం కూడా అనుకున్నాడు. భార్య సస్యతో చెప్పాడు. థంబ్ అప్ చూపింది. నాన్నకు చెప్పాడు. నాన్న కంగారు పడ్డాడు. ఎలాగో ఒప్పించి ఆయన దగ్గరే పది లక్షల రూపాయలను అప్పుగా తీసుకొని.. ఉద్యోగానికి రాజీనామా చేసి భార్యా సమేతంగా హైదరాబాద్‌కు మకాం మార్చాడు.
పోర్టల్ స్టార్ట్ అయింది... ఘోరంగా ఫెయిలైంది
ఇంకో ఫ్రెండ్ దగ్గరా అయిదు లక్షల రూపాయలు తీసుకొని మొత్తం పదిహేను లక్షల రూపాయలతో ‘అభిబస్’ పోర్టల్‌ను స్టార్ట్ చేశాడు.. చిన్న గదిని అద్దెకు తీసుకొని. అందులో టాయ్‌లెట్ కూడా లేదు. తను టికెట్లు అమ్మాలంటే ట్రావెల్ ఆపరేటర్స్ తనకు ఎన్నో కొన్ని టికెట్స్ ఇవ్వాలి కదా. ఎంతో మంది ప్రైవేట్ ట్రావెల్స్ ఆపరేటర్స్‌ని కలిశాడు.
ఒక ట్రావెల్స్ ఆఫీస్ ముందు రెండు నెలలు ఉదయం ఎనిమిది నుంచి రాత్రి తొమ్మిది వరకు పడిగాపులు కాస్తే నాలుగు టికెట్లు ఇచ్చాడు. అంత కష్టపడి తెచ్చుకుంటే ఒక్క సీటు కూడా అమ్మలేకపోయాడు. ఫెయిల్యూర్.. ఘోరమైన ఫెయిల్యూర్! కానీ వెనక్కు తగ్గలేదు. గుడ్డిగా వేసిన ఆ అడుగు తప్పు. అంతేకాని వ్యాపారం అనే ఆలోచన తప్పు కాదు. సరిదిద్దుకోవాలి అనుకున్నాడు.
అప్పటికే ఓ బస్... అయినా అభీబస్
తన దగ్గర సాఫ్ట్‌వేర్ ఉంది సరే.. ఆపరేటర్స్ దగ్గర కూడా ఉండాలి కదా. ఏ పూచీ మీద టికెట్లు ఇస్తాడు తనకు ఏ ఆపరేటరైనా? రెండు విషయాలు తెలిశాయి. ట్రావెల్స్ ఆపరేటర్స్ కోసం సాఫ్ట్‌వేర్ తయారు చేయించాడు. వాటి గురించి ఆపరేటర్స్‌కు చెప్పి.. వాళ్లను కన్విన్స్ చేయగలిగాడు. ఆ సాఫ్ట్‌వేర్‌ను లీజ్‌గా ఇచ్చాడు. ఈసారి ఈజీగా టికెట్లు అమ్మడయ్యాయి. ఈ విషయం ఇంకో నలుగురు.. ఆ నలుగురు ఇంకో పది మంది ట్రావెల్స్ ఆపరేటర్‌కు తెలిసి డిమాండ్ పెరిగింది. అన్ని ట్రావెల్స్‌ను ఎకామిడేట్ చేసే శక్తి సరిపోక సర్వర్‌క్రాష్ అయింది. సంతోషించాలో ఏడ్వాలో తెలియని స్థితి.
సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేయడానికి మూడుకోట్లు కావాల్సి వచ్చాయి. ఎవరిస్తారు? సుధాకర్ రెడ్డి సామర్థ్యం మీద ఉన్న నమ్మకంతో ఆపరేటర్సే ముందుకు వచ్చారు. అభీబస్ డాట్ కామ్ అప్‌టేడ్ అయింది. ప్రైవేట్ ట్రావెల్సే కాదు ఏపీఎస్‌ఆర్‌టీసీ, యూపీ, హిమాచల్ ప్రదేశ్, వెస్ట్ బెంగాల్, టీఎస్‌ఆర్‌టీసీ మొదలు దేశం నలుమూలల 350 ట్రావెల్స్ అభిబస్ డాట్ కామ్‌లో చేరాయి. ఈ పదేళ్లలో అభిబస్ ప్రయాణం ఇది. సుధాకర్ రెడ్డి విజయం అది. అతను తన అభిబస్‌ను మొదలుపెట్టేటప్పటికే ఇంకో బస్ ఉంది. అయినా సొంత సాఫ్ట్‌వేర్ ఫార్మూలా ఉన్నది అభిబస్‌కే. అంతేకాదు అతిపెద్ద ట్రావెల్ పోర్టల్ కూడా ఇదే.
కొట్టేద్దాం అని రావద్దు
ఈ జర్నీ అంత సులువుగా సాగలేదు. సాగదు కూడా. తొలిరోజుల్లో రోజుకు పదహారు గంటలు పనిచేసేవాడిని. నెలలో 25 రోజులు ప్రయాణాల్లోనే గడిచిపోయేవి. ఫ్రాంక్‌గా చెప్పాలంటే ఈ బిజినెస్‌లోకి గొప్ప విజన్‌తో ఏమీ రాలేదు. నేను జర్నీ చేస్తున్నప్పుడు టికెట్స్, రిజర్వేషన్ విషయంలో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. వాటిని సాల్వ్ చేయాలనే ఈ బిజినెస్ స్టార్ట్ చేశాను అంతే.
నా ప్రోగ్రెస్ అంతా ప్రాబ్లమ్స్.. సొల్యూషన్స్.. ఈ లెర్నింగ్‌తోనే సాగింది.. సాగుతోంది కూడా. అంతకుముందు మా ఊళ్లో నా గురించి.. ఏదో ఇంటర్నెట్ కొట్టు పెట్టుకున్నాడట అనుకున్నవాళ్లు ఈ రోజు నన్ను చాలా గౌరవంగా చూస్తున్నారు. ఇన్‌ఫాక్ట్ మా నాన్న కంటే ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తున్నారు. ఈ మధ్య చాలామంది యూత్ అంట్రప్రెన్యూర్స్ కావాలనుకుంటున్నారు. మంచిదే. కాని మొదలుపెట్టగానే సక్సెస్ వస్తుంది అనే ఆలోచనతో రావద్దు.
అపజయాల రహదారిలో గమ్యాన్ని చేరుకోవాల్సి ఉంటుందనే సంసిద్ధతతో రావాలి. సగటు రోజువారీ దిన చర్య గమనిస్తే.. అతని అవసరాలు ఏముంటాయో తెలుస్తుంది. వాటిని తీర్చగలిగే.. లేదంటే పరిష్కారాలు ఇవ్వగలిగే బిజినెస్ స్టార్ట్ చేస్తే చాలు.. విజయం ఖాయం. స్విగ్గీ, బుక్ మై షో.. లాంటివన్నీ అవే’’ అంటాడు సుధాకర్‌రెడ్డి చిర్రా, అభిబస్ డాట్ కామ్ సీఈవో.
– సరస్వతి రమ
Comments
Please login to add a commentAdd a comment