మార్చికల్లా రూ. 2,282 కోట్ల ఖర్చు
- 70 శాతం వైద్య పరికరాల కొనుగోలుకే..
- ఫిబ్రవరి నుంచి పెంటావాలెంట్ వ్యాక్సిన్
- డిప్యూటీ సీఎం టి. రాజయ్య
గోదావరిఖని: ప్రభుత్వ ఆస్పత్రుల్లో సామాన్య ప్రజలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని, ఇందులో భాగంగానే వచ్చే మార్చి నాటికల్లా వైద్యానికి కేటాయించిన రూ. 2,282 కోట్లను ఖర్చు చేయనున్నట్లు డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తాటికొండ రాజయ్య తెలిపారు.
ఆదివారం రాత్రి కరీంనగర్ జిల్లా గోదావరిఖని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో బస చేసిన ఆయన సోమవారం ఉదయం విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్ పరిధిలోని ఆస్పత్రులకు రూ.552 కోట్లు ఖర్చు చేస్తున్నామని, మొత్తం బడ్జెట్‌లో 70 శాతం ఆయా ఆస్పత్రులో వైద్య పరికరాల కొనుగోలు కోసమే వినియోగించనున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందుల కొరత లేదని, దీర్ఘకాలిక వ్యాధులకు గతంలో ఇచ్చిన విధంగా కాకుండా 10-15 రోజులకు మందులను అందజేస్తున్నామన్నారు.
కుక్కకాటు, పాముకాటుకు మందులు అందుబాటులో ఉన్నాయని, వచ్చే ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఐదు రకాల జబ్బులకు ఉపయోగపడే పెంటావాలెంట్ అనే వ్యాక్సిన్‌ను ప్రారంభించనున్నామని ప్రకటించారు. ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది కొరతను త్వరలోనే టీపీఎస్‌స్సీ ద్వారా నోటిఫికేషన్ జారీ చేసి ఉద్యోగాలను భర్తీ చేయనున్నామని తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రుల్లో 25 శాతంగా ఉన్న వైద్యసేవలను 60 శాతానికి పెంపుదల చేసేందుకు కృషి చేస్తున్నామని, ఇందుకు ప్రజలు సహకారం అందించాలని కోరారు. డిప్యూటీ సీఎం వెంట రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ ఉన్నారు.