కుక్క కరిస్తే.. దేవుడే దిక్కు!
అర్బన్ హెల్త్ సెంటర్లలో
ఏడు నెలలుగా ఏఆర్‌వీ లేదు
నగరంలో శునకాల స్వైర విహారం
రోజుకు 20 నుంచి 30 మందిపై దాడి..
ఏ ఏరియాలో కుక్క కరిచినా ప్రభుత్వాస్పత్రికే పరుగు
ఏఆర్‌వీ అందుబాటులో ఉంది కుక్కకాటుకు గురైనవారికి వేసే ఏఆర్‌వీ నగరపాలక సంస్థ కార్యాలయంలో ఉంది. అయితే అర్బన్ హెల్త్ సెంటర్లలో వ్యాక్సిన్ నిల్వ చేసే సౌకర్యం లేకపోవడంతో నగరపాలక సంస్థలోనే స్టోరేజీ చేస్తున్నాం. ఏదైనా సెంటర్‌కు అవసరమైనప్పుడు సిబ్బంది వచ్చి తీసుకెళ్లవచ్చు.
- డాక్టర్ ఇక్బాల్ హుస్సేన్,
కార్పొరేషన్ మెడికల్ ఆఫీసర్
లబ్బీపేట : నగర జనాభా 10.22 లక్షలు. వారికి ప్రాథమిక వైద్యం చేసేందుకు 12 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, రెండు సామాజిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. ఏడు నెలుగా ఈ ఆస్పత్రుల్లో కుక్క కరిచిన వారికి వేసేం దుకు యాంటీ రేబిస్ వ్యాక్సిన్(ఏఆర్‌వీ) అందుబాటులేదు. దీంతో నగరంలోని ఏ ప్రాంతం వారు కుక్కకాటుకు గురైనా గుణదలలోని ప్రభుత్వాస్పత్రికి పరుగులు పెట్టాల్సిన దుస్థితి నెలకొంది.రోజూ సగటున 20 నుంచి 30 మంది, నెలకు 700 మందికి పైగా కుక్కకాటుకు గురైనవారు ప్రభుత్వాస్పత్రికి వస్తున్నారు. ఇక్కడ కూడా ఇమ్యూనో గ్లోబలిన్ వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడం, బయట కొనుగోలు చేసేందుకు ప్రయత్నించినా లభించకపోవడంతో బాధితులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పరిస్థితి ఇంత తీవ్రంగా ఉన్నప్పటికీ పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో ఏఆర్‌వీ అందుబాటులోకి తీసుకురాకపోవడంపై నగరవాసులు మండిపడుతున్నారు.
గుంపులు గుంపులుగా కుక్కలు..
నగరంలోని అన్ని ప్రాంతాల్లోనూ కుక్కలు గుంపులు గుంపులుగా సంచరిస్తూ ప్రజలపై దాడిచేస్తున్నాయి. గట్టువెన ప్రాంతంలో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. ఉదయం నుంచే వీధుల్లో కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఆదివారం విద్యాధరపురం ప్రాంతానికి చెందిన ఐదేళ్ల బాలుడు శ్యామ్‌పై కుక్కలు దాడిచేసి తీవ్రంగా గాయపరిచాయి. సోమవారం కూడా భవానీపురంలో నివసించే ఓ మహిళ, చిట్టినగర్ ప్రాంతానికి చెందిన ఒక యువకుడు కుక్క కాటుకు గురయ్యారు. వీరిద్దరూ ప్రభుత్వాస్పత్రికి వచ్చి ఏఆర్ వ్యాక్సిన్ వేయించుకున్నారు.
అన్నీ తెలిసినా...
వైద్య శాఖ నిబంధనల ప్రకారం ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పట్టణ ఆరోగ్య కేంద్రంలో వ్యాధి నిరోధక టీకాలతోపాటు కుక్కకాటు, పాముకాటుకు సంబంధించిన వ్యాక్సిన్లు తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలి. నగరంలోని పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఏడు నెలలుగా ఏ ఒక్క ఆస్పత్రిలోనూ ఏఆర్‌వీ అందుబాటులో లేదు. నగరంలోని అన్ని ప్రాంతాల్లోనూ వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తున్న సంగతి నగరపాలక సంస్థల అధికారులు చూస్తూనే ఉన్నారు. వాటిని నియంత్రించేందుకు జీవకారుణ్య సంస్థలు అడ్డుగా మారాయని అధికారులు చెబుతున్నారు. అయితే, కుక్క కరిస్తే బాధితులకు వేసేందుకు ఏఆర్‌వీ కూడా అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకోవడం లేదు. కుక్కకాటుకు గురైన వారు సమీపంలోని అర్బన్ హెల్త్ సెంటర్లకు వెళితే తమ వద్ద మందు లేదని వైద్యులు చేతులెత్తేస్తున్నారు. దీంతో విద్యాధరపురం, భవానీపురం, కబేళా, కండ్రిక, సింగ్‌నగర్ వంటి దూరప్రాంతాల నుంచి సైతం వ్యాక్సిన్ కోసం ప్రభుత్వాస్పత్రికి రావాల్సి వస్తోంది. కుక్కకాటుకు గురైన వారు ఆరుసార్లు వాక్సిన్ వేయించుకోవాల్సి ఉండటంతో దూరప్రాంతాల వారు ఇబ్బందులు పడుతున్నారు.
ఇమ్యూనో గ్లోబలిన్ ఇంజక్షన్ల కొరత..
కుక్కకాటుకు గురైన వారి పరిస్థితిని బట్టి ఏఆర్‌వీతోపాటు ఇమ్యూనో గ్లోబలిన్ ఇంజక్షన్ కూడా చేస్తారు. గాయం తీవ్రత ఎక్కువగా ఉన్నా, పిచ్చి కుక్క కరిచినా, మెడ, తలపై భాగాల్లో గాయాలైనా ఈ ఇంజక్షన్ చేస్తారు. ఇంతటి విలువైన ఇమ్యూనో గ్లోబలిన్ ఇంజక్షన్ ప్రభుత్వాస్పత్రిలో 20 రోజులుగా అందుబాటులో లేదు. ఈ ఇంజక్షన్ సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ కూడా లేకపోవడం వల్లే ఆదివారం ప్రభుత్వాస్పత్రికి వచ్చిన బాలుడు శ్యామ్‌ను గుంటూరు రెఫర్ చేశామని వైద్యులు చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాస్పత్రిలో ఇమ్యూనో గ్లోబలిన్ ఇంజక్షన్లతోపాటు అర్బన్ హెల్త్ సెంటర్లలో ఏఆర్‌వీలు అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది.