వరల్డ్ ఇమ్యునైజేషన్ వీక్
వ్యాక్సిన్ ఇవ్వడం ద్వారా చాలా తక్కువ ధరతో అంటే చాలా చవకగా, దాదాపు పూర్తి సురక్షితంగా చాలా రకాల వ్యాధులను నివారించవచ్చు. ప్రస్తుతం ఈ నెల చివరి తేదీ వరకు వరల్డ్ ఇమ్యూనైజేషన్ వీక్ అనే వారోత్సవాలు నిర్వహితమవుతున్నాయి. ప్రతీ ఏడాదీ ఏప్రిల్ చివరి వారం... అంటే ఏప్రిల్ 24 నుంచి 30 వరకు ఇలా జరుపుతారు. అనేక వ్యాధులను నివారించడం కోసం వ్యాక్సిన్ ప్రాధాన్యతపై ప్రజలందరిలో అవగాహన కల్పించడం కోసమే ఈ వారోత్సవాలను (వీక్‌ను) రూపొందించారు.
సాధారణంగా వ్యాక్సిన్లు అంటే పిల్లలకు అనే అనుకుంటుంటారు. అయితే పెద్దవాళ్లకు కూడా వ్యాక్సిన్లు ఇవ్వాల్సి ఉంటుంది. చిన్నప్పుడు మనం తీసుకున్న వ్యాక్సిన్ల ప్రభావం క్రమంగా తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి వాటి శక్తియుక్తులను మళ్లీ బలోపేతం చేసేందుకు వాటిల్లో కొన్నింటిని 50 ఏళ్ల వయసు దాటిన దగ్గర్నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటి కొన్ని వ్యాక్సిన్ల వివరాలు, ప్రయోజనాల గురించి అవగాహన కోసం వాటి గురించి సంక్షిప్తంగా.
పెద్ద వయసు వారు తీసుకోవాల్సిన రకరకాల వ్యాక్సిన్లు
హెపటైటిస్ ఏ వ్యాక్సిన్ : హెపటైటిస్–ఏ అనే వైరస్ కాలేయంపై ప్రభావం చూపుతుంది. సాధారణంగా ఇది కలుషితమైన ఆహారం, నీటి ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. హెపటైటిస్–బి తో పోలిస్తే ఇది అంత ప్రమాదకరం కాదు. సాధారణంగా యువకులు, మధ్యవయస్కుల్లో ఎలాంటి చికిత్సా తీసుకోకపోయినా తగ్గిపోతుంది. కానీ వృద్ధుల్లో వ్యాధి నిరోధకత తక్కువగా ఉండే కారణాన దీనికి వ్యాక్సిన్ తీసుకోవడం అవసరం. మన దేశంలో ఈ వ్యాధి వ్యాప్తి ఒకింత ఎక్కువే కాబట్టి... దీన్ని నివారించడానికి ఒకసారి వ్యాక్సిన్ తీసుకొని, ఆర్నెల్ల తర్వాత మరో విడత కూడా తీసుకోవాలి.
హెపటైటిస్–బి వ్యాక్సిన్ : హెపటైటిస్–బి వైరస్ కాలేయాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది చాలా ప్రమాదకరమైన వ్యాధి. హెచ్‌ఐవీ వ్యాపించే మార్గాల ద్వారానే ఇది కూడా వ్యాపిస్తుంది. కాలేయాన్ని పూర్తిగా దెబ్బతీసి ప్రాణాంతకంగా మారే అవకాశమూ ఉంది. అయితే అదృష్టవశాత్తూ దీనికి వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. ఈ వ్యాక్సిన్‌ను మూడు డోసుల్లో ఇవ్వాలి. మొదటిది ఇచ్చిన నెల తర్వాత రెండో డోసు, ఆ తర్వాత మొదటిది ఇచ్చిన ఆర్నెల్లకి మూడో డోసు ఇవ్వాలి. యుక్తవయస్కులంతా దీన్ని తీసుకోవడం మంచిది.
వారిసెల్లా వ్యాక్సిన్ : వ్యారిసెల్లా జోస్టర్ (వీజడ్‌వీ) అనే ఈ వైరస్ మనం సాధారణంగా ‘చికెన్‌పాక్స్’ అని పిలిచే వ్యాధిని కలిగిస్తుంది. వారిసెల్లా వ్యాక్సిన్ పెద్దవారిలో చికెన్ పాక్స్‌నుంచి రక్షణ కల్పిస్తుంది. అయితే అప్పటికే ఏవైనా వ్యాధులతో ఉన్నవారికీ, గతంలో ఈ వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు తీవ్రమైన అలర్జీ వచ్చిన వారికీ, హెచ్‌ఐవీ వ్యాధి ఉండి, సీడీ4 సెల్స్ కౌంట్స్ 200 లోపు ఉన్నవారికీ, వ్యాధి నిరోధక శక్తి బాగా తగ్గిపోయిన ఇమ్యూనో కాంప్రమైజ్‌డ్ స్టేటస్ ఉన్నవారికి, స్టెరాయిడ్స్ మీద ఉన్నవారికి ఈ వ్యాక్సిన్‌ను డాక్టర్లు సిఫార్సు చేయరు. అలాగే క్యాన్సర్ కోసం కీమోథెరపీ తీసుకుంటున్నవారు, గత ఐదు నెలల వ్యవధిలో రక్తమార్పిడి / రక్తంలోని ఏదైనా అంశాన్ని స్వీకరించడం వంటి చికిత్స తీసుకున్న వారు సైతం ఈ వ్యాక్సిన్‌ను తీసుకోకూడదు. అలాగే గర్భవతులు కూడా తీసుకోకూడదు.
హెర్పిస్ జోస్టర్ వ్యాధి : హెర్పిస్ జోస్టర్ అనే వైరస్‌తో మొదట చికెన్‌పాక్స్ వస్తుంది. ఆ తర్వాత అది హెర్పిస్ జోస్టర్ వ్యాధికి దారితీస్తుంది. దాన్నే షింగిల్స్ అంటారు. జోస్టర్ వైరస్ సోకిన వారిలో పోస్ట్ హెర్పెటిక్ న్యూరాల్జియా అనే నరాలకు సంబంధించిన కాంప్లికేషన్ ఎక్కువగా కనిపిస్తుంది. జోస్టర్ హెర్పిస్ వైరస్ సోకిన వారిలో 60 ఏళ్ల వయసు దాటాక ఈ పోస్ట్ హెర్పిటిక్ న్యూరాల్జియా వచ్చే అవకాశాలు ఎక్కువ.హెర్పిస్ జోస్టర్ వ్యాధికి మంచి నివారణ జోస్టర్ వ్యాక్సిన్. అయితే ఈ వ్యాక్సిన్ వల్ల పూర్తిగా (అంటే 100 శాతం) వ్యాధి రాకుండా ఉంటుందనే గ్యారంటీ అయితే లేదుగానీ... వ్యాక్సిన్ తీసుకున్న వారిలో వారి జీవన ప్రమాణం మెరుగవుతుందని చెప్పవచ్చు.
‘ద షింగిల్స్ ప్రివెన్షన్ స్టడీ’ అనే అధ్యయనం ప్రకారం వ్యాక్సిన్ తీసుకున్నవారిలో వ్యాధి వచ్చే అవకాశాలు 50 శాతం తగ్గుతాయి. అలాగే పోస్ట్ హెర్పటిక్ న్యూరాల్జియా 67శాతం తగ్గుతుంది. అందుకే 50 ఏళ్లు దాటాక జోస్టర్ వ్యాక్సిన్ తీసుకోవడం చాలా మంచిది. ఎసైక్లోవిర్, వాలాసైక్లోవిర్ వంటి యాంటీవైరల్ మందులు తీసుకునేవారు ఇది తీసుకునే ముందర 24 గంటల పాటు ఈ మందులను వాడకపోవడం మంచిది. ఈ వాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా 14 రోజుల పాటు వాటిని వాడకపోవడం మంచిది.
నిమోకోకల్ వ్యాక్సిన్ : వయసు పైబడిన వారిలో స్ట్రెప్టోకాకల్ నిమోనియా అనే బ్యాక్టీరియా కారణంగా నిమోనియా, మెనింజైటిస్, బ్యాక్టీరిమియా అనేవి ఎక్కువగా వస్తుంటాయి.
నిమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ (పీసీవీ 13) : 65 ఏళ్ల వయసు పైబడిన ప్రతివారూ ఈ వ్యాక్సిన్ ఒక డోస్ తీసుకోవాలి. ఇది తీసుకున్న ఏడాది తర్వాత నిమోకాకల్ పాలీసాకరైడ్ వ్యాక్సిన్ (పీపీఎస్‌వీ 23) తీసుకోవాలి. నిమోకాకల్ పాలీసాకరైడ్ వ్యాక్సిన్ (పీపీఎస్‌వీ 23) : ప్రస్తుతం వేర్వేరు నిమోకాకల్ బ్యాక్టీరియా స్ట్రెయిన్స్ కారణంగా వచ్చే అనేక రకాల వ్యాధులకు ‘నిమోకాకల్ పాలీసకరైడ్ వ్యాక్సిన్’తో ప్రయోజనం చేకూరుతుంది. కాబట్టి దీన్ని ఒక నిమోనియాకే నివారణగా అనుకోవడం కంటే... మెనింజైటిస్, బ్యాక్టిరిమియా (బ్లడ్ ఇన్ఫెక్షన్)లకు నివారణ ఔషధంగా పరిగణించవచ్చు. అయితే దీని వల్ల కూడా నూరు శాతం నివారితమవుతుందన్న గ్యారంటీ ఉండదు.
అయితే దీనివల్ల చాలా వరకు రక్షణ లభించడంతో పాటు ఒకవేళ టీకా తీసుకుని ఉంటే పైన పేర్కొన్న వ్యాధులు చాలావరకు తగ్గుతాయి. కాంప్లికేషన్లను కూడా చాలా వరకు నివారించవచ్చు.అయితే నిమోకాకల్ పాలీసాకరైడ్ వ్యాక్సిన్ తీసుకున్న ఐదేళ్ల తర్వాత మళ్లీ మరో డోస్ తీసుకోవాలి. అలా ప్రతి ఐదేళ్లకోమారు ఈ వ్యాక్సిన్ తీసుకుంటూ ఉండాలి.అరవై ఐదేళ్లు దాటిన వారికి ఈ వ్యాక్సిన్ ఇవ్వడం మంచిదని అడ్వయిజరీ కమిటీ ఆన్ ఇమ్యునైజేషన్ ప్రాక్టీసెస్ (ఏసిఐపీ) సిఫార్సు చేస్తోంది. ఇది మాటిమాటికీ తీసుకోవాల్సిన అవసరం లేదనీ, ఒకసారి తీసుకున్న తర్వాత దీని వల్ల కలిగే వ్యాధి నిరోధక శక్తి ఐదేళ్ల పాటు ఉంటుందని ఏసిఐపీ పేర్కొంటోంది. మూత్రపిండాల వ్యాధి ఉన్నవారిలో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండే లుకేమియా, లింఫోమా వంటి క్యాన్సర్లు ఉన్నవారిలో, కార్టికో స్టెరాయిడ్స్ తీసుకునేవారిలో దీన్ని ఐదేళ్ల తర్వాత కూడా మరోసారి తీసుకోవాలి ఏసీఐపీ సిఫార్సు చేస్తోంది.
ఇన్‌ఫ్లుయెంజా వ్యాక్సిన్ : ఇది ఇన్‌ఫ్లుయెంజా వైరస్ వల్ల కలిగే ఫ్లూ వ్యాధి. మనకు సాధారణంగా జలుబు చేసినప్పుడు కనిపించే లక్షణాలే ఇన్‌ఫ్లుయెంజా వైరస్ సోకినప్పుడూ కనిపిస్తాయి. అయితే ఇన్‌ఫ్లుయెంజా నేరుగా హాని చేయకపోవచ్చు. జలుబు తగ్గినట్లే అదీ తగ్గిపోతుంది. కానీ ఒక్కోసారి ఇన్‌ఫ్లుయెంజా వైరస్ కారణంగా వచ్చే తర్వాతి దశ దుష్పరిణామాలైన శ్వాసకోశ సమస్యల వంటివి రోగిని బాధిస్తాయి. పైగా ఇన్‌ఫ్లుయెంజా వైరస్ ఎప్పటికప్పుడు తన జన్యుస్వరూపాన్ని మార్చుకుంటూ ఉంటుంది. అందుకే జలుబు వైరస్‌కు ఒకే వ్యాక్సిన్ రూపొందించడం కష్టసాధ్యం. అందుకే అరవైౖయెదేళ్లు ఏళ్లు పైబడిన వారు, ఇమ్యూనోకాంప్రమైజ్ స్టాటస్‌లో ఉన్నవాళ్లు (వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉన్నవాళ్లు) ఈ ఇన్‌ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను ప్రతి ఏడాదీ తీసుకోవాలి. దీన్ని ప్రతి ఏడాదీ సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో తీసుకోవడం మంచిది.
ఒక సూచన : గుడ్డు వల్ల అలర్జీ ఉన్నవారు రీకాంబినెంట్ వ్యాక్సిన్ తీసుకోవాలి.డిఫ్తీరియా అండ్ టెటనస్ వ్యాక్సిన్ : ప్రతి చిన్నారికీ చిన్నప్పుడు డీటీపీ వ్యాక్సిన్ ఇస్తారన్న విషయం తెలిసిందే. అయితే ఆ చిన్నారి 40 ఏళ్ల వయస్కుడయ్యే సమయానికి టెటనస్ వ్యాక్సిన్ ప్రభావం సగానికి తగ్గుతుంది. అదే 60 ఏళ్ల వయసుకు రాగానే టెటనస్ వ్యాక్సిన్ ప్రభావం కేవలం 10 శాతం మాత్రమే ఉంటుంది. కాబట్టి ఈ టెటనస్ డోస్‌ను 60 దాటిన వారికి మరోసారి ఇవ్వాలి. దాంతో అది బూస్టర్ డోస్‌లా పనిచేసి వ్యాక్సిన్ తీసుకున్నవారికి టెటనస్ (ధనుర్వాతం) నుంచి రక్షణ కల్పిస్తుంది. అలాగే డిఫ్తీరియా వ్యాక్సిన్ కూడా తీసుకోవాలి. చిన్నప్పుడు ఇచ్చే డీపీటీలలో పెర్టుసిస్ (కోరింత దగ్గు) అనే సమస్య పెద్ద వయసులో రాదు
కాబట్టి ఈ పెర్టుసిస్ వ్యాక్సిన్ పెద్దలకు ఇవ్వాల్సిన అవసరం ఉండదు.నిజానికి ‘టీ–డ్యాప్’ అనే వ్యాక్సిన్ ప్రతి పదేళ్లకు ఒకసారి తీసుకోవడం మంచిది.
మరికొన్ని వ్యాక్సిన్లు : ఇప్పుడు డెంగ్యూ వ్యాధికి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది, అయితే దాన్ని కొన్ని పరిమితులకు లోబడి ఇవ్వాల్సి ఉంటుంది. ఇవేగాక జపనిస్ ఎన్‌కెఫలైటిస్, మెనింగోకోకస్, రేబీస్, టైఫాయిడ్, పోలియో, ఎల్లో ఫీవర్ వంటి వ్యాధుల నివారణకూ వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఎల్లో ఫీవర్ అనే వ్యాధి మన దేశంలో లేదు. అది ఉన్నచోటికి ప్రయాణం చేసేవారు అక్కడికి వెళ్లే 15రోజుల ముందుగా ఈ వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉంటుంది.
పెద్ద వయసులో వ్యాక్సిన్లు ఎందుకు?
ప్రతి ఏడాదీ చాలా మంది కొన్ని వ్యాధుల బారిన పడుతుంటారు. అయితే వీటిలో చాలావరకు నివారించగలిగేవే. మన వయసు పెరుగుతున్నకొద్దీ, మన వృత్తిని బట్టీ, ఆరోగ్యపరిస్థితి, దేహతత్వాన్ని బట్టి కొన్ని జబ్బుల్లో రిస్క్ పెరుగుతుంది. ఆ రిస్క్ నివారించడం కోసం వ్యాక్సిన్లతో వ్యాధులను నిరోధించడం చాలా తేలిక. కొన్ని ప్రాంతాలకు, విదేశాలకు వెళ్లే చోట్ల కొన్ని రకాల వ్యాధులు ఉంటాయి. ఆ ప్రాంతాలకు వెళ్తున్నవారు అక్కడ వ్యాప్తిలో ఉండే వ్యాధికి వ్యాక్సిన్ తీసుకోవాలి. అలాగే లైఫ్‌స్టైల్ ఆధారంగా కూడా కొన్ని వ్యాక్సిన్లు అవసరం. దాదాపు 19 ఏళ్ల నుంచి 65 ఏళ్ల మధ్య వయసులో కొన్ని రకాల జబ్బులు ఉండి, కాస్త బలహీనమైన వ్యాధి నిరోధక శక్తి (ఇమ్యూనో కాంప్రమైజ్ కండిషన్) ఉన్నవారికి, 65 ఏళ్ల వయసు దాటాక మరికొన్ని జబ్బులు వచ్చే ముప్పు ఉంది.
అలాంటి వారిలో ఈ వాక్సిన్లతో ఆ ముప్పును దాదాపుగా నివారించవచ్చు. యుక్తవయసు దాటాక, పెద్ద వయసులో ప్రవేశించే ప్రతివారూ ఈ వ్యాక్సిన్లు తీసుకోవడం వల్ల వ్యాధుల నుంచి వారికి రక్షణ కలగడంతో పాటు... ఆ వ్యాధులు ఇతరులకు వ్యాపించకుండా కూడా నివారించడానికి కూడా అవకాశం ఉంటుంది. నిజానికి ఒకసారి వ్యాధి బారిన పడితే హాస్పిటల్‌లో పెట్టాల్సిన ఖర్చుతో పోలిస్తే... వ్యాక్సిన్ తీసుకోవడానికి అయ్యే ఖర్చు చాలా చాలా తక్కువ. ఇంటిని పోషించే యజమాని జబ్బు పడితే ఆ ప్రభావం ఇంటి మొత్తం మీద ఉంటుంది. పైగా ఉత్పాదకత కోసం వెచ్చించాల్సిన ఎన్నో విలువైన పనిదినాలను కూడా రక్షించుకొని, వాటిని సమర్థంగా పనులకోసం, ఆరోగ్యంగా జీవించడం కోసం, జీవితాన్ని ఆస్వాదించడం, ఆనందించడం కోసం ఉపయోగించవచ్చు.
హ్యూమన్ పాపిలోమా వ్యాక్సిన్ (హెచ్‌పీవీ వ్యాక్సిన్)
ఇది మహిళల్లో సర్వైకల్ క్యాన్సర్‌నుంచి నివారణ కల్పిస్తుంది. మహిళలకు 26 ఏళ్ల వయసు వచ్చే వరకు ఈ వ్యాక్సిన్ ఇవ్వవచ్చు. 15 ఏళ్లు పైబడ్డ యువతులు మొదలుకొని మూడు విడతలుగా ఈ వ్యాక్సిన్ ఇస్తారు. మొదటి డోస్ ఇచ్చిన నెల తర్వాత రెండో డోసు, ఆర్నెల్ల తర్వాత మూడో డోస్ ఇస్తారు. ఇందులో రెండు రకాలు అందుబాటులో ఉన్నాయి. ఒకటి రెండు రకాల స్ట్రెయిన్స్ నుంచి, మరొకటి నాలుగు రకాల స్ట్రెయిన్స్ నుంచి రక్షణ ఇస్తుంది. డాక్టర్ సలహా మేరకే అవసరమైన వాటిని వాడాల్సి ఉంటుంది.
డాక్టర్ టి.ఎన్.జె. రాజేశ్,
సీనియర్ కన్సల్టెంట్ ఫిజీషియన్‌ఇంటర్నల్ మెడిసిన్
ఇన్‌ఫెక్షియస్‌డిసీజెస్,స్టార్ హాస్పిటల్స్,బంజారాహిల్స్, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment