హెచ్‌ఐవీ వ్యాధి నిరోధానికి శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తున్న సరికొత్త వ్యాక్సిన్ సత్ఫలితాలనిస్తోంది. మానవులతోపాటు కోతులపై జరిగిన ప్రయోగాల్లో ఈ వ్యాక్సిన్ రోగనిరోధక వ్యవస్థను చైతన్యవంతం చేయడం ద్వారా వ్యాధిని అడ్డుకుందని నేషనల్ కేన్సర్ సెంటర్ శాస్త్రవేత్తలు అంటున్నారు. దాదాపు 400 మంది పాల్గొన్న ఈ పరీక్షలు మంచి ఫలితాలిచ్చిన నేపథ్యంలో రెండో దశ పరీక్షలు దక్షిణాఫ్రికాలో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని, ఇందులో 2600 మంది మహిళలకు ఈ వ్యాక్సిన్‌ను అందించనున్నామని ప్రొఫెసర్ డాన్ బరూచ్ తెలిపారు.
హెచ్‌ఐవీని అడ్డుకునేందుకు గత 35 ఏళ్లలో ఐదు వరకు వ్యాక్సిన్లను అభివృద్ధి చేయగా, ఈ స్థాయికి చేరుకున్న వ్యాక్సిన్ ఇదొక్కటే కావడం గమనార్హం. రకరకాల హెచ్‌ఐవి వైరస్‌ల ముక్కలు సేకరించి వాటిని కలపడం ద్వారా రోగనిరోధక శక్తిని ప్రేరేపించడం ఈ కొత్త వ్యాక్సిన్ ప్రత్యేకత. దీన్ని వాడినప్పుడు కోతులు హెచ్‌ఐవి లాంటి వైరస్‌ను 67 శాతం వరకు అడ్డుకోగలిగాయని బరూచ్ తెలిపారు. ప్రపంచం మొత్తం మీద దాదాపు 3.7 కోట్ల మంది హెచ్‌ఐవి బాధితులు ఉండగా.. ఏటా 18 లక్షల కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. ప్రాణాంతకమైన ఈ వ్యాధిని నిరోధించే వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే ఎన్నో విలువైన ప్రాణాలు నిలబడతాయి.
హెచ్‌ఐవీ వ్యాక్సిన్ వచ్చేస్తోంది...
Published Wed, Jul 11 2018 1:04 AM | Last Updated on Wed, Jul 11 2018 1:04 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment